తారాగణం: రవితేజ, ఇలియానా, విక్రంజీత్, సునీల్, అభిమన్యు సింగ్, సాయాజీ షిండే, శ్రీనివాస రెడ్డి, సత్య, రఘుబాబు & తదితరులు
నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: వెంకట్
ఎడిటర్: MR వర్మ
కథ: శ్రీను వైట్ల, వంశీ & కొండవీటి
నిర్మాతలు: నవీన్, రవి & మోహన్
కథనం & దర్శకత్వం: శ్రీను వైట్ల
రేటింగ్: 2/5
గత నాలుగేళ్లుగా విజయం కోసం నిరీక్షిస్తున్నారు దర్శకుడు శ్రీనువైట్ల. ఒకప్పుడు అగ్ర కథానాయకులతో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించిన ఆయన మంచి సక్సెస్ కోసం ప్రయాస పడుతున్నారు. హీరో రవితేజది ఇదే పరిస్థితి. ఆయన సైతం కొన్ని సంవత్సరాలుగా సరైన విజయం లేక సతమతవుతున్నారు. ఈ దర్శకహీరోలిద్దరూ భారీ విజయాన్ని ఆశిస్తూ అమర్ అక్బర్ అంటోని చిత్రానికి శ్రీకారం చుట్టారు. నీకోసం, వెంకీ, దుబాయ్ శీను వంటి చక్కటి విజయాలు ఈ ద్వయం ఖాతాలో ఉన్నాయి. దీంతో అమర్ అక్బర్ ఆంటోని చిత్రం నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ తెరకెక్కించడం మరింత అంచనాల్ని పెంచింది. ఈ నేపథ్యంలో విడుదలైన అమర్ అక్బర్ ఆంటోని ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుందో సమీక్షిద్దాం.
కథ
అమెరికాలో ఓ ఫార్మాసుటికల్ కంపెనీ నడుపుతున్న ఇద్దరు ప్రాణమిత్రులు వారి భాగస్వాముల కుట్ర కారణంగా హత్యకు గురవుతారు. ఆ రెండు కుటుంబాలకు చెందిన పిల్లలు అమర్ (రవితేజ), ఐశ్వర్య (ఇలియానా) ఆ దాడి నుంచి తప్పించుకుంటారు. వారిద్దరి సంరక్షణను కుటుంబ శ్రేయోభిలాషి అయిన జలాల్ అక్బర్ (షాయాజీషిండే) తీసుకుంటాడు. ఈలోగా ఓ హత్య అభియోగంతో అమర్ పద్నాలుగేళ్లు జైల్లో జీవితాన్ని గడపాల్ని వస్తుంది.
జైలు నుంచి విడుదలైన అమర్ తన తల్లిదండ్రులను చంపిన నలుగురు వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. అందుకు అతను ఏం చేశాడు? అమర్‌కు ఉన్న మానసిక రుగ్మత ఏమిటి? తన పథకాన్ని అమలు చేయడానికి అతను అమర్, అక్బర్, ఆంటోనిగా ఎందుకు అవరాతమెత్తాల్ని వచ్చింది?. చిన్నతనంలో తనను విడిచిపెట్టి వెళ్లిన ఐశ్వర్యను అమర్ ఎలా కలుసుకున్నాడు? చివరకు అమర్ ఏ విధంగా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నదే చిత్ర కథ..
నటీనటుల పనితీరు...
రవితేజ పాత్ర చిత్రణలో ఎలాంటి కొత్తదనం లేదు. అమర్, అక్బర్, ఆంటోనిగా భిన్న పార్శాల్లో వైవిధ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ప్రథమార్థంలో అక్బర్‌గా ఆయన నటన ఆకట్టుకుంటుంది. కాస్త ఒళ్లు చేయడంతో ఇలియానాలో మునుపటి గ్లామర్ లోపించినట్లుగా అనిపించింది. వెన్నెల కిషోర్, సత్య తమ పరిధిలో వినోదాన్ని పండించారు. ద్వితీయార్థంలో సునీల్ కాస్త నవ్వించారు. మిగతా నటీనటులు తమ పాత్రల మేరకు నటించారు.
విశ్లేషణ..
చిన్నతనంలో తల్లిదండ్రులు హత్యకు గురికావడం, పెరిగి పెద్దైన వారి కుమారుడు తన తల్లిదండ్రులను చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడం అన్నది కొన్ని దశాబ్దాలుగా తెలుగు తెరపై అరిగిపోయిన ఫార్ములా. అలాగే మల్టీఫుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసకి రుగ్మ తతో సినిమాలు తీయడమూ కొత్తేమి కాదు. ఈ రెండు ఫార్మ్లులాల్ని మేళవించి శ్రీను వైట్ల వండిన వంటకమే అమర్ అక్బర్ అంటోని. అయితే ఈ సినిమాలో సదరు మానసిక రుగ్మత పేరు డిస్అసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్. అంటే ఒకే మనిషి పరిస్థితుల వల్ల ఉద్దీపన చెంది మరొక వ్యక్తిగా మారడమన్నమాట.
సినిమా ఆరంభమైన తొలి పదినిమిషాల్లోనే ఇదొక ప్రతీకార నేపథ్య కథ అని అర్థమవుతుంది. జైల్లో నుంచి విడుదలైన అమర్ తన తొలి ప్రత్యర్థిని చంపడంతోనే అతని లక్ష్యమేమిటో స్పష్టమవుతుంది. అయితే ఈ రివేంజ్ స్టోరిని తనదైన శైలి మలుపులు, స్ర్కీన్‌ప్లే, కామెడీ టచ్‌తో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు శ్రీనువైట్ల. ఈ ప్రయత్నంలో ఆయన ఆద్యంతం తడబడినట్లుగా అనిపిస్తుంది. ఏ సన్నివేశంలోనూ లాజిక్ కనిపించదు. అమర్‌ను పట్టుకోవడానికి అతని ప్రత్యర్థులు ఎఫ్.బి.ఐ అధికారి బల్వంత్ (అభిమన్యుసింగ్)ను ఆశ్రయిస్తారు. అసలు ఓ ఎఫ్.బి.ఐ అధికారి క్రిమినల్స్ పక్షాన నిందితుడ్ని పట్టుకోవడానికి ఎలా ప్రయత్నిస్తాడన్నది ఏ మాత్రం హేతువుకు అందదు.
ప్రథమార్థంలోనే అమర్ మానసిక రుగ్మత గురించి చెప్పడంతో కథలోని మెయిన్ పాయింట్ రివీల్ అవుతుంది. దాంతో అమర్..అక్బర్, అంటోనిగా పరివర్తన చెందే సన్నివేశాలు ఏమాత్రం థ్రిల్‌ను పంచవు. గాజు అద్దాలు పగిలిపోవడం, బాంబ్‌బ్లాస్ట్ శబ్దాలు వినడం వల్ల కథానాయకుడు ఒక్కసారిగా అక్బర్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం కృతకంగా అనిపిస్తుంది. ఈ సినిమాలో కామెడీ ట్రాక్‌కోసం హోల్ ఆంధ్రా తెలంగాణ అసోసియేషన్ (వాటా) అంటూ ఓ అర్గనైజన్ సృష్టించారు. ఈ ట్రాక్‌లో వెన్నెల కిషోర్, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, సత్యలను పెట్టి వినోదాన్ని పండించే ప్రయత్నం చేశారు. అయితే చాలా సందర్భాల్లో అది ఫోర్స్‌డ్ కామెడీగానే అనిపించింది. జూనియర్ పాల్‌గా సత్య పాత్ర కాస్త వినోదాన్ని అందించింది. కథ మొత్తం అమెరికాలోనే జరుగుతుంది. ఈ రొటీన్ ప్రతీకార కథకు అమెరికా నేపథ్యం అవసరం లేదనిపిస్తుంది.
ఏదో మేకింగ్‌లో గ్రాండ్యూర్ ఉంటుందని ఆమెరికా బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్నారనే భావన కలుగుతుంది. సుదీర్ఘ విరామం తర్వాత తెలుగులో పునరాగమనం చేయడంతో ఇలియాన పాత్ర స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటుందని భావించారు. అయితే ఇందులో ఆమె పాత్రకు అభినయపరంగా ఎలాంటి స్కోప్‌లేకుండా పోయింది. కథేమిటో ముందే తెలిసిపోవడంతో ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు కూడా ఏమాత్రం ఉత్కంఠను కలిగించవు.
కథలో అర్థపర్థం లేని మలుపులతో ప్రేక్షకుల్ని కన్‌ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడా కన్విన్స్ చేసినట్లుగా కనిపించదు. మెంటల్ డిజార్డర్స్‌ను కాన్సెప్ట్‌గా ఎంచుకున్నప్పుడు అందుకు తగిన నేపథ్యం బలంగా ఉండాలి. ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే విధంగా సన్నివేశాల్ని రాసుకోవాలి. ఇందులో అలాంటి ప్రయత్నమేది కనిపించదు. ఏ మామూలు రొడ్డకొట్టుడు రివేంజ్ ఫార్ములా అనే భావన కలుగుతుంది.
సాంకేతికంగా..
వెంకట్ సి దిలీప్ ఛాయాగ్రహణం బాగుంది. అమెరికా శీతాకాలపు అందాల్ని అద్బుతంగా ఆవిష్‌లరించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. మేకింగ్‌పరంగా ఎక్కడా రాజీపడలేదనిపించింది. ఇక దర్శకుడు శ్రీనువైట్ల టేకింగ్‌లో ఎక్కడా కొత్తదనం కనిపించలేదు. తన పాత చిత్రాల ఫార్ములాతోనే సినిమాను తెరకెక్కించాడు. ఆయన మార్క్ వినోదం కూడా కనిపించలేదు. సంభాషణలు కొన్ని ఫర్వాలేదనిపించాయి. ఇక తమన్ సంగీతం ఏమాత్రం ఆకట్టుకోదు. ఒక్క పాట కూడా గుర్తుంచుకునేలా లేదనడం అతిశయోక్తి కాదు. అయితే కొన్ని సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుందనిపించింది.
ప్లస్ పాయింట్:
+ కామెడీ
మైనస్ పాయింట్స్:
- కథ
- కథనం
- దర్శకత్వం
- పాటలు
తీర్పు..
రొటీన్ రివేంజ్ ఫార్ములా సినిమా ఇది. కథలో, సన్నివేశాల రూపకల్పనలో ఎక్కడా కొత్తదనం కనిపించలేదు. తన సినిమాల్లోని మునుపటి మ్యాజిక్‌ను పునఃసృష్టించాలని దర్శకుడు శ్రీనువైట్ల చేసిన ప్రయత్నం నిష్ఫలంగా మిగిలిపోయింది...
రివ్యూ రాసింది శ్రీ.