తారాగణం: శ్రీనివాస రెడ్డి, సిద్ధి ఇద్నాని, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి తదితరులు
నిర్మాణ సంస్థ: శివం సేల్యులాయిడ్స్ & మెయిన్ లైన్ ప్రొడక్షన్స్
సంగీతం: గోపిసుందర్
ఛాయాగ్రహణం: సతీష్
ఎడిటర్: తమ్మిరాజు
మాటలు: శ్రీనివాస్
నిర్మాతలు: రవి, శ్రీనివాస్ రెడ్డి, జోజో జోస్
రచన-దర్శకత్వం: మురళి కృష్ణ (మను)
రేటింగ్: 1.5/5
పాత సినిమాల టైటిళ్లని వాడుకుంటున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. హిట్ సినిమా అయితే ఆ అప్రమత్తత మరింత అవసరం. టైటిల్ చూసి ప్రేక్షకులు నమ్మకాలు పెంచుకుంటారు. టైటిల్‌ని పాడు చేయకూడదు - అన్న ఒత్తిడి చిత్ర రూపకర్తలపై ఉంటుంది. కాకపోతే.. పాత సినిమా టైటిల్‌ని వాడుకోవడం - కోట్ల రూపాయల విలువైన పబ్లిసిటీ ఫ్రీగా వచ్చినట్టే. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి అండ్ టీమ్ అదే చేసింది. ఈవీవీ సూపర్ హిట్ సినిమా 'జంబలకిడి పంబ'ని టైటిల్‌గా వాడుకుంది. శ్రీనివాసరెడ్డికి ఆడ వేషం వేయించింది. ఇంకేం... టైటిల్, పోస్టరు రెండూ అదిరిపోయాయి.. మరి సినిమా ఎలా ఉంది? టైటిల్‌లో ఉన్న ఫన్ సినిమాలో కనిపించిందా? టైటిల్‌ని పాడుచేశారా, లేదంటే న్యాయం చేశారా?
* కథ
వరుణ్ (శ్రీనివాసరెడ్డి) ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. పల్లవి (సిద్దికి) ఓ ఫ్యాషన్ డిజైనర్. ఇద్దరూ భార్యాభర్తలు. కానీ ఆ కాపురంలో బోలెడన్ని కలహాలు. ఇద్దరూ విడిపోదామనుకుని లాయర్ హరి (పోసాని)ని కలుస్తారు. వీరిద్దరికీ విడాకులు మంజూరయ్యే సమయంలో హరి అనుకోకుండా చనిపోతాడు. స్వర్గానికి వెళ్లిన హరికి చేసిన పాపాలు గుర్తొస్తాయి. భార్యా భర్తల్ని విడగొట్టి తానెంత తప్పు చేశాడో అర్థం అవుతుంది. దానికి ప్రాయశ్చిత్తంగా భార్యా భర్తల్ని కలపాలని ఈ భూమ్మీదకు వస్తాడు. తన ఏకైక థ్యేయం వరుణ్, పల్లవిలను కలపడమే. అందుకోసం హరి ఏం చేశాడు? వరుణ్, పల్లవిలు మళ్లీ ఎలా కలిశారు? అనేదే కథ.
* నటీనటులు పనితీరు
శ్రీనివాసరెడ్డి మంచి కమెడియన్. తను సీరియస్‌గా ఉన్నా సరే కామెడీ పండిస్తాడు. ఈ కథలో, పాత్రలో కామెడీ పండించే ఆస్కారం లభించింది. కానీ పేలవమైన సన్నివేశాలు, సంభాషణలతో శ్రీనివాసరెడ్డి కూడా చాలా సాధారణమైన నటుడిగా కనిపించాడు.
కథానాయికకు ఇదే తొలి సినిమా. ఆమె అనుభవ రాహిత్యం కనిపించింది. శ్రీనివాసరెడ్డి పక్కన అస్సలు సూటవ్వలేదు.
ఉన్నంతలో వెన్నెల కిషోర్ కాస్త నయం. పోసాని అయితే మరీ ఓవరాక్షన్ చేశాడు.
