తారాగణం: నిఖిల్, సిమ్రాన్, సంయుక్త తదితరులు
నిర్మాణ సంస్థ: AK ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: అజనీష్ లోకనాథ్
ఛాయాగ్రహణం: అద్వైత గురుమూర్తి
కథ: రిషబ్ శెట్టి
కథనం: సుధీర్ వర్మ
మాటలు: చందూ మొండేటి
ఎడిటర్: MR వర్మ
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి
రేటింగ్: 2.5/5
కాలేజీ కథలెప్పుడూ కమర్షియల్‌గా వర్కవుట్ అయ్యేవే. సరిగా చూపించే నేర్పు ఉండాలే గానీ... ప్రతీ సినిమా ఓ హ్యాపీడేస్ అవుతుంది. కాకపోతే కాలేజీ, అందులోని స్నేహాలు, చిన్న చిన్న అలకలు, ప్రేమలు.. ఇవన్నీ అందంగా చూపించగలగాలి. ప్రేక్షకుడ్ని తన కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లగలగాలి. హ్యాపీడేస్, ప్రేమమ్ అవే చేశాయి. అందుకే... ఆయా సినిమాలు అలా నిలబడిపోయాయి. ఇవే కొలతలతో తయారైన సినిమా కిరాక్ పార్టీ. మరి... ఇందులోనూ అంతటి దమ్ముందా?? మరో హ్యపీడేస్ అనిపించుకుంటుందా?
* కథ
కృష్ణ (నిఖిల్ సిద్దార్థ్) నాలుగేళ్ల ఇంజనీరింగ్ జీవితమే ఈ కథ. కాలేజీలో అడుగుపెట్టినప్పటి నుంచీ... ఫేర్ వెల్ వరకూ అతని జీవితంలో ఏం జరిగిందన్నదే కిరాక్ పార్టీ. తనకో గ్యాంగ్ ఉంటుంది.. వాళ్లతో చేసే అల్లరి పనులు.. మీరా అనే అమ్మాయితో పరిచయం, తనతో ప్రేమలో పడడం.. అనూహ్యంగా మీరా దూరమవ్వడం, సత్య అనే మరో అమ్మాయి. తన జీవితంలోకి రావడం.. కాలేజీ గొడవలు... వీటన్నింటి కలబోత.. ఈసినిమా.
* నటీనటులు..
సిద్దార్థ్ రెండు షేడ్స్‌లలో కనిపించాడు. తొలిసగం సాఫ్ట్‌గా క్యూట్‌గా కనిపించిన సిద్దార్థ్, సెకండాఫ్‌లో గెడ్డం తో మాస్ లుక్‌లో దర్శనమిచ్చాడు. ఈమధ్య కాలంలో అతని పాత్రల్లో ఇంత వేరియేషన్ చూడడం ఇదే మొదటిసారి. నటుడిగానూ ఇంప్రూవ్ అయ్యాడు.
హీరోయిన్లు ఇద్దరూ ఆకట్టుకున్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో చూసే కథానాయికలకంటే కాస్త డిఫరెంట్‌గా ఉన్నారు. మీరా పాత్రతో పాటు సత్య పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. బ్రహ్మాజీని మినహాయిస్తే.. మిగిలినవాళ్లంతా కొత్తవాళ్లే. ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో కొత్త మొహాలు ఎక్కువగా కనిపించాయి. వాళ్లంతా ఆకట్టుకున్నారు.
* విశ్లేషణ..
కన్నడలో విజయవంతమైక కిర్రక్ పార్టీని తెలుగులో దాదాపుగా అదే పేరుతో, దాదాపుగా అవే సన్నివేశాలతో రీమేక్ చేశారు. కాలేజీ స్టూడెంట్స్‌కి నచ్చే సీన్లతో సినిమా మొదలవుతుంది. కాలేజీ లో ర్యాగింగు, సీనియర్లతో సరదాలు, కాలేజీలకు బంక్ కొట్టడం, హాస్టల్‌లో మందు కొట్టడం.. ఇలా కాలేజీ కుర్రకారు జీవితాల్ని ప్రతిబింబించేలా తొలి సగం సాగింది. వాటిలో ఫన్ ఎంత ఉంది? ఎంత రియలిస్టిక్‌గా ఉంది? అనేది పక్కన పెడితే - కాలేజీ కుర్రాళ్లు మాత్రం మళ్లీ తమ జీవితాల్ని తెరపై చూసుకుని మురిసిపోవడం ఖాయం.
మీరా పాత్ర రాకతో.. కథలో కాస్త ఎమోషనల్ డ్రామాకు చోటు దక్కింది. ఆమె పాత్ర మలిచిన విధానం బాగుంది. అయితే విశ్రాంతి ముందు మీరా పాత్రని సడన్‌గా ఎగ్జిట్ చేయించాడు దర్శకుడు. ద్వితీయార్థంలో కృష్ణ పాత్ర.. సీరియెస్‌గా సాగడానికి.. మీరా ఓ కారణంగా నిలిచింది. సెకండాఫ్ మొత్తం కాలేజీ గొడవలతోనే సాగింది. కాలేజీ అంటే.. మందు కొట్టడం, కాపీ కొట్టడం, అడ్డొచ్చిన వాళ్లని కొట్టడమేనా? అనిపించే ధోరణిలో సాగాయి ఆసన్నివేశాలు. ఫన్ మిస్సయ్యింది.. సీరియెస్‌నెస్ పెరిగింది. దాంతో ఫస్టాఫ్‌ని ఎంజాయ్ చేసింనంతగా ద్వితీయార్థాన్ని ఆస్వాదించలేం.
మళ్లీ క్లైమాక్స్ లో కథ గాడిలో పడింది. మీరా జ్ఞాపకాలు మళ్లీ కృష్ణని తట్టిలేపడంతో కథ సర్దుకుంది. క్లైమాక్స్‌లో మళ్లీ హార్ట్ టచింగ్ సీన్లతో ముంచేసి.. ఓ భారమైన ముగింపు ఇచ్చాడు దర్శకుడు.
* సాంకేతిక వర్గం
కిర్రిక్ పార్టీలో కొత్త కథేం లేదు. కొన్ని కాలేజీ సన్నివేశాల మేళవింపు. దాన్ని ఫన్, ఎమోషన్ జోడించి తీశారంతే. హ్యాపీడేస్, త్రీ ఈడియట్స్ ఫ్లేవర్స్ ఉన్నాయని భావిస్తే అది ప్రేక్షకుడి తప్పు కాదు. మాటలు అక్కడక్కడ మెరిశాయి. అయితే గుర్తుండిపోయేంత గొప్ప డైలాగ్స్ ఏం వినిపించలేదు. సంగీతం, ఛాయాగ్రహణం బాగున్నాయి. సినిమా రిచ్‌గా తీశారు. మాతృక కంటే మిన్నగా తీయకపోయినా... దర్శకుడు కాస్త దరిదాపుల్లోకి వెళ్లగలిగాడు.
* ప్లస్ పాయింట్స్
+ కాలేజీ సీన్లు
+ ఎమోషన్స్
* మైనస్ పాయింట్స్
- నిడివి
- తెలిసిన కథ
* ఫైనల్ వర్డిక్ట్: కొన్ని కాలేజీ జ్ఞాపకాలు..
రివ్యూ రాసింది శ్రీ