నటీనటులు: ఆనంద్ దేవరకొండ, శివాత్మిక తదితరులు
దర్శకత్వం: కె.వి.ఆర్. మహేంద్ర.
నిర్మాణ సంస్థలు: మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని
సంగీతం: ప్రశాంత్ విహారి
సినిమాటోగ్రఫర్: సన్నీ కూరపాటి
విడుదల తేదీ: 12 జులై, 2019
రేటింగ్: 2.75/5
ప్రేమకథలకు గొప్ప సౌలభ్యం ఉంది. కథ పాతదైనా అడగరు. పాయింట్ కొత్తగా లేకపోతే గొడవ పెట్టుకోరు. ఆ ఎమోషన్‌ని ఫీల్ అయ్యేలా తీస్తే సరిపోతుంది. అందుకే రొటీన్ ప్రేమకథలు కూడా బాక్సాఫీసు దగ్గర హిట్ కొట్టేస్తుంటాయి.
ఓ గొప్పింటి అమ్మాయిని, పేదింటి అబ్బాయి ప్రేమించడం - లేదంటే పేదింటి అమ్మాయిపై డబ్బున్న అబ్బాయి మనసు పడేసుకోవడం - చాలా రొటీన్ అంశాలు. అయితే ఈ కథలు ఇప్పటికీ వస్తున్నాయంటే కారణం.. ప్రేమపై వాళ్లకున్న ప్రేమ. ఇప్పుడు విడుదలైన `దొరసాని` కూడా ఇలాంటి కథే. కాకపోతే.... దాని భాష వేరు, వేషం వేరు, నేపథ్యం వేరు.. చూపించిన తీరే.. వేరు
* కథ
జయగిరి అనే ఊరి కథ ఇది. అక్కడ దొరల పెత్తనం ఎక్కువ. `బాంచన్ నీ కాల్మొక్కుతా` అన్నట్టే బతకాలంతా. అలాంటి చోట దొర బిడ్డ దొరసాని (శివాత్మిక)ని ప్రేమిస్తాడు రాజు (ఆనంద్ దేవరకొండ) అనే పేదింటి అబ్బాయి. కేవలం చూపులతో వీళ్ల పరిచయం మొదలవుతుంది. రాజు కవిత్వానికీ క్రమంగా ప్రేమకూ ఆకర్షితురాలువతుంది దొరసాని. ప్రతీరోజూ రాత్రి దొరల గడీలోకి రహస్యంగా అడుగుపెడుతుంటాడు రాజు.
అక్కడి నుంచి దూరంగా కిటికీ లోంచి దొరసానిని చూస్తూ ఎన్నో రాత్రుల్ని గడిపేస్తాడు. చివరికి దొరసాని కూడా ఆ గడీ దాటి రాజుకోసం బయటకు రావడానికి ధైర్యం చేస్తుంది. వీరిద్దరి రహస్య ప్రేమకథ ఎప్పుడు ఎలా బయట పడింది? దొరల పెత్తనం చలాయిస్తున్న రాజ్యంలో పేదింటి ప్రేమకథ విజయతీరం చేరిందా? లేదా? అనేదే `దొరసాని` కథ
* నటీనటులు
దర్శకుడు చేసిన మంచి పని - ఈ కథ కోసం స్టార్ కాస్టింగ్ జోలికి వెళ్లకపోవడం. ఎలాంటి ఇమేజ్ లేని నటీనటులు ఉండడం ప్లస్ అయ్యింది. తొలి సినిమానే అయినా ఆనంద్, శివాత్మిక చాలా బాగా చేశారు. శివాత్మిక లుక్స్ బాగున్నాయి. చూపులతో ఆకట్టుకుంది.
కళ్లు మూసుకుని డైలాగులు వింటుంటే.. విజయ్ దేవరకొండ మాట్లాడినట్టే అనిపిస్తుంది. ఆనంద్ నటుడిగా ఓకే. ఇదే తొలి సినిమా కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఆశించకూడదు కూడా. హుషారైన పాత్రలిస్తే... తానేం చేస్తాడో చూడాలి. కిషోర్ తప్ప మిగిలినవాళ్లంతా కొత్తవాళ్లే.
* సాంకేతిక వర్గం
కెమెరా, ఆర్ట్, నేపథ్య సంగీతం, పాటలు, కవిత్వం... ఇలా అన్ని రకాలుగా పనితీరు బాగుంది. 30 ఏళ్ల నాటి వాస్తవ పరిస్థితికి సినిమా అద్దం పట్టింది. దర్శకుడు ఎంచుకున్న కథ రొటీన్‌దే. కానీ.. తెలంగాణ నేపథ్యంతో దానికి కొత్త హంగులిచ్చే ప్రయత్నం చేశాడు. సినిమాటిక్ డైలాగులు ఎక్కడా లేవు. అంతటా సహజత్వం ప్రతిబింబించింది. పతాక సన్నివేశాలు గుండెని బరువెక్కించేలా తీశారు.
* విశ్లేషణ
ముందే చెప్పినట్టు ఇది కనీవినీ ఎరుగని ప్రేమకథేం కాదు. కొన్ని వందలసార్లు విన్నదీ, చూసిందే. ఓ గొప్పింటి అమ్మాయిని పేదింటి అబ్బాయి ప్రేమించడం - పెద్దలు అడ్డు పడడం - ఆ అడ్డుగోడల్ని బద్దలు కొట్టుకుని ప్రేమికులు బయటకు రావడం - ఇదీ దొరసాని కథ. ఈసారి కథలోని వైవిధ్యం తెలంగాణ భాష, యాస, సంప్రదాయం. సహజమైన పాత్రలు, సినిమాటిక్ గ్లామర్‌కి ఏమాత్రం పడిపోని నిజాయతీ ప్రయాణం - ఇవే.
కొన్ని వాస్తవ సంఘటనలే ఈ కథకు ఆధారం అని దర్శకుడు ముందే చెప్పాడు. ఈ సినిమా చూస్తునంత సేపు, కనీసం చివర్లో ఈమధ్య జరిగిన విషయాలే గుర్తొస్తుంటాయి. ప్రేమపై ఫ్ఫై ఏళ్ల క్రితం ఎలాంటి ఆక్షేపణలున్నాయో, ప్రేమికులకు ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయో.. ఇప్పటికీ అవే కనిపిస్తున్నాయన్నమాట. దర్శకుడిపై `సైరత్` ప్రభావం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. `గౌరవం` లాంటి చిత్రాలు సైతం పరువు హత్యల నేపథ్యంలో సాగినవే. కాకపోతే.. తెలంగాణ నేపథ్యాన్ని ఎంచుకోవడం వల్ల కొత్తందం వచ్చింది.
అప్పటి పెత్తందారీ వ్యవస్థ, నక్సలిజం, కట్టుబాట్లు.. వీటి మధ్య ప్రేమకథ.. మొత్తానికి ప్రేక్షకుల్ని 30 ఏళ్ల క్రితం నాటికి తీసుకెళ్లిపోయాడు. హీరో హీరోయిన్లు కలుసుకోవడాలూ, ముద్దులు పెట్టుకోవడాలూ, రొటీన్‌గా ప్రేమ ప్రమాణాలు చేసుకోవడం ఈ సినిమాలో కనిపించదు. కేవలం కళ్లతో ప్రేమించుకుంటారు. చూపులతో మాట్లాడుకుంటారు. అయితే ఆ సన్నివేశాలన్నీ బాగా రిజిస్టర్ అయిపోతాయి.
ద్వితీయార్థంలో కథ ఎమోషనల్‌గా పరుగులు పెడుతుంది. ప్రేమికుల మధ్య అగాథం.. భావోద్వేగాలకు గురి చేస్తుంది. కథ సుఖాంతం అయ్యిందనుకునేలోగా... ఓ భారమైన మలుపు తిప్పి - ముగించాడు దర్శకుడు. బహుశా ఈ ముగింపే ఇలాంటి కథల్ని చరిత్రలో మిగిలిపోయేలా చేస్తుంటాయేమో..? కథని ఇలా ముగించడం సినిమాటిక్ ఏం కాదు. ఎందుకంటే సమాజంలో ఇప్పటికీ జరుగుతున్న తంతు ఇదేగా?!
దర్శకుడి కథలో నిజాయతీ ఉంది. దాన్ని నిజాయతీగానే ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. కథని మొదలెట్టిన తీరు, ముగించిన విధానం రెండూ నచ్చుతాయి. మధ్యలో నక్సలిజానికీ, ప్రేమకీ ముడిపెట్టి చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. అయితే రాజు-దేవకిల ప్రేమకథ మరింత ఉన్నతంగా, మహోత్తరంగా రాసుకునే అవకాశం ఉందనిపించింది. వీరిద్దనీ చూపులకే పరిమితం చేయడం, ఆ సన్నివేశాలన్నే నమ్ముకుని విశ్రాంతి ఘట్టం వరకూ కథని లాక్కుని రావడానికి ప్రయత్నించడం ఇబ్బంది కలిగిస్తుంది. కథ చాలా స్లోగా వెళ్తుంది. ఓ నవల చదువుతున్న ఫీలింగ్ కలుగుతుంటుంది. ప్రేక్షకుల్ని అంత ఓపిగ్గా కూర్చోబెట్టడం కూడా కష్టమే.
* ప్లస్ పాయింట్స్
+నటీనటులు
+క్లైమాక్స్
+తెలంగాణ నేపథ్యం
* మైనస్ పాయింట్స్
-రొటీన్ కథ
* ఫైనల్ వర్డిక్ట్: మన `సైరత్`
- రివ్యూ రాసింది శ్రీ.