కెప్టెన్ మిల్లర్ మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం: కెప్టెన్ మిల్లర్
నటీనటులు: ధనుష్, శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్, ప్రియాంక మోహన్
 
దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్
నిర్మాతలు: సెంధిల్ త్యాగరాజన్ మరియు అర్జున్ త్యాగరాజన్
 
సంగీతం: జివి ప్రకాష్
ఛాయాగ్రహణం: సిద్ధార్థ నుని
కూర్పు: నాగూరన్
 
బ్యానర్స్: సత్యజ్యోతి ఫిల్మ్స్
విడుదల తేదీ: 26 జనవరి 2024
 
ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.5/5
 
ధనుష్ కి తెలుగులో కూడా ఫాలోయింది వుంది. ఆయన సినిమాలు ఇక్కడ డబ్బింగ్ గా విడుదలౌతుంటాయి. 'సార్' తో నేరుగా తెలుగులో సినిమా చేసి ఇక్కడ మరింత దగ్గరయ్యారు. ఇప్పుడు ఆయన నుంచి పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా 'కెప్టన్ మిల్లర్' వచ్చింది. నిజానికి సంక్రాంతి సీజన్ లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం థియేటర్స్ సమస్య కారణంగా ఇప్పుడు రిపబ్లిక్ డే కానుకగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధనుష్ కెరీర్ లో ఒక హయ్యస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల ఎలాంటి అనుభూతిని ఇచ్చింది? అసలు ఈ కెప్టన్ మిల్లర్ కథ ఏమిటి ?
 
కథ: దేశాన్ని బ్రిటీషర్స్ పాలిస్తున్న కాలమది. వెనుకబడిన తరగతికి చెందిన అగ్ని ( ధనుష్) చిన్నప్పటి నుంచి చాలా వివక్ష ఎదుర్కుంటాడు. తనకి గౌరవం దక్కాలంటే బ్రిటీష్ సైన్యంలో చేరడమే మార్గమని భావిస్తాడు. మరోవైపు అగ్ని సోదరుడు శివన్న( శివరాజ్ కుమార్) స్వతంత్ర పోరాటం చేస్తుంటాడు. అగ్ని సైన్యంలో చేరడాన్ని నిరాకరిస్తాడు శివన్న. అన్న మాటని లెక్కచేకుండా బ్రిటిష్ సైన్యంలో చేరిన అగ్ని.. మిల్లర్ గా మారుతాడు. అయితే అనుకోని ఓ ఘటన మిల్లర్ జీవితాన్ని మార్చేస్తుంది. బ్రిటిష్ సైన్యంలో సిపాయి గా చేరి అగ్ని.. బ్రిటిషర్స్ కు సవాల్ విసురుతూ.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్  గా మారుతాడు. తర్వాత ఏం జరిగింది ? అసలు మిల్లర్ మోస్ట్ వాంటెడ్ ఎందుకయ్యాడు ? ఈ కథలో ఊరి శివాలయం పాత్ర ఏమిటి ? ఊరి కోసం మిల్లర్ ఎలాంటి పోరాటం చేశాడనేది తెరపై చూడాలి.
 
విశ్లేషణ: స్వేచ అనేది చాలా రకాలుగా వుంటుంది. తనకి,  తన వర్గానికి సమాజంలో సమానత్వం, గౌరవం దొరకడమే స్వేఛ్చ అని భావించిన ఓ వ్యక్తి కథ ఇది. నిజానికి ఈ పాయింట్ లో కొత్తదనం వుంది. అణిచివేత, వివక్ష అంశాలని ఇతివృత్తంగా తీసుకొని గతంలో చాలా కథలు వచ్చాయి. ధనుష్ చేసిన అసురన్, కర్ణన్ చిత్రాల నేపధ్యం కూడా ఇదే. కెప్టన్ మిల్లర్ లో అసలైన స్వేఛ్చ ఏమిటి ? అనే కోణంలో కథని మొదలుపెట్టిన తీరు ఆసక్తిగానే వుంటుంది. గుడి చరిత్రని చెబుతూ ఈ కథని మొదలుపెట్టాడు దర్శకుడు. శివన్న, అగ్ని పాత్రల మధ్య జరిగిన సంభాషణ కథలోని మూల అంశాన్ని సమర్ధవంతంగా తెలియజేస్తుంది. అగ్ని సైన్యంలో చేరి మిల్లర్ గా మారడం, తర్వాత జరిగిన ఓ ఘటన కథకు మంచి ఎమోషనల్ టచ్ ఇస్తాయి. అయితే తర్వాత ఈ కథని తెగిన గాలిపటంలా ఒక దిశానిర్దేశం లేకుండా నడిపాడు దర్శకుడు.
 
