తారాగణం: ఎన్టీఆర్, పూజ, ఈశా, సుప్రియ, జగపతిబాబు, నాగబాబు, సునీల్, నవీన్ చంద్ర, ఈశ్వరి రావు, సితార, శుభలేక సుధాకర్, రావు రమేష్ &తదితరులు
నిర్మాణ సంస్థ: హారిక & హాసిని క్రియేషన్స్
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: PS వినోద్
ఎడిటర్: నవీన్ నూళి
నిర్మాత: S రాధాకృష్ణ
రచన-దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
రేటింగ్: 2.75/5
ఫ్యాక్షన్ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. ఓ విధంగా చెప్పాలంటే చిరంజీవితో సహా, అల్లరి నరేష్ వరకూ ఈ కథల్ని ఓసారి ట్రై చేసినవాళ్లే. ఎన్టీఆర్‌కి మాస్ ఇమేజ్ తెచ్చింది కూడా `ఆది` అనే ఫ్యాక్షన్ కథే. అయితే... ఫ్యాక్షన్ కథలపై మోజు క్రమంగా తగ్గిపోయింది. ఇప్పుడంతా కొత్త తరహా జోనర్లవైపు దృష్టి పెడుతున్నారు.
ఇలాంటి సందర్భంలో త్రివిక్రమ్ ఓ ఫ్యాక్షన్ కథ ఎంచుకున్నాడు. అదే.. `అరవింద సమేత వీర రాఘవ`. ఫ్యాక్షన్ సినిమాల సత్తా ఏమిటో తెలియజేసిన ఎన్టీఆర్‌ని కథానాయకుడిగా ఎంచుకున్నాడు. మరి.. ఈ కాంబినేషన్‌లో ఫ్యాక్షన్ కథ కొత్తగా మారిందా? వీళ్లిద్దరూ ఏం చెప్పాలనుకున్నారు? అందులో ఏ మేరకు విజయవంతమయ్యారు?
* కథ
నారప్ప రెడ్డి (నాగబాబు) తనయుడు వీర రాఘవ రెడ్డి (ఎన్టీఆర్). ఫ్యాక్షన్ గొడవల్లో వీర రాఘవుడు తన తండ్రిని, మావయ్యనీ కోల్పోతాడు. `కత్తి పట్టడం వారసత్వం అయితే ఫర్వాలేదు.. అది శాపం కాకూడదు` అని నాయినమ్మ చెప్పిన మాటలకు వీర రాఘవలో కొత్త ఆలోచనలు రేకెత్తుతాయి. ఈ ఫ్యాక్షనిజం వల్ల కుటుంబాలు నాశనమవుతాయని, తరువాతి తరం కూడా బలవుతుందని గ్రహించిన వీర రాఘవ సీమలో మార్పు తీసుకురావాలనుకుంటాడు.
శత్రువు దూరంగా ఉంటే.. ఈ గొడవలు తగ్గుతాయనిపించి - హైదరాబాద్ వచ్చేస్తాడు. హైదరాబాద్‌లో అరవింద (పూజా) పరిచయం అవుతుంది. ఫ్యాక్షనిజం అరికట్టడంపై ఓ డాక్యుమెంటరీ తీస్తుంటుంది. తనకు కావల్సిన సమాధానాలు అరవింద దగ్గర దొరుకుతాయేమో అని...తనతో పాటు ఉండిపోతాడు. అయితే శత్రువులు వీర రాఘవని వెదుక్కుంటూ హైదరాబాద్ వస్తారు. తన వల్ల అరవింద కుటుంబానికి ముప్పు ఉందని గ్రహిస్తాడు వీర రాఘవ. అప్పుడేం చేశాడు? తన శత్రువుల్ని ఎలా ఎదుర్కున్నాడు..? అనేదే మిగిలిన కథ.
* నటీనటులు
ఎన్టీఆర్ మరోసారి ప్రాణం పెట్టేశాడు. ఎక్కడా తక్కువ చేయలేదు. వీలైనంత వరకూ ఈ కథని, తన పాత్రనీ మోసే ప్రయత్నం చేశాడు. తండ్రి చనిపోయినప్పుడు, విశ్రాంతికి ముందొచ్చే సీన్‌లో, క్లైమాక్స్‌లో ఎన్టీఆర్ విశ్వరూపం చూడొచ్చు. కత్తి పట్టుకుని పరుగెడుతున్నప్పుడు, చొక్కా చిరిగి సిక్స్ ప్యాక్ కనిపించినప్పుడు ఫ్యాన్స్‌కి పూనకాలు వస్తాయి.
పూజా కూడా ఓకే అనిపిస్తుంది. జగపతిబాబుకి మరోసారి మంచి పాత్ర దొరికింది. సునీల్ కూడా మెప్పిస్తాడు. ఈ సినిమాలో ప్రతీ చిన్న పాత్రకూ ప్రాధాన్యం ఉంది. అందరూ బాగా చేశారు. నవీచ్ చంద్రతో సహా.
* విశ్లేషణ
`తనదైన రోజున ఎవడైనా కొడతాడు. అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు.. వాడే మగాడు` అనే డైలాగ్ ఉంది ఈ సినిమాలో. ఈ కథ ఇతివృత్తం కూడా అదే. సీమలో గొడవలు ఆపడానికి కత్తి వదిలిన ఓ ఫ్యాక్షనిస్టు కథ ఇది. దాన్ని తనదైన స్టైల్‌లో చూపించే ప్రయత్నం చేశాడు.
కథ మొదలైన కాసేపటికే ఫ్యాక్షనిజాన్ని ఉగ్ర స్థాయిలో చూపించాడు త్రివిక్రమ్. ఆ సన్నివేశాలన్నీ ఎమోషనల్‌గా సాగాయి. ఇటీవల ఎన్టీఆర్ తన తండ్రిని కల్పోయాడు. `రం రుధిరం` పాట చూస్తున్నప్పుడు ఆవిషయం లీలగా అభిమానుల మనసుల్లో మెదులుతుంది. దాంతో ఆయా సన్నివేశాలకు బాగా కనెక్ట్ అయిపోయారు. కథ హైదరాబాద్‌కి వచ్చాక... కాస్త ప్రశాంతంగా మారుతుంది. అక్కడక్కడ త్రివిక్రమ్ మెరుపులు కనిపిస్తాయి. మరీ ఇదివరకటి త్రివిక్రమ్ సినిమాలా పగలబడి నవ్వుకోలేం గానీ, చిరు మందహాసాలకు కొదవ లేదు.
లాయర్లపై వేసిన కొన్ని సెటైర్లు పేలాయి. శ్రీనివాసరెడ్డి, నరేష్‌లు కాస్తలో కాస్త నవ్వించే ప్రయత్నంచేశారు. ఇంట్రవెల్ ముందొచ్చే ఫైట్ కూడా ఆకట్టుకునేది. సెకండాఫ్ లో జోరు తగ్గింది. దర్శకుడు ఒకే పాయింట్‌పై స్ట్రిక్ అయిపోయాడు. హింసని పాలద్రోలి, శాంతిని నెలకొల్పడం ఎలా.. అనే ప్రయత్నం వైపు నుంచే కథానాయకుడి ప్రయాణం సాగుతుంది. కొన్ని సన్నివేశాలు ఆలోచింపజేసేవిలా ఉంటే, కొన్ని బోర్ కొడతాయి. కొన్ని చోట్ల స్పీచులు ఎక్కువయ్యాయి కూడా.
నవీన్ చంద్రని కన్వెన్స్ చేసే సందర్భంలో వచ్చే ఫైట్, చెప్పిన మాటలు ఆకట్టుకుంటాయి. కథానాయకుడు కత్తి పట్టకుండా ఈ సమస్యని ఎలా సాధిస్తాడా? అనే చోట మళ్లీ త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుంది. తన డైలాగులతో శత్రువులలో మార్పు తీసుకొద్దామనుకున్నాడు. చివరికి కత్తి పట్టక తప్పలేదు. అయితే భారీ యాక్షన్ సన్నివేశం బదులు తీవ్రత తగ్గిస్తూ... కత్తివేటలతో సరిపెట్టుకున్నాడు.
* సాంకేతిక వర్గం
ఆడియోలో పాటల్ని చూసి పెదవి విరిచిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సైతం థియేటర్‌లో ఆ లోపం కనిపించదు. ఇక్కడ మరో పాట ఉంటే బాగుణ్ణు అన్న ఫీలింగ్ రాకుండా చేశాడు. రం రుధిరం, పెనిమిటీ పాటలు ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం, కెమెరా పనితం, మాటలు.. ఇలా అన్నీ బాగున్నాయి. అయితే ఈ ఫ్యాక్షన్ కథలు, రక్తపాతం కుటుంబ ప్రేక్షకులకు ఏమాత్రం ఎక్కుతుంది? అనేది అనుమానమే. ఎన్టీఆర్ స్టామినాని దర్శకుడు పూర్తిగా వాడుకోలేదన్న కామెంట్లు వినిపించినా ఆశ్చర్యం లేదు.
* ప్లస్ పాయింట్స్
+ ఎన్టీఆర్ నటన
+ తొలి 20 నిమిషాలు
+ యాక్షన్ సీన్స్
* మైనస్ పాయింట్స్
- వినోదం మిస్
- నిడివి
* ఫైనల్ వర్డిక్ట్: అరవింద.. ఫ్యాక్షన్‌లో మరో కోణం.
రివ్యూ రాసింది శ్రీ.