తారాగణం: నితిన్, మేఘా ఆకాష్, రావు రమేష్, లిజి, సత్య, మధునందన్, ప్రభాస్ శీను తదితరులు
నిర్మాణ సంస్థ: పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ & శ్రేష్ట్ మూవీస్
సంగీతం: థమన్ ఎస్ ఎస్
ఎడిటర్: ఎస్ ఆర్ శేఖర్
ఛాయాగ్రహణం: నటరాజ సుబ్రమణియన్
నిర్మాతలు: పవన్ కళ్యాణ్ & సుధాకర్ రెడ్డి
రచన-దర్శకత్వం: కృష్ణ చైతన్య
రేటింగ్: 2.75/5
గీత రచయితగా తనదైన మార్క్ సృష్టించుకున్నాడు కృష్ణ చైతన్య! `రౌడీ ఫెలో`తో దర్శకుడిగా మారాడు. ఆ సినిమా అంతంతమాత్రంగానే ఆడినా... దర్శకుడిగా కృష్ణచైతన్య పనితనం, `మాట`కారితనం బాగా నచ్చాయి. `రౌడీ ఫెలో` చూసి త్రివిక్రమ్ కూడా ముగ్థుడైపోయాడంటే.. ఈ సినిమాతో కృష్ణ చైతన్య ఎంత మ్యాజిక్ చేశాడో అర్థమవుతోంది. ఇప్పుడు అదే త్రివిక్రమ్ అందించిన కథతో.. సినిమా తీసే అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు.
అదే.. ఛల్ మోహన రంగ. నితిన్ కి ఇది 25వ చిత్రం కావడం, పవన్ కల్యాణ్ నిర్మాతగా మారడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. మరి వాటిని ఛల్ మోహన రంగ అందుకుందా? అందుకుంటే... ఏ మాత్రం..? తెలియాలంటే.. కథలోకి వెళ్లాలి.
* కథ
మోహన్ రంగ (నితిన్) చిన్నప్పుడే ఓ అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. అయితే ఆ అమ్మాయి మాత్రం అమెరికా వెళ్లిపోతుంది. ఆ అమ్మాయి కోసమైనా అమెరికా వెళ్లాలనుకుంటాడు రంగ. పెరిగి పెద్దవాడై... ఎలాగోలా అమెరికా వీసా సంపాదించి - అక్కడ వాలిపోతాడు. తొలి రోజే... మేఘ (మేఘా ఆకాష్)తో పరిచయం ఏర్పడుతుంది. అమెరికాలో స్థిరపడాలంటే హెచ్1బి వీసా తప్పని సరి. దాన్ని సంపాదించడంలో మేఘా సహాయ పడుతుంది. దాంతో వాళ్లిద్దరి మధ్య స్నేహం పెరిగి, ప్రేమగా మారుతుంది. ఒకరి మనసులోని మాట మరొకరికి చెప్పేయాలనుకుంటారు. కానీ.. ఒకరి తత్వం మరొకరికి సరిపడదేమో అనే అనుమానంతో.. మనసులో మాట చెప్పుకోరు. రంగకి చెప్పకుండానే అమెరికా నుంచి ఊటీ వచ్చేస్తుంది మేఘా. ఆ తరవాత ఏమైంది? ఇద్దరూ మళ్లీ కలుసుకున్నారా, లేదా? కలుసుకుంటే ఏమైంది? అనేదే కథ.
* నటీనటుల ప్రతిభ
నితిన్ నటన ఈ సినిమాకి బలం. కామెడీ పండించడంలో ఆరితేరిపోయాడు. తన వల్లే చాలా సీన్లు గట్టెక్కాయి. ఇది తన 25వ చిత్రం. నటుడిగా ఇదే ది బెస్ట్ అని చెప్పలేం గానీ - నితిన్ స్టైల్ తెలిసినవాళ్లెవ్వరూ నిరాశ పడరు. మేఘా ఆకాష్ చాలా అందంగా ఉంది. లైతో పోలిస్తే... చాలా రెట్లు బెటర్. నటిగానూ ఇంప్రూవ్ అయ్యింది. రావు రమేష్ అలవాటైన పాత్రలో.. నడిచేశాడు. లిజి చాలా కాలం తరవాత తెరపై దర్శనమిచ్చింది. ఆమె పాత్రకున్న ప్రాధాన్యం అంతంత మాత్రమే. సత్య, మధునందన్, ప్రభాస్ శీను నవ్వించారు.
