నటీనటులు: సందీప్ మాధవ్, సత్య దేవ్, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, వినయ్ వర్మ, అభయ్, ముస్కాన్, మహాతి తదితరులు.
దర్శకత్వం: జీవన్ రెడ్డి
నిర్మాతలు: అప్పిరెడ్డి
సంగీతం: సురేష్ బొబ్బిలి
విడుదల తేదీ: నవంబర్ 22, 2019
రేటింగ్: 3/5
ఈమధ్య కాలంలో చిన్న సినిమాల్లో బాగా కుదిపేసిన పేరు `జార్జ్ రెడ్డి`. ఈ పేరుతో ఓ సినిమా వస్తుందనగానే జార్జిరెడ్డి గురించి తెలిసినవాళ్లు, తెలియనివాళ్లు సైతం ఉత్సుకత కనబరిచారు. జార్జ్‌రెడ్డి ఎవరో తెలుసుకోవాలని తపించారు. అందుకే `జార్జ్‌రెడ్డి`కి విపరీతమైన ప్రచారం లభించింది. దానికి తోడు టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో `జార్జ్‌రెడ్డి`పై అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? విద్యార్థి నాయకుడి జీవితం ఈ తరానికి అర్థమయ్యేలా, నచ్చేలా దర్శకుడు తీయగలిగాడా? లేదా?
చూద్దాం...
* కథ
జార్జ్‌రెడ్డి (శాండీ) స్వస్థలం కేరళ. పుట్టి పెరిగింది అక్కడే. ఉస్మానియాలో పై చదువుల కోసం వస్తాడు. ఇక్కడి విద్యార్థి రాజకీయాలు, తారతమ్యాలు, రౌడీయిజంపై తిరుగుబాటు చేస్తాడు. తోటి విద్యార్థులలో చైతన్య స్ఫూర్తి రగిలిస్తాడు. అయితే అప్పటి వరకూ క్యాంపస్‌ని తమ గుప్పెట్లోకి తీసుకున్నవాళ్లు, జార్జ్‌రెడ్డి తిరుగుబాటుకి ఎదురుదెబ్బలు తిన్నవాళ్లూ జార్జ్‌రెడ్డిపై పగ పెంచుకుంటారు. చివరికి జార్జ్‌రెడ్డిని స్నేహితుడే నమ్మించి - శత్రువులకు అప్పగిస్తాడు. వాళ్ల చేతుల్లో జార్జ్‌రెడ్డి దారుణ హత్యకు గురవుతాడు. జార్జ్‌రెడ్డి గురించిచరిత్ర పుస్తకాల్లో ఉన్న ఈ విషయాలనే తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు.
* నటీనటులు
జార్జ్‌రెడ్డి పాత్రలో శాండీ ఒదిగిపోయాడు. తన నటన సహజంగా ఉంది. కానీ జార్జ్‌లో ఉండే ఫైర్ మొత్తం తాను చూపించలేకపోయాడేమో అనిపిస్తుంది. కథానాయిక అందంగా కనిపించింది. నటించే అవకాశమే పూర్తిగా రాలేదు. సత్యదేవ్ మరోసారి ఆకట్టుకున్నాడు. ఉన్న కాసేపూ తన నటన నచ్చుతుంది. మనోజ్ నందం, చైతన్య కృష్ణ చాలా సహజంగా నటించారు.
* సాంకేతిక వర్గం
ఇది టెక్నీషియన్స్ సినిమా అని చెప్పొచ్చు. 1960ల నాటి వాతావరణం ప్రతిబింబించడం, అప్పటి కాస్ట్యూమ్స్‌ని వాడడం ఇవన్నీ బాగున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ సెట్ వేశారు. అందులో సహజత్వం మిస్ అయ్యింది. ఛాయాగ్రహణం, నేపథ్య సంగీతం ప్రాణం పోశాయి. యాక్షన్ విభాగం బాగానే కష్టపడింది. దర్శకుడు జీవన్ రెడ్డిలో కూడా ఫైర్ ఉంది. అయితే జార్జ్‌రెడ్డిలోని ఆవేశాన్ని సంపూర్ణంగా చూపించడంలో తడబడ్డాడు.
* విశ్లేషణ
ఇది జార్జ్‌రెడ్డి బయోపిక్. చరిత్రని ఎక్కడా వక్రీకరించకుండా, లేనిదేదో చూపించడానికి ప్రయత్నించకుండా కేవలం జార్జ్‌రెడ్డి వ్యక్తిత్వం, అతనిలో ఉన్న ఆవేశంపైనే ఫోకస్ పెడుతూ ఈకథని నడిపించాడు దర్శకుడు. జార్జ్‌రెడ్డిలో కోపం, ఆవేశం ఈ సమాజంపై, తోటి విద్యార్థులపై ఎలాంటి ప్రభావం చూపించిందో చక్కగా చూపించాడు. ఆ తరం విద్యార్థులకు గత స్మృతులు గుర్తొస్తాయి. జార్జ్‌రెడ్డి గురించి తెలిసిన వాళ్లకూ, అతని సన్నిహితులకూ... ఈ చిత్రం ఓ ఉద్వేగభరితమైన అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు.
కాకపోతే... అప్పటి వాతావరణం ఇప్పుడు లేదు. కాలేజీలో ఉద్యమాలు అంతగా లేవు. రౌడీయిజం, ధనిక పేద తారతమ్యం తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కథని ఇప్పటి విద్యార్థులు ఎంత వరకూ తమకు తాము అన్వయించుకుంటారన్నది ప్రశ్నార్థం. ఈ కథ ఎప్పుడూ విద్యార్థులు, వాళ్ల గొడవల చుట్టే తిరుగుతాయి. ఒక దశ దాటాక..`వీళ్లెప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారా?` అనే అసహనం ప్రేక్షకులలో కలుగుతుంది. జార్జ్‌రెడ్డిలో చాలా ఆవేశం, కోపం ఉన్నాయి. వాటిని సరైన రీతిలో ఆవిష్కరించలేదనిపిస్తుంది. ద్వితీయార్థంలో చాలా సాగదీత ఉంది. అనవసరమైన సన్నివేశాలు కనిపిస్తాయి. అవి పక్కన పెడితే కథలో మరింత వేగం వచ్చేది. పతాక సన్నివేశాల్లో మాత్రం దర్శకుడు మళ్లీ ట్రాక్ ఎక్కాడు. జార్జ్‌రెడ్డిని హత్య చేసే సన్నివేశం సహజంగా అనిపించేలా తెరకెక్కించాడు.
ఇప్పటి ఓ రిసెర్చ్ స్కాలర్ జార్జ్‌రెడ్డి జీవితంపై డాక్యుమెంటరీ తీయాలనుకుంటుంది. ఆ కోణంలోంచి ఈ కథ మొదలెట్టారు. నిజానికి ఈ తరహా స్క్రీన్ ప్లే ఈ సినిమాకి అవసరం లేదు. దాన్ని స్ట్రయిట్ నేరేషన్‌లో చెప్పినా సరిపోయేది. ముంబై యూనివర్సిటీలో అవకాశం వచ్చినా జార్జ్ ఎందుకు వెళ్లలేదు అనే సన్నివేశంలో స్పష్టత లేకుండా పోయింది. సత్య పాత్ర అర్థాంతరంగా మాయం అయిపోతుంది. ఇలాంటి లోటు పాట్లు కొన్ని కనిపిస్తూనే ఉంటాయి.
* ప్లస్ పాయింట్స్
టైటిల్
జార్జ్‌రెడ్డి వ్యక్తిత్వం
సాంకేతిక విభాగం
* మైనస్ పాయింట్స్
సాగదీత
* ఫైనల్ వర్డిక్ట్: జీనా హైతో మర్‌నా సీఖో.. కదం కదం పర్ లడ్ నా సీఖో..
- రివ్యూ రాసింది శ్రీ