వివేకం తెలుగు రివ్యూ & రేటింగ్స్

మరిన్ని వార్తలు

తారాగణం: అజిత్, వివేక్ ఒబెరాయ్, కాజల్, అక్షరా
సంగీతం: అనిరుద్
ఛాయాగ్రహణం: వెట్రి
ఎడిటర్: రూబెన్
నిర్మాతలు: సెంధిల్, అర్జున్
రచన-దర్శకత్వం: శివ

యావరేజ్ యూజర్ రేటింగ్: 2.75/5

తెర‌పై భారీద‌నం చూడాల‌ని కోరుకొంటున్నారు ప్రేక్ష‌కులు. క‌థ ఏదైనా దాన్ని భారీ స్థాయిలో చెప్పి తీరాల్సిందే. అందుకే హంగులూ, ఆర్భాటాల‌కు పెద్ద పీట వేయాల్సి వ‌స్తోంది. ద‌ర్శ‌కులు కూడా ఇదే ఆలోచిస్తున్నారు. మామూలు క‌థ‌ని భారీ స్థాయిలో, పెద్ద స్కేల్‌లో చెబితే త‌ప్ప‌కుండా జ‌నాలు చూస్తార‌న్న న‌మ్మ‌కంతో సినిమాలు చేస్తున్నారు. `వివేకం` కూడా అలాంటి సినిమానే. క‌థ ప్ర‌కారం చూస్తే.. ఓ రివైంజ్‌డ్రామా. ఓ దేశ భక్తుడి త‌ప‌న‌. కాక‌పోతే దాన్ని మ‌రీ గ్రాండ్ స్కేల్‌లో చూపించ‌డ‌మే `వివేకం` ప్ర‌త్యేకం.

* క‌థ‌...

ఏకే (అజిత్‌) ఇంటిలిజెన్స్ విభాగంలో తిరుగులేని అధికారి. ఎవ‌రు ఎక్క‌డ దాక్కున్నా ప‌ట్టేస్తాడు. ఏకేకి మ‌రో భారీ ఆప‌రేష‌న్ ఎదుర‌వుతుంది. అదే.. ఆప‌రేష‌న్ డాల్‌!  న‌టాషా (అక్ష‌ర హాస‌న్‌) అనే ఓ హ్యాక‌ర్‌ని ప‌ట్టుకోవాల్సివ‌స్తుంది. త‌న‌ని ప‌ట్టుకోవ‌డం అసాధ్య‌మైన విష‌యం. ఆ ప్ర‌య‌త్నంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఆ టాస్క్‌ని ఏకే చేప‌డ‌తాడు. న‌టాషాని ప‌ట్టుకొని తిరిగొచ్చేలోగా ఏకేకి ఊహించ‌ని ప్ర‌మాదం ఎదుర‌వుతుంది. అక్క‌డి నుంచి ఏకే జీవితం మారిపోతుంది. ఇంటిలిజెన్స్ లో టాప‌ర్ కాస్త మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్ అయిపోతాడు. ఇదంతా ఎందుకు జ‌రిగింది? ఏకే ఎందుకు త‌ప్పించుకొన్నాడు?  న‌టాషా ఎవ‌రు??  అనే విష‌యాలు తెలియాలంటే `వివేకం` సినిమా చూడాలి.

* న‌టీన‌టులు...

అజిత్ వ‌న్ మాన్ షో ఈ సినిమా. అంతా తానై న‌డిపించాడు.  ఎప్ప‌టిలా త‌న అభిమానుల్ని ఆక‌ట్టుకొనే ప్ర‌య‌త్నం చేశాడు. కాజ‌ల్ కూడా త‌న వంతు పాత్ర‌ని స‌మ‌ర్థంగా పోషించింది. అక్ష‌ర రోల్ చిన్న‌దే. వివేక్ ఓబెరాయ్ స్టైలీష్‌గా క‌నిపించాడు.

వీళ్ల‌ను మిన‌హాయిస్తే న‌టీన‌టుల వ‌ర్గంలో మిగిలిన‌వాళ్లంతా దాదాపుగా గెస్ట్ రోల్సే పోషించారు.

