'ఓయ్‌' బ్యూటీ గట్టెక్కేస్తావా మరి.!

మరిన్ని వార్తలు

అప్పుడెప్పుడో సిద్దార్ద్‌తో 'ఓయ్‌' సినిమాలో నటించింది ముద్దుగుమ్మ షామిలి. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా బాగా పాపులారిటీ ఉన్న ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది ఈ సినిమాతోనే. అయితే తొలి సినిమాకే అమ్మడు చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 

అందుకు కారణం ఫిజిక్‌. అసలే ఇప్పటి హీరోయిన్లు నాజూకైన సన్నజాజి నడుము గ్లామర్‌తో వస్తుంటే, రావడం రావడమే బొద్దు సౌందర్యంతో వచ్చిన షామిలిని జనం అంతగా ఆదరించలేకపోయారు. దాంతో తొలి సినిమా 'ఓయ్‌' భారీగా నిరాశపరిచింది. ఇక ఆ తర్వాత చాలా కాలం వెండితెర నుండి మాయమైపోవడంతో ఈ బ్యూటీ ఏకంగా సినిమాలకు గుడ్‌బై చెప్పేసిందనుకున్నారంతా. 

కానీ మళ్లీ వచ్చిందండోయ్‌. 'అమ్మమ్మగారిల్లు' చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది షామిలీ. ఈసారి నాగశౌర్యతో జోడీ కడుతోందన్న మాట ఈ ముద్దుగుమ్మ. ఇంకేం గట్టెక్కేసినట్లే అనిపిస్తోంది. ప్రధమ విఘ్నం ఉన్నా, ద్వితీయ విఘ్నం ఉండకూడదంటారు. అది షామిలీకి లేనట్లేననిపిస్తోంది. ఎందుకంటే, నాగశౌర్య లక్‌ షామిలికి కలిసొచ్చేలానే ఉంది. 

ఇటీవల 'ఛలో' సినిమాతో నాగశౌర్య రయ్‌ రయ్‌మని దూకుడుమీదున్నాడు. 'ఛలో' విజయంతో నాగశౌర్యపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు ఆడియన్స్‌. అందులోనూ ఈ సినిమా టీజర్‌ చూశాక ఆ కాన్ఫిడెన్స్‌ మరింత రెట్టింపయ్యింది. టైటిల్‌ సాఫ్ట్‌గా ఉన్నా, అన్ని కమర్షియల్‌ అంశాలు పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సక్సెస్‌ మంత్రం పల్లెటూరి వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఈ సినిమాలో. 

యాక్షన్‌ అంశాలు, ఆహ్లాదమైన, ఆరోగ్యమైన కామెడీ ఇవి చాలవా ఈ రోజుల్లో ఓ సినిమా హిట్‌ టాక్‌ సంపాదించడానికి. అందుకే షామిలి ఈ సారి హిట్‌ కొట్టడం ఖాయమనిపిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS