తారాగణం: రాజ్ తరుణ్, హెబ్బా పటేల్, రాజేంద్ర ప్రసాద్, రాజా రవీంద్ర, షాయాజీ షిండే
నిర్మాణ సంస్థ: ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేటు లిమిటెడ్
సంగీతం: శేఖర్ చంద్ర
ఛాయాగ్రహణం: బీ రాజశేఖర్
ఎడిటర్: ఏం ఆర్ వర్మ
సహా నిర్మాత: అజయ్ సుంకర
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
కథ-కథనం-డైలాగ్స్-దర్శకత్వం: వెలిగొండ శ్రీనివాస్
రచయితలు మెగా ఫోన్ పట్టడం ఈరోజుల్లో సర్వసాధారణమైంది. రచయితగా రెండు హిట్లు ఉంటే చాలు.. దర్శకుడిగా కెప్టెన్ కుర్చీలో కూర్చోవడానికి అర్హత సాధించేసినట్టే. ఆ లెక్కన కాస్త ఆలస్యంగా దర్శకుడైన రచయిత వెలిగొండ శ్రీనివాస్. వరుస విజయాలతో జోష్‌తో ఉన్న రాజ్ తరుణ్ - ఓ కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చాడంటే, కథని బాగా నమ్మబట్టే అనుకోవాలి. మరి ఆ కథ.. `అంధగాడు`ని ఎంత వరకూ గట్టెక్కించింది?? ఈ `అంధగాడు` ఎవరికి నచ్చుతాడు?? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
* కథ ఎలా నడిచిందంటే...
గౌతమ్ (రాజ్ తరుణ్) అనాధ.. దానికి తోడు అంధుడు. తన ముగ్గురు స్నేహితులతో కలసి ఆశ్రమంలో పెరుగుతాడు. పెరిగి.. పెద్దవాడై రేడియో జాకీగా పనిచేస్తుంటాడు. అదే సమయంలో నేత్ర (హెబ్బా పటేల్) ప్రేమలో పడిపోతాడు. ఆ అమ్మాయి ఎక్కడ దూరం అవుతుందో అని.. తనకు చూపు ఉన్నట్టే నటిస్తుంటాడు. కానీ.. నిజం తెలిసిపోతుంది. నేత్ర పేరుకు తగ్గట్టే నేత్ర వైద్యురాలు. అందుకే గౌతమ్‌కి చూపు వచ్చేలా చేస్తుంది. గౌతమ్‌కి చూపు వచ్చాక అసలు సమస్యలు మొదలవుతాయి. తన కంటికి ఓ ఆత్మ కనిపిస్తుంది. రెండు హత్యలు చేయ్... నా ఆత్మకు శాంతి కలిగించు... అని వేడుకొంటూ ఉంటుంది. ఇంతకీ ఆ ఆత్మ ఎవరిది? గౌతమ్‌ని ఎందుకు హత్యలు చేయమంటోంది?? గౌతమ్ చేశాడా, లేదా? అనేదే మిగిలిన కథ.
* నటీనటులు ఎలా చేశారంటే...?
సినిమాకు రాజ్ తరుణ్ నటన, తన కామెడీ టైమింగ్ బలం. తన పాత్రలో చాలా రకాలైన షేడ్స్ ఉన్నాయి. కామెడీ టైమింగ్ లో తిరుగులేదు.
హెబ్బా పాత్ర తొలి భాగానికీ, ప్రేమ సన్నివేశాలకే పరిమితమైంది. ద్వితీయార్థంలో ఆమె పాటలకు మాత్రమే కనిపిస్తుంది.
షియాజీ షిండే, రాజా రవీంద్ర మిగిలిన వారంతా ఓకే అనిపిస్తారు.
రాజేంద్ర ప్రసాద్ కి ఈసారి కొత్త తరహా పాత్ర దక్కింది. సత్య కామెడీ టైమింగ్ మరోసారి ఆకట్టుకొంటుంది.
* తెరపై ఎలా సాగిందంటే..??
కథ... ప్రారంభ సన్నివేశాలు నిదానంగా సాగుతాయి. పాత్రల పరిచయానికి దర్శకుడు బాగానే సమయం తీసుకొన్నాడు. రాజ్ తరుణ్, హెబ్బా ప్రేమాయణం.. తరుణ్ నాటకం... చూపు రావడం వీటికే ప్రధమార్థం నడిచిపోతుంది. తాను చెప్పాలనుకొన్న కథ.. అందులోని ట్విస్టులు ద్వితీయార్థానికి దాచుకొన్నాడు. కీలకమైన సెకండ్ ఆఫ్‌ని దర్శకుడు కట్టుదిట్టంగా నడిపించడలిగాడు. అక్కడ మాత్రం ఎక్కడా ట్రాక్ తప్పలేదు. కథలోని మలుపులు ఆకట్టుకొంటాయి. కామెడీ కంటే థ్రిల్‌కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు దర్శకుడు. కాసేపు థ్రిల్లర్‌లా, మరి కాసేపు హారర్‌లా, ఇంకాసేపు... కామెడీ సినిమాలా అనిపిస్తుంటుంది. అన్ని రకాల రుచులూ పంచుతుంది. అయితే.. ద్వితీయార్థంలో పాటలు కథాగమనానికి బ్రేకులు వేస్తాయి. అవి లేకపోతే.. కథలో మరింత స్పీడు ఉండేది. పతాక సన్నివేశాల్ని వినోదాత్మకంగా నడిపించడంలో దర్శకుడు విజయం సాధించాడు. మొత్తానికి ఓ మామూలు రివైంజ్ డ్రామాని కొత్త రకంగా నడిపించి... సక్సెస్ అయ్యాడు దర్శకుడు.
* సాంకేతిక వర్గం పనితీరు ఎలా ఉందంటే...?
ఓవరాల్‌గా చూస్తే ఇదో రివైంజ్ డ్రామా. అయితే దానికి ఓ కొత్త పాయింట్ జోడించి చూపించాడు దర్శకుడు. డైలాగులూ బాగున్నాయి. ఇన్ని పాటలు అనవసరం అనిపిస్తాయి. నేపథ్య సంగీతం మాత్రం విసిగిస్తుంది. కెమెరా వర్క్‌తో ఈ సినిమా క్వాలిటీ పెరిగింది. ద్వితీయార్థంలో పాటల్ని తగ్గించుకోవాల్సింది.
* ప్లస్ పాయింట్స్:
+ రాజ్ తరుణ్
+ కథనం
+ డైలాగులు
* మైనస్ పాయింట్స్:
- పాటలు
- నేపథ్య సంగీతం
ఫైనల్ వర్డిక్ట్: నవ్వించిన.. అంధగాడు
యావరేజ్ యూజర్ రేటింగ్: 3/5
రివ్యూ బై: శ్రీ