సినీ రాజకీయాలు కెవ్వు కేక

మరిన్ని వార్తలు

కళ్యాణ్‌రామ్‌ 'ఎమ్మెల్యే'నంటున్నాడు. మహేష్‌ ఏమో 'భరత్‌ అను నేను' అంటూ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నాడు. ఎమ్మెల్యే అంటే మంచి లక్షణాలున్న అబ్బాయ్‌ అని. మొన్నీమధ్యనే 'ఎంసీఏ' సినిమా కూడా 'మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌' అనే సరికొత్త నిర్వచనంతో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అలాగే 'ఎమ్మెల్యే' కూడా ప్రేక్షకుల మన్ననలు అందుకునేలానే ఉన్నాడు. మైక్రో టీజర్‌ని అంత ఎట్రాక్టివ్‌గా తీర్చిదిద్దారు మరి. 

కాస్తంత కామెడీ, ఇంకాస్త ఎమోషన్‌, కావాల్సినంత యాక్షన్‌ అనేలా 'ఎమ్మెల్యే'ని తీర్చిదిద్దుతున్నారట. ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో కాజల్‌ అగర్వాల్‌కి తొలి సినిమా 'లక్ష్మీకళ్యాణం' కాగా, అందులో కళ్యాణ్‌రామ్‌ హీరోగా నటించాడు. మళ్ళీ ఇన్నేళ్ళకు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తోంది. మార్చిలో 'ఎమ్మెల్యే' ప్రేక్షకుల ముందుకొస్తాడు. ఇంకో వైపున మహేష్‌ - కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'భరత్‌ అను నేను' సినిమా ఏప్రిల్‌లో ప్రేక్షకుల్ని పలకరించనున్న సంగతి తెలిసినదే. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ ఈ నెల 26న విడుదల చేయబోతున్నారు. ఆ విషయాన్నీ చాలా ఇన్నోవేటివ్‌గా ప్రకటించారు. 

'ఫస్ట్‌ ఓత్‌ ఆన్‌ జనవరి 26' అంటూ ఇంట్రెస్టింగ్‌గా ఈ విషయాన్ని వెల్లడించడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. మహేష్‌ సరసన బాలీవుడ్‌ భామ కైరా అద్వానీ హీరోయిన్‌గా ఈ సినిమాలో నటిస్తోంది. 'భరత్‌ అను నేను' టైటిల్‌ ప్రచారంలో ఉన్నప్పటికీ ఇది ఇంకా అధికారికంగా ప్రకటితం కాలేదు. మహేష్‌ 24వ సినిమా ఇది. కొరటాల శివ - మహేష్‌ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'శ్రీమంతుడు' సంచలన విజయాన్ని అందుకుంది. దాంతో ఈ 'భరత్‌ అను నేను' సినిమాపై సుమారు 200 కోట్ల రూపాయల బిజినెస్‌ ఖాయమనే అంచనాలు సినీ పరిశ్రమలో ఉన్నాయి. 

ఏదేమైనా ఈ ఏడాది రెండు బిగ్‌ సినిమాలు పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి ప్రేక్షకుల్ని అలరించనున్నాయన్నమాట. ఈ సినీ రాజకీయాలు కెవ్వు కేక అనిపిస్తాయా? వేచి చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS