తారాగణం: మోహన్ భగత్, ప్రవీణ పరుచూరి, ప్రణీత, రాధ, సుబ్బారావు, కార్తీక్ రత్నం & తదితరులు
సమర్పణ: సురేష్ ప్రొడక్షన్స్
సంగీతం: స్వీకర్ అగస్తి
ఛాయాగ్రహణం: వరుణ్ & ఆదిత్య
ఎడిటర్: రవితేజ
నిర్మాత: పరుచూరి విజయ ప్రవీణ
రచన-దర్శకత్వం: వెంకటేష్ మహా
రేటింగ్: 3/5
డ్రామా ఎప్పుడు మొదలవుతుందో, అక్కడ వాస్తవికతకు చోటుండదు. సినిమా గ్లామర్ అనేది ఎప్పుడో వాస్తవిక ప్రపంచాన్ని మింగేసింది. నిజం వేరు..సినిమా వేరు. మనం చూస్తున్న ప్రపంచం వేరు, సినిమా వేరు. బతుకు వేరు.. వెండి తెర వేరు. ఇలా తయారైంది పరిస్థితి. ఇలాంటి దశలో.. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కళ్ల ముందుకు తీసుకొస్తే.. మనసు అబ్బుర పడుతుంది.
మరాఠీలో 'సైరాట్' లాంటి చిత్రాలు అఖండ విజయాన్ని సాధించడానికి కారణం అదే. మిగిలిన భాషల్లో అప్పుడప్పుడూ ఇలాంటి ప్రయత్నాలు, ప్రయోగాలు జరుగుతుంటాయి. తెలుగు సినిమా మాత్రం పూర్తిగా నాటకీయ ధోరణిలో మునిగిపోయింది. వీటి మధ్య వికసించిన తామరపుష్షం లాంటి సినిమా 'కేరాఫ్ కంచరపాలెం'. ఈమధ్య ఏ చిన్న సినిమాకీ ఈ స్థాయిలో ప్రమోషన్ జరగలేదు.
రాజమౌళి, క్రిష్, సుకుమార్ లాంటి దర్శకులు కూడా ఈ సినిమా గురించి బాగా మాట్లాడారు. చూడాల్సిన సినిమా ఇది అంటున్నారు. మరి ఈ సినిమాలో ఏముంది? వాళ్ల మనసుల్ని గెలుచుకోవడానికి కారణమేంటి?
* కథ
కంచరపాలెంలోని రాజు ఓ గవర్నమెంటు ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తుంటాడు. యాభై ఏళ్లొచ్చినా పెళ్లికాదు. ఆ ఊరంతా రాజుకి పెళ్లి ఎందుకు కాలేదన్న విషయంలో రకరకాల పుకార్లు పుట్టిస్తుంది. అయితే రాజు ఏం పట్టించుకోడు. తన గోల తనదే. అదే ఆఫీసులో పనిచేసే తన సీనియర్ అధికారి రాధ... రాజుని ఇష్టపడుతుంది. తన వయసు 40 ఏళ్లు. భర్త చనిపోయి చాలా కాలం అవుతుంది. తనకు ఇరవై ఏళ్ల కూతురు కూడా. మరి తన సీరియర్ అధికారిణిని పెళ్లి చేసుకోవడానికి రాజు ఒప్పుకున్నాడా? అసలు రాజు అప్పటి వరకూ పెళ్లి చేసుకోకపోవడానికి కారణమేంటి? అనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది.
రాజుతో పాటు జోసెఫ్, సుందరం, గడ్డం... ఇలా ముగ్గురి ప్రేమకథలు కూడా సమాంతరంగా నడుస్తుంటాయి. ప్రతి ప్రేమకథలోనూ ఏదో ఓ అడ్డు. మరి ఈ ప్రేమకథలన్నీ ఏ కంచికి చేరాయి? ఎవరు ఎలా ఎప్పుడు కలుసుకున్నారు?? అనేది తెరపైనే చూడాలి.
* నటీనటుల ప్రతిభ
కంచరపాలెం అనే గ్రామంలో జరిగే కథ ఇది. అక్కడివాళ్లనే నటీనటులుగా ఎంచుకుని దర్శకుడు ఓ ప్రయోగం చేశాడు. వాళ్లందరికీ నటన కొత్త. కానీ ఎక్కడా ఆ విషయం తెలీదు. ఎంతో అనుభవం ఉన్న నటులుగా కనిపిస్తారు. రాజు పాత్ర, గడ్డం బాబు పాత్రలు గుర్తుండిపోతాయి. అందరూ బాగా చేశారు. ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ అనేది చెప్పలేం. ఎప్పుడూ తెరపై చూసిన మొహాలు కాదు కాబట్టి.. వారి నటన ఎంత సహజంగా అనిపించిందో, వారి నటనలో అంత నిజాయతీ కనిపించింది.
* విశ్లేషణ
వాస్తవిక జీవితాలకు, వాస్తవిక ప్రపంచానికీ అద్దం పట్టిన కథ ఇది. కంచెర పాలెం అనే ఊర్లో మనుషుల్నీ, వాళ్ల మనస్తత్వాల్నీ, జీవితాల్నీ బాగా అర్థం చేసుకుని వాటినే తెరపైకి తీసుకొచ్చాడా? అనిపించేంత సహజంగా ఉంటుందీ కథ. సినిమా వేరు, వాస్తవిక జీవితం వేరు. అయితే... ఇందులో కేవలం వాస్తవిక ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. తెరపై జరుగుతున్న సంఘటనలు, కనిపించే పాత్రలు, మాట్లాడే మాటలు ఇవేం కృత్రిమంగా, కృతకంగా ఉండవు. అవన్నీ అత్యంత సహజంగా తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు.
ప్రతీ జీవితంలో వినోదం, విషాదం రెండూ ఉంటాయి. గెలుపు ఓటమి ఉంటాయి. అలాంటి భావోద్వేగాలన్నీ రంగరించాడు. మన జీవితాన్ని, మనకు తెలిసిన కథని తెరపై చూసుకుంటున్నామా? అనే అనుభూతి కలిగించాడు. రాజు కథ, జోసెఫ్ ప్రేమ, సుందరం అమాయకత్వం, గెడ్డం బాబు ప్రేమలో నిజాయతీ ఇవన్నీ కట్టిపడేస్తాయి. రాజు తెరపై ఉన్నప్పుడు సుందరం గుర్తుకు రాడు. జోసెఫ్‌ని చూస్తున్నప్పుడు గెడ్డం బాబు గురించి మర్చిపోతాం. ఒక్కో కథని విడివిడిగా చెబుతున్నా... ముక్కలు ముక్కలుగా విడగొట్టి కథ చెబుతున్నా... ఆ స్క్రీన్ ప్లే ఏదీ ఈ కథగమనాన్ని అడ్డుపడలేదు.
అచ్చమైన పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించడంలో దర్శకుడు సఫలీకృతమయ్యాడు. ఈ నాలుగు కథలూ ఎలా కలుస్తాయి? ఇన్ని ప్రేమకథల్ని ఎలా ముగిస్తాడు? అనే సంశయం రావొచ్చు. కానీ దాన్ని తొలగిస్తూ చక్కటి అర్థవంతమైన ముగింపు రాసుకున్నాడు. ఆ ముగింపు `అ`,` మనమంతా` లాంటి చిత్రాల్ని గుర్తుకు తీసుకురావొచ్చు. కాకపోతే.. ఈ కథని ఇలా ముగించడమే సరైనది అనిపిస్తుంది.
దేవుడు, మతం, కులం... అనే బరువైన విషయాల్ని దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు. ఇవన్నీ సున్నితమైన అంశాలు. అయితే... మరీ ఎక్కువ కాంట్రవర్సీ కాకుండా.. ఏది ఎంత చెప్పాలో, అంతే చెప్పి తెలివిగా తప్పించుకున్నాడు దర్శకుడు. ఈ నాలుగు కథలూ అద్భుతాలు కాకపోవొచ్చు. కానీ రాజు పాత్ర, గడ్డం బాబు ప్రేమకథ మనసుని మెలిపెట్టేస్తాయి. మరీ పగలబడి నవ్వకపోయినా.. అక్కడక్కడ.. చిరు మందహాసాలు ఎదురవుతాయి. హాయిగా నవ్వుకుంటూ.. మధ్యలో మనల్ని మనం మళ్లీ ఓసారి చూసుకుంటూ, చివర్లో ఓ ఉద్వేగభరితమైన భావనకు గురి చేస్తూ సాగిన సినిమా ఇది.
* సాంకేతిక వర్గం
దర్శకుడు పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. ఓ స్వచ్ఛమైన సినిమాని నిజాయతీగా అందించాలి అనే తపన మెప్పిస్తుంది. ఎక్కడా కృత్రిమత్వం లేదు. గ్లామర్ కోసం ప్రాకులాడలేదు. వివాదాల్ని క్యాష్ చేసుకోవాలనుకోలేదు. ఏ పాత్రా.. తన పరిధిని దాటి బయటకు వెళ్లదు. ఇన్ని పాత్రలున్నా.. ప్రతీ పాత్రనీ బాలెన్డ్స్‌గా చేయడం నిజంగా గొప్ప విషయం. మాటలు, పాత్రల తీరుతెన్నులు సహజంగా ఉన్నాయి. నేపథ్య సంగీతం ప్రాణం పోసింది. పాటలు అర్థవంతంగా సాగాయి.
* ప్లస్ పాయింట్స్
+ కథా నేపథ్యం
+ పాత్రలు
+ సంభాషణలు
+ వాస్తవిక జీవనం
* మైనస్ పాయింట్
- స్లో నేరేషన్
* ఫైనల్ వర్డిక్ట్: ఓ కొత్త తరహా అనుభూతి.
రివ్యూ రాసింది శ్రీ