వెంకటేష్ హీరోగా తెరకెక్కుతోన్న 'గురు' సినిమా విడుదలకు రెడీగా ఉంది. అతి త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ లోగా కొత్త సినిమాకు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. క్రిష్ డైరెక్షన్‌లో ఆ సినిమా తెరకెక్కుతోంది. గతంలో క్రిష్ డైరెక్ట్ చేసిన 'కృష్ణం వందే జగద్గురుమ్' సినిమాలో వెంకీ ఓ పాటలో గెస్ట్ రోల్‌లో కనిపించాడు. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ మూవీ చేయబోతున్నాడు. తాజాగా క్రిష్ బాలయ్యతో చేసిన వందో చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి' మంచి విజయం అందుకుంది. అలాగే ఇప్పుడు వెంకీతో తెరకెక్కబోయే సినిమా, వెంకీకి 75వ చిత్రం కాగా, ఆ సినిమా వెంకీకి ఎంతో స్పెషల్ అట. ఎందుకంటే డిఫరెంట్ కాన్పెప్ట్ ఉన్న స్టోరీతో ఈ సినిమా తెరకెక్కబోతోందట. డిఫరెంట్ కాన్సెప్ట్స్ అంటే వెంకీ ముందుంటాడు. అలా వచ్చిన చిత్రాలే 'దృశ్యం', గోపాల గోపాల' చిత్రాలు. హుందా అయిన పాత్రల్లో నటిస్తూనే, యంగ్ లుక్‌తో కూడా అలరించాడు వెంకటేష్. అయితే క్రిష్‌తో తెరకెక్కబోతోన్న ఈ సినిమాలో వెంకీ సరసన అనుష్క హీరోయిన్‌గా నటిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. వెంకీతో అనుష్క 'చింతకాయల రవి' సినిమాలో జత కట్టింది. క్రిష్ సినిమా 'వేదం'లో డిఫరెంట్ రోల్‌లో మెప్పించింది. చాన్నాళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా అవుతుంది. ప్రస్తుతం అనుష్క నటించిన 'బాహుబలి ది కన్‌క్లూజన్' సినిమా విడుదలకు రెడీగా ఉంది. అలాగే 'నమో వేంకటేశాయ' సినిమాలో ఆమె కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా కూడా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.