తారాగణం: సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల, నరేష్, మురళి శర్మ తదితరులు
నిర్మాణ సంస్థ: UV క్రియేషన్స్ & పాకెట్ సినిమా
సంగీతం: శక్తికాంత్ కార్తీక్
ఛాయాగ్రహణం: బాల్ రెడ్డి
నిర్మాతలు: వంశీ-ప్రమోద్
రచన-దర్శకత్వం: లక్ష్మణ్
రేటింగ్:2.75/5
సినిమా టార్గెట్ యువతరమే. వాళ్లని థియేటర్‌కి రప్పించడానికే ప్రయత్నాలన్నీ. అందుకే వాళ్లకు కనెక్ట్ అయ్యే పాయింట్‌పైనే దృష్టి పెడుతున్నారు దర్శకులు, కథకులు. వాళ్ల ఇష్టాలనో, కన్‌ఫ్యూజన్‌నో, కష్టాలనో, ఆనందాలనో కథలోకి తీసుకొస్తే... డ్రైవ్ సులభం అయిపోతుంది. `హ్యాపీ వెడ్డింగ్` ఆలోచన కూడా అందులోంచే పుట్టినట్టు అనిపిస్తుంది. ఈతరంలో ముఖ్యంగా అమ్మాయిల్లో ఉన్న కన్‌ఫ్యూజన్‌ని పాయింట్‌గా చేసుకుని రాసుకున్న కథ ఇది. మరి ఈతరానికి నచ్చేలా దర్శకుడు తీశాడా? హ్యాపీ వెడ్డింగ్ - హ్యాపీ రిజల్ట్ నే అందించిందా??
* కథ
ఆనంద్ (సుమంత్ అశ్విన్), అక్షర (నిహారిక)ల పెళ్లి కుదురుతుంది. ఆనంద్ ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన అక్షర... క్రమంగా ఆనంద్ నిర్లక్ష్యాన్ని భరించలేకపోతుంది. ఆనంద్‌లో మార్పుని తట్టుకోలేకపోతుంది. పెళ్లికి ముందే ఇలా ఉంటే..? పెళ్లయ్యాక తన పరిస్థితేమిటి? పుట్టింట్లో ఉన్న స్వేచ్ఛ అత్తింట్లో ఉంటుందా? పెళ్లి పేరుతో తన ఇష్టాయిష్టాల్ని, కోరికల్ని అన్నీ చంపుకోవాల్సిందే అనే కన్‌ఫ్యూజన్ మొదలవుతుంది. మరి.. అందులోంచి బయటకు రాగలిగిందా? ఈ గందరగోళాల మధ్య తాను ఎలాంటి నిర్ణయం తీసుకొంది? ఆ తరవాత ఏమైంది? అనేదే కథ.
* నటీనటులు పనితీరు...
సుమంత్ అశ్విన్, నిహారిక ఇద్దరూ బాగానే చేశారు. ఇద్దరిలో నిహారికకు ఎక్కువ మార్కులు పడతాయి. రెండో సినిమానే అయినా సరే, అనుభవం ఉన్న నటిలా కనిపించింది. సినిమాని తన భుజాలపై వేసుకుని నడిపించగలదన్న నమ్మకం తీసుకొచ్చింది.
నరేష్, మురళీ శర్మ మరోసారి మంచి నాన్నలుగా క్రెడిట్ కొట్టేస్తారు. అన్నపూర్ణ నోటి నుంచి కాస్త ముతక జోకులు, సామెతలు చెప్పించడం బాలేదు. మిగిలిన వాళ్లంతా అనుభవజ్ఞులే కాబట్టి.. ఎవరి నటనకీ వంక పెట్టలేం.
* విశ్లేషణ
ప్రతీ అబ్బాయికీ అమ్మాయికి పెళ్లి ఓ పండగ. జీవితంలో ఓ ముఖ్యమైన ఘట్టం. ఎన్ని ఆనందాలు ఉంటాయో అన్నే భయాలు ఉంటాయి. వాటన్నింటినీ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. నిజానికి ఇదేం కొత్త పాయింట్ కాదు. మనలో ప్రతీ ఒక్కరికీ, ఏదో ఓ దశలో ఎదురైన, ఎదురయ్యే సందర్భమే.
