తారాగణం: నిఖిల్, రితు వర్మ, ఇషా కొప్పికర్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి
నిర్మాణ సంస్థ: అభిషేక్ పిక్చర్స్
సంగీతం: సన్నీ
ఛాయాగ్రహణం: దివాకర్ మణి
బ్యాకగ్రౌండ్ స్కోర్: ప్రశాంత్
డైలాగ్స్: కృష్ణ చైతన్య & అర్జున్
నిర్మాత: అభిషేక్ నామ
రచన-దర్శకత్వం: సుదీర్ వర్మ
యువతరం కథానాయకుల్లో నిఖిల్ ప్రయాణం విభిన్నంగానే సాగుతోంది. రెగ్యులర్ కథలకు దూరంగా, ఏదో ఓ కొత్త పాయింట్ తో సినిమాలు తీస్తున్నాడు. ఆ కొత్తదనమే నిఖిల్‌కి విజయాల్ని అందిస్తోంది. ''అందరికీ ఎడమవైపున ఉండే గుండె నాకు కుడివైపున ఉంది.. మర్డర్ కూడా ప్రశాంతంగా చేయాలి'' అంటూ టీజర్‌లో ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాడు నిఖిల్. ఆ పాయింట్ కచ్చితంగా థియేటర్లకు రప్పించేదే. మరి అంతే... క్రియేటివిటీ వెండి తెరపైనా చూపించారా?? అసలు కేశవ కథేంటి? ఈ సినిమా ఎవరికి నచ్చుతుంది?? చూద్దాం రండి.
* కథ ఎలా ఉందంటే...?
కేశవ (నిఖిల్) తన చిన్నప్పుడే అమ్మానాన్నల్ని కోల్పోతాడు. చెల్లాయి అవిటిది అయిపోతుంది. దానికి కారణం.. పోలీస్ డిపార్ట్ మెంట్‌లోని కొంతమంది దుర్మార్గులు. పెద్దయ్యాక వాళ్లపై పగ తీర్చుకోవడం మొదలెడతాడు కేశవ. ఒక్కొక్కర్నీ ఒక్కోలా చంపేస్తాడు. వరుస హత్యలు సంచలనం రేకెత్తిస్తాయి. హంతకుడ్ని పట్టుకోవడానికి పోలీస్ శాఖ ఓ ప్రత్యేక అధికారిణి కూడా నియమిస్తుంది. కేశవ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది పోలీస్ శాఖ. మరి కేశవ దొరికాడా, లేదా? కేశవ చిన్నప్పటి స్నేహితురాలు సత్యభామ (రీతూవర్మ)... కేశవకి ఎలా సహాయపడింది.? కేశవకు జరిగిన అన్యాయం ఏంటి?? అనేదే మిగిలిన కథ.
* ఎవరెలా నటించారంటే..??
కేశవగా నిఖిల్ పర్‌ఫెక్ట్. చాలా తక్కువ మాట్లాడాడు. ఎక్కువగా చేతల్లోనే చూపించాడు. తన కెరీర్‌లో ఇదో డిఫరెంట్ రోల్ అనొచ్చు.
రీతూ వర్మ గురించి ఎక్కువ ఆశించొద్దు. తనది కేవలం సపోర్టింగ్ రోల్ మాత్రమే. ఇషా కొప్పికర్ మాన్లీగా కనిపించడం తప్ప ఏం చేయలేదు. రావురమేష్ ఓకే అనిపిస్తాడు. వెన్నెల కిషోర్ కామెడీ కాస్త నవ్విస్తుంది. సత్య కూడా ఫర్వాలేదు. ప్రియదర్శన్‌కి ఈసారి అంత స్కోప్ ఇవ్వలేదు.
* తెరపై ఎలా సాగిందంటే..?
రివైంజ్ డ్రామాలు చాలా చూశాం. హీరోకి ఓ అన్యాయం జరుగుతుంది.కుటుంబాన్ని కోల్పోతాడు. అందుకు కారణమైన వాళ్లందరినీ చంపేస్తాడు. దాదాపు ఇదే కథని చాలా చాలా సినిమాల్లో చూసేశాం. మరి కేశవలో కొత్త పాయింట్ ఏంటి?? తన గుండె ఎడమవైపు కాకుండా.. కుడివైపున ఉంది. అతనికి ఆవేశం వచ్చినా, బాధ వచ్చినా.. ప్రాణానికే ప్రమాదం. అందుకే మర్డర్లన్నీ కూల్‌గా చేస్తుండాలి. అలా కూల్‌గా తన ప్రతీకారం ఎలా తీర్చుకొన్నాడన్నది ఆసక్తికరమే. ఓ మర్డర్‌తో కథ మొదలవుతుంది. ఆ తరవాత ఇన్వెస్టిగేషన్. కాలేజీలో వెన్నెల కిషోర్ కామెడీ... ఆ తరవాత మరో మర్డర్.. మళ్లీ కాలేజీ.. అక్కడ కామెడీ... ఇలా సగం థ్రిల్.. సగం ఎంటర్‌టైన్‌మెంట్‌తో నడిపాడు దర్శకుడు. విశ్రాంతికి ముందు హీరో పోలీసులకు దొరికేస్తాడు. అక్కడి నుంచి.. ఎలా బయటపడ్డాడు? తన పగ ఎలా తీర్చుకొన్నాడో చూడాలన్న కుతూహలం పెరుగుతుంది. అయితే ద్వితీయార్థం అంత రసవత్తరంగా ఏమీ సాగలేదు. చాలా లూప్ హోల్స్ కనిపిస్తుంటాయి. దొరికిన హంతకుడ్ని పోలీసులు వదిలేయడం.. సిల్లీగా అనిపిస్తుంది. ఒక్కొక్కర్నీ చంపుకొంటూ పోతే... అది థ్రిల్లర్ అయిపోతుందా? వాటి చుట్టూ ఆసక్తికరమైన సన్నివేశాలు నడిపించాలి కదా? హీరో దొరకుతాడా, లేదా? అనే ఉత్కంఠత దొరకపోతే బాగుణ్ణు అనే జాలి కలిగేలా చేయాలి. ఈ రెండు విషయాల్లోనూ కేశవ విఫలమైంది. సరిగ్గా శుభం కార్డు ముందు ఓ ట్విస్టు వస్తుంది. అది కాస్త ఓకే అనిపిస్తుంది. అయితే... అసలు నిజం బయటకు రావడానికి హీరో చేసిందేం ఉండదు. దాంతో ట్విస్టు రివీల్ చేసిన విధానం తేలిపోతుంది.
* సంగీతం
ఈ సినిమాలో పాటలకు స్కోప్ లేదు. ఉన్నదల్లా నేపథ్య సంగీతమే. ఆవిషయంలో సన్నీకి మించి మార్కులు పడతాయి.
* ఛాయాగ్రహణం
సినిమా చాలా నీట్ గా తీశారు. ఫొటోగ్రఫీ హైలెట్ అని చెప్పాలి. కలర్ కాంబినేషన్... మూడ్‌కి తగ్గట్టుగా సాగుతుంది.
* డైలాగులు
పంచ్‌లు అక్కడక్కడ బాగానే పేలాయి. క్లాస్ రూమ్ జోకులు తప్పకుండా నచ్చుతాయి.
* దర్శకత్వం
సుధీర్ వర్మ మంచి టెక్నీషియన్. తనకున్న పరిమిత బడ్జెట్లో ఎక్స్‌లెంట్ అవుట్ పుట్ ఇచ్చాడు. అయితే.. కథ. కథనాల విషయంలో జాగ్రత్త పడాలి. ఇదో రొటీన్ రివైంజ్ డ్రామా. హీరోకి ఓ లోపం పెట్టినా.. దాన్ని సరిగా వాడుకోలేదు. లాజిక్కులు వెదికితే.. చాలా లోపాలు కనిపిస్తాయి. ఈ విషయంలో సుధీర్ ఇంకా హార్డ్ వర్క్ చేయాలేమో.
* ఫైనల్ వర్డిక్ట్: కేశవ... కొత్తగా ఏం లేడు
యావరేజ్ యూజర్ రేటింగ్: 3/5
రివ్యూ బై: శ్రీ