నటీనటులు : రవితేజ, నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్య హోప్, బాబీ సింహ తదితరులు
దర్శకత్వం : వీఐ ఆనంద్
నిర్మాతలు : తాళ్లూరి రామ్
సంగీతం : ఎస్ ఎస్ థమన్
సినిమాటోగ్రఫర్ : ఘట్టమనేని కార్తీక్
ఎడిటర్: శ్రవణ్ కటికనేని
రేటింగ్: 2.5/5
రొటీన్ ఫార్ములా కథల మధ్య కొత్తగా ఆలోచించడం మొదలెట్టాడు విఐ ఆనంద్. అందుకే తన నుంచి ఒక్క క్షణం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి కథలు వచ్చాయి. ఆ సినిమా ఫలితాలెలా ఉన్నా, విఐ ఆనంద్ ఆలోచనా ధోరణి తెలుగు ప్రేక్షకులకు, విమర్శకులకు, హీరోలకూ నచ్చింది. తనేదో మ్యాజిక్ చేయగలడని నమ్మారు. ఫలితంగా రవితేజ నుంచి పిలుపొచ్చింది. ఇద్దరి కాంబినేషన్లో `డిస్కోరాజా` ఇలా మన ముందుకు రాగలిగింది. మరి.. ఆనంద్ తనపై నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడా? వరుస ఫ్లాపులలో ఉన్న రవితేజకు తన కొత్తదనం రుచి చూపించి, విజయాన్ని అందివ్వగలిగాడా?
*కథ
లఢక్‌లో కొంతమంది శాస్త్రవేత్తలకు ఓ మృతదేహం (రవితేజ) దొరుకుతుంది. దాన్ని ప్రయోగాల నిమిత్తం లాబ్‌కి తరలిస్తారు. చనిపోయిన వ్యక్తులకు ప్రాణాలు పోయడానికి ఓ శాస్త్రవేత్తల బృందం ప్రయత్నిస్తుంటుంది. వాళ్ల ప్రయోగాలకు ఈ మృతదేహాన్ని వాడుకుంటారు. అదృష్టవశాత్తూ.. దానికి ప్రాణం పోయగలుగుతారు. చచ్చి బతికిన ఆ `సబ్జెక్ట్`కి గతం గుర్తుకురాదు. అయితే.. ఢిల్లీలో ఓ కుటుంబం వాసు (రవితేజ) కోసం అన్వేషిస్తుంటుంది. ఆ వాసుకీ, ఈ చచ్చిబతికిన మనిషికీ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ముఫ్ఫై ఏళ్ల క్రితం చెన్నైని గడగడలాడించిన గ్యాంగ్ స్టర్ డిస్కోరాజా (రవితేజ) ఎవరు? ఈ కథలో తన పాత్రేమిటి అనేది తెరపై చూడాలి.
*విశ్లేషణ
ఓ రెగ్యులర్ కమర్షియల్ సినిమాకి, సైన్స్ ఫిక్షన్ జోడించాడు ఆనంద్. అది తనదైన మార్క్. రవితేజ కోసం... యాక్షన్ ఫార్ములా లైన్‌ని పట్టుకుని, తనదైన కొత్తదనం జోడించడానికి ప్రయత్నించాడు. లఢక్‌లో ఈ సినిమాని ప్రారంభించిన విధానం ఆకట్టుకుంటుంది. తరవాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠత కలుగుతుంది. వాసు ఏమయ్యాడు? వాసుకి ఏమైంది? అనే ఆసక్తి కూడా కలుగుతుంది. మధ్యమధ్యలో వెన్నెల కిషోర్ పంచ్‌లు,కామెడీ బాగానే పండింది. అయితే.. రవితేజ మార్కు వినోదం మిస్ అవుతూ ఉంటుంది. రవితేజ - నభా నటేషా మధ్య ట్రాక్‌నైనా కాస్త ఎనర్జిటిక్ గా రాసుకుని ఉంటే బాగుండేది. బాబి సింహా కి సంబంధించిన ఎపిసోడ్లు చూస్తుంటే - సెకండాఫ్ దద్దరిల్లిపోవడం ఖాయం అనిపిస్తుంటుంది. దానికి తోడు ఇంట్రవెల్‌లో ఇచ్చిన ట్విస్టు తప్పకుండా ఆశ్చర్యపరుస్తుంది. బహుశా ఈ ట్విస్టు దగ్గరే రవితేజ ఫ్లాట్ అయిపోయి ఉంటాడు.
ఇక సెకండాఫ్‌లో డిస్కోరాజా ట్రాక్ మొదలవుతుంది. అసలు దీని కోసమే ప్రేక్షకులంతా ఎదురు చూస్తుంటారు. అయితే ఇక్కడే దర్శకుడు పట్టు తప్పాడు. 1980 నాటి బ్యాక్ డ్రాస్ ఆసక్తిని రేకెత్తించినా, వాటి మధ్య గ్యాంగ్ స్టర్ గొడవలు మరీ రొటీన్‌గా చూపించాడు. రవితేజ - పాయల్ ట్రాక్ కూడా ఏమంత గొప్పగా ఉండదు. సాగదీత ఎక్కువ. ఫ్లాష్ బ్యాక్ అవ్వగానే.. రొటీన్ రివెంజ్ స్టోరీ గా టర్న్ తీసుకుంటుంది డిస్కోరాజా. సినిమా అంతా అయిపోతుందన్న తరుణంలో మరో ఊహించని ట్విస్టు వస్తుంది. అది మాత్రం షాకింగ్ ఎలిమెంటే. అయితే అప్పటికే ప్రేక్షకులలో నీరసం ఆవహిస్తుంది. ట్విస్టుని కూడా ఎంజాయ్ చేయలేని పరిస్థితి. మొత్తానికి ఓ కథని కొత్తగా మొదలెట్టి, కొత్తగా ముగించి, మధ్యలో ప్రయాణం అంతా రొటీన్‌గా సాగదీశాడనిపిస్తుంది.
*నటీనటులు
రవితేజ పాత్రలో చాలా షేడ్స్ ఉన్నాయి. వాటిని కేక్ వాక్‌లా హాయిగా నడిపించేశాడు రవితేజ. మునుపటికంటే యంగ్ లుక్‌లో కనిపించాడు. అయితే తొలి సగంలో తన ఎనర్జీకి మ్యాచ్ అయిన సన్నివేశాలేం పడలేదు. డిస్కోరాజాగా మాత్రం రెట్రో లుక్‌లో అదరగొట్టేశాడు.
బాబీ సింహా స్టైలీష్‌గా కనిపించాడు. రవితేజ - బాబీ సింహా మధ్య నడిచే సన్నివేశాలు బాగా తెరకెక్కించాడు. హీరోయిన్లు ఇద్దరివీ అంతగా ప్రాధాన్యం లేని పాత్రలే. ముఖ్యంగా నభా నటేషా. సునీల్ పెద్దగా నవ్వించలేకపోయాడు గానీ.. థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు తన పాత్ర గుర్తుంటుంది.
*సాంకేతికత
పాటలెలా ఉన్నా నేపథ్య సంగీతం విషయంలో తమన్ రెచ్చిపోయాడు. రెట్రో గీతం బాగుంది. హీరోయిజాన్ని బిల్డప్ చేసేటప్పుడు ఇచ్చిన థీమ్ మ్యూజిక్ నచ్చుతుంది. 1980 నాటి వాతావరణాన్ని తెరపై చూపించడానికి చాలా కష్టపడ్డారు. టెక్నికల్‌గా బాగుంది. నిర్మాత బాగా ఖర్చు పెట్టారు. దర్శకుడు ఈకథని సాధారణ కమర్షియల్‌గా తెరకెక్కించడ నచ్చదు. కొత్త పాయింట్ ఎత్తుకున్నా - దానికి న్యాయం చేయలేకపోయాడు.
*ప్లస్ పాయింట్స్
రవితేజ
రెట్రో ఎపిసోడ్స్
నేపథ్య సంగీతం
కెమెరా పనితనం
*మైనస్ పాయింట్స్
సాగదీత
రొటీన్ రివెంజ్ డ్రామా
*ఫైనల్ వర్డిక్ట్: మెరుపులు లేని డిస్కో రాజా.