తారాగణం: ఆశిష్ రాజ్, దీక్షా పంత్, సిమ్రాన్ శర్మ, కైరా దత్
సంగీతం: సాయి కార్తీక్
ఛాయాగ్రహణం: ప్రసాద్ GK
ఎడిటర్: శివ ప్రసాద్
నిర్మాతలు: విజయ్ కరణ, కౌశల్ కరణ్, అనిల్ కరణ్
దర్శకత్వం: RV సుబ్రహ్మణ్యం
రేటింగ్: 2/5
కొత్త దర్శకుల నుంచి కచ్చితంగా కొత్త తరహా ప్రయత్నాలే ఆశిస్తాం. ఎందుకంటే.. వాళ్లే.. కాస్త ఫ్రెష్‌గా ఫిల్మ్‌నగర్‌లో అడుగుపెడతారు కాబట్టి. సదరు కొత్త దర్శకులు కూడా రొడ్డకొట్టుడు ఫార్ములా కథల్ని పట్టుకొస్తే మాత్రం... ప్రేక్షకుల ఈగో హర్ట్ అవుతుంది. అలా... ఆడియన్స్ ఈగోతో ఆడేసుకున్న మరో సినిమా... `ఈగో`.
* కథ
గోపి (ఆశిష్ రాజ్), ఇందు (సిమ్రాన్) చిన్నప్పటి నుంచి బద్ద శత్రువులు. ఒకరంటే ఒకరికి పడదు. పైగా ఇద్దరికీ ఈగో ఎక్కువే. అమలాపురంలో వీళ్ల ఈగోకి బలైపోయిన వాళ్లు చాలామంది. అయితే కథ సగం దూరం నడిచే సరికి గోపీ, ఇందులు ప్రేమలో పడిపోతారు. తమ మధ్య ఉన్నది ఈగో కాదు. ప్రేమ అని తెలుసుకునే లోగా గోపీ ఓ కేసులో ఇరుక్కుంటాడు. అందులోంచి గోపీ ఎలా బయటపడ్డాడు? ఈగోలతో మొదలైన గోపీ, ఇందుల ప్రేమ కథ చివరికి ఏ మజిలీకి చేరుకుంది? అనేది తెరపై చూడాలి.
* నటీనటులు
ఆకతాయి హీరో చేసిన మరో ప్రయత్నం ఇది. ఆశిష్‌రాజ్ చలాకీగానే కనిపించాడు. డాన్సులు బాగా చేశాడు. కాకపోతే.. అక్కడక్కడ బిగుసుకుపోయాడు.
సిమ్రాన్ ది హీరోయిన్ ఫేస్ కట్ కాదు. నటనా అంతంత మాత్రమే. రావు రమేష్, అజయ్‌లు ఉన్నా... వారి పాత్ర పరిధి తక్కువ. ఉన్నంతలో ఫృథ్వీ పరవాలేదనిపించాడు. మిగిలినవాళ్లవన్నీ చిన్న చిన్న పాత్రలే.
* విశ్లేషణ
నాయకా నాయికలు ముందు గొడవ పడడం, ఆ తరవాత మెల్లగా ప్రేమికులుగా షిఫ్ట్ అవ్వడం చాలా సినిమాలుగా జరుగుతూనే ఉంది. సరిగ్గా ఈగో కథ కూడా అలాందిదే. హీరో హీరోయిన్లు ముందు గొడవ పడినా, ఆ తరవాత లవ్వాడేసుకుంటారన్న సంగతి... టైటిల్ కార్డ్ పడినప్పుడే ప్రేక్షకుడు గెస్ చేస్తాడు. అతని తెలివితేటల్ని వృధా చేయనివ్వలేదు దర్శకుడు. విశ్రాంతి కార్డు పడే సరికే వాళ్ల మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఆ వెంటనే ఇద్దరూ కలుసుకోనివ్వకుండా చేసి టైమ్ పాస్ చేశాడు.
సినిమా మరీ ఇంత రొటీన్‌గా జరిగిపోతోందేంటి అనుకున్నప్పుడు ఓ మర్డర్ ట్విస్ట్ వచ్చింది. అందులోంచి హీరో బయటపడడానికి తనలోని యాక్షన్ స్కిల్స్‌ని బయటకు తీసుకురావాల్సివచ్చింది. మర్డర్ మిస్టరీ వరకూ ఈగో మామూలు కథ. ఆ తరవాత పెద్ద గొప్పగా ఏం ఉండదు. కేసులోంచి బయటకు రావడానికి హీరో తన అమలాపురం తెలివితేటల్ని వాడినట్టు చూపిస్తే బాగుండేది. కానీ.. అక్కడ కూడా దర్శకుడు వైవిధ్యం ఏమీ చూపించకపోవడంతో.... ఈగో ఓ సగటు చిత్రంగా మిగిలిపోతుందంతే. తొలిసగంలో కాస్త కామెడీ, ఫృథ్వీ చేసిన అల్లరి, అక్కడక్కడ మెరిసిన డైలాగులు తప్ప.. ఈ సినిమాలో ఇంకేం లేకుండా పోయాయి.
* సాంకేతిక వర్గం
సాయికార్తీక్ అందించిన బాణీలు బాగున్నాయి. పాటల వరకూ ఓకే. దర్శకుడు రాసిన మాటలు ఛమక్కులు బాగున్నాయి. కానీ కథ, కథనాలు చప్పగా సాగాయి. ఇది అమలాపురం పరిసర ప్రాంతాల్లో సాగే కథ. దానికి తగ్గట్టుగా కోనసీమ అందాల్ని చూపించినా బాగుండేది.
* ప్లస్ పాయింట్స్
+ ఫృథ్వీ కామెడీ
* మైనస్ పాయింట్స్
- మిగిలినవన్నీ
* ఫైనల్ వర్డిక్ట్: ప్రేక్షకుల ఈగో హర్ట్ అయ్యింది.
రివ్యూ బై శ్రీ