చిత్రం: అంబాజీపేట మ్యారేజి బ్యాండు
నటీనటులు: సుహాస్, శివాని నాగరం, శరణ్య ప్రదీప్
దర్శకత్వం: దుశ్యంత్ కటికినేని
నిర్మాత: ధీరజ్ మొగిలినేని
సంగీతం: శేఖర్ చంద్ర
ఛాయాగ్రహణం: వాజిద్ బేగ్,
కూర్పు: కొదాటి పవన్ కల్యాణ్
బ్యానర్స్: జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్
విడుదల తేదీ: 2 ఫిబ్రవరి 2024
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.75/5
పల్లెల్లో జరిగే సంఘటనలు కొన్ని షాకింగా వుంటాయి. నిజంగా ఇలా జరిగిందా ? అనే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ కూడా అలాంటి ఓ యదార్థ సంఘటన ఆధారంగా రాసుకున్న కథే. ఈ సినిమా ట్రైలర్ చూడగానే కుల వివక్ష, వర్ణాంతరాలు, వర్గపోరు వున్న కథని అర్ధమైపోయింది. ఇలాంటి కథలు సినిమా పుట్టినప్పటి నుంచి వస్తున్నాయి. మరి ఇందులో దర్శకుడు చూపించిన కొత్తదనం ఏమిటి ? ఈ బ్యాండ్ పార్టీ సౌండ్ దద్దరిల్లిందా?
కథ: 2007. అది అంబాజీపేట దగ్గర చింతలపూడి. మల్లికార్జున్ అలియాస్ మల్లి( సుహాస్ ) నాయీ బ్రాహ్మణుల కులానికి చెందిన కుర్రాడు. మల్లి అక్క పద్మ(శరణ్య ప్రదీప్) స్కూల్ టీచర్. మల్లి తండ్రి వూర్లో సెలూన్ షాప్ నడుపుతుంటాడు. మల్లి అంబాజీపేట మ్యారేజి బ్యాండులో డ్రమ్మర్. అదే వూర్లో వెంకట్(నితిన్ ప్రసన్న) పలుకుబడి వున్న మనిషి. వడ్డీకి డబ్బులు ఇచ్చి ఆస్తులు కూడబెట్టుకుంటాడు. వెంకట్ చెల్లెలు లక్ష్మీ (శివాని నాగరం) మల్లి ప్రేమించుకుంటారు. వీరి ప్రేమ విషయం తెలుసుకున్న వెంకట్ ఏం చేశాడు ? ఆత్మ గౌరవం కోసం జరిగిన పోరాటంలో గెలుపెవరిది ? అనేది తెరపై చూడాలి.
విశ్లేషణ: కుల వివక్ష, వర్గ పోరు నేపధ్యంలో వచ్చిన కథలన్నీ దాదాపు ఒకటే లైన్ లో వుంటాయి. ఇద్దరు ప్రేమించుకోవడం, వారి ప్రేమకు అంతరాలు ఎదురవ్వడం, ఆ క్రమంలో చోటు చేసుకునే హింస, ఘర్షణ.. ఈ దారిలోనే సాగుతాయి. అయితే ఈ సంఘర్షణనే ఎంత కొత్తగా యంగేజింగా చూపిస్తున్నామనేది అసలు పాయింట్. అంబాజీపేట మ్యారేజి బ్యాండు కథలో రెండు లేయర్లు వున్నాయి. ఒకటి.. ప్రేమకథ, రెండు.. ఆత్మ గౌరవం కోసం చేసిన పోరాటం. ప్రేమకథ విషయానికి వస్తే.,. ఈ కథకు ఆ ట్రాక్ పెద్ద బలాన్ని ఇవ్వలేకపోయింది. దాదాపు తొలిసగం అంతా.. ప్రేమకథ చుట్టూనే సన్నివేశాలని నడిపిన దర్శకుడు.. ఆ ప్రేమకథని వదిలేసి ఆత్మ గౌరవం వైపు మళ్లాడు. దీంతో అప్పటి వరకూ చూసిన ప్రేమ సన్నివేశాలన్నీ టైం పాస్, రాజీ పడిపోయే వ్యవహారంలా తయారయ్యాయి.
ఎప్పుడైతే తెరపైకి ఆత్మ గౌరవం కోసం చేసే పోరాటం తెరపైకి వస్తుందో.. కథలో సీరియస్ నెస్ వస్తుంది. ఇంటర్వవెల్ బాంగ్ కూడా ఇంటెన్స్ గా డిజైన్ చేశారు. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని పెంచుతుంది. సెకండ్ హాఫ్ లో ‘సత్యాగ్రహం’తెరపైకి వస్తుంది బహుశా పద్మ పాత్ర ద్వారా దర్శకుడు ఎంచుకున్న శాంతి మార్గం ఇందులో వున్న కొత్తదనం అనుకోవాలి. ఇదే యాదార్ధ సంఘటనల నుంచి తీసుకున్న కీలక అంశం కావచ్చు. అయితే రక్తం మరిగిపోయే ఇంటర్వెల్ తర్వాత ఇలా శాంతి సూత్రాలు వల్లిస్తూ అల్లిన సన్నివేశాలు డ్రామాని డ్రాప్ చేసిన ఫీలింగ్ కూడా కలిగించే అవకాశం వుంది. క్లైమాక్స్ ముందే ఊహించవచ్చు. అయితే కథానాయకుడు క్లైమాక్స్ లో తీసుకున్న నిర్ణయం మాత్రం కాస్త కొత్తదే. విలన్ ని లేపేయడం రొటీన్. కానీ ఇందులో హీరో వేసిన శిక్ష లాజిక్ కి దూరంగా వున్నా.. గ్యాలరీకి ఓకే అనిపిస్తుంది.
నటీనటులు: మల్లి పాత్రలో అల్లుకుపోయాడు సుహాస్. ఎమోషనల్ సీన్స్ బాగా చేశాడు. ఇంటర్వెల్ సీన్ లో అతడి ఆవేశానికి ప్రేక్షకుడి కనెక్ట్ అవుతాడు. శరణ్య ప్రదీప్ సెకండ్ హీరో అనుకోవచ్చు. నిజానికి ఈ కథలో ఎమోషన్ ఆమె పాత్రలోనే వుంది. ఆ పాత్రలో ఒదిగిపోయింది. పోలీస్ స్టేషన్ సీన్ లో క్లాప్స్ పడతాయి. లక్ష్మీ పాత్రలో కనిపించిన శివాని నాగరం ఎదురింటి అమ్మాయిలానే వుంది కానీ ప్రేమకథకు బలాన్ని ఇచ్చే పాత్ర అయితే కాదు. మల్లి, లక్ష్మీ పాత్రలని ఇంకా బలంగా తీర్చిదిద్దే అవకాశం వుంది. నితిన్ ప్రసన్న లాగిపెట్టికొట్టాలనిపించే విలనిజం చూపించాడు. జగదీష్ ప్రతాప్ బండారి, గోపరాజు రమణ సహజంగా కనిపించారు. మిగతా నటులు పరిధిమేర చేశారు.
టెక్నికల్: శేఖర్ చంద్ర ఇచ్చిన పాటలు బావున్నాయి. గుమ్మా పాట క్యాచిగా వుంది. పాట ప్లేస్ మెంట్ కూడా కుదిరింది. వాజిద్ బేగ్ కెమరాపనితనం నీట్ గా వుంది. దర్శకుడు దుష్యంత్ కటికనేని ఎమోషనల్ హై ఇచ్చే మరిన్ని సన్నివేశాల్ని తీర్చిదిద్దాల్సింది. ఫస్ట్ హాఫ్ లో డ్రామా మరీ చప్పగా వెళ్ళిపోయింది. తమిళ్ లో మామన్నన్ అనే ఒక సినిమా వచ్చింది. అందులో సన్నివేశాలు చూస్తున్నపుడు రక్తం మరిగిపొద్ది. అంబాజీపేట కూడా లాంటి ట్రీట్మెంట్ డిమాండ్ చేసే కథే. కానీ దర్శకుడు ఇంటర్వెల్, క్లైమాక్స్ తప్పితే మిగతా సినిమా అంతా తేలిగ్గా తీసుకుంటూ వెళ్ళిపోయాడు. నిర్మాణ విలువలు పర్వాలేదనిపిస్తాయి.
ప్లస్ పాయింట్స్
కొన్ని ఎమోషనల్ హై ఇచ్చే సీన్స్
సుహాస్, శరణ్య ప్రదీప్ నటన
మైనస పాయింట్స్
ఊహకు అందిపోయే కథ, కథనం
తేలిపోయిన ప్రేమకథ
ఫైనల్ వర్దిక్ట్: బ్యాండు.. ఇంకా గట్టిగా మొగాల్సింది.