తారాగణం: అఖిల్, కళ్యాణి, రమ్యకృష్ణ, జగపతిబాబు, అజయ్ తదితరులు
నిర్మాణ సంస్థ: అన్నపూర్ణ స్టూడియోస్ & మనం ఎంటర్ప్రైజ్స్
సంగీతం: అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం: PS వినోద్
నిర్మాత: నాగార్జున
రచన-దర్శకత్వం: విక్రమ్ కె కుమార్
రేటింగ్: 3.25/5
ప్రతీ దర్శకుడికీ ఓ మార్క్ ఉంటుంది. అదే అతనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుంది. విక్రమ్ కె.కుమార్ కీ అది ఉంది. టెక్నికల్‌గా చాలా బ్రిలియెంట్‌గా ఆలోచిస్తాడు విక్రమ్. 13 బి, ఇష్క్, మనం, 24.... ఇలా తన ప్రతి సినిమాలోనూ అది కనిపించింది. సింపుల్ కథైనా, కాంప్లికేటెట్ కథైనా.. తనదైన శైలిలో ఆవిష్కరిస్తాడు. అందుకే విక్రమ్ కంటూ ప్రత్యేకమైన అభిమానులున్నారు. ఇప్పటి వరకూ ఒక్క ఫ్లాప్ కూడా చవి చూడని విక్రమ్ పై మరోసారి గురుతర బాధ్యత పెడుతూ.. నాగ్ చేసిన ప్రయత్నం - హలో! తొలి అడుగులో అఖిల్ తడబడ్డాడు. ఈసారి మాత్రం కచ్చితంగా మంచి సినిమా చేయాలన్న ప్రయత్నం.. హలో! మరి అటు విక్రమ్ టెక్నికల్ బ్రిలియెన్స్, ఇటు నాగ్ నమ్మకం ఏ మేర తెరపై ప్రతిఫలించాయి?? హలో ఎలా ఉంది?
కథ..
అవినాష్ (అఖిల్) తన పదేళ్ల ప్రాయంలో తప్పిపోయిన సోల్ మేట్ జున్ను కోసం అన్వేషిస్తుంటాడు. ప్రతీ రోజూ.. ఒకే చోట నిలబడి... తన చిననాటి స్నేహితురాలి కోసం ఎదురు చూస్తుంటాడు. ఈ తరుణంలో అనుకోకుండా తన జీవితంలోకి ప్రియ (కల్యాణి ప్రియదర్శి) వస్తుంది. ప్రియతో చాలా క్లోజ్ అవుతాడు అవినాష్. ప్రియ ధ్యాసలో పడి.. జున్నుని మర్చిపోయాడా?? ప్రియ ఎవరు? అవినాష్ - జున్ను ఎలా కలిశారు అనేదే కథ.
నటీనటులు పనితీరు..
అఖిల్‌లో మెచ్యూరిటీ కనిపించింది అని నాగార్జున పదే పదే చెబుతూ వస్తున్నాడు. అది నిజం. అఖిల్‌తో పోలిస్తే ఈసినిమాలో చాలా మారాడు. చాలా చక్కగా నటించాడు. అతని నటన, స్టెప్పులు, యాక్షన్ సీన్స్‌లో గ్రేస్ ఇవన్నీ బాగున్నాయి.
కళ్యాణిని చూడగానే నచ్చే ఫేస్ కాదు. ఫస్టాఫ్‌లో తనకు డైలాగే లేదు. కానీ.. ద్వితీయార్థంలో తప్పకుండా నచ్చుతుంది.
జగపతిబాబు - రమ్యకృష్ణ జంట చూడా చూడముచ్చటగా ఉంది. అజయ్‌ది చాలా చిన్న పాత్ర. బలమైన విలనీ లేదు.
విశ్లేషణ..
ఈ కథ ఇంత సింపుల్ గా ఉందేంటి? అనుకొంటే తప్పులో కాలేసినట్టే. ఇంత సింపుల్ కథని ట్రీట్‌మెంట్ పరంగా తన మ్యాజిక్ చూపించి - కొత్త రంగులద్దాడు విక్రమ్. శ్రీను - జున్నుల చిన్నప్పటి ఎపిసోడ్‌ని చాలా హృద్యంగా, అందంగా చూపించాడు. చిన్నప్పటి స్నేహితురాల్ని కలవడం కోసం అవినాష్ చేసే ప్రయత్నం హృదయాన్ని తాకుతుంది. వంద నోటు మిస్ అవ్వడం, సెల్ ఫోన్ దొంగతనం.. ఈ రెండింటికీ లింకు ఉండడం ఇదంతా విక్రమ్ బ్రిలియెన్సే. విశ్రాంతి వరకూ.. సినిమా ఒకే ఫ్లో లో వెళ్లుంటుంది. అదంతా ఒకే సీన్ అనిపించేలా మ్యాజిక్ చేశాడు విక్రమ్.
విశ్రాంతి ముందు.. రమ్యకృష్ణ, జగపతిబాబు మధ్య సన్నివేశాలు.. అవినాష్‌తో వాళ్లకున్న అనుబంధం చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు. తాను వెదుకుతున్న అమ్మాయి కళ్ల ముందే ఉన్నా - ఆమె కోసం పరితపించడం, చిన్న చిన్న లవ్ లీ మూమెంట్స్. చక్కటి సంగీతం.. దీంతో సెకండాఫ్ కూడా హాయిగానే సాగిపోతుంది. తొలి భాగంతో పోలిస్తే. సెకండాఫ్ కాస్త నెమ్మదించినట్టు అనిపించినా - ఇలాంటి కథల్లో అది సహజం కూడా. పాటలు, ఫైట్లు ఏవీ అనవసరంగా రావు. ఒక్క వేస్ట్ ఫ్రేమ్ కూడా సినిమాలో కనిపించదు.
కాకపోతే ఒకటి... లాజిక్కులు చాలా మిస్సయ్యాయి. సెల్ ఫోన్ నెంబర్ కోసం అంత ఛేజింగులు అవసరం లేదు. జస్ట్... కస్టమర్ కేర్‌కి ఫోన్ చేస్తే.. లాస్ట్ ఇన్ కమింగ్ నెంబర్ తెలిసిపోతుంది. చిన్నప్పుడు డిల్లీ వెళ్లిపోయిన జున్ను.. ఒక్కసారి హైదరాబాద్ వచ్చినా ఈ కథ అక్కడితే అయిపోయేది. అయితే సినిమాల్లో లాజిక్కులు పట్టించుకోకూడదన్న కామెన్ సెన్స్ ఉంటే ఈ సినిమాని ఎంజాయ్ చేసేయొచ్చు.
సాంకేతిక వర్గం..
టెక్నికల్‌గా మంచి టీమ్ కుదిరింది. కెమెరా, నేపథ్య సంగీతం, ఎడిటింగ్, పాటలు, ఫైట్లు... అన్నీ సూపర్ అనిపించేలా ఉన్నాయి. కథనం పరంగానూ విక్రమ్ మార్కులు కొట్టేస్తాడు. కానీ లాజిక్ మిస్సవ్వడం కాస్త లోటుగా కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
+ ఛైల్డ్ ఎపిసోడ్
+ సంగీతం
+ టెక్నికల్ టీమ్
+ యాక్షన్
మైనస్ పాయింట్స్:
- తెలిసిన కథ
- లాజిక్కులు మిస్స్ అవ్వడం
ఆఖరి మాట: హలో... కనీసం ఒక్కసారైనా పలకరించాల్సిందే.
రివ్యూ బై శ్రీ