చిత్రం: బచ్చల మల్లి
దర్శకత్వం: సుబ్బు మంగాదేవి
కథ - రచన: సుబ్బు మంగాదేవి
నటీనటులు: అల్లరి నరేష్, అమృతా అయ్యర్, అంకిత్ కొయ్య, రావు రమేష్, సాయికుమార్, హరితేజ , రోహిణి, ధనరాజ్, హర్ష చెముడు తదితరులు
నిర్మాతలు: రాజేష్ దండా, బాలాజీ గుత్తా
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం. నాథన్
ఎడిటర్: ఛోటా కె. ప్రసాద్
బ్యానర్: హాస్య మూవీస్
విడుదల తేదీ: 20 డిసెంబరు 2024
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.25/5
ఇంగ్లీష్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అల్లరి నరేష్ మొదట కామెడీ సినిమాలు చేసి అల్లరోడిగా పేరు తెచ్చుకుని ఇప్పుడు రూటు మార్చాడు. సీరియస్ కథలు పై ద్రుష్టి పెట్టి నాంది సినిమాతో శ్రీకారం చుట్టాడు. ఈ సినిమాతో పరవాలేదనిపించు కున్నాడు. నెక్స్ట్ వచ్చిన సినిమాలన్నీ అదే జోనర్ లోట్రై చేస్తున్నాడు. కానీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతున్నాడు. గమ్యం సినిమాలో నరేష్ చేసిన గాలి శ్రీను లాంటి పాత్రలో కనిపిస్తే చూడాలని ఫాన్స్ ఆశ పడుతున్నారు. బచ్చలమల్లి మూవీ తనకి గాలి శ్రీను అంతటి గుర్తింపు తెస్తుంది అని ఆశగా ఈ వారం థియేటర్స్ లో సందడి చేసేందుకు వచ్చాడు అల్లరి నరేష్. బచ్చలమల్లి గా నరేష్ ప్రేక్షకుల్ని మెప్పించాడా? లేదా? అల్లరి నరేష్ కి యాక్షన్, అండ్ డ్రామా జోనర్ కలిసి వచ్చిందో లేదో బచ్చలమల్లి రివ్యూలో చూద్దాం.
కథ:
బచ్చలమల్లి (అల్లరి నరేశ్) చిన్నప్పటి నుంచీ చాలా తెలివైనవాడు. తండ్రి గర్వపడేలా 10th మంచి మార్కులతో పాస్ అవుతాడు. తండ్రికి మల్లి అన్నా మల్లికి తండ్రి అన్నా చాలా ఇష్టం. అనూహ్యంగా తల్లి మరణం, తండ్రి వేరే ఆమెని పెళ్లి చేసుకోవటంతో తండ్రిపై కోపం, పగ ఎక్కువ అవుతాయి. చిన్న వయసులోనే తనని పట్టించుకోకుండా తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడని కోపంతో చదువు మాని చెడు వ్యసనాలకు బానిస అవుతాడు. తాగుడు, సిగరెట్స్ లేని అలవాటు అంటూ ఉండదు. చదువు మాని ట్రాక్టర్ నడుపుతుంటాడు. తాగి ఊరిలో గొడవల్లో తలదూర్చి మూర్ఖుడిలా తయారవుతాడు. ఒకరోజు మల్లి జీవితంలోకి కావేరి (అమృత అయ్యర్) వస్తుంది. మల్లి కావేరిని ఇష్టపడతాడు. కావేరి వచ్చాక మల్లి లైఫ్ ఎలా మారింది? మల్లి మూర్ఖత్వం తగ్గిందా పెరిగిందా? తండ్రిని మల్లి క్షమించ గలిగాడా? చివరికి తన మూర్ఖత్వాన్ని, వ్యసనాల్ని వదిలి కావేరిని పెళ్లి చేసుకున్నాడా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