* విశ్లేషణ
కొంతమంది దర్శకులు కథకంటే... దాన్ని నడిపించిన విధానంపైనే దృష్టి పెడతారు. కృష్ణ చైతన్య కూడా అదే చేశాడు. త్రివిక్రమ్ అందించిన కథ ఇది. ఓ స్టార్ దర్శకుడు కథ ఇచ్చాడంటే... అందులో మ్యాజిక్ పాయింట్ ఏదో ఉందనుకుంటారు. కానీ.. ఈ కథలో అదేం కనిపించదు. ఓ సగటు కథ. చాలా కాలంగా చూస్తున్న కథే. దాన్ని తనదైన పద్ధతిలో వండివార్చాడు కృష్ణ చైతన్య. ఈ ప్రయాణంలో తాను నమ్ముకున్నది వినోదం. ప్రతీ సీనులో వినోదానికి పెద్ద పీట వేస్తూ... సన్నివేశాల్ని అందంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుకున్నాడు. వీసా కోసం నితిన్ పడే పాట్లు నవ్విస్తాయి. అమెరికాలో దిగాక... నితిన్, మేఘాల మధ్య ఓ రోడ్ జర్నీ ఉంటుంది. అదీ సరదాగానే సాగిపోతోంది. రావు రమేష్ క్యారెక్టర్ కాస్త కొత్తగా ఉండడంతో అక్కడా ఫన్ పండింది. తొలి సగం కథేం ఉండదు. సన్నివేశాల అల్లికతో దర్శకుడు పాసైపోతాడు. ద్వితీయార్థంలో అసలు చిక్కు మొదలవుతుంది. కథ లేకుండా ఎంత సేపు గారడీ చేస్తారు? ఎక్కడో చోట ఆ వేగం తగ్గుతుంది. అది సెకండాఫ్‌లో కనిపిస్తుంది. సెకండాఫ్ ప్రారంభమైన అరగంట వరకూ కథ నత్తనడక నడుస్తూ బోర్ కొట్టిస్తుంది. కథానాయకుడు, నాయిక మధ్య విరహానికి ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వడు. సినిమా ఏంటి మరీ బోర్ కొట్టేస్తుంది అనే సమయానికి దర్శకుడు మళ్లీ తనకు ప్రావీణ్యం ఉన్న కామెడీ సీన్లపై దృష్టి పెట్టాడు. అవన్నీ యధావిధిగా బాగా పండాయి. దాంతో.. సినిమాకి జోష్ వస్తుంది. క్లైమాక్స్‌కి ముందు వచ్చే పార్టీ సీన్.. చాలా సుదీర్ఘంగా సాగుతుంది. కానీ... అందులో కన్‌ఫ్యూజన్ కావల్సినంత వినోదం పంచిపెట్టడంతో.. ఆ తప్పుల్ని క్షమించేస్తాడు ప్రేక్షకుడు. క్లైమాక్స్ తెలిసిన కథే. హీరో, హీరోయిన్లు కలిసిపోతారు. అది డ్రమెటిక్‌గానే సాగుతుంది. మొత్తానికి ఓ చిన్న కథని.. సరదాగా చెప్పే ప్రయత్నంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనుకోవాలి.
* సాంకేతిక వర్గం
తమన్ పాటలు బాగున్నాయి. వినడానికీ చూడ్డానికి కూడా. నేపథ్య సంగీతం హాయిగా సాగిపోయింది. కెమెరా వర్క్ చాలా బాగుంది. కృష్ణ చైతన్య మాటలు.. అందంగా, అర్థవంతంగా ఉన్నాయి. చాలా చోట్ల త్రివిక్రమ్ స్టైల్ కనిపించింది. సినిమా చాలా రిచ్‌గా ఉంది. ఫస్టాఫ్ అమెరికా, సెకండాఫ్ ఊటీ.. ఇలా కనుల పండుగగా తీర్చిదిద్దారు. ఓ సింపుల్ కథని దర్శకుడు బాగానే డీల్ చేశాడు. కథలో డెప్త్ ఉంటే.. మరింత బాగుండేది.
* ప్లస్ పాయింట్స్
నితిన్ - మేఘా
పంచ్ డైలాగులు
సంగీతం
కెమెరా వర్క్
* మైనస్ పాయింట్స్
బలహీనమైన కథ
స్లోగా సాగే సెకండాఫ్
* ఫైనల్ వర్డిక్ట్: ఫన్ మోహన రంగ