అగ్ని పాత్రలోని ఎమోషన్ ప్రేక్షకుడి ఎంతో కొంత కనెక్టింగానే వుంటుంది. అయితే అగ్ని , మిల్లర్ గా మారిన తర్వాత అతడి పాత్రలో వచ్చే లేయర్స్ ప్రేక్షకుడికి పట్టవు. తనని ఊరు వాళ్ళు దూరం చేయడం, ఆ బాధతో దేశదిమ్మరిగా తిరగడం, ఒక బందిపోటు ముఠాతో కలసి చేసిన పోరాటం ఇవన్నీ కథలో సంపూర్ణంగా కుదరలేదు. కొన్ని సన్నివేశాలైతే అసలు ప్రేక్షకుడిని ఇటు తీసుకెళుతున్నాయో అర్ధం కానీ పరిస్థితి వుంటుంది. సెకండ్ హాఫ్ లో కథ శివాలయంకు షిఫ్ట్ అవుతుంది. అయితే ఇందులో ఎక్కువ భాగం యాక్షన్ కి కేటాయించారు. మూడు వార్ సీక్వెన్స్ లతో కథని ముగించేశారు. ఆ యాక్షన్ తెరపై చుదటడానికి భారీగా ఉన్నప్పటికీ కథ, పాత్రలు కోర్ ఎమోషన్ అసంపూర్ణంగా మిగిలిపోయిన భావన కలుగుతుంది.
 
నటీనటులు: కెప్టన్ మిల్లర్ ధనుష్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడు. యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో తన మార్క్ చూపించాడు. భానుమతి పాత్రలో చేసిన ప్రియాంక ఆరుళ్ మోహన్ పాత్ర క్లారిటీ లేకుండా వుంటుంది. అన్నట్టు ఈ చిత్రానికి సీక్వెల్ కూడా వుంది. భానుమతి పాత్ర నేపధ్యంలోనే సీక్వెల్ లీడ్ ఇచ్చారు. శివరాజ్ కుమార్ ప్రజన్స్ బావుంది కానీ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. సందీప్ కిషన్ పాత్ర గెస్ట్ అప్పిరియన్స్ లానే వుంటుంది . కాళి వెంకట్, జయప్రకాష్ తో పాటు మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.
 
టెక్నికల్: సాంకేతికంగా సినిమా బావుంది. జీవి ప్రకాష్ నేపధ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కెమరాపనితనం కూడా నీట్ గా వుంది. వింటేజ్ ఫీల్ కలిగించే విజువల్స్ వున్నాయి  మంచి ప్రొడక్షన్ డిజైన్ కనిపించింది.1930 నాటి వాతావరణంను చక్కగా రిక్రియేట్ చేశారు. వార్ సీన్స్ లో వాడిన ఆయుధాలు కూడా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. తెలుగు డబ్బింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది.
 
ప్లస్ పాయింట్స్ 
కథా నేపధ్యం   
ధనుష్ నటన 
నిర్మాణ విలువలు 
 
మైనస్ పాయింట్స్ 
కథనం 
ఎమోషన్స్ కనెక్ట్ కాకపోవడం 
ఆకట్టుకొని డ్రామా
 
ఫైనల్ వర్డిక్ట్ : థ్రిల్ లేని మిల్లర్...

ALSO READ : REVIEW IN ENGLISH


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS