తారాగణం: ధనుంజయ, ఇర్రా మోర్, విజయ్ & తదితరులు
సంగీతం: రవి శంకర్
ఎడిటర్: అన్వర్ అలీ
పాటలు: సిరాశ్రీ
సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి
నిర్మాణ సంస్థ: అభిషేక్ పిక్చర్స్
నిర్మాతలు: అభిషేక్ నామా, భాస్కర్ రషి
సమర్పణ: రామ్ గోపాల్ వర్మ
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: సిద్ధార్థ తాతోలు
రేటింగ్: 3.25/5
రాంగోపాల్ వర్మనే కాదు, ఆయన శిష్యులు సినిమాలు తీస్తున్నా... ఆసక్తిగా ఓ లుక్కేస్తుంది చిత్రసీమ. ఎందుకంటే... వాళ్ల నుంచి ఎప్పుడు ఎలాంటి అద్భుతాలు వస్తాయో చెప్పలేం. `ఇదేం సినిమా రా బాబు` అనుకునేలా ఓ చెత్త సినిమా తీయ్యగలరు. `సినిమా అంటే ఇదేరా బాబు` అనుకునేలా ఓ గొప్ప సినిమా కూడా తీయగలరు. అయితే.. టైటిల్, ట్రైలర్ దగ్గర నుంచే అటెన్షన్ తెచ్చుకున్న సినిమాలు ఈమధ్య చాలా తక్కువనే చెప్పాలి. అలాంటి వాటిలో `భైరవ గీత` ఒకటి. సినిమా పేరు, ట్రైలర్లలో కనిపించే `రా` లుక్.. ఇవన్నీ `భైరవ గీత`పై ఆసక్తి పెరిగేలా చేశాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? వర్మ స్టైల్‌లో సాగిందా? లేదంటే.. వర్మ పేరుని చెడగొట్టేలా ఉందా? వర్మ శిష్యుడు, కొత్త దర్శకుడు సిద్దార్థ్ `భైరవ గీత`ని ఎలా రాశాడు, ఎలా తీశాడు?
కథ
1991 నాటి కథ ఇది. రాయలసీమలో జరిగిన యదార్థ సంఘటన. సుబ్బారెడ్డికి నమ్మిన బంటు భైరవ. తండ్రిలానే.. సుబ్బారెడ్డి కోసం ప్రాణాలు తీయడానికైనా ఇవ్వడానికైనా సిద్ధం అనే రకం. సుబ్బారెడ్డి మాత్రం తన అనుచరుల్ని కుక్కకంటే హీనంగా చూస్తుంటాడు. వాళ్లు బతికేతే... తమ ప్రాణాల్ని కాపాడడానికి అనుకునే వ్యక్తిత్వం సుబ్బారెడ్డిది. వియ్యానికైనా, కయ్యానికైనా తనతో సమ ఉజ్జీని చూసుకుంటాడు. అలా.. కట్టారెడ్డికి తన కూతురైన గీతని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. గీతకు తన తండ్రి పద్ధతులు బొత్తిగా నచ్చవు. మొరటుగా ఉండే.. కట్టారెడ్డిపైనా మనసు పోదు. శత్రువుల నుంచి తనని కాపాడిన భైరవని ఇష్టపడుతుంది. అదే మాట తండ్రితో చెబుతుంది. దాంతో సుబ్బారెడ్డి తల్లడిల్లిపోతాడు. తన కూతురి మనసులోని ప్రేమని చంపేయాలంటే.. భైరవని ఈ భూమ్మీద లేకుండా చేయాలని భావిస్తాడు. భైరవని చంపేయమని తన అనుచరుల్ని ఉసుగొల్పుతాడు. మరి భైరవ ఏం చేశాడు? సుబ్బారెడ్డిని ఎదిరించాడా? తన ప్రేమని కాపాడుకున్నాడా? అనేది వెండి తెరపై చూడాలి.
నటీనటుల పనితీరు..
మిస్ మ్యాచింగ్ అన్నది వర్మ చరిత్రలోనే లేదు. ఏ పాత్రకి ఎవరిని తీసుకోవాలో తనకు బాగా తెలుసు. ఈ సినిమాలోని పాత్రల్ని, పాత్ర ధారుల్ని చూస్తుంటే... సిద్దార్థ్ వర్మని ఈ విషయంలోనూ బాగా ఫాలో అయినట్టు కనిపిస్తోంది. తెరపై కనిపించే ప్రతీ చిన్న పాత్రనీ చాలా బాగా డిజైన్ చేసుకుంటూ, ఆ పాత్రకి తగిన వాళ్లనే ఎంచుకున్నాడు దర్శకుడు. భైరవగా ధనుంజయ్ నటన ఆకట్టుకుంటుంది. అత్యంత సహజంగా కనిపించాడు ధనుంజయ్. కట్టారెడ్డి పాత్ర లో క్రూరత్వం అదే స్థాయిలో పండింది. సుబ్బారెడ్డిగా కనిపించిన నటుడు కూడా తెలుగు తెరకు కొత్తే. కానీ ఆ పాత్ర కూడా గుర్తిండిపోతుంది. కథానాయిక విషయానికొస్తే.. తన నటనకు వంక పెట్టలేం గానీ, ఇంకాస్త అందమైన అమ్మాయిని తీసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది.
విశ్లేషణ...
ఇదో యదార్థ సంఘటన అని - ఈ సినిమా టైటిల్ కార్డు సమయంలోనే వర్మ చెప్పేశాడు. ఈ కథేంటో కూడా వర్మ ముందు మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి.. కథలో మలుపులు, కొత్తదనం కోసం ఆశించకూడదు. ఈ కథని దర్శకుడు ఎంత ప్రభావవంతంగా తీశాడన్నదే చూడాలి. ఆ విషయంలో సిద్దార్థ్‌కి నూటికి నూరు మార్కులు పడిపోతాయి. కథని ప్రారంభించిన విధానం, పాత్రల పరిచయం, కథలోని మూడ్‌ని ఎలివేట్ చేసిన పద్ధతి, ఫ్రేమింగులు.. ఇలా ఎలా చూసుకున్నా... గురువు రాంగోపాల్ వర్మ గుర్తొచ్చేస్తాడు. అలా తీశాడు సిద్దార్థ్. ప్రతీ ఫ్రేమూ చాలా సహజంగా కనిపిస్తుంది. ఎంచుకున్న పాత్రధారుల్ని కూడా అలానే పట్టుకొచ్చాడు. నిజంగానే... ఈ సినిమాని 1991లోనే తీశారా? ఇందులో నిజంగానే ఫ్యాక్షనిస్టులు నటించారా? అన్నంత సహజంగా ఉన్నాయి ఆ సన్నివేశాలు.
తెలిసిన కథ చెబుతున్నప్పుడు.. ఎమోషన్‌ని కరెక్టుగా పట్టుకోగలిగి, దాన్ని ఫ్రేమ్‌లోకి తీసుకొస్తే చాలు. ప్రేక్షకుడ్ని థియేటర్లో కూర్చోబెట్టొచ్చు. ఈ విషయంలో సిద్దార్థ్‌కి పూర్తి మార్కులు పడిపోతాయి. సుబ్బారెడ్డి పాత్రని పరిచయం చేసిన విధానం, క్వారీ సన్నివేశంలో కట్టారెడ్డి పాత్రలోని క్రూరత్వం చూపించే పద్ధతి.. ఇవన్నీ దర్శకుడిలోని ప్రతిభకు అద్దం పడతాయి. భైరవ - గీత ప్రేమ కథలో ఎలాంటి వైవిధ్యం ఉండదు. సాధారణంగా మనం చూసిన రాజు - బీద కాన్సెప్టే. ఈ లవ్ ట్రాక్ విషయంలో దర్శకుడు కొత్తగా ఆలోచిస్తే బాగుండేది.
బలహీనుడు బలవంతుడిపై తిరుగుబాటు చేయడమే విప్లవం. ఇదే భైరవగీతలోని ద్వితీయార్థం. ఆ తిరుగుబాటుకి ఎమోషనల్ డ్రామా, సెంటిమెంట్ రెండూ మిక్స్ చేశాడు. ఎప్పుడైతే భైరవ... తను కాపుకాసే సుబ్బారెడ్డిపైనే కత్తి ఎత్తాలని చూస్తాడో.. అప్పుడే `భైరవ గీత`కు కావల్సిన హై వచ్చేస్తుంది. శవాల్ని తీసుకుని భైరవ ట్రాక్టరుపై వెళ్లే సీన్... అక్కడ భైరవ చెప్పే డైలాగులు ప్రేక్షకులకు కావల్సినంత కిక్ ఇస్తాయి. ఆ తరవాత క్లైమాక్స్ మామూలే. శత్రు సంహారంతో ఈ కథకు శుభం కార్డు వేస్తాడు దర్శకుడు.
సాంకేతిక వర్గం...
టెక్నికల్‌గా ఏ విషయంలోనూ తగ్గని చిత్రమిది. ఫొటోగ్రఫికి పూర్తి మార్కులు పడతాయి. కథలోని మూడ్ ని కెమెరా కూడా అర్థం చేసుకుందేమో అనిపిస్తుంది. రాయలసీమని ఇంత అందంగా చూపించొచ్చా? అనేలా కొన్ని ఫ్రేమింగులు కనిపించాయి. నేపథ్య సంగీతం కథకు ప్రాణం పోసింది. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో పాటలు అడ్డు పడతాయి. కానీ `భైరవ గీత`లో మాత్రం అవి అదనపు ఆకర్షణగా నిలిచాయి. రెండు పాటలు మాత్రం రొమాన్స్‌కి ప్రత్యేకం అనుకోవాలి. దర్శకుడి టేకింగ్‌ని మెచ్చుకొని తీరాల్సిందే. సాధారణమైన కథని.. `రా` మూడ్‌లో తీసుకెళ్లి.. కళ్లకు కట్టాడు. ఈమధ్య వచ్చిన ఫ్యాక్షన్ నేపథ్యంలోని సినిమాల్లో `భైరవ గీత` మేకింగ్ పరంగా తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంటుందనడంలో సందేహం లేదు.
* ప్లస్ పాయింట్స్
- వాస్తవిక కోణం
- నటీనటులు
- కెమెరా, సంగీతం
* మైనస్ పాయింట్స్
- తెలిసిన కథ కావడం
- హింస
పైనల్ వర్డిక్ట్: 'భైరవ గీత'... తీత, రాత రెండూ బాగున్నాయి
రివ్యూ రాసింది శ్రీ.