అసలీ కథ ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కావటం లేదు. హీరో పాత్రని తాగుబోతు, తిరుగుబోతుగా చూపిస్తూ అతి మూర్ఖుడిగా చూపించటంతో ఏం మెసేజ్ ఇచ్చాడు. హీరోతో ఎమోషనల్ గా ప్రేక్షకుడు కనక్ట్ కాలేడు. చాలా సందర్భాల్లో హీరో పాత్రపై ప్రేక్షకుడికి ఏవగింపు కలుగుతుంది. ఆ పాత్రకు అంత అనవసరమైన కోపం, మూర్ఖత్వం అవసరమా అనిపిస్తుంది. అప్పటివరకు ప్రాణంగా ఉన్న తండ్రి కొడుకులు, తల్లి చనిపోయి బాధలో ఉన్న కొడుకుని వదిలి వేరే లైఫ్ చూసుకోవటం ఎవరికైనా బాధే. కానీ ఇంత మూర్ఖంగా తయారయ్యేలా చూపించాలా? ఈ హీరో పాత్రని చాలా మంది ఓన్ చేసుకుంటే ఎన్ని అనర్థాలు జరుగుతాయి. ఏ సినిమాకి అయినా హీరో, హీరో పాత్ర ఆకర్షణ కానీ ఈ మూవీలో హీరో పాత్రలో హీరోయిజం లేదు. సినిమాలో ఎక్కువ భాగం తాగడం, ఎవడ్ని పడితే వాడ్ని చిదగ్గోట్టడం ఇదే తంతు. మల్లి ఇంట్రడక్షన్ సీన్ అలాంటి సీన్ తోనే మొదలవుతుంది. బచ్చలమిల్లి యాక్షన్ డ్రామాగా మలచాలి అనుకున్నారు అందుకు తగ్గట్టు అవసరమున్నా లేకపోయినా ఫైట్స్ పెట్టేసారు. కథేమీ లేదు. ప్రేక్షకుడ్ని ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఏమి లేవు. సినిమా అంత మూర్ఖంగా సాగిన మల్లి పాత్ర చివర్లో తల్లి చెప్పిన ఒక్క మాటతో మార్పు వచ్చేయటం వింతగా ఉంది. ఇదేదో మొదట్లో చేస్తే అసలు ఇంత కథ ఉండకపోను అనిపిస్తుంది.
అసలు ఏ క్వాలిటీ లేని మల్లిని కావ్య ఎందుకు ప్రేమించింది. అసలు ఏం చూసి ఇష్టపడింది అన్న దానికి రీజన్ లేదు. పైగా అత్యంత మూర్ఖుడిలా ఉన్న మల్లి కావేరికోసం చిటికెలో అన్ని వ్యసనాలు వదిలేయటం, ఆమె తండ్రిని వదిలి రానని అనగానే మళ్లీ అన్నీ మొదలుపెట్టడం ఎబ్బెట్టుగా ఉన్నాయి. చివరికి కావేరి తండ్రి మల్లితో పెళ్ళికి ఒప్పుకోవటం కూడా సినిమాటిక్ గానే ఉంటుంది. మల్లి జీవితంలో జరిగిన ఓ మూడు సంఘటనల్ని తీసుకుని ఈ స్టోరీని తీశామని చెప్పిన దర్శకుడు ఆ సీన్స్ ని కరక్టుగా ఎలివేట్ చేయలేకపోయాడు. ఆ సీన్స్ ఇంతకు ముందు సినిమాల్లో చూసినట్టే ఉన్నాయి తప్ప కొత్తగా ఏం లేవు. ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ కథ కూడా ఇదే నేపథ్యంలో ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందన్న ఆసక్తి ప్రేక్షకుడికి కలగదు. ఇంకొంచెం ఎమోషనల్ గా కొత్తగా చెప్పి ఉంటే బాగుండేది. కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ ని సీరియస్ పాత్రలో ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. ఇదే విషయం ముందు వచ్చిన సినిమాల ద్వారా ప్రూవ్ అయ్యింది. నరేష్ సీరియస్ పాత్రకోసం కష్టపడటమే కానీ ఫలితం దక్కటం లేదు.
నటీ నటులు:
తాను కేవలం కామెడీ మాత్రమే కాదు యాక్షన్ సినిమాలు కూడా చేయగలను అని బచ్చలమల్లి తో మరొకసారి నిరూపించుకున్నాడు అల్లరి నరేష్. నరేష్ మల్లి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసాడు. ఇన్నాళ్లు మనం చూసిన నరేష్ వేరు, ఇప్పడు చూస్తున్నది వేరు అనేలా ఉంది యాక్టింగ్. సినిమా వరకు పాత్ర తీరు తెన్నులని వదిలేస్తే, నటన పరంగా నరేష్ అద్భుతంగా నటించాడు. కోపం, ఆవేశం, అన్నీ పీక్స్ లో ఉన్నాయి. సినిమా ఫలితం ఎలా ఉన్నా నటుడిగా నరేష్ బచ్చలమల్లి పాత్రకి న్యాయం చేసాడు. కావేరి పాత్రలో అమృతా అయ్యర్ అమాయకంగా, ఆకట్టుకునే విధంగా ఉంది. హనుమాన్ మూవీ తరవాత తెలుగులో అమృత నటించిన సినిమా ఇదే. గ్రామీణ నేపథ్యానికి అమృత ఆహార్యం, నటన సరిపోయింది. రావు రమేశ్ పాత్ర కీలకం. పెళ్లి చూపుల సీన్ లో అల్లరి నరేశ్‌కీ, రావు రమేష్‌కీ మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ లోకూడా రావు రమేష్ నటన బాగుంది. కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ విలనిజం కొత్తగా ఉంది. రోహిణి, బలగం జయరామ్, హరితేజ, ప్రవీణ్, వైవా హర్ష వారి వారి పాత్రల పరిధి మేరకు నటించారు.
టెక్నికల్:
దర్శకుడు ఎదో చేద్దామని ఇంకేదో చేసాడు. హీరోలో ఉన్న మూర్హత్వమే అతనికి ప్రత్యర్థి అన్న కాన్సెప్ట్ బాగానే ఉంది. మిగతాదంతా ఏదో ఒక సినిమాని గుర్తు చేస్తూనే ఉన్నాడు. మొతం రా అండ్ రస్టిక్ గా మలిచాడు తప్ప కొత్తగా ఏం చెప్పలేకపోయాడు. కొన్ని సీన్స్‌లో, స్టోరీ బ్యాక్‌డ్రాప్‌ను ఆవిష్కరించడంలోనూ తనదైన ముద్ర వేశాడు దర్శకుడు. ముఖ్యంగా కథను 1985, 95, 2005 అని మూడు భాగాలుగా రాసుకున్న స్క్రీన్ ప్లే బాగుంది. బచ్చలమల్లి మూవీకి ప్రధాన బలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. విశాల్ చంద్రశేఖర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ద్వారా కొంతవరకు మ్యానేజ్ చేసాడు. పాటలు విషయానికి వచ్చేసరికి సౌండ్ పొల్యూషన్ తో లిరిక్స్ సెన్స్ దెబ్బతింది. ఒకటి రెండు పాటలు పర్వాలేదనిపించాయి. మొత్తానికి పీరియాడిక్ మూవీ ఫీలింగ్ తీసుకువచ్చారు. విజువల్స్, ఆర్ట్ వర్క్ అన్నీ న్యాచురల్ గా ఉన్నాయి. రిచర్డ్ కెమెరా వర్క్ బాగుంది. అచ్చమైన పల్లెటూరి నేపథ్యాన్ని చూడ చక్కగా రూపొందించారు. ఆర్ట్, ఎడిటింగ్ విభాగాల కష్టం, ఆ కష్టానికి తగిన ప్రతిఫలం తెరపై కనిపిస్తోంది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
అల్లరి నరేష్
సంగీతం
మైనస్ పాయింట్స్
కథ, కథనం
హద్దులు లేని ఫైట్స్
సెకండ్ హాఫ్
ఫైనల్ వర్దిక్ట్: ఆకట్టుకోలేని 'బచ్చలమల్లి'