తారాగణం: ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా, నాజర్, రమ్య కృష్ణన్, సత్యరాజ్
సంగీతం: ఎం ఎం కీరవాణి
కెమెరామెన్: సెంథిల్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
కథ: కెవీ విజయేంద్రప్రసాద్
నిర్మాణ సంస్థ: ఆర్కా మీడియా వర్క్స్
నిర్మాతలు: శోభు యార్లగడ్డ & ప్రసాద్ దేవినేని
కథనం & దర్శకత్వం: ఎస్ ఎస్ రాజమౌళి
తెలుగు సినిమా దశనీ, దిశనీ మార్చేసిన ఘనత బాహుబలికే దక్కుతుంది. బాహుబలి కి ముందు తెలుగు సినిమాది ఒక లెక్క... వచ్చిన తరవాత మరో లెక్క. వంద కోట్లు తెచ్చుకోవడం ఓ అద్భుతం అనుకొనే చోట.. ఆరొందల కోట్లు గుమ్మరించాడు బాహుబలి. ఇంతకంటే బాహుబలి స్టామినాని ఎలా కొలవగలం?? బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న కోసం, బాహుబలి ముగింపు కోసం రెండేళ్ల పాటు జనం ఆసక్తిగా ఎదురుచూశారు. అందుకే బాహుబలి 2 పై అంచనాలు పెరిగిపోయాయి. బాహుబలి 1 రికార్డులు బద్దలు కొట్టగలిగే సత్తా బాహుబలి 2కే ఉందని చిత్ర పరిశ్రమ యావత్తూ నమ్ముతోంది. ఇన్ని అంచనాల మధ్య 'బాహుబలి 2' ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి.. రాజమౌళి మళ్లీ మ్యాజిక్ చేశాడా? నిజంగానే తెలుగు సినిమాని వెయ్యి కోట్లకు తీసుకెళ్లగలిగే సత్తా బాహుబలి 2కి ఉందా?
* కథ ఎలా సాగిందంటే..?
మాహీష్మతీ రాజ్యానికి బాహుబలి (ప్రభాస్)ని రాజుగా ప్రకటిస్తుంది శివగామి. పట్టాభిషేకానికి ముందు కట్టప్పతో కలసి దేశాటనకు బయల్దేరతాడు బాహుబలి. మధ్యలో కుంతల దేశంలో ఆగినప్పుడు.. అక్కడ ఆ దేశ యువరాణి దేవసేన (అనుష్క) కనిపిస్తుంది. దేవసేన శక్తి సామర్థ్యాలు, అందచందాలు చూసి ఆకర్షితుడవుతాడు బాహుబలి. అయితే తాను మాహీష్మతీ రాజ్యానికి కాబోయే యువరాజు అని చెప్పకుండా... ఓ అమాయకుడిగా నటిస్తూ దేవసేనకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. కుంతల దేశానికి శత్రు దేశం నుంచి అనుకోని ప్రమాదం ఎదురవుతుంది. ఆ ఆపద నుండి బాహుబలినే రక్షిస్తాడు. దాంతో బాహుబలి ధీరుడన్న విషయం దేవసేనకు అర్థం అవుతుంది. ఈలోగా మాషీష్మతీ రాజ్యం నుంచి బాహుబలికి శివగామి ఓ సందేశం పంపుతుంది. దేవసేనని బంధించి తీసుకురమ్మని..! అప్పుడు బాహుబలి ఏం చేశాడు? తాను ప్రేమించిన అమ్మాయిపై యుద్ధం చేశాడా, అమ్మ మాట ధిక్కరించాడా? అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాల్సివచ్చింది? అనేదే బాహుబలి 2 కథ.
* ఎవరెలా చేశారంటే...?
ప్రభాస్ ఈ సినిమాకి ప్రాణం. బాహుబలి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. రాజసం కురిపించాడు. రౌద్రం పండించాడు. అన్ని కోణాల్లోనూ ప్రభాస్‌కి ఇది బెస్ట్ ఫిల్మ్.
రానా మరోసారి ఆకట్టుకొన్నాడు. భళ్లాల దేవ పాత్ర కాస్త తగ్గినట్టు అనిపించింది. కానీ కనిపించిన ప్రతీ సీన్‌లోనూ రాణించాడు రానా.
బిజ్జలదేవగా నాజర్‌కి పూర్తి మార్కులు పడిపోతాయి. కన్న కొడుకుకి రాజ్యాధికారం అప్పగించాలన్న ఆశతో కుట్రలు పన్నిన కపట తెలివితేటల పాత్ర అది. తొలి భాగంతో పోలిస్తే.. పార్ట్ 2లోనే ఆ పాత్రకు ప్రాధాన్యం పెరిగింది.
అనుష్క పాత్ర కూడా అంతే. ఫస్టాఫ్‌లో మరీ చిన్నదైపోయిందనుకోంటే.. దానికి వడ్డీతో పాటు వసూలు చేసింది.
తమన్నా ఉందా, లేదా? అన్నట్టు ఉందంతే. తనకి ఒక్క డైలాగ్ కూడా లేకపోవడం విశేషం.
ఇక కట్టప్పగా సత్యరాజ్ మరోసారి రెచ్చిపోయాడు. సుబ్బరాజుతో కలసి ఈసారి కామెడీ కూడా చేశాడు. సుబ్బరాజు పాత్రని ముందు వినోదం కోసమే వాడుకొన్నా, ఆ పాత్రనీ అర్థవంతంగా ముగించారు.
శివగామిగా రమ్యకృష్ణన్ అభినయం అద్బుతం అని వేరే చెప్పకర్లేదు
* తెరపైకి ఎలా తీసుకొచ్చారంటే..?
బాహుబలి 2 కథ ఎలా సాగుతుందన్న విషయంలో చాలా రోజుల నుంచి చర్చ నడుస్తూనే ఉంది. బాహుబలి 2 కథ, రాజమౌళి ఇచ్చిన ముగింపు ఓ వర్గం ప్రేక్షకులు ముందే ఊహించారు. ఆ లెక్కన కథలో గొప్ప మలుపులేం లేవు. కానీ ఆ కథని నడిపించిన విధానం, తెరపై ఆవిష్కరించిన పద్ధతి.. ఇవన్నీ మరోసారి రాజమౌళిలోని మాయాజాలాన్ని బయటకు తీసుకొచ్చాయి. ప్రతీ సన్నివేశాన్నీ ఓ పెయింటింగ్‌లా తీర్చిదిద్దాడు జక్కన్న. విజువల్‌గా బాహుబలి 1 కంటే గ్రాండియర్‌గా పార్ట్ 2ని తీసుకొచ్చాడు. దాంతో ఒళ్లంతా కళ్లు చేసుకొని చూడాల్సివస్తుంది. తొలి భాగం కుంతల దేశం నేపథ్యంలో నడుస్తుంది. సుబ్బరాజు పాత్రని అడ్డు పెట్టుకొని కొంత కామెడీ చేయడానికి ట్రై చేశాడు. అది కాస్తంత వర్కవుట్ అయ్యిందంతే. కుంతల దేశంలో యుద్దం, విశ్రాంతి ఘట్టం.. `బాహుబలి 2` స్థాయిని పెంచాయి. శివగామికి బాహుబలి దూరం అవ్వడం, నమ్మిన కట్టప్పతోనే బాహుబలిని చంపించడం.. ఇవన్నీ ఎమోషనల్‌గా వర్కవుట్ అయిన సన్నివేశాలు. రాజదర్బార్‌లో బాహుబలి సైన్యాధిపతి తల నరికిన దృశ్యం.. సూపర్బ్‌గా వచ్చింది. ఇలాంటి రోమాంఛిత సన్నివేశాలు ఈ సినిమాలో చాలా కనిపిస్తాయి. బాహుబలి ని కట్టప్ప ఎందుకు చంపాడు? ఎవరి కోసం అనేది అందరూ ఊహించినదే. దాన్ని సైతం... ఆకట్టుకొనేలా తీర్చిదిద్దాడు రాజమౌళి. పతాక సన్నివేశాలన్నీ యుద్దంతోనే నింపేశాడు. అవేం కొత్తగా అనిపించవు. కాకపోతే.. విజువల్ పరంగా చూస్తే పూర్తి మార్కులు పడిపోతాయి. మొత్తానికి ప్రేక్షకుడు బాహుబలి 2 లో ఏం చూడాలని థియేటర్‌కి వెళ్తాడో అవన్నీ సమపాళ్లలో మేళవించి అందివ్వగలిగాడు.
విజువల్ పరంగా వంకలు పెట్డడానికి ఏం లేదు. దీన్నో విజువల్ వండర్‌గా తీర్చిదిద్దారు సాంకేతిక నిపుణులు. అన్ని విభాగాల్లోనూ అత్యున్నత ప్రతిభ కనిపించింది. రాజమౌళికి మరోసారి జై కొట్టాల్సిందే. ఈ సినిమాకి తను పడిన కష్టం, చిందించిన శ్వేదం.. తప్పకుండా గొప్ప ఫలితాల్ని తీసుకొస్తాయి. తెరపై కనిపించే బాహుబలి ప్రభాస్ అయితే.. తెర వెనుక కచ్చితంగా రాజమౌళినే.
* ప్లస్ పాయింట్స్
+ పాత్రలు.. వాళ్ల నటన
+ ఎమోషన్ సీన్స్
+ విజువల్ వండర్
* మైనస్ పాయింట్స్
- నిడివి
- సాగదీసిన యుద్దం
* ఫైనల్ వర్డిక్ట్
బాహుబలి.. మళ్లీ కొట్టేశాడు.. డౌటే లేదు
యూజర్ రేటింగ్: 3.75/5
రివ్యూ బై: శ్రీ