తారాగణం: రాహుల్ రవీంద్రన్, చాందిని, అజయ్, రావు రమేష్, అలీ తదితరులు
నిర్మాణ సంస్థ: EMVE స్టూడియోస్ ప్రైవేటు లిమిటెడ్
సంగీతం: శేఖర్ చంద్ర
నిర్మాతలు: నాగేశ్వర రావు, వడ్డేపల్లి శ్రీనివాస్ & నల్లి కిరణ్ కుమార్
దర్శకత్వం: రేవన్ యాదు
రేటింగ్: 1.5/5
కొన్ని సినిమాల టైటిళ్లకూ... ఆ కథకూ, సినిమాకీ ఏమాత్రం పొంతన ఉండదు. దుబాయ్ శ్రీను సినిమాలో రవితేజ దుబాయ్‌వెళ్లాడా.. లేదు! ఇప్పుడు ఈ హౌరా బ్రిడ్జ్ కూడా అంతే. హౌరా బ్జిడ్స్ అంటూ టైటిళు, పోస్టరుపై చాంతాడంత బ్జిడ్స్.. ఇదంతా రకరకాల ఎక్స్‌పెక్టేషన్స్‌ని పెంచాయి. తీరా చూస్తే.. అక్కడ హౌరా బ్రిడ్జ్ కనిపించలేదు. అసలు దానికీ కథకూ ఏమాత్రం సంబంధం ఉండదు. పోతే పోనిండి... ఇంతకీ ఆ కథైనా, సవ్యంగా ఉందా??
* కథ..
మాచవరం బ్రిడ్జ్ ... అర్జున్ (రాహుల్ రవీంద్రన్), శ్రుతి (మనాలి రాథోడ్) ల మధ్య పరిచయం ఏర్పడడానికి కారణం అవుతుంది. 18 ఏళ్ల తరవాత... తన శ్రుతిని వెదుక్కుంటూ మాచవరంలో అడుగుపెడతాడు అర్జున్. ఇక్కడికి వచ్చేసరికే.. శ్రుతికి తన బావ అజయ్ (అజయ్)తో పెళ్లి ఖాయం అవుతుంది. కానీ.. క్రమంగా అర్జున్ ని ఇష్టపడడం ప్రారంభిస్తుంది. తన బావతో తనకు పెళ్లి ఖాయమైందన్న విషయాన్ని సైతం మర్చిపోయి... పూర్తిగా అర్జునే ప్రపంచంగా బతుకుతుంటుంది. అయితే.. తన చిన్నప్పటి నేస్తం శ్రుతి కాదన్న విషయం ఆలస్యంగా తెలుస్తుంది. దాంతో శ్రుతికి సారీ చెప్పి.. అక్కడ్నుంచి వెళ్లిపోతాడు అర్జున్. అప్పుడు శ్రుతి ఎలా స్పందించింది? ఇంతకీ అర్జున్ వెదుకుతున్న శ్రుతి ఎక్కడ ఉంది? చివరికి ఏమైంది? అనేదే కథ.
* నటీనటుల ప్రతిభ..
రాహుల్ రవీంద్రన్ నటన సహజంగా ఉంటుంది. అందాల రాక్షసి చూడండి... ఎక్కడా నటించినట్టు అనిపించదు. తను తొలిసారి నటన నేర్చుకుంటున్నట్టు కనిపిస్తాడు. `అతి` లక్షణాలు తొలిసారి తొంగి చూశాయి.
చాందినీ చౌదరి మాత్రం కాస్త గ్లామరెస్‌గా కనిపించింది. ఈ సినిమాలో చూడదగ్గ అంశం.. చాందినీ మాత్రమే.
అజయ్,రావు రమేష్, అలీ.. ఇలా చెప్పుకోవడానికి చాలా లిస్టు ఉంది. కానీ ఏ పాత్రనీ దర్శకుడు సరిగా వాడుకోలేదు. కథ, కథనాలు బలహీనంగా ఉన్నప్పుడు పాత్రలు కూడా అలానే తయారవుతాయి.
* విశ్లేషణ..
ముందే చెప్పుకున్నట్టు అసలు హౌరా బ్జిడ్జికి.. ఈ కథకీ సంబంధం లేదు. ఓ బ్రిడ్జ్ కారణంగా ప్రేమ కథ మొదలైంది కాబట్టి ఆ పేరు పెట్టేశారు. ఆ బ్రిడ్జికీ అసలు కథకీ లింకు ఉండదు. సో.. టైటిల్ దగ్గరే ప్రేక్షకుల్ని తప్పు దోవ పట్టించారు. ప్రేమకథలో అమ్మాయి, అబ్బాయి మధ్య లవ్ సీన్స్ చాలా కీలకం. వాళ్ల ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టిందన్నది ఆసక్తికరం చూపించాలి. వాళ్ల మధ్య ఎమోషన్ బాండింగ్ గట్టిగా వేయాలి. అప్పుడే వాళ్లిద్దరూ విడిపోయిన సన్నివేశాలు సైతం పండుతాయి. కానీ.. ఈ సినిమాలో మాత్రం ఆయా సన్నివేశాలకు ఏమాత్రం న్యాయం జరగలేదు.
పైగా కొన్ని చోట్ల డబులు మీనింగ్ డైలాగులు ఏరులై పారాయి. లవ్ ఫీల్ తగ్గిపోయింది. సన్నివేశాల్లో సాగదీత మరీ ఎక్కువైంది. అనవసరమైన సన్నివేశాలు చాలా కనిపిస్తాయి. ఈనాటి ప్రేక్షకుడు కథ ఎలా ఉన్నా స్వీకరిస్తాడేమో గానీ, కథనంలో వేగం లేకపోతే తిరస్కరిస్తాడు. టీవీ సీరియెల్స్ సైతం షార్ప్‌గా కట్ చేస్తున్న తరుణంలో.. హౌరా బ్జిడ్జ్ మాత్రం ఆ విషయంలో నిరాశ పరుస్తుంది. సెకండాఫ్‌లో చాలా సన్నివేశాల్ని బలవంతంగా ఇరికించినట్టు స్పష్టం అవుతుంది. డ్రామా కూడా ఏమాత్రం పండలేదు. హీరో, హీరోయిన్లు మళ్లీ కలుసుకునే సీన్లు సైతం కృతకంగా ఉన్నాయి. ఏ దశలోనూ ఆసక్తి రేకెక్తించని చిత్రాల్లో హౌరా బ్రిడ్జ్ ఒకటిగా నిలిచిపోతుంది.
* సాంకేతిక వర్గం..
టెక్నికల్‌గా ఈ సినిమా ద్వితీయ శ్రేణిలో కనిపిస్తుంటుంది. సినిమాని చుట్టేసినట్టు అనిపించినా అది ప్రేక్షకుడి తప్పు కాదు. శేఖర్ చంద్ర బాణీలు కూడా రొటీన్‌గానే సాగాయి. కెమెరా పనితనం ఇంకా మెరుగ్గా ఉండాల్సింది. కత్తెరకు మాత్రం పని చెప్పలేదు. సరిగా ఎడిటింగ్ చేసుంటే అరగంట నిడివి తగ్గేది. దర్శకుడు తొలి ప్రయత్నంలోనే విఫలమయ్యాడు. ప్రేమకథకు కావల్సిన అంశాలు ఈ కథలో ఉన్నా.. దాన్ని ఓ రొమాంటిక్ ఫీల్‌లోకి తీసుకుని రావడంలో విఫలం అయ్యాడు.
* ప్లస్ పాయింట్స్
+ చాందిని చౌదరి
* మైనస్ పాయింట్స్
- కథ, కథనం
- నాణ్యత
- నిడివి
* ఫైనల్ వర్డిక్ట్: హౌరా బ్రిడ్జి.. కుప్పకూలింది
రివ్యూ బై శ్రీ