ADA

ఖైదీ నెంబర్‌ 150 మూవీ రివ్యూ

By iQlik Movies - January 11, 2017 - 07:37 AM IST

మరిన్ని వార్తలు

చిత్రం: ఖైదీ నెంబర్‌ 150 
తారాగణం: చిరంజీవి (ద్విపాత్రాభినయం), కాజల్‌ అగర్వాల్‌, తరుణ్‌ అరోరా, రాయ్‌ లక్ష్మి, బ్రహ్మానందం, అలీ, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి తదితరులు. 
నిర్మాణం: కొణిదెల ప్రొడక్షన్స్‌ కంపెనీ 
నిర్మాత: రామ్‌చరణ్‌ 
సమర్పణ: కొణిదెల సురేఖ 
దర్శకత్వం: వి.వి. వినాయక్‌ 
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌ 
సినిమాటోగ్రఫీ: రత్నవేలు 
విడుదల తేదీ: 11 జనవరి 2017

 

కథా కమామిషు:

చిరంజీవి పదేళ్ల విరామం తర్వాత వచ్చిన సినిమా 'ఖైదీ నెంబర్‌ 150'. ఇంత గ్యాప్‌ తర్వాత చిరంజీవి చేస్తున్న సినిమా కావడంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ సినిమా కథలోకి వెళితే, దొంగతనాలు, మోసాలు చేసే కత్తి శీను (చిరంజీవి) కోల్‌కత్తా సెంట్రల్‌ జైలు నుంచి తప్పించుకుని పారిపోయి హైద్రాబాద్‌ వస్తాడు. అక్కడ నుండి ఫ్రెండ్‌ (అలీ) సహాయంతో బ్యాంకాక్‌ వెళ్లిపోదామనుకుంటాడు. ఎయిర్‌ పోర్ట్‌లో లక్ష్మీ(కాజల్‌ అగర్వాల్‌)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అయితే అదే సమయంలో ఓ హత్య జరగడం, ఆ హత్యలో గాయపడిన వ్యక్తి శంకర్‌ (చిరంజీవి ద్విపాత్రాభినయం) అచ్చం తనలాగే ఉండడంతో ఆశ్చర్యానికి గురవుతాడు. అతన్ని కాపాడి ఆసుపత్రిలో చేరుస్తాడు. శంకర్‌ ఎవరంటే రైతు సమస్యల కోసం పోరాడే రైతు నాయకుడు. ఇంతలో లక్ష్మీ కత్తి శీనుకు హ్యండిచ్చిందని తెలియడంతో మళ్లీ బ్యాంకాక్‌ వెళ్లిపోదామనుకునే ప్రయత్నాల్లో ఉన్న కత్తి శీనును, శంకర్‌ అనుకుని కలెక్టర్‌ వృద్దాశ్రమానికి తీసుకెళ్తాడు. మరో వైపు ఓ శీతల కంపెనీ పెట్టాలనుకునే ఇండస్ట్రియలిస్ట్‌ అగర్వాల్‌ (తరుణ్‌ అరోరా) శంకర్‌లా ఉన్న కత్తి శీనుతో రైతుల భూముల్ని కాజేయడానికి 25 కోట్ల రూపాయలకి డీల్‌ సెట్‌ చేసుకుంటాడు. శంకర్‌ కోసం ఏర్పాటు చేసిన ఓ సన్మాన సభలో అంతా తెలుసుకుని, తానే శంకర్‌గా మారి ఆ రైతులకు అండగా నిలబడి అతని ఆశయాన్ని గెలిపించాలని నిర్ణయించుకుంటాడు కత్తి శీను. అసలు శంకర్‌ చేసే పోరాటం ఏంటి? దాన్ని గెలవడానికి కత్తి శీను ఏం చేశాడు? చివరికి శంకర్‌, శీనులు కలిసారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! 

 

నటీనటులు ఎలా చేశారు? 

తొమ్మిదేళ్లుగా మెగాస్టార్‌ చిరంజీవి నటనకు దూరమయ్యారు. కానీ ఆయనలో గ్రేస్‌, జోరు అలాగే ఉందని ప్రూవ్‌ చేశారు. చిరంజీవి అంటే డాన్సులు, కామెడీ.. ఫైట్లు.. ఇలా ఈ ఈక్వేషన్స్‌ ఏమీ తగ్గకుండా ఆయన తనలోని ఫుల్‌ జోష్‌ని చూపించి, రీ ఎంట్రీలో అభిమానులను ఫుల్‌ ఖుషీ చేశాడు. అనుకున్న అంచనాలకు మించిన రిజల్ట్‌ని ఆయన తెరపై చూపించారు. ఎమోషనల్‌ సీన్స్‌లో అయితే కంటతడి పెట్టించేశారు. డాన్సులు సూపర్బ్. కత్తి శీను క్యారెక్టర్‌లో మాస్‌ మసాలా చూపిస్తే, శంకర్‌ గెటప్‌లో డిగ్నిటీ లుక్‌ని ప్రదర్శించారు. టోటల్‌గా బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అనిపించారు చిరంజీవి. కాజల్‌ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. అంతే కాదు చిరంజీవి పక్కన జోడీగా కరెక్ట్‌గా సెట్‌ అయిపోయింది. ఆమెకు ఈ సినిమాలో పెద్దగా నటనకు స్కోప్‌ లేకపోయినా, గ్లామర్‌తో ఆకట్టుకుంది. అలాగే తరుణ్‌ అరోరా విలన్‌గా ఫ్రెష్‌ లుక్‌నిచ్చారు. అలీ, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, జయప్రకాష్‌ రెడ్డి తదితరులు తమ పరిధి మేర ఎంటర్‌టైన్‌ చేశారు. మిగతా పాత్రధారులంతా ఓకే. 

 

సాంకేతిక వర్గం పనితీరు 

తమిళ్‌ సినిమా 'కత్తి'కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో పెద్దగా మార్పులేమీ చేయలేదు. రైతు సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ కమర్షియల్ సినిమాకి కథే బలం. ఆ కథకి కమర్షియల్‌గా ఇంకొన్ని హంగులు జోడించి తెలుగులో వినాయక్‌ తెరకెక్కించాడు. తనకున్న అనుభవంతో చిరంజీవిని తెరపై ఎలా చూపించాలనుకున్నాడో అలా చూపించి సక్సెస్‌ అయ్యాడు వినాయక్‌. గతంలో ఇదే కాంబినేషన్‌లో రీమేక్‌ అయిన సినిమా 'ఠాగూర్‌' మాదిరిగానే ఈ సినిమాను సక్సెస్‌ చేయడంలో డైరెక్టర్‌గా వినాయక్‌ మంచి పాత్ర పోషించాడు. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన మ్యూజిక్‌కి చిరు, కాజల్‌ డాన్స్‌లు తోడై అభిమానుల్ని అలరించాయి. అలాగే విజువల్‌గా చాలా అందంగా ఉన్నాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ. రత్నవేలు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఏ మాత్రం రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మాత చరణ్‌ నిర్మించాడు. అయితే అక్కడక్కడా స్లో పేస్‌ అనిపించడంతో ఎడిటింగ్‌ అవసరం అనిపిస్తుంది. సరదా సన్నివేశాలతోపాటు, హృదయాన్ని ఆకట్టుకునే ఎమోషనల్‌ సీన్స్‌లో డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. చిరంజీవికి తగ్గట్టుగా డైలాగ్స్‌ రాశారు. అవి అభిమానుల్ని మెప్పిస్తాయి. 

 

విశ్లేషణ 

చిరంజీవిని అన్నయ్యా అని పిలిచే వినాయక్‌, చిరంజీవికి తన తండ్రి తర్వాత అంతటి ప్లేస్‌నిచ్చాడు. అతని అభిమానం అలాంటిది. ఈ కాంబోలో 'ఠాగూర్‌' ఘనవిజయం సాధించాక, దాంతో ఈ సినిమాని పోల్చడం మామూలే. అయితే కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ పరంగా ఇంకాస్త శ్రద్ధ పెట్టి, ఇంకొంచెం గ్రిప్పింగ్‌గా వినాయక్‌ సినిమాని తెరకెక్కించగిలిగి ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఎందుకంటే ఇది చిరంజీవి కమ్‌ బ్యాక్‌ ఫిలిం. సోషల్‌ మెసేజ్‌ ఉన్న సినిమా కాబట్టి, టెంపో కొనసాగుతుండాలి. ఆ విషయంలో అక్కడక్కడా జర్క్స్‌ కనిపిస్తాయి. సీన్స్‌ కొన్ని ముతగా అనిపించడం దర్శకుడి పొరపాటే. హీరోయిజాన్ని ఎలివేట్‌ చేయడంలో వినాయక్‌ దిట్ట. తన మార్క్‌ సన్నివేశాలు బాగానే తెరకెక్కించాడు. మొత్తంగా చూసినప్పుడు చిరంజీవిని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో తెరపై అలా చూపించాడు దర్శకుడు. ప్రతిష్టాత్మకమైన సినిమా కావడంతో ఈ సినిమా నుంచి ఇంకా ఆశించడం అనేది మామూలే. అదొక్కటీ పక్కన పెడితే సినిమాపై పెరిగిన హైప్‌, చిరంజీవి ఎలా ఉంటాడనే ఉత్కంఠ వీటన్నిటికీ తగ్గట్టుగా సినిమాని వినాయక్‌ రూపొందించాడు. అన్నిటికన్నా ముఖ్యంగా చిరంజీవి తనపై అభిమానులు పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాలో నటించి మెప్పించారు. డాన్సులతో తనలో జోష్‌ ఏమాత్రం తగ్గలేదని నిరూపించారాయన. పైసా వసూల్‌ అనేది మామూలే మాటే. అంతకు మించి అనే మాట వినిపించి ఉండేది దర్శకుడు ఇంకొంచెం గ్రిప్పింగ్‌గా సినిమాని నడిపి ఉంటే.

 

ఫైనల్‌ వర్డ్‌

అభిమానుల కోసం మెగాస్టార్‌ ఈజ్‌ బ్యాక్‌


iQlik App is now on Google Play Store. See what the Celebs are saying about this APP. Download right Now


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS

AD

Duvvada Jagannadham Telugu Movie

AD

We are Hiring - Content Writer

AD

Ninnu Kori Telugu Movie