* విశ్లేషణ
టైటిల్‌ని చూసి కామెడీ జోనర్ అనుకుంటారు. పోస్టర్‌ని చూసి ఫిక్షన్ అనుకుంటారు.కానీ దీన్ని సోషియో ఫాంటసీగా మార్చేశాడు దర్శకుడు. జోనర్లన్నీ కలగాబులగంగా మారి... ఈ సినిమా ఏ కోవకు చెందుతుందో అర్థం కాదు. శ్రీనివాసరెడ్డి సినిమా, అందులోనూ.. ఆడవేషం, దానికి తోడు భలే సరదా టైటిల్ - ఇవన్నీ చూసి ఈ సినిమాలో బోలెడంత కామెడీ ఉందనుకుంటారు. నిజానికి అంత స్కోప్ కూడా ఉంది. అయితే ఈ అవకాశాన్ని వృధా చేశాడు దర్శకుడు. ఏ సన్నివేశం నవ్వించదు. `ఈ సీనుకి ప్రేక్షకులు పడీ పడీ నవ్వుతారు చూడండి` అన్నట్టు తెరపై ప్రతీ ఒక్కరూ వీరావేశంతో ఓవరాక్షన్ చేసేస్తుంటారు. కానీ ఆ సన్నివేశాలేవీ రక్తి కట్టలేదు. బలవంతంగా కామెడీని రుద్దినట్టు అనిపిస్తుంటుంది.
ఈ సినిమా టేకాఫే తేలిపోతుంది. `కామెడీ ముందుంటుందిలే` అనుకుంటూ ఆశ పడుతూ కూర్చోవడం మినహా... ఆ నవ్వులు ఎంతకీ రావు. పోనీ.. పోసాని ఆత్మలా మారి కిందకు దిగిన తరవాత.. సినిమా జోరందుకుంటుందనుకుంటారు. అదీ అత్యాసే అవుతుంది. శ్రీనివాసరెడ్డి నైటీలు వేసుకుని, లిప్ స్టిక్ పూసుకున్న తరవాత వినోదం పండుతుంది అనుకుంటే.. అక్కడా. అదే సీను. ఇలా సీన్లు గడుస్తున్నా ఫన్ పుట్టదు. నిజానికి శ్రీనివాసరెడ్డి కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. దాన్ని ఏ కొశనా వాడుకోలేకపోయాడు దర్శకుడు. స్క్రిప్టు దశలోనే లోపం కనిపిస్తుంది. సరైన సన్నివేశాలు రాసుకోకపోవడం ఒక ఎత్తయితే, అనుకున్న ఫ్లాటే బలంగా లేకపోవడం మరో లోపం. ఇవి రెండూ ఈవీవీ సూపర్ హిట్ సినిమా టైటిల్‌ని పాడు చేశాయి.
తొలి సగంలోనే సినిమా భవిష్యత్తు అర్థమైపోతుంది. కనీసం రెండో సగంలో అయినా సినిమా బతుకుతుంది అనుకుంటే... తొలి సగమే నయం అన్నట్టు తయారు చేశాడు సన్నివేశాలు. మొత్తానికి ఈ మధ్య కాలంలో టాలీవుడ్ చూసిన మరో బోరింగ్ సినిమాగా `జంబలకిడి పంబ` మిగిలిపోతుంది.
* సాంకేతికత వర్గం పనితీరు
మురళీకృష్ఱ రాసుకున్న స్క్రిప్టులో ఏమాత్రం బలం లేదు. కథ ఎక్కడ మొదలెట్టాడో, ఎక్కడికి తీసుకెళ్లి వదిలాడో ఆయనకైనా తెలుసా? అనిపిస్తుంది. కేవలం టైటిల్‌ని నమ్ముకుని తీసిన సినిమా ఇది. టైటిల్‌లో ఉన్న మ్యాజిక్ కథలో లేదు. మాటల్లో ఫన్ పండలేదు. స్క్రీన్ ప్లే అతుకుల బొంతలా మారింది. గోపీ సుందర్ సంగీతంలో మెరుపుల్లేవు. నిర్మాణ విలువల పరంగా ఈ సినిమా ఓకే.
* ప్లస్ పాయింట్స్
+ టైటిల్
* మైనస్ పాయింట్స్
- మిగిలినవన్నీ
* ఫైనల్ వర్డిక్ట్: 'పంబ' రేగిపోవడం ఖాయం.
రివ్యూ రాసింది శ్రీ