నటీనటులు : నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ తదితరులు
దర్శకత్వం : చంద్ర శేఖర్ యేలేటి
నిర్మాతలు : వి ఆనంద్ ప్రసాద్
సంగీతం : కళ్యాణి మాలిక్
సినిమాటోగ్రఫర్ : రాహుల్ శ్రీవాత్సవ్
ఎడిటర్: సనాల్ అనిరుదన్
రేటింగ్: 2.5/5
ఐతే, అనుకోకుండా ఓరోజు, సాహసం, మనమంతా.. ఇలా ఎలాంటి సినిమా తీసినా, తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశాడు చంద్రశేఖర్ యేలేటి. ఎప్పటి నుంచో ఓ కమర్షియల్ సినిమా తీయాలి.. అన్న టార్గెట్ చందూది. తన సినిమా మాస్ కి నచ్చాలని, కమర్షియల్ గానూ ఆడాలని... తన టార్గెట్. అందులో భాగంగా తను చేసిన కొత్త ప్రయత్నం `చెక్`. మంచి ఫామ్ లో ఉన్న నితిన్ హీరో అవ్వడం, చందూ సినిమా కావడంతో.. చెక్ పై అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? చెక్‌లో కమర్షియాలిటీ ఎంత? చందూ లోని క్రియేటివిటీ ఎంత?
* కథ
సర్కార్ (నితిన్)ని `నా` అనేవాళ్లెవరూ లేరు. అనాథాశ్రమం నుంచి పారిపోయి.. ఓ మ్యూజీషియన్ దగ్గర చేరతాడు. పెరిగి పెద్దవాడై... దొంగతనాలు చేయడం మొదలెడతాడు. రోజుకో పేరు.. రోజుకో వేషం. అయితే అనుకోకుండా ఓరోజు పోలీసులు టెర్రరిస్ట్ గా అనుమానించి అరెస్టు చేస్తారు. నలభైమంది చావుకి కారణమైన ఆదిత్య అనబడే సర్కార్‌కి కోర్టు ఉరిశిక్ష విధిస్తుంది. జైల్లో నాలుగ్గోడల మధ్య బంధీగా ఉండలేకపోతాడు ఆదిత్య. గురూజీ (సాయిచంద్) ఇచ్చిన ప్రోత్సాహంతో చెస్ నేర్చుకుంటాడు. గురువునే ఓడించి... చెస్ లో రాటు దేలతాడు. ఆదిత్యలో ఉన్న స్పార్క్ ని గుర్తిస్తాడు గురూజీ. జైలర్ (మురళీ శర్మ) కీ ఆదిత్యపై గురి ఏర్పడుతుంది. దాంతో.. వరుసగా టోర్నమెంట్లు ఆడుతూనే ఉంటాడు. వరల్డ్ ఛాంపియన్ షిప్ గెలుచుకుంటే.. రాష్ట్రపతి నుంచి క్షమాభిష కోరే అవకాశం ఏర్పడుతుంది. దాంతో ఆదిత్య గురి.. వరల్డ్ ఛాంపియన్ షిప్ పై పడుతుంది. మరి ఆదిత్య.. ఈ పోటీల్లో గెలిచాడా? క్షమాభిక్షతో బయటకు వచ్చాడా? అనేదే `చెక్` కథ.
* విశ్లేషణ
చెస్ - క్రియేటీవ్ గేమ్. దాన్ని కమర్షియల్ కథలో ఇరికించి - థ్రిల్ కలగజేయాలనుకున్నాడు దర్శకుడు. ఇది మంచి ఆలోచనే. జైల్లో చీకటి గదిలో.. ఆదిత్య చెస్ నేర్చుకోవడం, గురువునే ఓడించడం, చెస్ ఛాంపియన్ గా ఆవిర్భవించడం, ఇదంతా సినిమాటిక్ గా ఉన్నా - టైమ్ పాస్ అయిపోయే సన్నివేశాలుగా మిగులుతాయి. లాయర్ కి తన కథ చెప్పడంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అది అంత ఇంట్రస్టింగ్ గా ఏమీ ఉండదు. సాధారణ ఫ్లాష్ బ్యాక్‌లాంటిదే. యాత్ర (ప్రియా వారియర్) పాత్ర ఆదిత్య జీవితాన్ని మలుపు తిప్పుతుంది.
కాకపోతే.. ఆయా సన్నివేశాల్ని దర్శకుడు మరింత ఇంటిలిజెంట్ గా రాసుకోవాల్సింది. ప్రధమార్థంలో.. మంచి ఫైట్ తో ముగించాడు. జైలు సన్నివేశాలు, అక్కడి వాతావరణం.. తన ఇంటిలిజెన్సీని ఉపయోగించి, హీరో ఎత్తుకు పై ఎత్తులు వేడయం ఇవన్నీ మజా ఇస్తాయి.
రెండో భాగంలో హీరో నిర్దోషి అని నిరూపించుకుంటాడా? క్షమాభిక్షతో బయటకు వస్తాడా? అనే ఆసక్తి నెలకొనేలా చేస్తాయి. అయితే దురదృష్టం ఏమిటంటే.. హీరో తాను నిర్దోషి అని నిరూపించుకోవడానికి ఒక్క ప్రయత్నమూ చేయడు. ఆటలపై ఆటలు గెలిచి ఛాంపియన్ గా అవతరించినా.. క్షమాభిక్ష రాదు.
చివరికి తనదైన శైలిలో. జైల్లోంచి పారిపోవడంతో కథ ముగుస్తుంది. ఈ ముగింపు.. చాలామందికి నచ్చకపోవొచ్చు. ఎందుకంటే.. ప్రేక్షకుడు హీరో నిర్దోషిగా బయటకు రావాలని భావిస్తాడు. లేదంటే క్షమాభిక్ష అయినా దొరుకుతుందనుకుంటాడు. అవి రెండూ జరగవు. దాంతో ప్రేక్షకుల్లో కాస్త నిరుత్సాహం ఆవహిస్తుంది. జైల్లోంచి హీరో సొరంగ మార్గం ద్వారా పారిపోవడం, అందుకోసం మూడు నెలల సమయం తీసుకోవడం సిల్లీగా అనిపిస్తుంది. అది కూడా.. ఓ హాలీవుడ్ సినిమాకి కాపీనే. ద్వితీయార్థంలో.. హీరో గెలుస్తూనే ఉంటాడు.
కానీ.. ఆ ఆటలో మజా ఉండదు. పైగా చెస్ ఓ ఇంటిలిజెంట్ గేమ్. చాలామందికి అర్థం కాని ఆట. దాన్ని తెర పై హీరో అవలీలగా ఆడేస్తుంటే.. సామాన్య ప్రేక్షకుడి బుర్రకి అదేం ఎక్కదు. ఎప్పుడూ హీరోకి జైల్లోని సంఘర్షణ ఎదురవుతుంది. ఎవరో కావాలని అడ్డు పడుతుంటారు. ఆయా సన్నివేశాలు, ఆ సంఘర్షణ రక్తి కట్టవు. క్లైమాక్స్ లో భూమి బద్దలయ్యే ట్విస్టు ఉంటుందనుకుంటే... అక్కడ చంద్రశేఖర్ ఏలేటి లోని క్రియేటర్ చేతులెత్తేశాడు. దాంతో `చెక్` పూర్తిగా.. అటు కమర్షియాలిటీకి, ఇటు.. క్రియేటివిటీకి దూరంగా, ఎటూ కాకుండా మిగిలిపోయింది.
* నటీనటులు
నితిన్ మంచి నటుడు. తనలో చాలా ఈజ్ ఉంది. అయితే ఈ కథ దాన్ని పూర్తిగా వాడుకోలేదు. ఈ సంగతి ఈ కథ ఒప్పుకుంటున్నప్పుడే నితిన్‌కి తెలుసు. అయినా ఓ ప్రయోగంగా, ఓ ఛాలెంజ్ గా భావించి ఈ సినిమా ఒప్పుకున్నాడు. ఆ విషయంలో నితిన్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ప్రియా వారియర్ ది అతిథి పాత్ర అనుకోవాలి. తన మేకప్ కూడా ఎక్కువైంది. రకుల్ తన గ్లామర్ రోల్స్ కి భిన్నంగా చేసిన ఈ పాత్ర చేసింది. అయితే.. తన త్యాగాన్ని సరిగా వాడుకోలేదు. `నాంది`లో వరలక్ష్మి శరత్ కుమార్ తరహాలో ఆ పాత్రని పవర్ ఫుల్ గా తీర్చిదిద్దాల్సింది.సాయిచంద్ కి మంచి పాత్ర దొరికింది. మిగిలినవాళ్లంతా రొటీనే.
* సాంకేతిక వర్గం
కల్యాణి కోడూరి మంచి పాటలిస్తాడు. అయితే ఈ సినిమాలో తన పాటలకు అవకాశం లేదు. ఉన్నది ఒకే ఒక్క పాట... అది కూడా ఏమంత గొప్పగాలేదు. బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం తన పనితనం చూపించాడు. కెమెరా, ఎడిటింగ్ ఓకే అనిపిస్తాయి. సన్నివేశాల్లో మరీ ల్యాగేం లేదు. దర్శకుడిగా, కథకుడిగా చంద్రశేఖర్ ఏలేటి విఫలం అయ్యాడు. తన బ్రాండ్ కథని ఎంచుకున్నా. .. తనదైన దారిలో వెళ్లలేకపోయాడు. కమర్షియల్ లెక్కల మధ్య లాజిక్కుల్ని మర్చిపోయాడు.
* ప్లస్ పాయింట్స్
కథా నేపథ్యం
నితిన్
ఇంట్రవెల్ ఫైట్
* మైనస్ పాయిట్స్
ద్వితీయార్థం
క్లైమాక్స్
* ఫైనల్ వర్డిక్ట్: `చెక్`.. బాగా వీక్