తారాగణం: బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహ్రీన్ కౌర్, నీల్ నితిన్ ముఖేష్, పోసాని కృష్ణమురళి, హర్షవర్ధన్ రాణే & తదితరులు
సంగీతం: ఎస్ ఎస్ థమన్
సినిమాటోగ్రఫీ: ఛోటా కె నాయుడు
నిర్మాత: నవీన్ చౌదరి
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్ మామిళ్ళ
రేటింగ్: 2.5/5
భారీదనం కేరాఫ్ బెల్లంకొండ అనుకోవాలేమో. తన మార్కెట్‌తో సంబంధం లేకుండా, అంతకు మించి బడ్జెట్‌తో భారీ చిత్రాల్ని చేస్తున్నాడు బెల్లకొండ. `అల్లుడు శీను` నుంచి అదే దారి. అయితే `సాక్ష్యం` తనని బాగా ఇబ్బంది పెట్టింది. కథలో లోపాలుంటే, ఎన్ని కోట్లు పోసినా వృథా అనే సంగతి తెలిసొచ్చింది. అందుకే ఈసారి కథ, కథనాలపై దృష్టి పెట్టి `కవచం` చేశాడు. ఇదో థ్రిల్లర్. మైండ్ గేమ్ నేపథ్యంలో సాగుతుంది. మరి బెల్లంకొండ ఈసారైనా హిట్టు కొట్టాడా? ఈ సినిమా తన కెరీర్‌కి `కవచం`లా ఉపయోగపడుతుందా?
కథ
విజయ్ (బెల్లంకొండ శ్రీనివాస్) విశాఖపట్నంలో ఎస్.ఐ గా పనిచేస్తుంటాడు. తన దగ్గరకు వచ్చిన ఎలాంటి కేసునైనా... తెలివితేటలతో, ధైర్యంతో పరిష్కరిస్తుంటాడు. సంయుక్త (మెహరీన్) ని రౌడీల బారీ నుంచి కాపాడతాడు. తనకో ప్రేమ కథ ఉందని తెలుసుకుంటాడు. తన వంతు సాయం చేయాలనుకుంటాడు. కానీ.. సంయుక్తని ప్రేమించిన అబ్బాయి మోసం చేసి వెళ్లిపోతాడు. సరిగ్గా అదే సమయంలో విజయ్ తల్లి ఓ ప్రమాదానికి గురవుతుంది. ఆపరేషన్ చేస్తే గానీ అమ్మ బతకదు. అందుకోసం రూ.50 లక్షలు కావాల్సివస్తుంది. ఆ డబ్బుల కోసం సంయుక్త ఓ ప్లాన్ చెబుతుంది. తనని కిడ్నాప్ చేసి రూ.50 లక్షలు డిమాండ్ చేయమని, ఆ డబ్బుతో ఆపరేషన్ చేయించమని చెబుతుంది. తల్లిని కాపాడుకోవడానికి విజయ్ కిడ్నాప్ డ్రామా ఆడాల్సివస్తుంది. మరి ఆ తరవాత ఏమైంది? ఈ కిడ్నాప్ వల్ల ఎవరి జీవితాలెలా తారుమారయ్యాయి? తను చేయని తప్పుకి విజయ్ చట్టం ముందు దోషిలా ఎలా నిలబడాల్సివచ్చింది? అనేదే `కవచం` కథ.
నటీనటుల పనితీరు..
బెల్లకొండ శ్రీనివాస్‌లో ఈజ్ ఉంది. దాన్ని ఈసినిమాలోనూ చూడొచ్చు. తనవంతు తాను కష్టపడ్డాడు. డైలాగులు చెప్పడంలో మాత్రం ఇప్పటికీ వీక్ గానే కనిపిస్తున్నాడు. కాజల్, మెహరీన్ ఇద్దరు ఉన్నా.. కాజల్‌కే అగ్రతాంబూలం. తన సీరియారిటీ మొత్తం ఉపయోగించి చకచక నటించుకుంటూ వెళ్లిపోయింది. నీల్ నితీన్ దేశ్‌ముఖ్ కి బిల్డప్పులు ఎక్కువ ఇచ్చారు. తన పాత్రని సరిగా వాడుకోలేదు. హర్షవర్థన్ రాణాదే కూడా చిన్న పాత్రే. పోసానిని కామెడీ కోసం పెట్టుకున్నారు. తన కామెడీ మరీ చిరాకుని తెప్పిస్తుంది.
