తారాగణం: సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బ, మురళి శర్మ, వేణు తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్
సంగీతం: JB
రచన & సమర్పణ: మారుతీ
నిర్మాత: శైలేంద్ర బాబు
దర్శకత్వం: ప్రభాకర్
రేటింగ్: 2.25/5
ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత బ్రాండ్ మానియా వుంటుంది. బ్రాండెడ్ దుస్తులు, వస్తువుల్ని వాడుతూ తమ దర్పాణ్ని, హోదాను ప్రదర్శించుకోవాలని తపిస్తారు. జీవితంలోని ప్రతి విషయాన్ని బ్రాండ్‌తో ముడిపెట్టి చూస్తూ విపరీతమైన బ్రాండ్ వ్యామోహం కలిగిన ఓ యువకుడి కథతో బ్రాండ్‌బాబు చిత్రాన్ని తెరకెక్కించారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మారుతి ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు కథ, మాటలు సమకూర్చడంతో ఈ చిన్న సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి కనబరిచారు.
ఈ చిత్రం ద్వారా కన్నడ యువ కథానాయకుడు సుమంత్ శైలేంద్ర తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ప్రభాకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్నిశ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై యస్.శైలేంద్రబాబు నిర్మించారు. చిన్న సినిమా అయినప్పటికీ ఓ మోస్తరు అంచనాలతో విడుదలైన ఈ చిత్ర కథా విశేషాలు ఏమిటో తెలుసుకుందాం..
కథ
తండ్రికొడుకులైన రత్నం, డైమండ్‌బాబు (మురళీశర్మ, సుమంత్‌శైలేంద్ర) ఇద్దరికీ బ్రాండ్ అంటే మోజు. బట్టల దగ్గరి నుంచి తాము వాడే ప్రతి వస్తువు టాప్ బ్రాండ్‌కు సంబంధించినదై ఉండాలని కోరుకుంటారు. కుమారుడు తన హోదా, అంతస్థుకు తగినట్టుగా గొప్పింటి అమ్మాయిని పెళ్లిచేసుకోవాలని రత్నం తపిస్తుంటాడు. ఈ క్రమంలో డైమండ్‌బాబుకు ఫోన్ ద్వారా హోం మినిస్టర్ ఇంటిలో పని మనిషిగా పనిచేసే రాధా (ఈషా రెబ్బా) పరిచయమవుతుంది. రాధా హోం మినిస్టర్ కూతురనే భ్రమలో ఆమెను ముగ్గులోకి దింపాలని ప్రయత్నాలు చేస్తుంటాడు డైమండ్‌బాబు.
చివరకు రాధాను ఒప్పించి నిశ్చితార్థానికి సిద్ధపడతాడు. ఆ సమయంలో డైమండ్‌బాబు రాధా గురించిన నిజాన్ని తెలుసుకుంటాడు. రాధా హోం మినిస్టర్ కూతురు కాదని తెలుసుకున్న డైమండ్‌బాబు ఏం చేశాడు? బ‌్రాండ్ భ్రాంతిలో బ్రతికే రత్నం, డైమండ్‌బాబుల మనసుల్ని మార్చడానికి రాధా చేసిన ప్రయత్నాలేమిటి? చివరకు రాధా, డైమండ్‌బాబుల కథ సుఖాంతమైందా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగత చిత్ర కథ.
నటీనటులు పనితీరు..
కన్నడ హీరో శైలేంద్రకు తెలుగులో తొలి చిత్రమిది. తన పాత్ర మేరకు అహంభావ స్వభావి అయిన యువకుడిగా తన పరిధి మేరకు మంచి నటనను కనబరిచాడు. అతని స్క్కీన్‌ప్రజెన్స్ కూడా బాగానే ఉంది.
ఇక మురళీశర్మ పాత్రలో ఎలాంటి కొత్తదనం లేదు. ఆయన పాత్రలో గత చిత్రాల తాలూకు ఛాయలు స్పష్టంగా కనిపించాయి. ఈ తరహా పాత్రలకు మురళీశర్మ కొంచెం బ్రేక్‌నిస్తే బాగుంటుందనిపిస్తుంది.
రాధా పాత్రలో ఈషారెబ్బా మెప్పించింది. అయితే సినిమాలో ఆమెను పనిమనిషి అంటే ఎవరూ నమ్మేలా కనిపించలేదు. మేకప్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేదనిపించింది.
డైమండ్ బాబు మిత్రులుగా వేణు, సాయి హాస్యం అంతగా అలరించలేదు. మిగతా పాత్రల్లో పెద్దగా గుర్తుంచుకునే అంశాలు లేవు.
విశ్లేషణ...
బ్రాండ్ పిచ్చి వున్న మనుషులు నిత్యజీవితంలో ఎందరో కనిపిస్తుంటారు. అది ఓ రకంగా వారి బలహీనత కూడా. తమ దర్పాన్ని, పలుకుబడిని ఎదుటివారు ఈజీగా గుర్తించడంలో ఈ బ్రాండ్ ప్రయారిటీ ఎక్కువగా కనిపిస్తుంది. కథాంశం పరంగా మారుతి మంచి పాయింట్‌నే ఎంచుకున్నాడు. ఈ తరహాలో కాన్సెప్ట్‌లో కావాల్సినంత వినోదం, ఎమోషన్ పండించడంతో పాటు చివరకు చక్కటి మెసేజ్ అందించడానికి మంచి స్కోప్‌వుంటుంది. కానీ ఈ ఇతివృత్తాన్ని తెరపై తీసుకురావడంతో దర్శకుడు పూర్తిగా తడబడ్డట్టుగా కనిపించింది.
ఓ రకంగా ఈ సినిమా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిందని చెప్పవచ్చు. ఆరంభ సన్నివేశాలు మారుతి మార్క్‌తో మంచి వినోదాన్నేపండించాయి. కథ సాగుతున్న కొద్ది అసందర్భంగా సన్నివేశాలు ఓ ప్రహసనంలా సాగాయి. హోం మినిస్టర్ కూతురుని ప్రేమలో దింపడానికి డైమండ్ బాగు వాళ్ల ఇంటి ముందు ఐస్‌క్రీమ్ అమ్ముకునే వాడి అవతారమెత్తడం, ఈ క్రమంలో అతడు చేసే విన్యాసాలు సిల్లీగా అనిపిస్తాయి.
డైమండ్‌బాబు.. అతని స్నేహితులు వేణు, సాయిల మధ్య రచయిత సత్యం రాజేష్ పాత్రను ఎందుకు పెట్టారో అస్సలు అర్థం కాదు. కథాగమనంలో ఎక్కడా సీరియస్‌నెస్ కనిపించలేదు. డైమండ్‌బాబు మనసు గెలుచుకోవడానికి రాధా చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఆకట్టుకోవు. ఇదంతా ఒక ఎత్తయితే రత్నం కటుంబానికి వ్యతిరేకంగా బస్తీకి చెందిన వారందరూ పీఎం - పేద, మధ్యతరగతి అంటూ ఓ సంఘాన్ని ఏర్పాటు చేయడం, సదరు సంఘం వారు రత్నం బాబు కుటుంబాన్ని ప్రతి చోట ముప్పుతిప్పలు పెట్టడం వాస్తవికతకు దూరంగా, ఓరకంగా ప్రేక్షకులకు విసుగెత్తేలా సాగాయి.
చివరకు రత్నం కుటుంబ మనసును గెల్చుకోవడానికి రాధా వారి ఇంటిలో రహస్యంగా పనిమనిషిగా చేరడం, వారిలో పరివర్తన కనిపించడం కూడా సత్యదూరంగా అనిపించాయి. దర్శకుడు ప్రభాకర్‌కున్న సీరియల్ డైరెక్షన్ అనుభవం సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌లో కనిపించింది. ప్రథమార్థంలోని ఓ పాటు వస్త్రదుకాణాల యాడ్‌ను తలపించింది. మారుతి మార్క్ కామెడీ మెరుపులు ఎక్కడా కనిపించలేదు. కథాగమనంలో ఎమోషన్ పూర్తిగా మిస్ అయింది. చనిపోయిన తర్వాత మన పేరును పదిమంది చెప్పుకోవడమే నిజమైన బ్రాండ్...మనకు కావాల్సిన రక్తానికి కూడా బ్రాండ్ వుండాలంటే మనిషి బ్రతకడం కష్టం..వంటి సంభాషణలు హార్ట్‌టచింగ్ అనిపించాయి. డైలాగ్స్‌పరంగా కొన్ని సన్నివేశాల్లో తన మార్క్‌ను చూపించాడు. చివరగా మారుతి కథను ప్రభాకర్ సరిగ్గా ఓన్ చేసుకోలేకపోయాడనే భావన కలుగుతుంది.
సాంకేతిక వర్గం..
జేబీ సంగీతం ఫర్వాలేదనిపించింది. కొన్నిసన్నివేశాల్లో నేపథ్య సంగీతం బాగా కుదిరింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
విజయవంతమైన కథకుడు, మాటల రచయితగా పేరున్న మారుతి బ్రాండ్‌బాబు విషయంలో ఎక్కడో పట్టుతప్పాడనిపించింది. ముఖ్యంగా భావోద్వేగాల మేళవింపుతో ఏ ఒక్క సన్నివేశాన్ని అల్లుకోలేదనిపిస్తుంది.
ఇక దర్శకుడు ప్రభాకర్ ఈ కథను ఏ మాత్రం డీల్ చేయలేకపోయాడు. మంచి వినోదాన్ని ఆస్వాదిస్తామని వెళ్లిన ప్రేక్షకులకు ఈ బ్రాండ్‌బాబు కాస్త బోరింగ్‌బాబుగా అనిపిస్తాడు..
ప్లస్ పాయింట్స్
+ పాయింట్
+ అక్కడక్కడ వినోదం
* మైనస్ పాయింట్స్
- బోరింగ్ స్క్రీన్ ప్లే
- పేలవమైన సీన్లు
* ఫైనల్ వర్డిక్ట్: బోరింగ్ బాబు
రివ్యూ రాసింది శ్రీ