తారాగణం: అదిత్ అరుణ్, హెబ్బ పటేల్, రావు రమేష్, నరేష్ & తదితరులు
నిర్మాణ సంస్థ: పర్ఫెక్ట్ క్రియేషన్స్
సంగీతం: జోయి
ఛాయాగ్రహణం: ఉదయ్
ఎడిటర్: అనిల్
నిర్మాతలు: అయోధ్య కుమార్, అనిల్ పల్లాల & సంజయ్ రెడ్డి
రచన-దర్శకత్వం: అయోధ్య కుమార్
రేటింగ్: 1.5/5
మిణుగురులు వంటి సందేశాత్మక చిత్రం ద్వారా విమర్శకుల ప్రశంసలందుకున్నారు దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం 24కిస్సెస్. అరుణ్అదిత్, హెబ్బా పటేల్ జంటగా నటించారు. ఆసక్తికరమైన టైటిల్‌తో పాటు యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న హెబ్బాపటేల్ నాయికగా నటించడంతో ఈ సినిమా ప్రేక్షకుల్లో కొంత ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవలకాలంలో ప్రచారపరంగా కూడా అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ చిత్ర కథా వివరాలేమిటో తెలుసుకుందాం...
కథ
ఆనంద్ (అరుణ్ అదిత్) చిల్డ్రన్స్ ఫిల్మ్‌మేకర్. పిల్లల సమస్యల పట్ల మానవీయ కోణం అతనిది. సినీరంగంలో రాణించాలనుకునే ఔత్సాహికులకు ఓ సినీ నిర్మాణ సంస్థ ద్వారా శిక్షణ కూడా ఇస్తుంటాడు. ఈ క్రమంలో అతనికి షార్ట్‌ఫిలిమ్స్ తీసే శ్రీలక్ష్మి (హెబ్బా పటేల్) పరిచయమవుతుంది. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. అనుకోని అపార్థాలతో వారి మధ్య అపోహలు తలెత్తుతాయి. దీంతో విడిపోతారు. ఈ క్రమంలో ఏం జరిగింది? ఆనంద్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలని ఎందుకు నిర్ణయం తీసుకుంటాడు? ఈ ప్రేమ ప్రయాణంలో 24ముద్దుల కథేమిటి? చివరకు ఈ జంట కథ ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా చిత్ర కథ..
నటీనటుల పనితీరు..
కథ, కథనాలు బలహీనంగా ఉన్నా...నాయకానాయికలు అరుణ్ అదిత్, హెబ్బాపటేల్ తమ పాత్రలకు న్యాయం చేశారు. చక్కటి భావోద్వేగాల్ని పండిస్తూ తమ పాత్రల్లో రాణించారు. అరుణ్ అదిత్ నటనలో మంచి పరిణితి కనిపించింది. ఈ సినిమాలో చాలా కొద్ది పాత్రలే ఉన్నాయి. సైకో థెరపిస్ట్‌గా రావు రమేష్ తనదైన శైలిలో మెప్పించాడు. ఇక కథానాయిక తండ్రిగా నరేష్ పాత్రకు అంత ప్రాధాన్యత దక్కలేదు.
విశ్లేషణ...
ప్రేమికులంటే ముద్దుముచ్చట్లు సహజం. అయితే ఇందులో వాటి అర్థం పరమార్థాన్ని తెలియజెప్పాలనుకున్నారో ఏమో తొలిముద్దు పెట్టగానే కథానాయిక ముద్దుల తాలూకు పుస్తకాల్నిఅన్వేషించే పనిలో పడుతుంది. ఇంటర్నెట్‌లో, లైబ్రరీలో అనేక పుస్తకాలు తిరగేస్తుంది. కిస్ ఆఫ్ లవ్ అంటూ ఓ పుస్తకాన్ని దొరకబుచ్చుకుంటుంది. అందులో 24 ముద్దులు, వాటివెనకున్న డివైన్ మీనింగ్ (దైవికమైన అర్ధం) ఏమిటో తెలుసుకుంటుంది. ఈ నేపథ్యంలో ముద్దుల వెనకున్న మర్మాన్ని కథానాయిక నేపథ్యంలో మనకు వివరించే ప్రయత్నం చేస్తాడు దర్శకుడు.
ఓ సైకో థెరపిస్ట్ మూర్తి (రావు రమేష్), ఆనంద్ మధ్య సంవాదంతో చిత్ర కథను మొదలవుతుంది. ప్రథమార్థమంతా నాయకానాయికల మధ్య పరిచయం, వారిమధ్య చోటుచేసుకునే ముద్దులు, వాటి ఆంతర్యం...ఇలా వివరిస్తూ సినిమాను సాగించాడు దర్శకుడు. ముద్దు దృశ్యాల్ని కొంత సుదీర్ఘంగా నిర్మొహమాటంగానే చూపించారు. అయితే కేవలం ముద్దుల గోల తప్పించి హీరోహీరోయిన్ల మధ్య ఎలాంటి ఎమోషన్ , సంఘర్షణ లేకపోవడంతో కథ మొత్తం సాగతీతగా అనిపిస్తుంది. ఈ మధ్యలో మూర్తి, ఆనంద్ మధ్య జరిగే డిస్కషన్ కూడా ఫిలాసఫీ కలబోతతో సాధారణ ప్రేక్షకులకు ఓ పట్టాన అర్ధం కాదు.
ఇక ద్వితీయార్థంలో విడిపోయిన నాయకానాయికలు తిరిగి కలుసుకోవడం..అందుకు దారితీసిన పరిస్థితుల్నిచూపించారు. ఇద్దరు కలిసి వుండటానికి పెళ్లి అవసరం లేదని భావించే కథానాయకుడు, అతనిలో పరివర్తన తీసుకురావడానికి కథానాయిక చేసే ప్రయత్నాలతో ద్వితీయార్థాన్ని నడిపించారు. అయితే ఈ క్రమంలో కథాగమనం అంతా గందరగోళంగా సాగింది. దర్శకుడు ఈ సినిమా ద్వారా ఏం చెప్పదలచుకున్నాడో స్పష్టత లేకుండా పోయింది. హీరో పెళ్లి వద్దనడానికి చూపించే కారణంలో ఎలాంటి లాజిక్ కనిపించదు. నాయకానాయికల మధ్య బంధాన్ని కవితాత్మకంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అయితే సన్నివేశాల్లో భావోద్వేగాలు లేకపోవడంతో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఏ ఒక్క సన్నివేశంలో కూడా బలమైన ఉద్వేగాలు పండలేదు. ఇక హాస్యం మచ్చుకైనా కానరాలేదు. ఇక ముద్దు సన్నివేశాల్లో కూడా ఈస్థటిక్ ఫీల్ మిస్సయింది.
యువతను అట్రాక్ట్ చేయడానికే ఆ ముద్దు సీన్స్ పెట్టారనిపిస్తుంది. కథానాయకుడు చిన్న పిల్లల పౌష్టికాహారలోపం గురించి ఓ చిత్రాన్ని తీయడానికి పూనుకోవడం, అందుకు అతను చేసే ప్రయత్నాలు బాగానే అనిపించినా అవి కథలో ఏమాత్రం ఇమడలేకపోయాయి. పేలవమైన కథ,కథనాల వల్ల ప్రతి సన్నివేశం సాగతీసిన భావన కలుగుతుంది.
సాంకేతిక వర్గం
ఇక ఉదయ్ ఛాయాగ్రహణం కొన్ని సన్నివేశాల్లో ఫర్వాలేదనిపించింది. జోయ్ బారువా సంగీతం బాగుంది. సత్యం, శివం, సుందరం..పాటకు మంచి బాణీ కుదిరింది. నిర్మాణ విలువలు అంతంత మాత్రంగా అనిపిస్తాయి. ఇక దర్శకుడు అయోధ్యకుమార్ దర్శకుడిగా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. నిస్సారమైన కథతో ప్రేక్షకుల్ని ఆసాంతం నిరాశకు గురిచేశాడు.
తీర్పు..
ప్రేమ కథలో కాన్సెప్ట్ కంటే హృదయాన్ని కదిలించే ఎమోషన్స్, కాన్‌ఫ్లిక్ట్ చాలా ముఖ్యం. ఈ సాధారణ అంశాన్ని విస్మరించి 24కిస్సెస్ అంటూ అర్థంలేని ముద్దుల కథతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తూ వారిని ఆద్యంతం విసిగించే ప్రయత్నమిది..
రివ్యూ రాసింది శ్రీ.