తారాగణం: నార రోహిత్, నాగ శౌర్య, నమితా ప్రమోద్
నిర్మాణ సంస్థ: ఆరోహో సినిమా & అరన్ మీడియా వర్క్స్
ఛాయాగ్రహణం: నరేష్
సంగీతం: విశాల్
నిర్మాతలు: ప్రశాంతి, సౌందర్య, కృష్ణ విజయ్
దర్శకత్వం: మహేష్ సూరపనేని
యావరేజ్ యూజర్ రేటింగ్: 2/5
కొన్ని టైటిళ్లు భలే ఉంటాయి. పొయెటిగ్గా.. చూడగానే నచ్చేసి, ఈ సినిమా ఎలా ఉన్నా చూసేద్దాం అనిపించేంత ఫీల్ ఇస్తాయి. తీరా థియేటర్‌లోకి అడుగుపెడితే.. తెరపై కథ కీ, టైటిల్ కీ ఏమాత్రం పొంతన ఉండదు. అనవసరంగా ఓ మంచి టైటిల్‌ని పాడు చేశారే.. అనిపిస్తుంది. 'కథలో రాజకుమారి' చూసినా ఇదే ఫీలింగ్ ఇంచు కూడా మిస్ అవ్వకుండా ఇంచు మించుగా కలిగేస్తుంది. అసలు ఈ టైటిల్‌కీ, కథకీ లింకెక్కడ కుదిరింది?? కథ ఎలా ఉంది, ఆ రాకుమారి ఎలా ఉంది? చూసేస్తే..
* కథ
అర్జున్ (నారా రోహిత్) ఓ అవివీర భయంకరమైన విలన్. సినిమాల్లో క్రూర పాత్రలకు పెట్టింది పేరు. బయట కూడా విలన్ లానే ఉంటాడు. బలుపెక్కువ. ఎవరినీ లెక్కచేయడు. సడన్ గా ఓ రోజు మంచోడైపోతాడు. ఎంతలా అంటే.. తెరపై కూడా చెడ్డవాడిలా నటించలేనంతగా. తనలోని నటుడు, క్రూరుడు ఏమైపోయాడో అర్జున్‌కి అర్థం కాదు. మానసిక వైద్యుడు దగ్గరకు వెళ్లినా ప్రయోజనం ఉండదు. 'నీ జీవితంలో నీకు ఎదురైన శత్రువుని వెదుక్కొంటూ వెళ్లు. వాళ్ల జీవితంతో ఆడుకో.. అప్పుడు నీలోని క్రూరుడు మళ్లీ బయటకు వస్తాడు' అని ఎవరో ఇచ్చిన సలహాని పట్టుకొని, చిన్నప్పుడు తన తండ్రి మరణించడానికి కారణమైన సీత (నమిత ప్రమోద్)ని వెదుక్కొంటూ వెళ్తాడు. సీత ఎవరు? సీతకీ అర్జున్‌కీ ఉన్న సంబంధం ఏమిటి? అర్జున్ మళ్లీ అర్జున్ లా మారాడా? తెలియాలంటే... కథలో రాజకుమారి చూడాల్సిందే.
* నటీనటుల ప్రతిభ..
రోహిత్ కొత్త కథల్నీ, కొత్త పాత్రల్నీ ఈజీగా ఒప్పుకొంటున్నాడు. అయితే దాన్ని డీల్ చేసే సామర్థ్యం దర్శకుడికి ఉందా? లేదా? అనేది ఆలోచించడం లేదు. తన వరకూ బాగానే నెట్టుకొచ్చాడు. కాకపోతే ఈ సినిమాలోనూ అదే విధంగా లావుగా కనిపించాడు. నాగశౌర్యది అతిథిలాంటి పాత్ర. నమిత ప్రమోద్ సీత పాత్రకు సూట్ అవ్వలేదు. ఆ స్థానంలో స్టార్ హీరోయిన్ ఉండుంటే.. బాగుండేది. మిగిలినవాళ్లవందరివీ చిన్న చిన్న పాత్రలే.
* విశ్లేషణ..
కథగా చెప్పాల్సివస్తే... `లైన్` బాగుంది. ఓ విలన్.. తనలోని చెడుని వదిలేసి మంచోడిగా మరి.. కేవలం పాత్ర కోసం తనలోని చెడుని మళ్లీ తట్టి లేపాలనుకోవడం కొత్త పాయింటే. కానీ దాన్ని డీల్ చేసిన పద్ధతి రుచించదు. కథని ప్రారంభించిన విధానం ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే.. సన్నివేశాలు గడిచే కొద్దీ.. నీరసం ఆవహిస్తుంది. అర్జున్ సడన్‌గా మంచివాడిగా మారిపోవడానికి కారణం కనిపించదు. చిన్నప్పటి ఎపిసోడ్లు కూడా అంత సమర్థంగా తెరకెక్కించలేదు. సినిమా ఎపిసోడ్లు మాత్రం నచ్చుతాయి. అయితే ఏది సినిమా సీనో, ఏది నిజమైన సన్నివేశమో తెలీక కాస్త కన్‌ఫ్యూజన్ అవుతాం. కథ సీత దగ్గరకు షిఫ్ట్ అయ్యాక మరీ నెమ్మదిస్తుంది. దర్శకుడు ఏ సీన్‌నీ బలంగా రాయలేక, బలవంతంగా ఇరికించినట్టు అనిపిస్తుంది. దాంతో ఎమోషన్స్ పండవు. సినిమాల్లో అంత పాపులర్ స్టార్ అయినప్పటికీ.. బయట మామూలుగా తిరిగేస్తుంటాడు అర్జున్. అతనంత పెద్ద స్టార్ అన్న విషయం కూడా సామాన్య జనాలు గుర్తించరు. సెకండాఫ్ చాదస్తంగా, నీరసంగా సాగుతుంది. వినోదానికి చోటు లేదు. దర్శకుడు చెప్పాలనుకొన్న పాయింట్ ఏంటి? చెబుతోన్నదేంటి? అనేది అర్థంకాని గందరగోళం నెలకొంటుంది. క్లైమాక్స్‌ని ఈజీగా ఊహించేస్తారు.
ఇళయరాజా అందించిన రెండు పాటల్లో ఒకటి బాగుంది. నేపథ్య సంగీతం, ఫొటోగ్రఫీ.. ఇవన్నీ సాధారణం అనిపిస్తాయి. మాటలు అక్కడక్కడ మెప్పించినా.. ఓవరాల్ గా పాత డైలాగులే ఎక్కువగా వినిపించాయి. దర్శకుడి ఆలోచన బాగుంది. కానీ.. దాన్ని సినిమాగా మలిచే అనుభవం ఇంకా రాలేదు.
* ప్లస్ పాయింట్స్
+ కథలో పాయింట్
* మైనస్ పాయింట్స్
- మిగిలినవన్నీ
* ఫైనల్ వర్డిక్ట్: కథా లేదు.. రాజకుమారీ కనిపించలేదు
రివ్యూ బై శ్రీ