'జై సింహా' మూవీ రివ్యూ & రేటింగ్స్

మరిన్ని వార్తలు

తారాగణం: బాలకృష్ణ, నయనతార, నటాషా, హరిప్రియ తదితరులు.. 
నిర్మాణ సంస్థ: CK ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: చిరంతన్ భట్
కథ-సంబాషణలు: M రత్నం
ఛాయాగ్రహణం: C రాంప్రసాద్
ఎడిటర్: ప్రవీణ్
నిర్మాత: C కళ్యాణ్
కథనం-దర్శకత్వం: KS రవికుమార్

రేటింగ్: 3/5

సెంటిమెంట్ల‌ని ఫాలో అయిపోవ‌డంలో నంద‌మూరి బాల‌కృష్ణ‌కు తిరుగులేదు.
ఆయ‌న సంక్రాంతి హీరో.
సింహా అనే పేరు బాగా క‌లిసొస్తుంది.
న‌య‌నతార‌.. అచ్చొచ్చిన తార‌!
ఇవి మూడు సెంటిమెంట్ల‌ని మేళ‌విస్తూ ఈ సంక్రాంతికి బాల‌య్య `జై సింహా` అవ‌తారం ఎత్తాడు.  ప్ర‌చార చిత్రాలు చూస్తుంటే బాల‌య్య సినిమా నుంచి ఫ్యాన్స్ ఆశించే అన్ని అంశాలూ పుష్క‌లంగా ఉన్నాయ‌ని తెలుస్తూనే ఉంది. మ‌రి.. ఆ దినుసులు ఏమేర‌కు అందాయి?  సంక్రాంతి సింహం మ‌ళ్లీ విజృంభించిందా?  లేదా?

* క‌థ‌

న‌ర‌సింహా (బాల‌కృష్ణ‌) ఓ బాబుతో స‌హా విశాఖ‌ప‌ట్నం నుంచి త‌మిళ‌నాడులోకి కుంభ‌కోణంకి వ‌చ్చి స్థిర‌ప‌డ‌తాడు. అక్క‌డ ఓ ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త (ముర‌ళీ మోహ‌న్‌)  ద‌గ్గ‌ర డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తాడు. య‌జ‌మాని కూతురు ధ‌న్య (న‌టాషా దోషి) కోసం చేయ‌ని నేరాన్ని త‌న‌మీద వేసుకుంటాడు. అటు పోలీస్ క‌మీష‌న‌ర్‌తోనూ, ఇటు ఓ ముఠా నాయ‌కుడితోనూ గొడ‌వ‌లు ప‌డుతుంటాడు.  బాబుని వెదుక్కుంటూ గౌరి (న‌య‌న‌తార‌) కుంభ‌కోణం వ‌స్తుంది. ఇంత‌కీ గౌరి ఎవ‌రు?  న‌ర‌సింహాకీ గౌరికీ... ఈ బాబుకీ ఉన్న సంబంధం ఏమిటి?  అనేదే మిగిలిన క‌థ‌.

* న‌టీన‌టులు


మ‌రోసారి బాల‌య్య వ‌న్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. బాల‌య్య లేక‌పోతే.. ఇంత సాదాసీదా క‌థ‌ని తెర‌పై భ‌రించ‌డం క‌ష్టం. పురోహితుల ఎపిసోడ్‌, ధ‌ర్నా సీన్ ద‌గ్గ‌ర బాల‌య్య డైలాగులు మైమ‌ర‌పిస్తాయి. అమ్మ‌కుట్టి పాట‌లో బాల‌య్య స్టెప్పుల‌కు థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోతాయి. సెంటిమెంట్ ని కూడా బాగానే పండించాడు. న‌య‌న‌తార స్ర్కీన్ టైమ్ త‌క్కువే. ఉన్నంత‌లో త‌న అనుభ‌వాన్ని రంగ‌రించింది. ప్ర‌కాష్‌రాజ్ ఓకే అనిపిస్తాడు. బ్ర‌హ్మానందం కామెడీ పండ‌లేదు. ఆ విష‌యంలో ద‌ర్శ‌కుడు జాగ్ర‌త్త తీసుకుంటే బాగుండేది. హ‌రిప్రియ‌, న‌టాషా గ్లామ‌ర్ బొమ్మ‌లే.


* విశ్లేష‌ణ‌

బాల‌య్య శైలికి సెంటిమెంట్ జోడించిన క‌థ ఇది. `బాబు` ఎపిసోడ్ అనేది త‌ప్పిస్తే... అంద‌రికీ తెలిసిన క‌థే. అయితే దాన్ని క‌మ‌ర్షియ‌ల్ పంథాలో మ‌రీ ముఖ్యంగా నంద‌మూరి బాల‌కృష్ణ అభిమానులకు న‌చ్చేలా ద‌ర్శ‌కుడు ఈ క‌థ‌ని తెర‌కెక్కించాడు.  సినిమా కాస్త నిదానంగానే మొద‌ల‌వుతుంది. కుంభ‌కోణం ఎపిసోడ్లు, అక్క‌డ శాంత మూర్తి లాంటి బాల‌య్య‌, బ్ర‌హ్మానందంతో వినోదం, క‌మీష‌న‌ర్‌తో గొడ‌వ‌.. ఇలా క‌థ మెల్ల‌మెల్ల‌గా పుంజుకుంటుంది. పూజారుల వైశిష్ట‌త తెలిపే స‌న్నివేశం ఒక‌టుంది. అక్క‌డ క‌థ పూర్తిగా జోరందుకుంటుంది. విశ్రాంతి ముందు.. ఓ భారీ పోరాట స‌న్నివేశం ఉంది. అక్క‌డ న‌య‌న‌తార ఎంట్రీతో క‌థ‌లో ట్విస్ట్ అర్థ‌మ‌వుతుంది.  సెకండాఫ్ లో ఎక్కువ‌గా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ల‌పై ఆధార‌ప‌డ్డాడు ద‌ర్శ‌కుడు. ఫ్లాష్ బ్యాక్ బాగా లెంగ్తీగా సాగింది. తొలి భాగంతో పోలిస్తే.. ఇక్క‌డే బాల‌య్య కాస్త హుషారుగా క‌నిపిస్తాడు. న‌య‌న‌తో త‌న కెమిస్ట్రీ మ‌రోసారి ఆక‌ట్టుకుంటుంది. పొలిటీష‌య‌న్‌ని త‌ల‌ప‌డే స‌న్నివేశం, ధ‌ర్నా ఎపిసోడ్ ఇవ‌న్నీ మాస్ కోస‌మే. తాను ప్రేమించిన అమ్మాయికి క‌థానాయ‌కుడు దూరం అయ్యే స‌న్నివేశాలలో సెంటిమెంట్‌ని ద‌ట్టించాడు ద‌ర్శ‌కుడు. ప్రీ క్లైమాక్స్ అంతా... కుటుంబ ప్రేక్ష‌కుల కోసం డిజైన్ చేసిన‌దే. ప‌తాక స‌న్నివేశాల్ని త్యాగాల మ‌యం చేశాడు. అవ‌న్నీ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకునే అవ‌కాశం ఉంది. అయితే అక్క‌డ‌క్క‌డ బాల‌య్య‌కు త‌గిన మెరుపులాంటి డైలాగులు, ఫైట్లు, స్టెప్పుల‌తో..  మాస్‌కి కావ‌ల్సిన అంశాల‌న్నీ ఉండేలా జాగ్ర‌త్త ప‌డ్డాడు. కాక‌పోతే సెంటిమెంట్ డోస్ కాస్త ఎక్కువ అయిన‌ట్టు అనిపిస్తుంది. ఇది ఏమేర‌కు న‌చ్చుతుంద‌న్న దాన్ని బ‌ట్టి ఈ సినిమా విజ‌యావ‌కాశాలు ఆధార‌ప‌డి ఉన్నాయి.

* సాంకేతికంగా

యాక్ష‌న్ దృశ్యాల్ని లావీష్‌గా తెర‌కెక్కించారు. నిర్మాణ విలువ‌లు క‌నిపించాయి. పాట‌లు అంతంత మాత్ర‌మే. నేప‌థ్య సంగీతం కూడా అంతే. ద‌ర్శ‌కుడు ఎంచుకున్న క‌థ‌లో వైవిధ్యం లేదు. ట్విస్టు, త్యాగాలు మిన‌హాయిస్తే... 80 ద‌శ‌కంలో క‌థ‌లా అనిపిస్తుంది. ర‌త్నం సంభాష‌ణ‌లు బాగున్నాయి. బాల‌య్య మీట‌ర్‌కి త‌గిన‌ట్టు రాశారు.

* ప్ల‌స్ పాయింట్స్‌

+ బాల‌య్య న‌ట‌న‌
+ డైలాగులు
+ సెంటిమెంట్‌
+ బాబు.. ట్విస్టు

* మైన‌స్ పాయింట్స్‌ 


- పాత క‌థ‌

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌:  ఇది బాల‌య్య సినిమా!

రివ్యూ బై శ్రీ

రివ్యూ బై శ్రీ


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS