నటీనటులు : సముధ్రఖని, వినయ్ వర్మ, ప్రశాంత్త, తేజ దితరులు
దర్శకత్వం : అశ్విన్ గంగరాజు
నిర్మాతలు : పద్మనాభ రెడ్డి
సంగీతం : కాళ భైరవ
సినిమాటోగ్రఫర్ : సురేష్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
రేటింగ్: 2.75/5
దేవుడు అనేది అంతు చిక్కని టాపిక్. దేవుడు ఉన్నాడా, లేడా? అనే ప్రశ్న ఈ జీవి ఉన్నంత వరకూ వేధిస్తూనే ఉంటుంది. ఎవరి నమ్మకాలు వాళ్లవి. దేవుడ్ని చూపించమని నాస్తికులు అడుగుతారు. కనిపించనిదల్లా లేదని కాదని భక్తులు చెబుతారు. ఇద్దరి వాదనలోనూ నిజం ఉంది. అలా... రేడియోలో దేవుడ్ని చూసిన ఓ గూడెం ప్రజల కథ `ఆకాశవాణి`.
సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకుడు. సోనీ లైవ్ లో విడులైంది. మరి ఈసినిమా ఎలా ఉంది? ఆకాశవాణి మహిమలేంటి? అనే విషయాలు తెలుసుకుంటే...
* కథ
అనగనగా ఓ మారుమూల.. దట్టమైన అడవి. అక్కడ నివసించే వాళ్లందరికీ దొర (వినయ్ వర్మ)నే దేవుడు. ఆయన మాటంటే వేద వాక్కు. దొర కూడా ఆ గూడెం ప్రజల అజ్ఞానాన్ని తన వైభవం కోసం వాడుకుంటాడు. దొర మాటే.. దేవుడి మాట, దొరకు కోపం వస్తే, దేవుడికి కోపం వచ్చినట్టే అన్నంతగా ఆ గూడెం ప్రజల్ని నమ్మిస్తాడు. ఆ గూడెం వాసులు ఎంత అమాయకులంటే.. వాళ్లకు బయట ప్రపంచం తెలీదు. ఆ గూడెం దాటి ఒక్క అడుగు కూడా వేయరు. వేస్తే... దేవుడు శిక్షిస్తాడన్నది వాళ్ల నమ్మకం.
దొర పుట్టిన రోజున ఊర్లో పిల్లలందరికీ పీచు మిఠాయి పంచుతారు. అప్పుడే... అనుకోకుండా... ఓ పిల్లాడికి రేడియో దొరుకుతుంది. అది రేడియో అని తెలియని అమాయకత్వం గూడెం ప్రజలది. రేడియోలోంచి మాటలు వినిపిస్తుంటే, దేవుడే మాట్లాడుతున్నాడని భ్రమ పడతారు. ఆ రేడియోని దేవుడ్ని చేసేస్తారు. గుడి కడతారు. ధ్వజస్థంభం కూడా పాతుతారు. దీన్ని కూడా దొర తన సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటాడు. అయితే.... క్రమంగా ఆ రేడియోనే గూడెం ప్రజలకు ఆ దొర నిజ స్వరూపం బట్టబయలు చేస్తుంది. అదెలా అన్నదే మిగిలిన కథ.
* విశ్లేషణ
నిజంగా ఇలాంటి పాయింట్ తో ఓ కథ తయారు చేసుకోవడం, దాన్ని ఓ సినిమాగా మలచడం సాహసమే. ఎలాంటి కమర్షియల్ అంశాలూ లేని కథ ఇది. దాన్ని అంతే నిజాయితీతో తెరపైకి తీసుకొచ్చారు. అసలు రేడియో అంటేనే తెలియని ఓ గూడెం ఉందని, ఆ గూడెం ప్రజల అమాయకత్వాన్ని దొర ఆడుకుంటున్నాడని చెబుతూ కథని మొదలెట్టారు. ఈ కథలో గమ్మత్తేమిటంటే... రేడియోనే హీరో. రేడియోనే దేవుడు.
ఈ కథని చాలా స్లో నేరేషన్ తో మొదలెట్టాడు దర్శకుడు. గూడెం ప్రజల జీవన విధానాలూ, వాళ్ల నమ్మకాలు చెబుతూ సినిమా మొదలెట్టారు. గూడెం ప్రజల్ని దొర ఎలా పీడిస్తాడో చెబుతూ కొన్ని ఎమోషనల్ సీన్లు రాసుకున్నాడు. ఆ తరవాత రేడియో వస్తుంది. రేడియో ఎలా దేవుడయ్యాడో చెప్పే సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఆ మధ్య ఫ్లో.. మరీ స్లో అయిపోతుంది. అడవీ - దొర పెత్తనం ఇవి తప్ప తొలి సగంలో కథగా ఏం లేదు. సముద్ర ఖని పాత్ర కూడా తొలి సగంలో ఒకట్రెండు సన్నివేశాల్లో కనిపిస్తుంది. ఆ తరవాత.. క్లైమాక్స్ కి ముందే వస్తుంది. ఈలోగా ఆటంతా.. రేడియో తోనే.
రేడియోని దేవుడిగా భావిస్తున్న గూడెం ప్రజలతో `ఇది దేవుడు కాదు. మనిషి చేసిన వస్తువు. దాన్ని మీరు దేవుడు అనుకుంటున్నారు` అని సముద్రఖని తో చెప్పిస్తారు.
`మీరు రాయిని మొక్కుతారు కదా, రాయిని కూడా మనిషే చేశాడు కదా` అని ఓ పాత్రతో పలికించారు. ఈ సంభాషణే... ఈ కథకు మూలం. ప్రతి వస్తువులోనూ దేవుడ్ని చూసే మనుషుల కంటే గొప్ప దేవుడు ఉండడన్నది ఈ కథలో కీలక పాయింట్. దాన్నే దర్శకుడు బలంగా చెప్పే ప్రయత్నం చేశాడు. పతాక సన్నివేశాల్లో అదే చెప్పాడు. చివరికి ఏ వస్తువునైతే గుడ్డిగా దేవుడిగా నమ్మారో... అదే వస్తువు శత్రు సంహారం చేయడంతో కథకు న్యాయం జరిగినట్టైంది. తొలి సన్నివేశాల్లో రేడియోలో వచ్చే `హిరణ్య కశ్యప` నాటకాన్ని - క్లైమాక్స్ లో వాడుకోవడం, ఏ రేడియో నైతే పాడేశాడో, అదే రేడియోని దేవుడిగా భావించి మొక్కడం నిజంగా మంచి స్క్రీన్ ప్లే టెక్నిక్కులు.
* నటీనటులు
సముద్రఖని సహజమైన నటుడు. తన నటన ఈ సినిమాకి బలం. తను ఎంత అనుభజ్ఞుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తనతో పాటు నటించిన మిగిలిన వాళ్లు కూడా... అంతే సహజంగా నటించారు. ఓరకంగా సముద్రఖని కి పోటీ ఇచ్చారు. దొరగా కనిపించిన వినయ్ వర్మలో గాంభీర్యం ఉంది. కరుకుదనం ఉంది. ఇవి రెండూ తను బాగా పోషించాడు. గూడెంలోని పాత్రలన్నీ సహజత్వం ఉట్టి పడేవే. వాళ్లూ అంతే సహజంగా నటించారు.
* సాంకేతిక వర్గం
కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన సంగీతం మరో ప్రధాన ఆకర్షణ. పాటలు గూడెం ప్రజల జీవితాన్ని, జీవనాన్ని ప్రతిబింబించాయి. ఫొటోగ్రఫీ అయితే మరింత బాగుంది. బుర్రా సాయిమాధవ్ సంభాషణలు ఆకట్టుకుంటాయి. దర్శకుడు ఎంచుకున్న కథ మంచిది. అయితే దాన్ని కమర్షియల్ యాంగిల్ లో చెప్పలేకపోయాడు. కొన్ని చోట్ల బాగా బోర్ కొడుతుంది. అయితే తాను అనుకున్న పాయింట్ అనుకున్నట్టు తెరపై తీసుకొచ్చాడు.
* ప్లస్ పాయింట్స్
అటవీ నేపథ్యం
క్లైమాక్స్
సంభాషణలు
* మైనస్ పాయింట్స్
కథనం
కమర్షియల్ అంశాలు లేకపోవడం
* ఫైనల్ వర్డిక్ట్: దేవుడు వినిపించాడు