* విశ్లేష‌ణ‌.. 

మామూలు యాక్ష‌న్ డ్రామాల్లానే క‌నిపించే క‌థ ఇది. ఓ నిజాయ‌తీగ‌ల అధికారి, డిపార్ట్‌మెంట్‌లోనే త‌న‌కు ద్రోహం జ‌రిగిన‌ప్పుడు, వాళ్ల‌తో త‌ల‌ప‌డుతూ.. త‌న ల‌క్ష్యాన్ని ఎలా చేరుకొన్నాడు, త‌న నిజాయ‌తీ ఎలా చూపించుకొన్నాడ‌న్న‌ది రొటీన్ క‌థే. కాక‌పోతే.. దీన్ని భారీ స్కేల్‌లో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. లొకేష‌న్లు, చిత్రీక‌రించిన విధానం కొత్త‌గా క‌నిపిస్తుంది. టేకింగ్ అయితే.. హాలీవుడ్ స్థాయిలో క‌నిపిస్తుంది. హాలీవుడ్ జేమ్స్ బాండ్ చిత్రాల్ని తెలుగు డ‌బ్బింగ్ తో చూస్తే ఎలా ఉంటుందో ఈసినిమా అలా ఉంటుంది. ఆ త‌ర‌హా చిత్రాలు ఇష్ట‌ప‌డేవాళ్ల‌కు. అజిత్ అభిమానుల‌కు ఈ సినిమా త‌ప్ప‌కుండా  న‌చ్చుతుంది. హీరో విల‌న్ల మ‌ధ్య జ‌రిగే ఇంటిలిజెంట్ ప్లే ఆక‌ట్టుకొంటుంది. అయితే ఆ తెలివితేట‌లు
మ‌రీ ఎక్కువైపోయిన‌ట్టు క‌నిపిస్తాయి. సామాన్య ప్రేక్ష‌కుడికి అర్థం కాని వ్య‌వ‌హారాలు చాలా జ‌రుగుతుంటాయి. పాట‌లు, వినోదం.. వీటికి చోటు త‌క్కువ‌. అవ‌న్నీ ఆశించి థియేట‌ర్‌కి వెళ్తే భంగ‌ప‌డ‌క త‌ప్ప‌దు. అయితే యాక్ష‌న్ దృశ్యాల్ని మాత్రం అంత‌ర్జాతీయ స్థాయిలో తీశారు. బైక్ ఛేజ్ ఆక‌ట్టుకొంటుంది. న‌టాషా ని ప‌ట్టుకొనే క్ర‌మం ఆస‌క్తిక‌రంగా చూపించాడు. క్లైమాక్స్‌కి ముందు హీరో విల‌న్ల మైండ్ గేమ్ కూడా.. బాగుంది.

* సాంకేతిక వ‌ర్గం...

ఈ సినిమాని హాలీవుడ్ రేంజులో తీయ‌డానికి నిర్మాత‌లు డ‌బ్బుల్ని నీళ్ల‌లా ఖ‌ర్చుపెట్టారు. వెట్రి కెమెరా ప‌నిత‌నం కట్టిప‌డేస్తుంది. విజువ‌ల్ ఎఫెక్ట్స్ కూడా ఆక‌ట్టుకొంటాయి. అనిరుధ్ నేప‌థ్య సంగీతం యాక్ష‌న్ ఎపిసోడ్ల‌లో బాగుంది. శివ‌.. ఎంచుకొన్న క‌థ రొటీన్‌దే. అయితే.. దాన్ని
ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయిలో చూపించాడు.

* ప్ల‌స్ పాయింట్స్‌

+ అజిత్
+ యాక్ష‌న్ ఎపిసోడ్స్‌
+ మైండ్ గేమ్‌

* మైనస్ పాయింట్స్

- లాజిక్ లేని స‌న్నివేశాలు
- వినోదం లేక‌పోవ‌డం

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌:  వివేకం.. వేగం బాగుంది

రివ్యూ బై శ్రీ

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS