నటీనటులు : టోవినో, అను సితార, సిద్ధికి తదితరులు
దర్శకత్వం : సలీం అహమద్
నిర్మాతలు : సలీం అహమద్
సంగీతం : బిజిబల్
సినిమాటోగ్రఫర్ : మధు అంబట్
ఎడిటర్: విజయ్ శంకర్
రేటింగ్: 2.5/5
సినిమా అన్నది కలల ప్రపంచం. వినోద సాధనం. ఓ సినిమా చూశాక, అది ఫ్లాపో, హిట్టో ఈజీగా చెప్పేయొచ్చు. కానీ.. ఆ సినిమా తీయడానికి వాళ్లు పడిన కష్టం, ఎదుర్కొన్న ఇబ్బందులు చూస్తే.. `అయ్యో..` అనిపిస్తుంది. సినిమా తీయడం ఎంత కష్టమో, సినిమా తీసేవాళ్లకే తెలుస్తుంది. అలా సినిమా కష్టాల్ని కళ్లముందు నిలిపిన సినిమా `అండ్ ద ఆస్కార్ గోస్ టూ`. మలయాళంలో గతేడాది విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా ఇది. ఇప్పుడు.. అదే పేరుతో `ఆహా`లో వచ్చింది. మరి... మలయాళ ప్రేక్షకులకు నచ్చిన ఈ ప్రయత్నం.. తెలుగు ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంటుందా? ఆస్కార్ కోసం ఓ సామాన్యుడు కన్న కల నెరవేరిందా?
* కథ
ఇస్సాక్ (టోవినో థామస్) కి చిన్నప్పటి నుంచీ సినిమాలంటే పిచ్చి. చిన్నప్పటి నుంచీ సినిమాలు చూస్తూ. ఆ డైలాగులే పాఠాలుగా వల్లిస్తూ పెరిగి పెద్దవాడవుతాడు. ఎప్పటికైనా దర్శకుడిగా మారి, ఓ సినిమా తీయాలన్నది తన కల. అది అలాంటిలాంటి సినిమా కాదు, ఆస్కార్ అవార్డు గెలుచుకునే సినిమా తీయాలనుకుంటాడు. అందుకోసం తన ఆస్తులన్నీ అమ్ముకుంటాడు. ఓ మంచి సినిమా తీస్తాడు. మరి ఆ సినిమా ఆస్కార్‌ని గెలుచుకుంటుందా? ఆ ప్రయాణంలో.. తనకు ఎదురైన అనుభవాలేంటి? అన్నదే `అండ్ ద ఆస్కార్ గోస్ టూ` కథ.
* విశ్లేషణ
ఈ సినిమా దర్శకుడి ఊహల్లోంచి పుట్టిన కథ కాదు. తన జీవితంలో ఎదురైన అనుభవాలే. ఈ దర్శకుడు సలీమ్ అహ్మద్... తన తొలి చిత్రం కేరళలో పలు అవార్డులు అందుకుంది. ఆస్కార్‌కూ నామినేట్ అయ్యింది. మన సినిమాల్ని ఆస్కార్ స్థాయిలో తీసుకెళ్లడం, అక్కడ ప్రమోట్ చేయడం, అవార్డు సంపాదించడం సామాన్యమైన విషయం కాదు. అందుకు చాలా తతంగం ఉంటుంది. అవన్నీ పడి వచ్చిన వాడు... సలీమ్. ఆ అనుభవాలే, ఈ సినిమా కథగా మార్చుకున్నాడు. తన సినిమా ఆస్కార్ రేసులో ఉండేందుకు సలీమ్ చేసిన ప్రయత్నాలన్నీ ఈ సినిమాలోని సన్నివేశాలుగా కనిపిస్తాయి.
సినిమా నేపథ్యంలో ఓ సినిమా తీయడం ఎప్పటికీ ఆసక్తి కలిగించే అంశమే. సినీ రంగంలో ఏం జరుగుతుంటుంది? అనేది తెలుసుకోవాలని ప్రతి ప్రేక్షకుడికీ ఉంటుంది. కాకపోతే.. అస్తమానూ సినిమా కష్టాలే చెప్పుకుంటూ పోతే.. భరించడం కష్టమే. ఓ సినిమా తీయడానికి ఓ దర్శకుడు ఎన్ని కష్టాలో పడాలో,పడతాడో చెప్పడానికి తీసిన డాక్యుమెంటరీలా అనిపిస్తుంది ఈ చిత్రం. అందులో చాలా వరకూ.. దర్శకుడి స్వీయ అనుభవాలే కావొచ్చు. కానీ.. వాటిని చూసి, అయ్యో అని ఫీలయ్యేంత డెప్త్ ఆయా సన్నివేశాల్లో కనిపించదు. కొన్నిసార్లు.. మాకెందుకొచ్చిన సినిమా కష్టాల్రా బాబూ.. అనిపిస్తుంటుంది. కాకపోతే.. సినిమా రంగంలోనే ఉంటూ, ఆయా బాధల్ని అనుభవించిన వాళ్లకు మాత్రం తమ జీవితాన్ని కళ్ల ముందు తెచ్చిన ఫీలింగ్ ఇస్తుందీ సినిమా. ఆస్కార్ బరిలో నిలిచిన ఓ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి? అక్కడ లాబియింగ్ లు ఎలా ఉంటాయి? మన సినిమాలు ఆస్కార్‌లకు ఎందుకు దూరంగా ఉన్నాయి? అనే విషయాలు సెకండాఫ్‌లో కనిపిస్తాయి. అయితే ఇవన్నీ అకడమిక్ సబ్జెక్టులా అనిపించి, అంత ఇంట్రస్టింగ్‌గా ఉండవు. కథానాయకుడి జీవితాన్ని సినిమానీ లింకు చేస్తూ చెప్పిన సన్నివేశాలు, సంఘటనలు కాస్త బెటర్‌గా అనిపిస్తాయి. ఎమోషన్ సీన్స్ పండడంతో.. కొన్ని సన్నివేశాలు రక్తి కడతాయి. కానీ.. సినిమాటిక్ ముగింపు మాత్రం అంతగా అతకలేదు.
* నటీనటులు
మలయాళ నటీనటులంతా.. సహజత్వాన్ని ఒడిసి పట్టుకోవడంలో దిట్ట. సలీమ్ నటన ఆకట్టుకుంటుంది. నిక్కీ, అను, సితార.. వీళ్లంతా తమ పరిధి మేర నటించారు.
*సాంకేతికత
దర్శకుడు నిజాయతీగానే రాసుకున్నా.. కథలో మరీ...మెలోడ్రామా ఎక్కువైపోయింది. కష్టాల భారాన్ని ప్రేక్షకుడు మోయడం కష్టమే. ఆస్కార్ అవార్డులకు సంబంధించిన అకడమిక్ ఇన్‌ఫర్మేషన్ మరీ ఎక్కువైపోయింది. ఈ కథని పూర్తిగా సినిమాటిక్ చేసి, చక్కటి స్క్కీన్ ప్లేతో మలిస్తే.. బాగుండేది. కాకపోతే సినిమా వాళ్లకు నచ్చే అంశాలు ఇందులో ఎక్కువగానే ఉన్నాయి. అవన్నీ సగటు ప్రేక్షకులకు భారమైన అంశాలే.
* ప్లస్ పాయింట్స్
సినీ నేపథ్యం
జీవిత అనుభవాలు
సహజమైన నటన
* మైనస్ పాయింట్స్
కష్టాల కడలి
* ఫైనల్ వర్డిక్ట్: సినిమా కష్టాలు