తారాగణం: రజినీకాంత్, నానా పాటేకర్, సముత్రికని, ఈశ్వరి రావు, హ్యుమా ఖురేషి తదితరులు
నిర్మాణ సంస్థ: వండర్ బార్ ఫిలిమ్స్
సంగీతం: సంతోష్ నారాయణన్
ఛాయాగ్రహణం: మురళి. జి
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
నిర్మాత: ధనుష్
రచన-దర్శకత్వం: Pa.రంజిత్
రేటింగ్: 2.25/5
రజనీకాంత్ సినిమా అంటే ఓ పూనకం... ఓ ఉత్సాహం. ఓ సంబరం. బాషా, ముత్తు, నరసింహా, సింహాచలం.. ఇలా ఏ సినిమా అయినా తీసుకోండి. రజనీలోని అరివీరభయంకరమైన హీరోయిజమే జనాలకు నచ్చుతుంటుంది. అదే తన సినిమాల పాలిట కల్పతరువు. ఇవేం చూపించకుండా 'కబాలి' తీసి అభిమానులకు షాక్ ఇచ్చాడు పా.రంజిత్. రజనీలోని కొత్త కోణాన్ని చూపించాలనుకున్న అతని ప్రయత్నాన్ని కొంతమంది అభిమానించినా - రజనీ అభిమానులు మాత్రం బాగా నిరుత్సాహపడ్డారు. అయితే.. రజనీ మాత్రం రంజిత్‌కి మరో ఛాన్స్ ఇచ్చాడు. అలా 'కాలా' కల సాకారం అయ్యింది. మరి ఈసారి రంజిత్ ఏం చేశాడు? అభిమానుల్ని మెప్పించాడా? లేదంటే తన అలవాటు ప్రకారం, కబాలి కొలతల ప్రకారం 'కాలా'ని మలిచాడా?
* కథ
అది ముంబైలోని ధారావి అనే ఓ మురికివాడ. లక్షలమంది అక్కడ ఎన్నో ఏళ్లుగా స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తుంటారు. ఆ ప్రాంత ప్రజల దేవుడు... నాయకుడు... కాలా (రజనీకాంత్). ఎలాగైనా సరే ధావావిని హస్తగతం చేసుకోవాలని హరి దాదా (నానా పటేకర్) అనే రాజకీయ నాయకుడు ప్రయత్నిస్తుంటాడు. మురికివాడ స్థానంలో బిల్డింగులు కడతానని, అపార్ట్‌మెంట్లు ఇస్తానని అక్కడి ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తుంటాడు. అయితే ఆకుట్రలకు కాలా అడ్డుపడుతుంటాడు.
ఓసారి ధారావి వచ్చి తన అహంకారం చూపించాలనుకున్న హరి దాదాకి గట్టిగా బుద్ది చెబుతాడు కాలా. ఈ అవమానాన్ని భరించలేని హరిదాదా.. కాలాపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? ధారావి హరి దాదా హస్తగతం కాకుండా.. కాలా ఎలా అడ్డుపడ్డాడు? అనేదే కథ.
* నటీనటులు
రజనీకాంత్ విశ్వరూపం చూడాలనుకునేవాళ్లకు `కాలా` నిరుత్సాహ పరుస్తుంది. రజనీ బలాల్ని సరిగా వాడుకోలేదు. అయినా సరే... ఆ ప్రయత్నం చేసినప్పుడల్లా రజనీ మెప్పిస్తూనే ఉంటాడు. అతనిలో ఈజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ సినిమా మరోసారి నిరూపిస్తుంది. బాషాలో రజనీకాంత్ ఒక్క సీన్‌లోఅయినా కనిపిస్తే చాలు.. అనుకుంటే ఈ సినిమాని నిరభ్యంతరంగా వెళ్లొచ్చాడు.
నానా పటేకర్ లాంటి నటుడ్ని సరిగా వాడుకోలేదు. అతని స్టామినాకి సవాల్ విసిరే సీన్ ఒక్కటీ లేదు.
ఈశ్వరీరావుకి చాలా పెద్ద పాత్రే ఇచ్చేశారు. అరవ స్టైల్‌లో ఆ పాత్రని తీర్చిదిద్దడం తెలుగు ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవొచ్చు. మిగిలినన్నీ తమిళ ఫేసులే.
* విశ్లేషణ
ధారావి అనే మురికివాడ చుట్టూ తిరిగే కథ ఇది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ.. అక్కడే జరుగుతుంది. అక్కడి ప్రజల జీవన విధానాన్ని, ఆ నేలపై వాళ్లు పెంచుకున్న మమకారాన్నీ వెండి తెరపై చూపించాలనుకున్నాడు దర్శకుడు. తొలి సన్నివేశాలు అలానే సాగాయి. రజనీకాంత్ నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఏం కోరుకుంటారో.. అవన్నీ అందిస్తూ... మధ్యమధ్యలో ధారావి కథ చెబితే బాగుండేది. కానీ... సెంటర్ ఆఫ్ ఎట్రాక్షనే ధారావి అయ్యింది. రజనీ పాత్ర, అతని హీరోయిజం అతిథులుగా మిగిలిపోయాయి.
హ్యూమా ఖురాషీతో.. ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ కథకు అడ్డు పడేదే. అదేమంత కొత్తగా, ఆకట్టుకునేలా లేదు. కథకూ ఉపయోగపడలేదు. ఓ యంగ్ హీరోయిన్ తెరపై కనిపిస్తే బాగుంటుందన్న ఆశతో.. ఆ పాత్రని ప్రవేశ పెట్టి ఉంటారు. రజనీ అనగానే వెల్లువలా ఉబికి వచ్చే ఉత్సాహం, ఉల్లాసం ఏ ఒక్క సన్నివేశంలోనూ కనిపించవు. ఉన్నా.. అక్కడక్కడ మెరిశాయంతే. హరి దాదా ధారావి వచ్చినప్పుడు.. 'నా అనుమతి లేకుండా వెళ్లలేవు' అని రజనీ చెప్పడం - హరి దాదాని నిర్బంధించడం.. ఆ ఎపిసోడ్ ఫ్యాన్స్ చేత ఈలలు వేయిస్తుంది.
కానీ.. ఆ తరవాత అంత హై ఉన్న సన్నివేశం ఒక్కటీ కనిపించదు. నిజానికి రజనీకాంత్ ఇమేజ్‌కి, అతని హీరోయిజానికీ సూటయ్యే కథ కాదది. కబాలి విషయంలోనూ ఇలాంటి తప్పే చేశాడు రంజిత్. మరోసారి.. ఆ పొరపాటు పునరావృతం చేశాడు. ద్వితీయార్థం మరింత స్లోగా సాగుతుంది. నానా పటేకర్ లాంటి విలన్ ఉన్నప్పుడు హీరో - విలన్ల పోరు రసవత్తరంగా సాగాలని ప్రేక్షకుడు భావిస్తాడు. ఆ అంచనాలకు అందనంత దూరంలో.. వాళ్లిద్దరి ఘర్షణ నిలబెట్టాడు దర్శకుడు.
పతాక సన్నివేశాలు కూడా.. హడావుడిగా చుట్టేసినట్టు అనిపిస్తుంది. నానా పటేకర్ అనే కాదు.. రజనీ పాత్రనీ సరిగా వాడుకోలేదు. ఆయా పాత్రలు ఎక్స్‌పోజ్ అయ్యే సన్నివేశాల్ని రాసుకోలేకపోయాడు. దాంతో రజనీ సినిమా చూద్దామని వెళ్లిన ప్రేక్షకులు, వీరాభిమానులు బిక్కమొహం వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
* సాంకేతిక వర్గం
కబాలి నిరుత్సాహ పరిచినా టెక్నికల్ గా బాగుంటుంది. ముఖ్యంగా సంతోష్ నారాయణ్ ఇచ్చిన ఆర్.ఆర్ గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. అయితే ఆ స్థాయి ఈసారి కనిపించదు. పాటలు ఏమంత ఆకట్టుకోవు. అందులో వినిపించే సాహిత్యం కూడా అంతంత మాత్రమే. విషాద గీతాలకు కూడా ర్యాప్ వాడేసి కొత్తదనం అనుకోమంటే ఎలా?
ధారావి అనే సెట్ మాత్రం అబ్బుర పరుస్తుంది. నిజంగా ఓ మురికివాడలో ఉన్న ఫీలింగ్ తీసుకొచ్చారు. నిడివి కూడా ఎక్కువే. కత్తిరించాల్సిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. కొన్ని డైలాగులు మ్యూట్‌లో లేచిపోయాయి. రంజిత్ కి దక్కిన రెండో అవకాశం ఉంది. దాన్నీ వాడుకోలేపోయాడు. రజనీ ఫ్యాన్‌గా ఫ్యాన్స్‌కి నచ్చే సినిమా తీయలేకపోయాడు.
* ప్లస్ పాయింట్స్
+ ఇంట్రవెల్ ఫైట్
+ నానా పటేకర్‌తో సీన్లు
* మైనస్ పాయింట్స్
- స్లో నేరేషన్
- వీక్ స్క్రీన్ ప్లే
* ఫైనల్ వర్డిక్ట్: మరో 'కబాలి'.
రివ్యూ రాసింది శ్రీ