తారాగణం: అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, వెన్నెల కిశోరే, ఈషా, అదితి, తనికెళ్ళ భరణి
నిర్మాణ సంస్థ: గ్రీన్ టీ ప్రొడక్షన్స్
కెమెరామెన్: పీ జీ విందా
సంగీతం: మణిశర్మ
నిర్మాత: కే సి నరసింహారావు
రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
యావరేజ్ యూజర్ రేటింగ్: 3/5
దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ప్రత్యేకత తెలియాలంటే అష్టాచమ్మా చూడాల్సిందే. చిన్ని కథ... తమాషా పాత్రలు వాటి చుట్టూ వినోదం ఇంద్రగంటి ప్రత్యేకత. ఆ తరహా కథలతో ఇంద్రగంటి సినిమా తీసినప్పుడల్లా.. హిట్టు కొట్టాడు. ఇప్పుడూ అంతే! అమీ - తుమీతో అలాంటి ప్రయత్నమే చేశాడు. అవసరాల శ్రీనివాస్, అడవిశేష్, వెన్నెల కిషోర్ నటించిన ఈ చిత్రంపై.. ముందు నుంచీ మంచి అంచనాలే ఉన్నాయి. మరి.. అమీ తుమీ వాటిని అందుకొందా? ఇంద్ర గంటి తన ప్రత్యేకత ఈ సినిమాలోనూ చూపించాడా?? లేదా?? చూద్దాం రండి.
* కథ ఎలా సాగిందంటే...?
ఆనంద్ (అడవి శేష్), దీపిక (ఈషా) ప్రేమికులు. అయితే వీళ్ల ప్రేమకి.. దీపిక తండ్రి జనార్ధన్ (తనికెళ్ల భరణి) అడ్డు పడుతుంటాడు. దీపిక పెళ్లి శ్రీ చిలిపి (వెన్నెలకిషోర్) తో చేయాలన్నది జనార్థన్ పంతం. జనార్థన్ కొడుకు విజయ్ (అవసరాల శ్రీనివాస్) మాయ (అదితి) అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. మాయ ఇంట్లో.. వీళ్ల పెళ్లి కి అడ్డు చెబుతారు. దాంతో మాయ నన్ గా మారాలనుకొంటుంది. దీపిక మాత్రం ఆనంద్ కోసం ఇంట్లోనుంచి పారిపోతుంది. దీపికని పెళ్లి చేసుకోవడం కోసం వైజాగ్ నుంచి చిలిపి హైదరాబాద్ వస్తాడు. అప్పుడు ఏమైంది?? ఈ రెండు ప్రేమకథల మధ్య చిలిపి ఎలా ఇరుక్కొన్నాడు? అనేదే అమీ తుమీ కథ.
* ఎవరెలా చేశారంటే...?
అవసరాల శ్రీనివాస్, అడవిశేష్‌ల ఫొటోలు పోస్టర్లపై కనిపిస్తున్నా... ఈ సినిమాకి రియల్ హీరో మాత్రం వెన్నెల కిషోరే. చిలిపి పాత్ర లేకపోతే, ఆ పాత్రలో వెన్నెల కిషోర్ నటించకపోతే ఈ సినిమా ఉండేదే కాదు. కేవలం ఈ ఒక్క పాత్రే అన్ని పాత్రల్నీ, కథనీ, ఆ కథలోని మైనస్సుల్నీ డామినేట్ చేసింది. ఆ పాత్రలో వెన్నెల కిషోర్ డైలాగులు, బాడీ లాంగ్వేష్, ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ సూపర్. అవసరాల, అడవి శేష్ ఇద్దరూ కాస్త సపోర్ట్ చేశారంతే. భార్గవి (పనిమనిషి కుమారి) పాత్ర కూడా ఎంటర్‌టైన్ చేస్తుంది. తనికెళ్ల భరణి నటన.. కాస్త శ్రుతిమించినట్టు అనిపిస్తుంది. హీరోయిన్లు ఇద్దరిలో ఈషా పాత్రే బాగుంది.
* తెరపై ఎలా తీశారంటే..?
ఇంద్రగంటి రాసిన కథలో గమ్మత్తేం లేదు. కథ చాలా పాతది. ఇంకా చెప్పాలంటే... ఇలాంటి కన్‌ఫ్యూజ్ డ్రామాలు చాలా చూశాం. అయితే.. తన సంభాషణలతో, ఛమక్కుతో మరీ ముఖ్యంగా చిలిపి అనే పాత్రతో ఈ సాధారణమైన కథని ఎంటర్‌టైన్‌మెంట్ తో హాయిగా చూసేలా తెరకెక్కించాడు. సినిమాని ప్రారంభించిన విధానం చాలా నిదానంగా ఉంటుంది. ఫన్ వర్కవుట్ అవుతూ అవుతూ ముందుకు వెళ్తుంది. ఎప్పుడైతే అవసరాల శ్రీనివాస్ చిలిపిగా అడుగుపెట్టాడో.. అక్కడి నుంచి సినిమా పూర్తిగా తన చేతుల్లోకి వెళ్లిపోతుంది. కథ, పాత్రలు, వినోదం.. అన్నీ ఆ పాత్ర చుట్టూనే తిరుగుతాయి. అవసరాల శ్రీనివాస్ ఎప్పుడు కనిపించినా.. థియేటర్లో నవ్వులు వెల్లివిరుస్తాయి. కన్‌ఫ్యూజ్ డ్రామా కూడా రక్తి కట్టడంతో టైమ్ పాస్‌కి ఢోకా ఉండదు. కథలో మలుపులేం ఉండవు. కేవలం పాత్రల ప్రవర్తన కాస్త ఫన్నీగా ఉంటుందంతే. క్లైమాక్స్ యేం జరుగుతుందన్నది అందరూ ఊహించేదే. అయితే... రొటీన్ కథలో వినోదం మిస్ అవ్వకపోవడంలో ఎలాంటి కంప్లైంట్లూ లేకుండా ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకు వస్తాడు.
* సంగీతం
ఈ సినిమాలో పాటలకు స్కోప్ తక్కువ. రెండు పాటలూ సందర్భానికి తగినట్టు వాడుకొన్నారు. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది.
* ఫొటోగ్రఫీ
చిన్న సినిమా... ఆ ఖర్చుని దృష్టిలో పెట్టుకొని, వీలైనంత క్వాలిటీతో ఈ సినిమాని తెరకెక్కించారు.
* సంభాషణలు - దర్శకత్వం
ఈ సినిమాకి మొదటి హీరో వెన్నెల కిషోర్ అయితే.. రెండో హీరో సంభాషణలు. ప్రతీ సీన్‌లోనూ ఒక్క వెరైటీ డైలాగ్ అయినా వినిపిస్తుంది. దర్శకుడిగా కంటే రచయితగానే ఇంద్రగంటికి మార్కులు పడతాయి.
* బలాలు
+ వెన్నెల కిషోర్
+ డైలాగులు
* బలహీనతలు
- కథ
- ఓవరాక్షన్
* ఫైనల్ వర్డిక్ట్:
వెన్నెల కిషోర్ షో!!
రివ్యూ బై శ్రీ