నటీనటులు: వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర తదితరులు
దర్శకత్వం : కిరణ్ కొర్రపాటి
నిర్మాతలు: అల్లు బాబీ, సిద్దు ముద్ద
సంగీత దర్శకుడు: థమన్
సినిమాటోగ్రఫీ: జార్జ్ సి విలియమ్స్
ఎడిటర్ : మార్తాండ్ కే వెంకటేష్
రేటింగ్ : 2.5/5
బాక్సింగ్ మెగా ఫ్యామిలీ బాగా కలిసొచ్చిన స్పోర్ట్. పవన్ కళ్యాణ్ ని ప్రేక్షకులు తొలిసారి చూసింది బాక్సింగ్ రింగ్ లోనే. తర్వాత బాక్సింగ్ నేపధ్యం వున్న 'తమ్ముడు' సినిమాతో ప్రేక్షకులు మరింత దగ్గరయ్యారు పవర్ స్టార్. ఇప్పుడు మెగా హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపధ్యం వున్న 'గని' సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచే ఆసక్తిని పెంచింది. వరుణ్ బాక్సింగ్ రింగ్లో కనిపించడంతో తమ్ముడు సినిమాతో పోలికలు వచ్చాయి.
ట్రైలర్ ఆ అంచనాలని ఇంకా పెంచింది. పైగా వరుణ్ తేజ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ సినిమాగా కూడా గని ఆసక్తి కలిగించింది. వరుణ్ తేజ్ తో పాటు ఉపేంద్ర, సునీల్ శెట్టి లాంటి పాన్ ఇండియా స్టార్లు సినిమాలో భాగమయ్యారు. ఇన్ని అంచనాల మధ్య వచ్చిన 'గని'లో ఏముంది ? బాక్సింగ్ పంచ్ హిట్ అయ్యిందా ? బాక్సింగ్ నేపధ్యం మరోసారి కలిసొచ్చిందా ? ఒక్కసారి కథలోకి వెళితే..
కథ:
విక్రమ్ ఆదిత్య (ఉపేంద్ర)స్టేట్ లెవల్ బాక్సింగ్ ఛాంపియన్. తను ప్రాక్టీస్ చేసిన చోట ఎలాంటి సౌకర్యాలు వుండవు. ప్రాక్టీస్ లో ఆటగాళ్ళకు గాయాలు అవుతుంటాయి. ఎలాగైనా నేషనల్స్ గెలిచి బాక్సింగ్ కి మంచి రోజులు తీసుకురావాలని కల గంటాడు. అయితే డ్రగ్స్ వాడి ఆటలో పాల్గొన్నాడనే కారణంతో విక్రమ్ ని బ్యాన్ చేస్తారు. విక్రమ్ కొడుకు గని( వరుణ్ తేజ్) భార్య మాధురి (నదియా). విక్రమ్ చేసిన పని వలన అనేక అవమానులు ఎదురుకుంటారు.
తన తండ్రిలానే బాక్సర్ అవ్వాలని చిన్నప్పుడే కలగంటాడు గని. అయితే జీవితంలో మళ్ళీ బాక్సింగ్ జోలికి వెళ్ళకూడదని గని దగ్గర మాట తీసుకుంటుంది మాధురి. పెరిగిపెద్దవాడైన గని, తల్లికి తెలియకుండా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. నేషనల్ ఛాంపియన్ గా నిలిచిన తన కుటుంబానికి జరిగిన అవమాన్ని తుడిచేయాలనేది గని లక్ష్యం. ఇలా వుండగా విజయేంధర్ సిన్హా (సునీల్ శెట్టి ) రూపంలో గనికి తన తండ్రి గురించి ఓ నిజం తెలుస్తుంది. ఏమిటా నిజం? అసలు విక్రమ్ ఆదిత్యకి ఏం జరిగింది? ఈశ్వర్ (జగపతి బాబు) రూపంలో గనికి ఎదురైన సవాళ్ళు ఏంటి ? గని తన లక్ష్యాన్ని చేరుకున్నాడా ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
స్పోర్ట్స్ కథలన్నీ దాదాపు ఒకే ఫార్ములాలో వుంటాయి. కథానాయకుడికి ఆట పై ప్యాషన్ వుండటం. గ్యమాన్ని చేరే ప్రయత్నంలో కొన్ని అడ్డంకులు, ఎత్తుపల్లాలు .. వాటిని అధికమించి చివరికి హీరో విజయాన్ని అందుకోవడం. దాదాపు ఇదే ఫార్ములా వుంటాయి. గని కథని కూడా ఇదే ఫార్ములాలో అల్లుకున్నారు. అయితే ఇక్కడ కొత్త పాయింట్ ఏమిటంటే.. ఆటని గెలిపిచాలనే వ్యక్తి కథ ఇది. తన తండ్రి ఆశయాలని నెరవేర్చే కొడుకు కథ. అయితే ఈ కథని డీల్ చేసిన విధానం మాత్రం ఆసక్తికరంగా లేదు.
సినిమాకి ఒక కథ అనుకున్నప్పుడు 'వారెవ్వా' అనుకునే కొన్ని సీన్లు వుండాలి. కానీ 'గని' సినిమా ప్రారంభమైప్పటి నుంచి చివరి దాక ఏదో సాగుతుందనే మాటే గానీ సూపర్ అనుకున్న సీన్ ఒక్కటీ వుండదు. పైగా సీన్స్ లో కొత్తదనం లేదు. చాలా సార్లు చూసిన సన్నివేశాలే కనిపిస్తాయి. హీరో ఎంట్రీ పరమ రొటీన్ గా వుంటుంది. హీరో ప్రేమ కథ కూడా ఎలాంటి క్లారిటీ లేకుండా వుంటుంది. మొదటి బాగంలో కథ ఏమీ వుండదు కాబట్టి హీరోయిన్ తో ఏదో ఫిల్ చేశారనే మాటే తప్పా .. కధకు ముందుకు నడిపే వ్యవహారం ఏమీ మొదటి సగంలో కనిపించదువు. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా ఏమంత గొప్పగా అనిపించదు. సినిమా ఓపెనింగ్ సీన్ లో ఓ షాట్ ని దాచేసి ఆ షాటే ఇంటర్వెల్ ట్విస్ట్ అని ఏదో మ్యాజిక్ చేద్దామని అనుకున్నాడు దర్శకుడు. కానీ అది ఏమంత ఎఫెక్టీవ్ గా వుండదు.
రెండో సగం ఆరంభంలో ఉపేంద్ర ఎపిసోడ్ కొంత బెటరు. ఈ ఎపిసోడ్ అయిన తర్వాత సినిమా అంతా బాక్సింగ్ రింగ్ లోనే పూర్తయిపోతుంది. జగపతి బాబు పాత్ర రూపంలో హీరోకి ఒక ఛాలెంజ్ ఎదురైనప్పటికీ .. ఆ పాత్ర రింగ్ అవతల వుంటుంది కాబట్టి ప్రేక్షకుడు అంత కనెక్ట్ కాలేకపోతాడు. పైగా విలనిజం ఏమంత ఫ్రెష్ గా వుండదు. రింగ్లో ఫైట్స్ కూడా టెన్షన్ క్రియేట్ చేయలేకపోయాయి. హీరో గెలవం ఖాయమనే భావన అరగంట ముందే వచ్చేసి రీప్లేయ్ చూస్తున్న మ్యాచ్ రిలాక్స్ గా చూస్తాడు తప్పా ఏం జరుగుతుందనే టెన్షన్ కలిగించలేకపోయారు. చివరిగా చాలా సాదాసీద ఎండింగ్ తో కథకు శుభం కార్డ్ పడిపోతుంది.
నటీనటులు :
వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఆ కష్టం తెరపై కనిపిస్తుంది. గని పాత్రలో సహజంగా కనిపించాడు. బాక్సింగ్ రింగ్ లో రియల్ బాక్సర్ లా కనిపించాడు. ఎమోషనల్ సీన్స్ ని కూడా చక్కగా చేశాడు. వరుణ్ నటనలో మరింత పరిణితి కనిపించింది. అయితే గని పాత్రకు బలమైన కథ తోడవ్వలేదు.
హీరోయిన్ సాయీ మంజ్రేకర్ అందంగా కనిపించింది. అయితే పాత్రకు పాధాన్యత లేదు. సెకండ్ హాఫ్ లో ఒక్క డైలాగ్ ఇవ్వలేదు. ఉపేంద్ర పాత్ర బావుంది. బాక్సర్ గా ఫిట్ గా కనిపించాడు. తన పాత్రని సునాయాసంగా చేశాడు.
సునీల్ శెట్టి ఈ వయసులో కూడా ఫిట్ గా కనిపించడం మెచ్చుకోదగ్గ విషయం. గని కోచ్ గా, మాజీ ప్లేయర్ గా తన పాత్ర వరకూ చక్కగా చేశాడు. సెకండ్ హాఫ్ లో జగపతి బాబు పాత్ర లీడ్ తీసుకుంటుంది. అయితే ఇది తనకి అలవాటైన పాత్రే. ఆయన్ని మరోసారి స్టయిలీష్ విలన్ గా చూడొచ్చు.
తల్లి పాత్రలో కనిపించిన నదియాకి కూడా మంచి మార్కులు పడతాయి. తమన్నా ఎప్పటిలానే స్పెషల్ సాంగ్ లో గ్రేస్ ఫుల్ గా కనిపించింది. నరేష్ చేసిన కామెడీ పెద్దగా నవ్వించలేదు. మిగతా నటులు పరిధి మేర చేశారు.
సాంకేతిక విభాగం:
తమన్ సూపర్ ఫామ్ లో వున్నాడు. అయితే గనికి పాటలకు అవకాశం తక్కువ. మళ్ళీమళ్ళీ పాడుకునే ట్యూన్ ఇందులో లేదు. బహుశా బాక్సింగ్ నేపధ్యంలో పాటలు పై ద్రుష్టి పెట్టలేదు. నేపధ్య సంగీతం బావుంది.
జార్జ్ విలియమ్స్ కెమరాపనితనం కు మంచి మార్కులు పడాతాయి. విజువల్స్ రిచ్ గా వున్నాయి. బాక్సింగ్ నేపధ్యంలో వచ్చిన యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ ఇంకాస్త సార్ఫ్ గా ఉండాల్సింది. అబ్బూరి రవి రాసిన మాటలు కొన్ని బావున్నాయి. నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
వరుణ్ తేజ్, ఉపేంద్ర
బాక్సింగ్ నేపధ్యం
మైనస్ పాయింట్స్ :
కొత్తదనం లేని కథ
బలహీనమైన కథనం
ఫైనల్ వర్దిక్ట్ : పంచ్ లో పవర్ లేదు