విశ్లేషణ...
మైండ్ గేమ్ నేపథ్యంలో ఇప్పటి వరకూ చాలా సినిమాలొచ్చాయి. ఇది కూడా అందులో భాగమే. తెలివైన కథానాయకుడు.. అంతకంటే తెలివైన ప్రతినాయకుడు.. వీళ్ల మధ్యలో జరిగే పోరే ఈ చిత్ర కథ. థ్రిల్లర్ తరహా చిత్రాల్లో ట్విస్టులు చాలా ప్రధానం. మలుపులు ఎన్నుంటే ఆ కథ అంత బాగా రక్తి కడుతుంది. `కవచం`లో కూడా కావల్సినన్ని మలుపులు ఉన్నాయి. అవన్నీ ఆసక్తికరమైనవే. అయితే.. ఆ మలుపుల్ని మలచి, సన్నివేశాలుగా తెరకెక్కించే విషయంలో దర్శకుడు తడబడ్డాడు. ఈ సినిమా చాలా స్లో గా మొదలవుతుంది. కాజల్‌తో ప్రేమకథ చాలా బోర్ కొట్టిస్తుంది. పాటలు, ఫైటులతో కాలక్షేపం చేశాడు. సరిగ్గా విశ్రాంతి ముందు కథ వేగం పుంజుకుంటుంది. కిడ్నాప్ డ్రామా బాగా రక్తి కడుతుంది. అయితే ఈ ఉత్తుత్తి డ్రామా కాస్త నిజం అయిపోవడం, హీరో ఓ ట్రాప్‌లో చిక్కుకోవడం ఈ కథలో అసలైన మలుపు.
ఈ ముడుల్ని దర్శకుడు ఎలా విప్పుతాడా? అనే ఆసక్తితో థియేటర్ నుంచి బయటకు వస్తాడు ప్రేక్షకుడు. ద్వితీయార్థం కూడా బాగానే టేకాఫ్ తీసుకుంది. అయితే క్రమంగా ఆ ఆసక్తి సన్నగిల్లడం మొదలవుతుంది. కథానాయకుడు అన్వేషించి క్లూల్ని రాబట్టుకోవాలి. అదే కదా కథలో మజా. కానీ... క్లూలే కథానాయకుడ్ని వెదుక్కుంటూ వస్తుంటాయి. దాంతో ఇంట్రస్ట్ పక్కదారి పట్టేస్తుంది. ఓ విధంగా ఇంట్రవెల్ బ్యాంగ్ దగ్గరే ప్రేక్షకుడు కథలోని మలుపులు ఊహిస్తాడు. అవి అచ్చుగుద్ది నట్టు సెకండాఫ్‌లోనూ కనిపిస్తాయి. ముడుల్ని వేసినంత శ్రద్ద విప్పడంలో ఉండాలి. థ్రిల్లర్ చిత్రాలు సక్సెస్ అయ్యేది అక్కడే. అయితే `కవచం`లో మాత్రం రివీల్ చేసే సీన్లు చాలా సాదా సీదాగా ఉంటాయి. అసలు విలన్ ఎవరో తెలిశాక కథని వీలైనంత త్వరగా ముగించాలి. కానీ ఇక్కడ మాత్రం సాగదీస్తూనే ఉంటారు. క్లైమాక్స్ కూడా రొటీన్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోనివిధంగా సాగింది.
సాంకేతిక వర్గం...
తమన్ అందించిన పాటల్లో ఒక్కటీ బాలేదు. తెరపై మాత్రం అవన్నీ లావిష్ గా కనిపించాయి. నేపథ్య సంగీతంలో మాత్రం తమన్ మార్క్ కనిపిస్తుంది. చోటా పనితనం మెచ్చుకొని తీరాల్సిందే. విజువల్ గా చాలా గ్రాండ్‌గా తీశాడు. దర్శకుడు అనుకున్న పాయింట్ బాగుంది. కానీ దాన్ని తెరపైకి తీసుకొచ్చేటప్పుడు మాత్రం తడబడ్డాడు.
* ప్లస్ పాయింట్స్
ట్విస్టులు
భారీదనం
* మైనస్ పాయింట్స్
తొలి సగం
ట్విస్టుల్ని రివీల్ చేసే పద్ధతి
పైనల్ వర్డిక్ట్: కవచానికి బలం సరిపోలేదు
రివ్యూ రాసింది శ్రీ.