చిత్రం: జై లవకుశ
తారాగణం: ఎన్టీయార్, రాశి ఖన్నా, నివేదా థామస్, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజీ, సాయికుమార్, ప్రదీప్ రావత్, జయప్రకాష్‌రెడ్డి తదితరులు.
సంగీతం: దేవిశ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు
దర్శకత్వం: కె.ఎస్. రవీంద్ర (బాబీ)
నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్
విడుదల తేదీ: 21 సెప్టెంబర్ 2017
యావరేజ్ యూజర్ రేటింగ్: 3.25/5
ఒక్కరే మూడు పాత్రల్లో కనిపించడం కొత్తేం కాదు. దశావతారంలో కమల్‌హాసన్ ఏకంగా పది పాత్రలు చేశాడు. కాకపోతే... ఆయా పాత్రల మధ్య వైవిధ్యం చూపించడం మాత్రం కత్తిమీద సామే! అందుకే మన వాళ్లు ద్వి పాత్రాభియనయాల వరకూ నల్లేరుమీద నడకలా చేసేశారు. త్రిపాత్రలు పోషించడం అరుదు. ఎన్టీఆర్ లాంటి నటుడు.. మూడు పాత్రల్లో కనిపిస్తున్నాడనేసరికి తెలుగు తెరకు ఉత్సాహం వేసింది. బేసిగ్గా.. ఎన్టీఆర్ మంచి నటుడు. కాబట్టి మూడు పాత్రల్నీ అవలీలగా పోషించేస్తాడన్న భరోసా కలిగింది. మరి.. `జై లవకుశ`లుగా ఎన్టీఆర్ ఎలా మెప్పించాడు?? ఏ పాత్రకు ఎక్కువ మార్కులు పడ్డాయి?? ఇంతకీ ఈ సినిమా కథేంటి? తెలియాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే.
* కథ
జై, లవ, కుశ (ఎన్టీఆర్) ముగ్గురూ కవల సోదరులు. మేనమామ (పోసాని కృష్ణమురళి) చిన్నప్పుడు వీళ్లతో నాటకాలు వేయిస్తుండేవాడు. జైకి నత్తి.. కాబట్టి తనని దూరం పెట్టి లవ, కుశల్ని ప్రోత్సహిస్తుండేవాడు. జైని అవహేళన చేయడంతో జై.. అమమానంతో రగిలిపోతుంటాడు. ఓ రోజు నాటకాల వేదికను తగలబెట్టి పారిపోతాడు. ఆ ప్రమాదంలో కవలసోదరులు ముగ్గురూ విడిపోతారు. లవకుమార్ ఓ బ్యాంకు ఉద్యోగిగా స్థిరపడతాడు. తనకన్నీ సమస్యలే. ప్రియ (రాశీఖన్నా)తో ప్రేమలో విఫలం అవుతాడు. బ్యాంకులో అప్పులు తీసుకొన్న వాళ్లు ఎగ్గొడతారు. ఆ బాకీలు వసూలు చేయకపోతే... లవ ఉద్యోగం పోతుంది. ఈ దశలో కుశ (ఎన్టీఆర్)ని కలుస్తాడు. కుశ ఓ దొంగ. అమెరికా వెళ్లి అక్కడ గ్రీన్ కార్డ్ సంపాదించి, అక్కడే ఉండిపోదామనుకొంటాడు. అందుకోసం లవ కుమార్‌ని వాడుకొందామని, అతని స్థానంలో కుశాల్ అడుగుపెడతాడు. ఓరోజు బ్యాంకు డబ్బు, ప్రియ రెండూ మాయమైపోతాయి. ఎత్తుకెళ్లింది జైనే. ప్రియనీ, డబ్బునీ వెదుక్కొంటూ లవ, కుశాల్ జై దగ్గరకు వెళ్లాల్సివస్తుంది. ఇంతకీ జై ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? లవకుశల్ని తన దగ్గరకు ఎందుకు రప్పించాడు? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
* నటీనటులు..
జై, లవ, కుశ ఈ మూడు పాత్రల్నీ సమర్థంగా పోషించాడు ఎన్టీఆర్. ఆ పాత్రల మధ్య వైవిధ్యం స్పష్టంగా కనిపించింది. మరీ ముఖ్యంగా జై పాత్ర చాలాకాలం గుర్తుండిపోతుంది. రెండు మూడు చోట్ల.. ఎమోషన్ పరంగా జైకి ఎక్కువ మార్కులు పడతాయి. క్లైమాక్స్‌లోనూ జై దే హవా. అయితే మిగిలిన రెండు పాత్రల్నీ తక్కువ చేయాల్సిన అవసరం లేదు. దేని ప్రాధాన్యం దానిదే. రాశీఖన్నా, నివేదాలకు ఏమాత్రం ప్రాధాన్యం లేదు. పోసాని ఓకే అనిపిస్తాడు. సాయికుమార్ మరోసారి నమ్మిన బంటు పాత్రలో రాణించాడు. పెళ్లిచూపులు ప్రియదర్శి కాసేపు నవ్వించాడు.
* విశ్లేషణ..
ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపించడం ఇదే తొలిసారి. ఆ మూడు పాత్రల్నీ సరిగా రాసుకొన్నాడు దర్శకుడు. కాకపోతే జై పాత్ర వైపు ఎక్కువ ప్రేమ చూపించాడు. జై పాత్రే ఈ సినిమాకి కీలకం. అతని పగే ఈ కథకు ఆధారం. అయితే లవ, కుశల్నీ సమర్థంగానే వాడుకొన్నాడు. లవ, కుశల చుట్టూ తొలి అర్థభాగం నడిచిపోతుంది. సరిగ్గా ఇంట్రవెల్ సమయంలో జై పాత్ర ఎంట్రీ అవుతుంది. అక్కడ్నుంచి జై దే సినిమా. చిన్నప్పుడు తనకు జరిగిన అవమానానికి అన్నదమ్ముల మీద ఎలా పగ తీర్చుకొన్నాడు? తన ఎదుగుదలకు వారిద్దరినీ ఎలా వాడుకొన్నాడు అనే పాయింట్ మీదే సెకండాఫ్ నడిచిపోతుంది. లవ పాత్రలో కుశ ఎంట్రీ ఇవ్వడం దగ్గర్నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ మొదలవుతుంది. కుశ.. బ్యాంకు డబ్బుల్ని రికవరీ చేయడం, బ్యాంకులో చేసిన హంగామా ఇవన్నీ నచ్చుతాయి. విశ్రాంతి ఘట్టం... ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కోసం డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. అందులో జై పాత్రలో ఎన్టీఆర్ విశ్వరూపం చూపిస్తాడు. ద్వితీయార్థంలో మళ్లీ కథ కాసేపు ఫ్లాష్ బ్యాక్ వైపుకు వెళ్తుంది. తిరిగొచ్చాక.. కథాగమనం కాస్త మందగించినట్టు అనిపిస్తుంది. నాటకాల పర్వంతో మళ్లీ కథ పట్టాలెక్కుతుంది. ఆ ఎపిసోడ్‌ని దర్శకుడు బాగా వాడుకొన్నాడు. ప్రీ క్లైమాక్స్ ఆకట్టుకొంటుంది. క్లైమాక్స్ విషాదంతం. కాకపోతే.. అంతటి హెవీ క్లైమాక్స్ లేకపోతే... సెకండాఫ్ తేలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దర్శకుడిగా బాబి ఆలోచన మంచే చేసినట్టైంది.
* సాంకేతిక వర్గం..
దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఓకే అనిపిస్తాయి. కానీ నేపథ్య సంగీతం అందరగొట్టాడు. రావణా... అనే పాటని బాగా వాడుకొన్నాడు. ఐటెమ్ సాంగ్లో తమన్నా బాగున్నా... ఆ పాటలో ఊపు తగ్గింది. బాబి ఎంచుకొన్న లైన్ బాగుంది. ఎన్టీఆర్‌ని పర్‌ఫెక్ట్‌గా పోట్రయిట్ చేయగలిగాడు. అక్కడక్కడ స్లో నేరేషన్ ఇబ్బంది పెడుతుంది. `ప్రేమ పావురాలు చూస్తున్నప్పుడు కూడా అందులో పావురాల్ని ఎత్తుకెళ్తే ఎంతొస్తుందని ఆలోచించాను తప్ప, ప్రేమ గురించి ఆలోచించలేదు` లాంటి డైలాగులు నచ్చుతాయి. ఛోటా కెమెరా పనితనం అదనపు బలం.
* ప్లస్ పాయింట్స్
+ ఎన్టీఆర్
+ క్లైమాక్స్
+ నేపథ్య సంగీతం
* మైనస్ పాయింట్స్
- పాటలు
* ఫైనల్ వర్డిక్ట్: జై.. జై... జై
రివ్యూ బై శ్రీ