పెళ్లి జరిగితే.. పుట్టిల్లు మాత్రమే వదిలితే సరిపోదు. తన ఇష్టాల్ని కూడా.. అక్కడే వదిలేయాలన్న భయం ఎప్పుడైతే ఓ అమ్మాయిలో కలుగుతుందో, అప్పుడే ఇలాంటి కన్‌ఫ్యూజన్లు మొదలైపోతాయి. అక్కడి నుంచే `హ్యాపీ వెడ్డింగ్` కథ పుట్టింది.
సినిమా ప్రారంభంలోనే కథానాయకుడు, నాయికల క్యారెక్టరైజేషన్లు బలంగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అక్షర పాత బోయ్ ఫ్రెండ్ కథలోకి వచ్చాక.. అక్షర జీవితంలో ఈ కన్‌ఫ్యూజన్లు మరింత ఎక్కువవుతాయి. ఆనంద్ ని పెళ్లి చేసుకోవాలా, వద్దా? అనే కన్‌ఫ్యూజన్‌లో అక్షర ఉంటే, అక్షరని ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవచ్చన్న నమ్మకంతో ఆనంద్ ఉంటాడు. వాళ్లిద్దరి ప్రయాణమే ఈ సినిమా.
కథని ఎంత నిదానంగా ప్రారంభించాడో, అంతే నిదానంగా తీసుకెళ్లాడు. ప్రతీ సందర్భాన్ని, ప్రతీ భావోద్వేగాన్నీ విడమరచి చెప్పాలనుకున్నాడు దర్శకుడు. దాంతో.. కాస్త సాగదీత కనిపిస్తుంది. హమ్ ఆప్ కే హై కౌన్ లాంటి హిందీ సినిమాలు చూసి, అలాంటి కుటుంబ వాతావరణం తెలుగు సినిమాల్లోకీ ఎక్కించాలనుకున్నాడు. ఓ సున్నితమైన కథని అంతే సున్నితంగా డ్రైవ్ చేస్తూ, చివర్లో తాను చెప్పాలనుకున్న విషయాన్ని కన్‌ఫ్యూజ్ లేకుండా చెప్పేశాడు.
అయితే కథానాయిక పాత్రలోనే కాస్త కన్‌ప్యూజన్ కనిపిస్తుంటుంది. ఆ పాత్ర పెళ్లంటే భయపడుతుందా? లేదంటే ఎవరిని చేసుకోవాలో తెలీక కన్‌ఫ్యూజ్ అవుతుందా? అనే క్లారిటీ మిస్ అయ్యింది. హై మూమెంట్స్ పెద్దగా లేకపోవడం ప్రధాన లోపం.
* సాంకేతికత
సినిమా కలర్‌ఫుల్‌గా ఉంది. ఆ క్రెడిట్ కెమెరామెన్‌కీ, ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌కీ దక్కుతుంది. పాటలు కథలో కలిసిపోయాయి. సాహిత్యం ఆకట్టుకుంటుంది. దర్శకుడిలోని రచయిత ఎక్కువ మార్కులు కొట్టేశాడు. స్వతహాగా కవి ఏమో. ఎక్కువ చోట్ల మాటల కంటే కవిత్వం ఎక్కువగా వినిపించింది. తమన్ అందించిన నేపథ్య సంగీతం మరో ఆకర్షణ.
* ప్లస్ పాయింట్స్
+ నిహారిక నటన
+ ఎమోషన్స్
+ డైలాగ్స్
* మైనస్ పాయింట్స్
- స్లోగా సాగిన కథనం
* ఫైనల్ వర్డిక్ట్: 'హ్యాపీగా' చూసేయొచ్చు.
రివ్యూ రాసింది శ్రీ