తారాగణం: పూజా, సాయి రోనక్, హరీష్ కళ్యాణ్
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
సంగీతం: ప్రసన్ ప్రవీణ్ శ్యాం
ఛాయాగ్రహణం: శేఖర్ వీ జోసెఫ్
ఎక్జీక్యుటివ్ నిర్మాత: ఆనంద్ రంగ
రచన-నిర్మాత-దర్శకత్వం: పట్టాభి
యావరేజ్ యూజర్ రేటింగ్: 2.5/5
కాదలి పోస్టర్లు, ట్రైలర్లు చూస్తే... చాలామందికి 'ప్రేమ దేశం' సినిమా గుర్తొస్తుంది. ముక్కోణపు ప్రేమ కథా చిత్రాలు ఎన్ని వచ్చినా, ఎన్ని వస్తున్నా.. ప్రేమ దేశం ఇచ్చిన కిక్ వేరు. కాదలి కూడా... ట్రయాంగిల్ లవ్ స్టోరీనే. ఇద్దరు స్నేహితుల్లో ఎవరిని ప్రేమికుడిగా ఎంచుకోవాలో తెలీక సతమతమయ్యే అమ్మాయి కథ. మరి.. 'ప్రేమ దేశం' స్థాయిలోనే ఈ కాదలి అలరించిందా?? లేదంటే.. సగటు ప్రేమకథగానే మిగిలిపోయిందా?? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
* కథ
బాంధవి (పూజా) కి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. కానీ.. ఏదీ సెట్ అవ్వదు. పెళ్లి చూపులు, నచ్చడాలు, ముహూర్తాలు పెట్టుకోవడాలూ... ఇవన్నీ ఎందుకు.. ఎవరినో ఒకరిని ప్రేమిస్తే - ఈ తంతు ఉండదు కదా అని ఇంట్లో బామ్మ, బయట స్నేహితురాలు సలహా ఇస్తే... తనకు తగిన ప్రేమికుడి కోసం అన్వేషిస్తుంది. ఆ ప్రయాణంలో కార్తీక్ (హరీష్ కల్యాణ్ ) క్రాంతి (సాయి రోనక్) పరిచయం అవుతారు. ఒకొక్కరిలో ఒక్కో ప్లస్.. ఒక్కొక్కరిలో ఒక్కో మైనస్. ఇద్దరినీ ప్రేమించలేదు. అలాగని ఒకరిని దూరం చేసుకోలేదు. ఈ పరిస్థితులలో బాంధవి ఏం చేసింది? తన జీవిత భాగస్వామిగా ఎవరిని ఎంచుకొంది? అనేదే.. 'కాదలి' కథ.
* నటీనటులు
హీరోలిద్దరూ బాగా చేశారు. అందంగా ఉన్నారు. వాళ్ల వాళ్ల పాత్రల్లో ఇమిడిపోయారు. అయితే.. కథకు బలంగా మారాల్సిన పూజా.. ఈ సినిమాకి మైనస్ అయ్యింది. ఆ స్థానంలో మరో అందమైన, నటన తెలిసిన అమ్మాయిని తీసుకొంటే బాగుండేది. ఆమె లిప్ సింక్ అస్సలు మ్యాచ్ అవ్వలేదు. ఏదో డబ్బింగ్ సినిమా చూస్తున్న భావన కలుగుతుంది. మిగిలిన పాత్రల్లో తెలిసిన నటీనటులు ఎవరూ కనిపించరు. కనీసం ఒకట్రెండు పాత్రలకైనా గుర్తింపు ఉన్న నటుల్ని తీసుకొంటే బాగుండేది.
* విశ్లేషణ
మూడు ముక్కల్లో `కాదలి` కథ చెప్పుకొంటే.. సింపుల్ లవ్ స్టోరీనే అనిపిస్తుంది. తెరపై కూడా చాలా సింపుల్‌గా సాగింది. కథలో మలుపులు.. ఊహించని పరిణామాలూ ఏం ఉండవు. ఓ అమ్మాయి - ఇద్దరబ్బాయిలు - వాళ్ల మధ్య ప్రేమ... అంతే. ఇదే కథని.. సరికొత్తగా ఆవిష్కరించే అవకాశం ఉంది. ఎమోషన్స్‌ని ఎలివేట్ చేస్తూ... ఆడియన్ ని థ్రిల్ చేసే ఆస్కారం ఉంది. అయితే... దాని గురించి దర్శకుడు పెద్దగా ఆలోచించలేదు. ఈకాలంలో కొత్త దర్శకులంతా సహజత్వానికి పెద్ద పీట వేస్తున్నారు. ఎమోషన్స్ తో కథని నడిపిస్తే.. సహజత్వం దెబ్బతింటుందని భావించాడేమో. కథానాయిక పాత్ర ఈ కథకు చాలా కీలకం. అయితే ఆమె పాత్ర రాసుకోవడంలోనే దర్శకుడ కన్‌ఫ్యూజ్ అయ్యాడు. తాను ఏం ఆలోచిస్తుంది? ఏం అనుకొంటోంది? ఇద్దరిని ఏక కాలంలో ఎందుకు ప్రేమిస్తుంది? ఇవేం సరిగా చెప్పలేకపోయాడు. ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాల్సివచ్చినప్పుడు తను పడే మనోవేదక కళ్లకు కట్టినట్టు చెబితే.. ఈ సినిమా పండేది. కానీ.... దాని గురించి కూడా ఏమాత్రం ఆలోచించలేదు. పతాక సన్నివేశాలు రక్తికట్టవు. ఈ కథని ఎక్కడో చోట ముగించాలి కాబట్టి... ఈ స్టెప్ తీసుకొన్నాడా? అనిపిస్తుంది. సినిమా మొదలై ఎంతసేపయినా దర్శకుడు ఏం చెప్పదలచుకొన్నాడో అర్థం కాదు. ఆ కన్‌ఫ్యూజన్ చివరి వరకూ కొనసాగుతుంది.
* సాంకేతికంగా
చిన్న సినిమా అయినా.. కలర్ ఫుల్ గా ఉంది. అయితే డీఐ వర్క్ సరిగా జరిగినట్టు లేదు. సంగీతం... బాగుంది. పాటలు వినసొంపుగా ఉన్నాయి. మాటల్లో గుర్తు పెట్టుకోదగినవి ఏం లేవు. ఓ సాదా సీదా కథని... అంతే సాధారణంగా తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాత, దర్శకుడు కూడా ఒక్కరే కావడం వల్ల. `చెక్` పెట్టే అధికారం తన దగ్గరే ఉంచుకోవడం వల్ల.. సాదా సీదా సీన్లు కూడా పాసైపోయాయి.
* ప్లస్ పాయింట్స్
పాటలు
* మైనస పాయింట్స్
మిగిలినవన్నీ...
* ఫైనల్ వర్డిక్ట్:
ప్రేమ దేశం కాదు... ప్రేమ శోకం
రివ్యూ బై శ్రీ