తారాగణం: వెంకటేష్, రితికా సింగ్, నాజర్, జాకీర్ హుసేన్
బ్యానర్: వై నాట్ స్టూడియోస్
కెమరామెన్: కే ఏ శక్తివేల్
సంగీతం: సంతోష్ నారాయణన్
నిర్మాత: ఎస్ శశికాంత్
రచన-దర్శకత్వం: సుధా కొంగర
వెంకటేష్‌కి రీమేక్ కథలు భలే బాగా అచ్చొచ్చాయి. ఆయన సినిమాల్లో సగానికి సగం.. రీమేక్‌లే. అందులో హిట్స్ శాతం కూడా అధికంగా ఉండడంతో రీమేక్ ప్రయాణమే సో.. బెటరు అనుకొని దూసుకుపోతున్నాడు వెంకీ. తాజాగా ఆయన్నుంచి మరో రీమేక్ వచ్చింది. అదే... 'గురు'. బాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకొన్న 'సాలా ఖడూస్'కి ఇది రీమేక్. అక్కడ మాధవన్ నటిస్తే.. ఇక్కడ వెంకీ ఆ పాత్ర పోషించాడు. బాలీవుడ్ చిత్రాన్ని తెరకెక్కించిన సుధా కొంగర.. ఈ రీమేక్‌నీ నడిపించింది. మరి.. ఈ రీమేక్ వెంకీకి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతోంది?? బాలీవుడ్ రిజల్ట్ ఇక్కడా రిపీట్ అయ్యిందా? తేలాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
* కథ ఎలా సాగిందంటే...
రాములు (రితికా సింగ్) కూరగాయలు అమ్ముకొంటుంది. అక్క లక్స్ (ముంతాజ్ సర్కార్) ఓ బాక్సర్. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించడానికి తెగ ప్రయత్నిస్తుంటుంది. తన కోచ్... ఆది (వెంకటేష్). రాములులో తెగువ, ధైర్యం చూసి ఆశ్చర్యపోతాడు ఆది. రాములుకు శిక్షణ ఇస్తే బాక్సర్‌గా ఎదుగుతుందన్న నమ్మకంతో రోజుకి రూ.500 వేతనం ఎదురిచ్చి మరీ అకాడమిలో చోటు ఇస్తాడు. రాములులో సత్తా ఉన్నా.. పెంకితనం వల్ల కావాలనే మ్యాచ్‌లు ఓడిపోతుంది. జాతీయ పోటీల కోసం రాముల్ని సన్నద్ధం చేస్తే... బాక్సింగ్ రింగ్‌లో వెటకారంగా ప్రవర్తించి ఆది మనసు విరిచేస్తుంది. మరి ఈ కథ అక్కడితో ఆగిపోయిందా? రాములులో బాక్సర్ కావాలన్న తపనని ఆది ఎలా కలిగించాడు? రాములు బాక్సింగ్ ఛాంపియన్ ఎలా అయ్యింది? అకాడమిలోని రాజకీయాలెలా ఉంటాయి? ఇవన్నీ తెలియాలంటే 'గురు' చూడాల్సిందే.
* నటీనటుల ప్రతిభ...
ఇలాంటి పాత్రల్ని వెంకటేష్ తప్ప ఇంకెవ్వరూ చేయలేరేమో అనుకొనేంత అందంగా.. నటించాడు వెంకటేష్. ఈ పాత్ర కోసం తను పడిన తపన కనిపిస్తూనే ఉంటుంది. తనని డీ గ్రేడ్ చేస్తూ కొన్ని డైలాగులు రాశారంటే.. అది వెంకీ ఇచ్చిన నమ్మకమే. పతాక సన్నివేశాల్లో వెంకీ నటన మరీ మరీ నచ్చుతుంది.
బాలీవుడ్‌లో నటించిన రితికా సింగ్‌నే మళ్లీ తెలుగులో తీసుకొచ్చారు. ఆ పాత్రని రీప్లేస్ చేయడం నిజంగానే చాలా కష్టం. ఎందుకంటే రితిక అంత బాగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయగలిగింది. చాలా సహజంగా నటించిన రితికకి వెంకీ కంటే ఎక్కువ మార్కులే పడతాయి.
నాజర్ హిందీలో ఏం చేశాడో.. తెలుగులోనూ అదే చేశాడు. అవే డైలాగులు... అదే నటన... కాపీ పేస్ట్. రవిబాబు యధావిధిగా ఓవరాక్షన్ చేశాడు. మిగిలినవాళ్లంతా ఓకే.
* తెరపై ఎలా నడిచిందంటే...?
సాలా ఖడూస్‌ని తెలుగులో గురుగా మార్చేటప్పుడు పెద్దగా మార్పులేం చేయలేదు సుధా కొంగర. అక్కడ ఎమోషన్స్‌ని ఉన్నది ఉన్నట్టు మళ్లీ సృష్టించాలంటే... కథని, సన్నివేశాల్నీ డిట్టో దింపేయడం మినహా మరో మార్గం లేదని భావించారో ఏమో.. సీన్ బై సీన్.. దింపేసే ప్రయత్నం చేశారు. రీమేక్ గురించి ఆలోచించకుండా, హిందీ సినిమా ఇది వరకే చూసుంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేసి.. ఈ 'గురు' చూడాలి. అప్పుడు నిజంగానే 'గురు' ఓ కొత్త అనుభూతి కలిగిస్తాడు. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే చిత్రాలు తెలుగులో చాలా తక్కువ. కాబట్టి.. ఆ వాతావరణం, పాత్రలు, వాటి ప్రవర్తన, ఎమోషన్స్ ఇవన్నీ మనకు కొత్తగానే కనిపిస్తాయి. అకాడమిలో రాజకీయాలతో సినిమా సీరియెస్‌గా మొదలవుతుంది. ఆ టెంపో చివరి వరకూ అలానే సాగుతుంది. రాములు పాత్ర, తన అల్లరి.. ఇవే వినోదం పంచిచ్చే విషయాలు. ఓ పెంకి పిల్లని బాక్సర్‌గా మార్చడంలో గురువు పడే తపన, చేసే త్యాగాలూ ఆకట్టుకొంటాయి. ద్వితీయార్థం కాస్త నెమ్మదించినా, పతాక సన్నివేశాలు భావోద్వేగ భరితంగా సాగడంతో ఆ కొరత తీరిపోతుంది. రెగ్యులర్ సినిమాలు చూసేవాళ్లకు, హీరోయిజం, దాని తాలుకూ రుచిని మాత్రమే అనుభవించే అభిమానులకూ.. ఈ సినిమా ఓ కొత్తదనం పంచుతుంది. వెంకీ పాత్రని వయసైపోయినట్టు చూపించడం, 'ఓ తొంభై ఏళ్లుంటాయా', 'దున్నపోతులా తయారయ్యావ్' అంటూ వెంకీపైనే డైలాగులు రాసుకోవడానికి ధైర్యం ఉండాలి. ఓ స్ఫూర్తివంతమైన కథని, నిజాయతీగా అందించే ప్రయత్నం ఈసినిమాలో కనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు కంట్లో నీళ్లు తిరిగేలా చేస్తాయి. ఎమోషన్ పార్ట్ పరంగా ఈ సినిమా విజయవంతమైంది.
* సాంకేతిక వర్గం పనితీరు...
దర్శకురాలు రాసుకొన్న స్క్రిప్ట్‌లోనే విషయం ఉంది. బలమైన భావోద్వేగాల్ని ఓ క్రీడా నేపథ్యంలో చెబుతూ నడిపించిన తీరు ఆకట్టుకొంటుంది. అయితే.. తెలుగు వరకూ ఇంకొన్ని మార్పులు చేయాల్సింది. సంతోష్ నారాయణ్ పాటల కంటే నేపథ్య సంగీతానికి ఎక్కువ మార్కులు పడతాయి. ఫొటో గ్రఫీ నీట్‌గా ఉంది. హర్షవర్థన్ మాటలు అక్కడక్కడ ఆకట్టుకొంటాయి.
* ప్లస్ పాయింట్స్
- వెంకీ, రితిక
- క్లైమాక్స్
* మైనస్ పాయింట్స్
- స్లో నేరేషన్
* ఫైనల్ వర్డిక్ట్: గురు.. పాసైపోయాడు
యావరేజ్ యూజర్ రేటింగ్: 3.25/5
రివ్యూ బై: శ్రీ