ఫ్యామిలీస్టార్‌ మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

కొన్ని కాంబినేషన్లకు భలే క్రేజ్ వుంటుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ - ప‌ర‌శురామ్ లది కూడా అలాంటి కాంబోనే. ‘గీత గోవిందం’తో సూపర్ హిట్ కొట్టారు. విజయ్ కి తొలి వందకోట్ల సినిమా అది. ఇప్పుడు ‘ది ఫ్యామిలీస్టార్‌’తో ఈ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులముందుకు వచ్చింది. మరి మరోసారి మ్యాజిక్ చేశారా? విజయ్‌ ఖాతాలో మరో హిట్‌ పడిందా? 


కథ: గోవ‌ర్ధన్ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌)ది మ‌ధ్య త‌ర‌గ‌తి ఉమ్మడి కుటుంబం. తను సివిల్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తుంటాడు. మ‌ద్యానికి బానిసైన పెద్దన్నయ్య, ఇంకా స్థిరపడని చిన్నన్నయ్య.. వాళ్ళ పిల్లలు, బామ్మ .. ఇలా అందరినీ తన జీతంతో నెట్టుకొస్తుంటాడు గోవ‌ర్ధన్.  ఇందు (మృణాల్ ఠాకూర్‌) గోవర్ధన్ పెంట్ హౌస్ లో అద్దెకు దిగుతుంది. వ‌చ్చీ రాగానే గోవ‌ర్ధన్‌ని, అత‌ని కుటుంబాన్నీ అర్థం చేసుకుని వాళ్లతో క‌లిసిపోతుంది. గోవ‌ర్ధన్, ఇందు ఇద్దరూ ప్రేమ‌లో ప‌డిపోతారు. ఇంతలో ఇందు గురించి ఓ నిజం తెలుసుకుంటాడు గోవర్ధన్. అస‌లు ఇందు ఎవ‌రు? గోవ‌ర్ధన్ జీవితంలోకి ఎందుకు వ‌చ్చింది? ఇవన్నీ తెరపై చూడాలి.  


విశ్లేషణ: కథ కంటే కథనంపై ఎక్కువ ద్రుష్టి పెట్టే దర్శకుడు ప‌ర‌శురామ్. గీత గోవిందం కథగా చెప్పుకుంటే అందులో పాయింట్ చిన్నదే. కానీ కథనంలో వుంది అసలు మ్యాజిక్. ఫ్యామిలీ డ్రామాతో పాటు ఫన్ చక్కగా వర్క్ అవుట్ అయ్యింది. కానీ ఫ్యామిలీ స్టార్ లో అదే దెబ్బకొట్టింది.  ‘ఐ ల‌వ్ యూ’ అనే మాట ఓ వ్యక్తికి చెప్పేది కాదు, ఓ కుటుంబానికి చెప్పేది'' ఈ సినిమాలో హీరో చెప్పే డైలాగ్ ఇది. నిజానికి ఈ కథ కూడా ఈ పాయింట్ చుట్టూ తిరగాల్సింది. కానీ అందులో కోర్ పాయింట్ ని వదిలేసే ఎక్కడెక్కడో ఒక దిశా నిర్దేశం లేకుండా సన్నివేశాలు జంప్ కొడుతూ చాలా సాదాసీదాగా సాగిపోతుంది ఫ్యామిలీ స్టార్. ఇటు కామెడీ వర్క్ అవుట్ అవ్వదు. క‌థ‌, క‌థ‌నాలు కూడా ఏ దశలోనూ ఆసక్తికరంగా ముందుకు సాగలేదు.  


విజయ్ పాత్రలో చూపించే పొదుపు పాఠాలు పెద్ద కొత్తగా వుండవు. మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ని పట్టుకోవడానికి దర్శకుడు ఇంకాస్త క్రియేటివ్ వర్క్ చేయాల్సింది. ఇందు పాత్ర రాక త‌ర్వాత కూడా స‌న్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. ఇంటర్వెల్ కు ముందు వ‌చ్చే స‌న్నివేశాలు మాత్రం కొంత  ఆస‌క్తికరంగా వుంటాయి. ద్వితీయార్ధంపై అంచ‌నాలని తారుమారు చేస్తుంది. అమెరికా నేప‌థ్యంలో సాగే ద్వితీయార్ధం తేలిపోయింది. ప్రీక్లైమాక్స్ ఇచ్చుకున్న ట్రీట్మెంట్ చాలా పాతది. క్లై మాక్స్ కూడా చాలా సినిమాటిక్ బగా ఒక దశలో అతిగా అనిపిస్తుంది.


నటీనటుల నటన: గోవ‌ర్ధన్ పాత్రలో విజయ్ ఒదిగిపోయాడు. తన స్క్రీన్ ప్రజన్స్ ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణ. మృణాల్ పాత్ర హుందాగా వుంది. అందంగా కనిపించింది. సెకండాఫ్‌లో ఆమె పాత్రని పేలవంగా రాసుకున్నారు. జ‌గ‌ప‌తిబాబు, వెన్నెల కిశోర్‌, ప్రభాస్ శ్రీను ఈ పాత్రలు రొటీన్ గా వున్నాయి..  రోహిణి హ‌ట్టంగ‌డి పోషించిన బామ్మ పాత్ర  సీతమ్మ వాకిట్లో సినిమాని గుర్తు తెచ్చినప్పటికీ పర్వలేదనిపిస్తుంది. దివ్యాంశ కౌశిక్ పాత్రకు ప్రాధాన్యత లేదు. 


టెక్నికల్ గా: సాంకేతికంగా సినిమా ఓకే అనిపిస్తుంది. గోపిసుందర్ నేపధ్య సంగీతం ఓకే కానీ పాటలు అంతగా మెప్పించవు, కళ్యాణి పాట రోలింగ్ టైటిల్స్ కి వెళ్ళిపోయింది.  కెమరాపనితనం డీసెంట్ గా వుంది. మాటల్లో ప‌ర‌శురామ్ మార్క్ తగ్గింది. కథ కథనంలో పూర్తిగా నిరాశపరిచాడు. 


ప్లస్ పాయింట్స్ 
విజయ్, మృణాల్ 
ఫస్ట్ హాఫ్ 


మైనస్ పాయింట్స్ 
కథ, కథనం 
సెకండ్ హాఫ్ 
ఎమోషన్ లేని ఫ్యామిలీ డ్రామా 


ఫైనల్ వర్దిక్ట్ : మెరవని నక్షత్రం..


ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.25/5
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS