'ఇది నా లవ్ స్టొరీ' మూవీ రివ్యూ & రేటింగ్స్

మరిన్ని వార్తలు

తారాగణం: తరుణ్. ఒవియా తదితరులు.
నిర్మాణ సంస్థ: రామ్ ఎంటర్టైనర్స్
ఎడిటర్:శంకర్
సంగీతం: శ్రీనాథ్ విజయ్
ఛాయాగ్రహణం: క్రిస్టోఫర్ జోసెఫ్
నిర్మాత: ప్రకాశ్
దర్శకులు: రమేష్-గోపి 

రేటింగ్: 1.75/5

ద‌ర్శ‌కులు కావ‌డానికి దాదాపు ప‌దిహేనేళ్లు క‌ష్ట‌ప‌డ్డామ‌ని సినిమా వేడుక‌లో చెప్పారు ర‌మేష్ గోపి.  ఎట్ట‌కేల‌కి వాళ్ల‌కి  `ఇది నా ల‌వ్‌స్టోరీ` రూపంలో ఓ అవ‌కాశం వ‌చ్చింది.  మ‌రి అన్నేళ్లుగా మ‌న‌సులో ఉన్న క‌సిని తీర్చుకోవాలి క‌దా! అందుకే వాళ్ల పాండిత్యాన్నంతా జోడించి స్క్రిప్టులో పెట్టేశారు. కాక‌పోతే  ప‌దిహేనేళ్ల కింద‌ట వాడినా అప్పుడు కూడా అప్‌డేట్‌గా అనిపించ‌ని సంభాష‌ణ‌ల్ని అట్టిపెట్టుకొని ఇందులో ఎడా పెడా వాడేశారు. దాంతో మ‌న‌సుకు  హ‌త్తుకొనేలా సాగాల్సిన  ప్రేమ‌క‌థ... సిల్లీగా సాగే మాట‌ల మ‌ధ్య ప‌డి న‌లిగిపోయింది. ఆసాంతం ప్రేక్ష‌కుడికి విసుగు పుట్టించేస్తుంది.  అస‌లు క‌థ‌లోకి వెళితే...

క‌థ‌:

అభిరామ్‌ (తరుణ్‌) యాడ్‌ ఫిలిం డైరెక్టర్‌. శ్రుతి కోస‌మ‌ని అర‌కు వెళ‌తాడు. త‌నకి ప్రాణ‌మైన చెల్లెలికి కాబోయే భ‌ర్తకి స్వయానా  సోద‌రే శ్రుతి. త‌న అన్న‌య్య ఆమెని పెళ్లి చేసుకొంటే బాగుంటుంద‌నేది అభిరామ్ చెల్లెలి ఆలోచ‌న‌. అయితే దారి మ‌ధ్య‌లోనే ఓ అమ్మాయిని చూసి మ‌న‌సు పారేసుకొంటాడు అభిరామ్‌. కానీ చెల్లెలికి ఇచ్చిన మాట మేర‌కు శ్రుతి ఇంటికి వెళతాడు.  కాలింగ్ బెల్ కొట్ట‌గానే  తాను దారిలో చూసి మ‌న‌సుప‌డిన అమ్మాయే క‌నిపిస్తుంది. ఇంట్లోవాళ్లు బ‌య‌టికి వెళ్లార‌ని, తానే శ్రుతి (ఓవియా)ని అని ఆమె ప‌రిచ‌యం చేసుకొంటుంది. ఇంట్లో ఇద్ద‌రే ఉండ‌టంతో ఒక‌రి అభిప్రాయాల్ని మ‌రొక‌రు పంచుకొంటారు. ఆ త‌ర్వాత ప్రేమ‌లో ప‌డ‌తారు.  మ‌రుస‌టి రోజు ఉద‌య‌మే శ్రుతి కంప్ల‌యింట్ మేర‌కు అభిరామ్‌ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అందుకు కార‌ణ‌మేమిటి? శ‌్రుతికీ, అభిరామ్‌కీ మ‌ధ్య ఆరోజు రాత్రి ఏం జ‌రిగింది?  ఇంత‌కీ ఆ ఇంట్లో ఉన్న‌ది శ్రుతినేనా? మ‌రొక‌రా?  వాళ్లిద్ద‌రి ప్రేమ నిజం కాదా?  త‌దిత‌ర విష‌యాలతో మిగ‌తా సినిమా సాగుతుంది.

 

న‌టీన‌టులు:

తరుణ్‌, ఓవియా పాత్ర‌లు త‌ప్ప తెర‌పై ఎప్పుడో కానీ మ‌రో కొత్త పాత్ర క‌నిపించ‌దు. త‌రుణ్ చెల్లెలిగా ఓ అమ్మాయి అప్పుడ‌ప్పుడు ఫోన్‌లో మాట్లాడుతూ క‌నిపిస్తుందంతే. త‌రుణ్ ఈ క‌థ‌ని ఎంతో నమ్మి న‌టించాడ‌నే అభిప్రాయం క‌లుగుతుంది ఆయ‌న న‌ట‌న చూస్తే. 

ఓవియా అందంగా క‌నిపించింది. అయితే చాలా చోట్ల ఆమె లిప్ సింక్ స‌రిగ్గా కుద‌ర‌లేదు. మంచు మ‌నోజ్ అతిథి పాత్ర‌లో మెరుస్తాడు. ఆయ‌న త‌న నిజ జీవితంలోలాగానే హీరో పాత్ర‌లో క‌నిపిస్తాడు.

విశ్లేష‌ణ‌:

క‌న్న‌డ‌లో స‌క్సెస్ అయిన `సింపుల్ ఆగ్ ఒందు ల‌వ్ స్టోరీ`కి రీమేక్‌గా తెర‌కెక్కిన చిత్ర‌మిది. మూడు యాంగిల్స్‌లో ఈ ప్రేమ‌క‌థ సాగుతుంది. నాయ‌కానాయిక‌లిద్ద‌రికీ గ‌తంలో ప్రేమ‌క‌థ‌లు, వాటి తాలూకు జ్ఞాప‌కాలు ఉంటాయి. వాటిని ఒక‌రికొక‌రు పంచుకొనే క్ర‌మంలో ఫ్లాష్‌బ్యాక్‌లుగా వ‌స్తాయి ఆ రెండు క‌థ‌లు. మ‌రో క‌థ అభిరామ్‌, శ్రుతిల మ‌ధ్య సాగుతుంది. అయితే ఈ మూడు క‌థ‌ల్లోనూ ఫీల్‌కి ప్రాధాన్యం ఉంది. కానీ ఆ  విష‌యంపై దృష్టిపెట్టకుండా ఏమాత్రం ప్ర‌యోజ‌నం లేని సిల్లీ డైలాగుల‌తో క‌థ‌ని ముందుకు న‌డిపించే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కులు. 

ప్ర‌తి క్ష‌ణం అర్థం ప‌ర్థం లేని మాట‌ల గోలే త‌ప్ప‌, ప్రేమ‌లోని భావోద్వేగాల‌పైనా, కెమిస్ట్రీపైన ఏమాత్రం దృష్టిపెట్టలేదు.  దాంతో ఇది ప్రేక్షకుడికి  ఏమాత్రం రుచించ‌ని ఓ ల‌వ్‌స్టోరీగా మారిపోయింది.   తొలి స‌గ‌భాగంలో విరామం స‌మ‌యంలో వ‌చ్చే మ‌లుపే కాస్త ఆస‌క్తికి రేకెత్తిస్తుంది. మిగిలిందంతా కూడా బ‌ల‌వంతంగా రుద్దిన‌ట్టే అనిపిస్తుంది. విరామం త‌ర్వాతైనా సినిమా గాడిలో ప‌డుతుందే అంటే అది కూడా జ‌ర‌గ‌లేదు. మాట‌ల పైత్యం అక్క‌డ కూడా ఆగ‌లేదు. ప్రీ క్లైమాక్స్ స‌న్నివేశాలు కాస్త‌లో కాస్త ఫ‌ర్వాలేద‌నిపిస్తాయి. క్లైమాక్స్ మ‌ళ్లీ సాగ‌దీశారు. పాట‌లు, లొకేష‌న్లు మాత్రమే ఈ సినిమాలో బాగుంద‌నిపించే విష‌యాలు. ప్రేమ‌క‌థ‌ల్లో ప్రేక్ష‌కుడు ఎక్క‌డో ఒక చోట త‌మ‌ని తాము చూసుకోవాలి. 

కానీ ఈ  సినిమాలో మాత్రం ఆ భావ‌న ఎప్పుడూ కల‌గ‌లేదు. పైగా ఈ మూడు క‌థ‌లు కూడా అక్క‌డ‌క్క‌డ క‌న్‌ఫ్యూజింగ్‌గా అనిపిస్తాయి. త‌రుణ్‌, ఓవియా జంట మాత్రం బాగుంది. వాళ్లిద్దరూ అందంగా క‌నిపించారు. కానీ కెమిస్ట్రీ పండ‌లేదు. అదే ఈ సినిమాకి ప్ర‌ధాన‌మైన మైన‌స్‌.

 

సాంకేతికంగా:

క్రిస్టోఫ‌ర్ జోసెఫ్ కెమెరా ప‌నిత‌నం బాగుంది. ప‌లు లొకేష‌న్లని అందంగా చూపించాడు.  శ్రీనాథ్ సంగీతం ప‌ర్వాలేద‌నిపిస్తుంద‌తే. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉన్నాయి. 

ద‌ర్శ‌క‌ద్వ‌యం అనుభవ రాహిత్యం ఈ సినిమాలో చాలాచోట్ల క‌నిపిస్తుంది. వాళ్లు ఓ మంచి ప్రేమ‌క‌థ‌ని తీస్తూ... అవ‌న‌ర‌మైన‌... అస‌లు ఏమాత్రం  ప‌స లేని పంచ్ డైలాగుల‌తో సినిమాని న‌డిపించాల‌నుకోవ‌డం సినిమాకి పెద్దశాపంగా మారింది. కెమిస్ట్రీ,  భావోద్వేగాల్ని పండించేలా స‌న్నివేశాల్ని తీర్చిదిద్ద‌డంలో విఫ‌ల‌మ‌య్యారు.

ఆఖరి మాట:

స‌హ‌నాన్ని ప‌రీక్షించే ఓ ప్రేమ‌క‌థ ఇది. ఇంట‌ర్వెల్‌కి ముందు, ప్రీ క్లైమాక్స్‌లోనూ ఓ రెండు ట్విస్టులు మిన‌హా సినిమాలో ఏమాత్రం కొత్త‌ద‌నం లేదు. ఆ ట్విస్టుల కోస‌మ‌ని రెండున్న‌ర గంట‌లపాటు స‌హ‌నం వ‌హించే ఓర్పు ఉన్న‌వాళ్లే చివ‌రిగా సీట్ల‌లో క‌నిపిస్తారు. వాళ్లు కూడా అన‌వ‌స‌ర‌మైన‌సంభాష‌ణ‌ల్ని విని చెవులు త‌ప్పు వ‌దిలించుకొంటూ బ‌య‌టికి వ‌చ్చేస్తారు.

రివ్యూ బై శ్రీ

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS