పంతం మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

తారాగణం: గోపీచంద్, మెహ్రీన్, సంపత్, జేపీ తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రీ సత్య సాయి ఆర్ట్స్
సంగీతం: గోపిసుందర్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
ఛాయాగ్రహణం: ప్రసాద్ మురేళ్ళ
నిర్మాత: KK రాదామోహన్
రచన-దర్శకత్వం: చక్రవర్తి రెడ్డి

రేటింగ్: 2/5

గోపీచంద్‌కి ఈమ‌ధ్య టైమేమీ బాగోలేదు. త‌న క‌థ‌ల జ‌డ్జిమెంట్ త‌ప్పుతోంది. సినిమాలో భారీద‌నం ఉన్నా - కొత్త‌ద‌నం క‌నిపించ‌క‌పోవ‌డంతో చాలా ఫ్లాపులు త‌గిలాయి. త‌న ట్రాక్ రికార్డు కూడా దెబ్బ‌తింది. ఈ క్ర‌మంలోనే త‌న 25వ సినిమాకీ ద‌గ్గ‌ర‌పడ్డాడు. 25వ సినిమా అంటే ఏ హీరోకైనా మైలు రాయే. దానికి తోడు.. క‌చ్చితంగా హిట్ కొట్టాల్సిన ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి కొత్త‌ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇచ్చాడు. ఆ ఫ‌లిత‌మే.. `పంతం`. గోపీచంద్ కెరీర్‌ని నిర్ణ‌యించే ఈ చిత్రం ఇప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి సినిమా ఎలా ఉంది?  హిట్టుకోసం గోపీచంద్ ప‌ట్టిన పంతం ఎంత వ‌ర‌కూ నెర‌వేరింది?

* క‌థ‌

విక్రాంత్ (గోపీచంద్‌) దొంగ‌త‌నాలు చేస్తుంటారు. మంత్రులంతా దాచుకున్న సొమ్ముని.. వాళ్ల బినామీల ద‌గ్గ‌ర్నుంచి తెలివిగా కాజేస్తుంటాడు. వాటిని ఓ ట్ర‌స్ట్‌కి పంపి... అక్క‌డి నుంచి పేద ప్ర‌జ‌ల‌కు సహాయం అందేలా చేస్తుంటాడు. విక్రాంత్ వ‌ల్ల ఎక్కువ‌గా న‌ష్ట‌పోయింది హోం మినిస్ట‌ర్ జ‌యేంద్ర (మిర్చి సంప‌త్‌). అస‌లు.. విక్రాంత్‌కీ ఈ హోం మినిస్ట‌ర్ కీ సంబంధం ఏమిటి? ఈ దొంగ‌త‌నాల వెనుక ఉన్న బ‌ల‌మైన కార‌ణ‌మేంటి? అక్ష‌ర (మెహ‌రీన్‌)తో ప్రేమ‌క‌థ ఎలా మొద‌లైంది?  చివ‌రికి విక్రాంత్ ల‌క్ష్యం నెర‌వేరిందా?  లేదా?  అనేదే క‌థ‌

* న‌టీన‌టులు

గోపీచంద్ 25వ సినిమా ఇది. 24 సినిమాలుగా ఏం చేస్తూ వ‌చ్చాడో ఇందులోనూ అదే చేశాడు. కాక‌పోతే... రెండు షేడ్లు ఉన్నాయి కాబ‌ట్టి... రెండు ర‌కాలుగా క‌నిపించాడంతే. 

మెహ‌రిన్ పాత్ర‌కు ఏమాత్రం ప్రాధాన్యం లేదు. త‌ను బొమ్మ‌లా నిల‌బ‌డిపోయిందంతే. సంప‌త్‌, జెపీ... ఇలా చెప్పుకోవ‌డానికి చాలామంది ఉన్నారు. వాళ్ల‌దీ సేమ్ టూ సేమ్ రొటీన్ న‌ట‌నే. ఈ సీను అదిరిపోయింద‌నో, ఈ న‌టుడు బ్ర‌హ్మాండంగా చేశాడ‌నో చెప్పుకోవ‌డానికి ఏమీ మిగ‌ల్లేదు.

* విశ్లేష‌ణ‌

ఇదో రాబిన్ వుడ్ త‌ర‌హా క‌థ‌. డబ్బున్న వాళ్ల ద‌గ్గ‌ర దోచుకుని లేని వాళ్ల‌కు పెట్ట‌డం.. ఆ టైపు స్టోరీ. కొండ‌వీటి దొంగ‌, జెంటిల్‌మెన్‌, కిక్, శివాజీ.. ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలా సినిమాలు మ‌దిలో మెదులుతుంటాయి. వాటికి `ఎక్స్‌గ్రేషియా` అనే పాయింట్ జోడించాడు. ప్ర‌భుత్వ ప‌ధ‌కాలు, వాళ్ల స‌హాయాలు పేద‌ల‌కు, అందాల్సిన వాళ్ల‌కు స‌రిగా అంద‌డం లేద‌ని, ఒక్క ఫైలు క‌ద‌ల‌డానికి ప‌దుల సంత‌కాల అవ‌స‌రం ఎందుక‌ని ప్ర‌శ్నించిన సినిమా ఇది. 

కాక‌పోతే.. అవ‌న్నీ పాత పాయింట్లే. లంచం, అవినీతి.. ఇలాంటి మాట‌లు వినీ,వినీ ప్రేక్ష‌కుల చెవులు తుప్ప‌ట్టుకుపోయాయి. పంతం కూడా అదే డైలాగ్ కొట్టింది.  ప్ర‌మాదాల వ‌ల్ల ప్రాణాలు, అవ‌య‌వాలు కోల్పోయిన కుటుంబాల‌కు ప్ర‌భుత్వం ఇవ్వాల్సిన న‌ష్ట‌ప‌రిహారాలు స‌రిగా అంద‌డం లేదు. వాటిని మంత్రులు, ప్ర‌భుత్వ అధికారులే భోం చేస్తున్నారు.. అనే పాయింట్‌పై ఇంకాస్త బ‌లంగా ఫోక‌స్‌పెట్టి ఉంటే.. కాస్తో కూస్తో కొత్త `పాయింట్` అనిపించేది. ఆ అవ‌కాశం ఇవ్వ‌లేదు.  

ఇలాంటి క‌థ‌ల్ని స్క్రీన్ ప్లే తెలివితేట‌ల‌తో తెర‌కెక్కించాలి. గ‌మ్మ‌త్తైన క‌థ‌నం ఉండాలి. దొంగ‌త‌నాల ఎపిసోడ్లు తెలివిగా రాసుకోవాలి. అవేం ఇందులో క‌నిపించ‌వు. అంతా పాత వాస‌నే. విశ్రాంతి స‌మ‌యంలో ఏదో షాక్ ఇచ్చిన‌ట్టు అనిపిస్తుంది. కానీ.. సెకండాఫ్ మొద‌లైన కాసేప‌టికే అదీ తేలిపోతుంది. సెకండాఫ్‌లో మొద‌టి ప‌ది నిమిషాలూ విసుగు తెప్పిస్తుంది. ఆ త‌ర‌వాత‌.. విక్రాంత్ ఫ్లాష్ బ్యాక్ మొద‌ల‌వుతుంది. అక్క‌డ క‌థ కు కాస్త ప్రాణం అందుతుంది. విక్రాంత్ ల‌క్ష్యం, ఆశ‌యం, పంతం అర్థ‌మ‌వుతాయి. అయితే ఫ్లాష్ బ్యాక్ అయిపోయాక‌.. మ‌ళ్లీ రొటీన్ రొడ్డ‌కొట్టుడు వ్య‌వ‌హార‌మే. 

కోర్టు స‌న్నివేశాల్లో సైతం బ‌లం లేదు. అక్క‌డ ప‌లికే సంభాష‌ణ‌లు లెంగ్తీగా ఉన్నా, వాటిలో పెయిన్ లేదు. అలా.. ఓ భారీ అంశాన్ని ద‌ర్శ‌కుడు నెత్తిమీద పెట్టుకుని, అనుభ‌వ లేమితో దాన్ని మోయ‌లేక మ‌ధ్య‌లో చ‌తికిల ప‌డిపోయాడు.

* సాంకేతిక వ‌ర్గం

పాట‌లు ఓ మోస్త‌రుగా అనిపిస్తాయి. కొన్ని చోట్ల లిప్ సింక్ అస్స‌లు కుద‌ర్లేదు. `దేశ‌మంటే మ‌ట్టీ కాదోయ్` సాహిత్యానికీ, వేసే స్టెప్పుల‌కూ సంబంధం ఉండ‌దు. నేప‌థ్య సంగీతంలోనూ పాత సినిమాల ఛాయ‌లు వినిపిస్తాయి. కెమెరా వ‌ర్క్ బాగుంది. ఖ‌ర్చు కూడా బాగానే పెట్టారు. కానీ.. ద‌ర్శ‌కుడు ఆ డ‌బ్బుకి త‌గిన న్యాయం చేయ‌లేదు. పాత క‌థ‌ని, అంతే పాత ప‌ద్ధ‌తిలో తీశాడు. హిట్టు కొట్టాల‌న్న గోపీచంద్ ల‌క్ష్యం.. ఈ పంతం నెర‌వేర్చ‌లేక‌పోయింది.

* ప్ల‌స్‌పాయింట్స్‌

+ క‌థా నేప‌థ్యం

* మైన‌స్‌పాయింట్స్‌

- పాత క‌థ‌
- రొటీన్ స‌న్నివేశాలు

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌:  గోపీచంద్ పంతం నెర‌వేర‌లేదు. 

రివ్యూ రాసింది శ్రీ


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS