'అశ్వ‌ద్ధామ‌' మూవీ రివ్యూ & రేటింగ్!

By iQlikMovies - January 31, 2020 - 13:03 PM IST

మరిన్ని వార్తలు

నటీనటులు : నాగశౌర్య, మెహ్రీన్, ప్రిన్స్, పోసాని కృష్ణ మురళి తదితరులు 
దర్శకత్వం :  రమణ తేజ
నిర్మాత‌లు : ఉషా ముల్పురి
సంగీతం : శ్రీచరన్ పాకాల
సినిమాటోగ్రఫర్ : మనోజ్ రెడ్డి
ఎడిటర్: గ్యారీ బి

 

రేటింగ్‌: 2.5/5

 

ప్రేమ‌క‌థ‌లు చేసి, వాటితో విజయాలు అందుకుని, ల‌వర్ బోయ్‌, చాక్లెట్ బోయ్ అనే ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు నాగ‌శౌర్య‌. అయితే మాస్ హీరోగా, యాక్ష‌న్ హీరోగా ఎద‌గాల‌న్న త‌ప‌న త‌న‌లో ఉంది. అందుకే మ‌ధ్య‌మ‌ధ్య‌లో  `జాదూగాడు` లాంటి క‌థ‌ల్నిఎంచుకుంటున్నాడు. ఆమ‌ధ్య విడుద‌లైన `న‌ర్త‌న‌శాల‌` న‌టుడిగా, నిర్మాత‌గా చాలా దెబ్బ‌కొట్టింది. అందుకే ఈసారి జాగ్ర‌త్త ప‌డిపోయి, ఇప్ప‌టి జ‌న‌రేష‌న్‌కి న‌చ్చే క‌థే చేయాల‌నుకున్నాడు. అందుకే `అశ్వద్ధామ‌` లాంటి క‌థ‌తో వ‌చ్చాడు. త‌న స్నేహితుడు ర‌మ‌ణ తేజ‌ని ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేశాడు. మ‌రి.. ఈ ప్ర‌య‌త్నం ఎలా సాగింది?  అశ్వ‌ద్ధామ‌తో నాగ‌శౌర్య ఏం చెప్పాల‌నుకున్నాడు?

 

*క‌థ

 

గ‌ణ (అశ్వ‌ద్ధామ‌)కి త‌న చెల్లాయంటే చాలా ఇష్టం. చెల్లికి పెళ్లి కుదిరింద‌న్న ఆనందంలో ఉన్న గ‌ణ‌కి ఓ చేదు నిజం తెలుస్తుంది. ఆమె గ‌ర్భ‌వ‌తి అని అర్థం అవుతుంది. అయితే ఆ గ‌ర్భం ఎలా వ‌చ్చింద‌న్న సంగ‌తి ఆమెకి కూడా తెలీదు. ఇలాంటి కేసులు విశాఖ‌ప‌ట్నంలో చాలా జ‌రుగుతున్న విష‌యం గ‌ణ దృష్టికి వ‌స్తుంది. దాంతో పాటు చాలామంది అమ్మాయిలు క‌నిపించ‌కుండా పోతుంటారు. అస‌లు దీనంత‌టికీ కార‌ణం ఎవ‌రు?  ఈ ముఠాని గ‌ణ ఎలా ప‌ట్టుకున్నాడు?  అనేదే మిగిలిన క‌థ‌.

 

*విశ్లేష‌ణ‌

 

రాక్ష‌సుడులాంటి క‌థ ఇది. అక్క‌డా, ఇక్క‌డా అమ్మాయిల స‌మ‌స్యే. పైగా రెండు చోట్లా ఓ శాడిస్టు విల‌న్ ఉంటాడు. ఈ రెండు పాయింట్ల‌నీ ప‌క్క‌న పెడితే... మిగిలిన క‌థ‌, క‌థ‌నాలు, ప్ర‌తినాయ‌కుడి నేప‌థ్యం ఇవ‌న్నీ కొత్తగానే అనిపిస్తాయి. క‌థ‌ని ఓ హై టెన్ష‌న్ మూడ్‌లో మొద‌టెట్టిన ద‌ర్శ‌కుడు.. ఆ సీరియెస్‌నెస్‌ని వీలైనంత వ‌ర‌కూ కొన‌సాగించే ప్ర‌య‌త్నం చేశాడు. ప‌క్క‌దారులు ప‌ట్ట‌లేదు. ఓ స‌మ‌స్య‌ని నిజాయ‌తీగా చూపించే ప్ర‌య‌త్నం చేశారు. అమ్మాయిలు మాయం అవ్వ‌డానికి, వాళ్ల‌కు తెలియ‌కుండానే గ‌ర్భ‌వ‌తులు అయిపోవ‌డానికీ గ‌ల కార‌ణాల్ని అన్వేషించే సంద‌ర్భంలో వ‌చ్చే స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రంగా సాగుతాయి. అన్నా చెల్లెల సెంటిమెంట్ ఓవైపు, హంత‌కుడి అన్వేష‌ణ మ‌రోవైపు ఇవి రెండూ బాలెన్స్ చేయ‌గ‌లిగాడు.


ద్వితీయార్థంలో గానీ విల‌న్ పాత్ర ఎంట్రీ ఇవ్వ‌దు. ఆ పాత్ర‌ని వీలైనంత శాడిస్టిక్‌గా చూపించే ప్ర‌య‌త్నం చేశారు. కొన్ని సార్లు ఒళ్లు గ‌గుర్పాటుకి గుర‌వుతుంది కూడా. హింస పాళ్లు కూడా ఎక్కువే అయ్యింది. తొలి భాగంతో పోలిస్తే.. ద్వితీయార్థం ఆస‌క్తిగా ఉన్నా, ఈ శాడిజం  చాలామందికి ఎక్క‌క‌పోవొచ్చు. హీరోకి దారుల‌న్నీ మూసుకుపోవ‌డం, విల‌న్ ఎవ‌రో తెలియ‌క‌పోవ‌డం.. మ‌ళ్లీ చిన్న చిన్న క్లూల‌తో విల‌న్‌ని ప‌ట్టుకోవ‌డం.. ఇవ‌న్నీ థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. అయితే... ముందే చెప్పిన‌ట్టు ఈ క‌థంతా ఒక జోన‌ర్‌కే స్ట్రిక్ అయ్యింది. థ్రిల్ల‌ర్ సినిమాలు చూసేవాళ్ల‌కు మాత్రం న‌చ్చుతుంది. కుటుంబ ప్రేక్ష‌కులంతా క‌లిసి చూసేలా మాత్రం సినిమా లేదు. అది ఈ క‌థ లోపం కాదు. దాన్ని అలానే తీయాలి. అలానే తీశారు కూడా..

 

*న‌టీన‌టులు


ఈ త‌ర‌హా సినిమా చేయ‌డం నాగ‌శౌర్య‌కి ఇదే తొలిసారి. గ‌ణ పాత్ర‌కు త‌న‌వంతు న్యాయం చేశాడు. త‌న మేకొవ‌ర్ బాగుంది. చెల్లెలు కోసం త‌పించే ఓ అన్న‌గా చ‌క్క‌టి న‌ట‌న ప్ర‌ద‌ర్శించాడు. నాగ‌శౌర్య త‌ర‌వాత ఎక్కువ మార్కులు విల‌న్ కే ప‌డ‌తాయి. త‌న న‌ట‌న‌, డ‌బ్బింగ్ రెండూ గాంభీర్యంగా ఉన్నాయి. చూపుల‌తో, మాట‌ల‌తో భ‌య‌పెట్టాడు. మెహ‌రీన్ పాత్ర‌కున్న ప్రాధాన్యం చాలా త‌క్కువ‌. అయినా ఇలాంటి సినిమాల్లోహీరోయిన్ పాత్ర‌ల‌కు అంత స్కోప్ ఉండ‌దు కూడా. మిగిలిన‌వాళ్లంతా ఎవ‌రి ప‌రిధిలో వాళ్లు చ‌క్క‌గా న‌టించారు.

 

*సాంకేతిక‌త‌


పాట‌ల‌కు ఈ సినిమాలో స్కోప్ లేదు. కానీ ఓ మెలోడీ ఆక‌ట్టుకుంటుంది. జిబ్రాన్ ఇచ్చిన నేప‌థ్య సంగీతం స‌న్నివేశాల‌కు ప్రాణం పోసింది. మాట‌లు ఆలోచింప‌జేసేలా ఉన్నాయి. కెమెరా ప‌నిత‌నం, ఎడిట‌ర్ నైపుణ్యం రెండూ క‌లిసొచ్చాయి. ఈ సినిమాని ఇంకాస్త ఇంట్రెస్టింగ్‌గా, గ్రిప్పింగ్‌గా చెప్పొచ్చు. అలా చేస్తే రాక్ష‌సుడు, ఖైదీ త‌ర‌హా సినిమాగా నిలిచిపోయేది.

 

*ప్ల‌స్ పాయింట్స్‌

క‌థా నేప‌థ్యం
నాగ‌శౌర్య‌
విల‌న్‌

 

*మైన‌స్ పాయింట్స్‌

హింస‌
శాడిజం
 

*ఫైన‌ల్ వర్డిక్ట్‌: ప్ర‌య‌త్నం బాగుంది కానీ...


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS