తారాగణం: బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్, ప్రాగ్యా జైస్వాల్, జగపతిబాబు
నిర్మాణ సంస్థ: ద్వారకా క్రియేషన్స్
ఛాయాగ్రహణం: రిషి పంజాబీ
సంగీతం: దేవిశ్రీప్రసాద్
నిర్మాత: రవీందర్ రెడ్డి
దర్శకత్వం: బోయపాటి శ్రీను
యావరేజ్ యూజర్ రేటింగ్: 3.25/5
మాస్, కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ బోయపాటి శ్రీను. తన దమ్ము.. మాస్ అంశాలే. వాటిని బలంగా చూపిస్తూ.. వరుస హిట్లు కొట్టేస్తున్నాడు. టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ దర్శకుడు అనిపించుకొన్నాడు. అతన్నుంచి మరో సినిమా - అదీ.. 'సరైనోడు' తరవాత వస్తోందంటే అంచనాలు ఏ మేరకు ఉంటాయో తెలుసు. దానికి తోడు హీరోకి ఎలాంటి ఇమేజ్ లేదు. కాబట్టి.. ఆ బాధ్యత అంతా బోయపాటి శ్రీనునే మోయాల్సివచ్చింది. మరి.. ఈసారి ఆ అంచనాల్ని అందుకొన్నాడా, లేదా? జయ జానకి నాయక ఏ వర్గాన్ని అలరించే సినిమా అవ్వబోతోంది? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
* కథ..
గగన్ (బెల్లంకొండ శ్రీనివాస్)కి నాన్న (శరత్ కుమార్) అన్న (నందు) అంటే ప్రాణం. వాళ్లేమో పెద్ద బిజినెస్ మేగ్నేట్స్. కానీ ఊర మాస్. సాయింత్రం అయితే... మందు తాగి రోడ్డుమీద పడి పచ్చి మిర్చి బజ్జీలు లొట్టలేసుకొని తినే రకం. గగన్‌కి స్వీటీ (రకుల్ ప్రీత్ ) పరిచయం అవుతుంది. అక్కడి నుంచి గగన్‌నీ, ఆ ఇంటినీ క్రమశిక్షణలోకి తీసుకొస్తుంది స్వీటీ. గగన్ తో ప్రేమలో పడుతుంది. గగన్‌కీ స్వీటీ అంటే ఇష్టం. అయితే అప్పుడే స్వీటీకి ఓ అనుకోని కష్టం ఎదురవుతుంది. అదీ.. రెండు మూఠాల ద్వారా. అదెందుకు..? స్వీటీకి ఎదురైన ప్రమాదం ఏమిటి? అందులోంచి స్వీటీని గగన్ ఎలా బయటపడేశాడు? అనే విషయాలు తెలియాలంటే జయజానకి నాయక చూడాల్సిందే
* నటీనటుల ప్రతిభ..
బెల్లంకొండ శ్రీనివాస్ బలాబలాల్ని బేరీజు వేసుకొని తీసిన సినిమా ఇది. ఫైట్స్, డాన్సులు బాగా చేస్తాడు కాబ్టటి.. ఆ పోర్షన్‌కే ఎక్కువ పరిమితం చేశాడు. డైలాగులు తక్కువ. ఒకేరకమైన ఎమోషన్ పండించాడు. దానిపై రకుల్‌తో ఓ సెటైర్ కూడా వేయించాడు బోయపాటి. అయితే.. ఓ పాటలో ఒకే టేకులో సుదీర్ఘమైన స్టెప్ వేసి ఈ విషయంలో తనకు తిరుగులేదని నిరూపించుకొన్నాడు. రకుల్ నటన ఆకట్టుకొంటుంది. మరీ ముఖ్యంగా ఎమోషన్ పరంగా... రకుల్‌కి బాగా మంచి మార్కులు పడతాయి. జగపతిబాబు మరోసారి స్టైలీష్‌గా కనిపించాడు. శరత్‌కుమార్ పాత్ర కూడా అంతే. వాణీ విశ్వనాథ్ వచ్చాక కథలో మార్పులొస్తాయనుకొంటే.. తను మమ అనిపించింది. మిగిలివాళ్లంతా బోయపాటి ఆలోచనలకు తగ్గట్టు నటించారంతే.
* విశ్లేషణ..
మాస్, కమర్షియల్ అంశాల చుట్టూ సాగే ప్రేమకథ ఇది. ఓ అమ్మాయి కోసం ఓ అబ్బాయి ఏం చేస్తాడు, ఎంతకు తెగిస్తాడు? అనే అంశం చుట్టూ బోయపాటి తనదైన శైలిలో మాస్, కమర్షియల్ అంశాల్ని మేళవించి తెరకెక్కించాడు. సినిమా ప్రారంభంలోనే శ్రీనులోని కమర్షియల్ మాస్ కోణాన్ని బయటపెట్టేశాడు బోయపాటి. ఓ మంచి యాక్షన్ ఎపిసోడ్‌తో ఊపు తెచ్చాడు. శరత్ కుమార్ - బెల్లంకొండ మధ్య సాగే కుటుంబ సన్నివేశాలు ఆకట్టుకొంటాయి. కాస్త ఫ్యామిలీ ఎమోషన్.. మధ్యలో యాక్షన్.. అంటూ సినిమాని పంచుకొంటూ వెళ్లాడు. ఇంట్రవెల్ బ్యాంగ్ దగ్గరే అసలు కథ మొదలవుతుంది. సెకండాఫ్‌లోనూ అదే జోరు. యాక్షన్ సన్నివేశాల్ని డిజైన్ చేయడంలో బోయపాటి తనదైన మార్క్ చూపించుకొన్నాడు. హంసలదీవిలో తెరకెక్కించిన యాక్షన్ ఎపిసోడ్ మాస్ ని ఆకట్టుకొంటుంది. అయితే దర్శకుడు కేవలం యాక్షన్‌కే కాదు.. ఎమోషన్‌కీ పెద్ద పీట వేయడంతో.. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకొనే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. ప్రధమార్థం కాస్త స్లో అనిపించినా.. సెకండాఫ్ మాత్రం మాంఛి ఊపుమీద సాగిపోతుంది. రొటీన్ క్లైమాక్స్ ఒక్కటే.. కాస్త నిరాశ పరిచింది. అంతకు ముందే భారీ ఎమోషన్, యాక్షన్ దృశ్యాలు చూసేయడంతో క్లైమాక్స్ ఫైట్ పెద్దగా ఆనదు.
* సాంకేతిక వర్గం...
ఇది బోయపాటి శ్రీను సినిమా. అన్ని విభాగాల్లోనూ ఆయన ఆవహించినట్టు కనిపిస్తుంది. సినిమా ప్రారంభం, లవ్ సీన్లలో మాంటేజ్‌లు చూస్తే బోయపాటి కొత్తదారిలో వెళ్తున్నాడనిపిస్తుంది. అయితే.. మళ్లీ తనదైన మాస్ ముద్రతోనే సినిమా ముగించాడు. యాక్షన్ సీన్లలో బోయపాటికి తిరుగులేదు. హంసల దీవి లో సాగే ఫైట్ చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది. యాక్షన్ మితిమీరినా, డైలాగులు హద్దుల్లోనే ఉన్నాయి. ట్విస్టులు బాగున్నాయి. అక్కడక్కడ సినిమా స్లో అవుతూ వస్తుంది. వినోదానికి స్కోప్ లేదు. దేవి ఆర్.ఆర్ అదరగొట్టేశాడు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమా రిచ్‌గా ఉంది.
* ప్లస్ పాయింట్స్
+ యాక్షన్
+ ఎమోషన్
+ రకుల్
+ మేకింగ్ వాల్యూస్
* మైనస్ పాయింట్స్
- హింస - రక్తపాతం
* ఫైనల్ వర్డిక్ట్: మాస్ మసాలా.. పైసా వసూల్
రివ్యూ బై శ్రీ