నటీనటులు: రామ్ పోతినేని,నిధి అగర్వాల్, నభా నటేష్, షాయాజీ షిండే, ఆశిష్ విద్యార్థి తదితరులు
దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాతలు : ఛార్మి, పూరి జగన్నాధ్
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫర్: రాజ్ తోట
విడుదల తేదీ: 18 జులై, 2019
రేటింగ్: 2.75/5
కొంతమంది దర్శకులు ఎన్ని ఫ్లాపులు తీసినా వాళ్లకంటూ ఓ అభిమాన వర్గం ఉంటూనే ఉంటుంది. ఈసారైనా ఓ హిట్టు కొడతాడేమో అన్న నమ్మకంతో టికెట్ కౌంటర్ల ముందు నిలబడుతుంటారు జనాలు. అలాంటి దర్శకులలో పూరి జగన్నాథ్ ఒకరు. పోకిరి లాంటి బ్లాక్ బ్లస్టర్ సినిమాల్ని అందించాడు పూరి. తనలో సత్తా ఏపాటిదో చిత్రసీమకు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. కాకపోతే... కొన్నేళ్లుగా పూరి నుంచి హిట్టు లేదు. నానాటికీ తీసికట్టు నాగంబొట్టు అన్నట్టు తయారైంది వ్యవహారం.
తీసిన కథనే మళ్లీ తీస్తూ, అదే టేకింగూ, మేకింగులతో నీరసం తీసుకొస్తున్నాడు. ఈసారి తాను చేసిన మరో ప్రయత్నం `ఇస్మార్ట్ శంకర్`. గుడ్ బాయ్ పాత్రలు చేసుకుంటూ వెళ్తున్న రామ్‌కి - తొలిసారి పక్కా బ్యాడ్ బోయ్ పాత్ర చేయాలనిపించి, పూరితో జట్టు కట్టాడు. మరి ఈ కాంబో ఏం చేసింది? ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న విజయం పూరికి లభించిందా? రామ్ ఆశ నెరవేరిందా?
* కథ
శంకర్ (రామ్) పాత బస్తీలో దందాలు చేస్తుంటాడు. డబ్బు కోసం ఓ హత్యకు ప్లాన్ చేస్తాడు. ఆ హత్య చేసి, ప్రియురాలు చాందిని (నభా నటేషా)తో కలిసి గోవా పారిపోతాడు. గోవాలో శంకర్‌ని వెదుక్కుంటూ వచ్చిన పోలీసులు.. చాందినిని షూట్ చేస్తారు. శంకర్ పోలీసులకు దొరికిపోతాడు. జైలు నుంచి పారిపోయి బయటకు వస్తాడు శంకర్. ఈ కేసుని పరిశోధిస్తున్న సీబీఐ అధికారి (సత్యదేవ్) ఓ గ్యాంగ్ చేతిలో హత్యకు గురవుతాడు.
ఈ కేసుకి సంబంధించిన గుట్టు అంతా తనకు మాత్రమే తెలుసు. అతని మెదడులోని మెమొరీని అనుకోకుండా శంకర్ మెదడులోకి షిప్ట్ చేస్తారు. అక్కడి నుంచి శంకర్ రెండు రకాలుగా ప్రవర్తించడం మొదలెడతాడు. ఇంతకీ ఈ హత్య వెనుక ఉన్న ప్రధాన కుట్రదారులెవరు? తన ప్రేయసి మరణానికి శంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అనేదే సినిమా కథ.
* నటీనటులు
ఈ సినిమా ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే అది రామ్‌కి మాత్రమే. తన ఎనర్జీతో ఈ సినిమాని నడిపించాడు. ఈ సినిమాలో ఓ కొత్త రామ్ కనిపిస్తాడు. తన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ తోనే వినోదం పండించాడు.
రామ్‌ని ఇంత మాస్‌గా ఇంకెప్పుడూ చూడలేమేమో అన్నట్టు తయారు చేశాడు ఆ పాత్రని. నభా పాత్ర చాలా సార్లు హద్దులు దాటుతుంది. అది కమర్షియాలిటీ కోసమే అనుకోవాలి.
నిధి అగర్వాల్ కూడా గ్లామర్ విషయంలో ఏమాత్రం మొహమాట పడలేదు. సత్య పాత్ర పరిధి చాలా తక్కువ. షాయాజీ షిండే రొటీన్‌గా అరిపించాడు.
* సాంకేతిక వర్గం
చాలా రోజుల తరవాత మణిశర్మ నుంచి మంచి పాటలు వచ్చాయి. మాస్‌ని ఆకట్టుకునేలా బాణీలు ఇవ్వగలిగాడు. ఫొటోగ్రఫీ, ఆర్.ఆర్... ఇలాంటి సాంకేతిక విభాగాలు బాగానే పనిచేశాయి. పూరి డైలాగులు కొన్ని చోట్ల బాగున్నాయి.
ఇంకొన్ని చోట్ల మరీ మాసీగా అనిపించాయి. కథా రచయితగా పూరి మరోసారి విఫలం అయ్యాడు. ఓ కొత్త పాయింట్ పట్టుకున్నా, దాన్ని తన పాత స్టైల్లోనే తీయడం నిరాశ పరుస్తుంది.
* విశ్లేషణ
పూరికి ఓ స్టైల్ ఉంది. తాను ఏ కథ తీసుకున్నా అదే స్టైల్‌లో చెబుతుంటాడు. ఈసారీ అంతే. బుర్రల మార్పిడి అనే కొత్త పాయింట్ తీసుకున్నప్పటికీ... పూరి తన పాత పంథా మార్చుకోలేదు. హీరోయిజం ఎలివేషన్ చేసే షాట్లూ, డైలాగులు, హీరోయిన్ పాత్రని చూపించే విధానం, ఆ మాస్, గోవా బీచ్‌లో పాటలు.. వీటిలో ఒక్కటీ వదల్లేదు. పూరి ప్రధాన బలం శంకర్ పాత్ర. ఆ పాత్ర చుట్టూనే పూరి తన ఎఫెక్ట్ అంతా పెట్టేశాడు. రామ్ తెలంగాణ మాండలికంలో మాట్లాడడం బాగా కలిసొచ్చింది. అదే పూరి పాత సినిమాకు కొత్త సొబగు అద్దించింది. ఆ డైలాగుల్లోనే ఫన్ పుట్టుకొచ్చింది. హీరోతో పోటీగా హీరోయిన్ (నభా) కూడా బూతులు దట్టించింది.
మాస్ డైలాగులు పలికింది. పాటలూ మంచి బీటున్నవే ఎంచుకోవడంతో తొలి సగంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. హీరో బుర్రలో చిప్ పెట్టడం పూరి రాసుకున్న కొత్త ఐడియా కావొచ్చు. ఈమధ్య ఇలాంటి సినిమాలు చూడ్డం కూడా ప్రేక్షకులకు అలవాటైపోయింది. సైంటిఫిక్ లైన్‌ని మాస్ సినిమాకి అప్లై చేయడం మన దర్శకులకే చేతనైంది. అయితే పూరి ఆ పాయింట్‌ని కూడా.. పాత ధోరణిలోనే తీయడం, సెకండాఫ్ మొత్తం రొటీన్ రివైంజ్ డ్రామాగా మిగిలిపోవడం వల్ల ఆ లైన్‌ని కూడా చేతులారా పాడు చేసుకున్నాడనిపిస్తుంది. హీరోలో రామ్ ఎప్పుడు నిద్ర లేస్తాడో, సత్య గా ఎప్పుడు మారతాడో తెలీదు.
ఈ పాయింట్‌ని తనకు అనుగుణంగా రాసేసుకుంటూ, ఎక్కడిక్కడ కథని తనకు వీలుగా తిప్పుకుంటూ.. చాలా సన్నివేశాల్లో ఎస్కేప్ అయిపోయాడు పూరి. విలన్ పాత్రని కూడా బలంగా చూపించలేకపోయాడు. ఓ హత్య చేసిన హీరోని పోలీసులు, సీబీఐ కలసి అలా గాలికి వదిలేయడం, సివిల్ ఇంజనీర్ చేసిన అమ్మాయి ఓ హంతకుడికి ఈజీగా పడిపోవడం కమర్షియాలిటీ అనుకోవాలంతే. ఈ సినిమా చూశాక పూరి ఏం మారలేదనిపిస్తుంది. తన బలాల్ని వదలుకోవడానికి ఇష్టపడని పూరి, తన బలహీనతల్ని సైతం కప్పిపుచ్చుకోలేదు. ఓ కొత్త పాయింట్ రాసుకున్నంత మాత్రన సరిపోదు. దాన్ని కొత్తగా ప్రజెంట్ చేయాలి. ఆ విషయంలో పూరి విఫలమయ్యాడు.
* ప్లస్ పాయింట్స్
+రామ్
+డైలాగులు
+పాటలు
+మాస్ మసాలా అంశాలు
* మైనస్ పాయింట్స్
-లాజిక్ లేని సన్నివేశాలు
-సెకండాఫ్
* ఫైనల్ వర్డిక్ట్: శంకర్.. ఓన్లీ ఫర్ మాస్
- రివ్యూ రాసింది శ్రీ.