చిత్రం: ఖుషి
నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత
దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి
సంగీతం: హిషామ్ అబ్దుల్ వాహబ్
ఛాయాగ్రహణం: జి.మురళి
కూర్పు: ప్రవీణ్ పూడి
బ్యానర్స్: మైత్రీ మూవీ మేకర్స్
విడుదల తేదీ: 1 సెప్టెంబర్ 2023
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.75/5
లైగర్ తో విజయ్ దేవరకొండకి పెద్ద షాక్ తగిలింది. అప్పటివరకూ వరుస విజయాలతో వున్న విజయ్ కి ఇది పెద్ద స్పీడ్ బ్రేక్ అయ్యింది. ఎలాగైనా హిట్ కొట్టి లైగర్ పీడకల నుంచి బయటపడాలని ఇప్పుడు 'ఖుషి' చేశాడు విజయ్. సమంత, విజయ్ కెమిస్ట్రీ, పాటలు హిట్ కావడం, ట్రైలర్ ఆసక్తిని పెంచడంతో మంచి బజ్ ఏర్పడింది. మరి విజయ్ కోరుకున్న విజయం ఖుషితో వచ్చిందా ?
కథ: విప్లవ్ దేవరకొండ (విజయ్ దేవరకొండ)కి బి.ఎస్.ఎన్.ఎల్‌లో ఉద్యోగం వస్తుంది. చాల ఇష్టంతో కశ్మీర్‌లో పోస్ట్ వేయించుకుంటాడు. అక్కడే బేగం (సమంత)ని చూసి ప్రేమలో పడతాడు. ఐతే బేగం అసలు పేరు ఆరాధ్య. విప్లవ్ నుంచి తప్పించుకోవాలని తన పేరు బేగం అని చెబుతుంది. ఐతే చివరికి విప్లవ్ ప్రేమలో పడిపోతుంది ఆరాధ్య. అయితే వీరిద్దరి కుటుంబ నేపథ్యాలు వేరు. విప్లవ్ తండ్రి లెనిన్ సత్యం (సచిన్ ఖేడ్కర్) నాస్తికుడు. సైన్స్‌ని తప్ప దేన్నీ నమ్మడు. ఆరాధ్య తండ్రి చదరంగం శ్రీనివాస్ (మురళీ శర్మ) దేవుడిని తప్పా దేన్నీ నమ్మడు. ఆస్తికత్వం, నాస్తికత్వం మధ్య ఈ ప్రేమ జంట ప్రయాణం ఎలా సాగిందనేది కథ.
విశ్లేషణ: ఆస్తికత్వం, నాస్తికత్వం పై ఎన్నో సినిమాలు వచ్చాయి. అప్పుడెప్పుడో వచ్చిన ఏఎన్ఆర్ బుద్ధిమంతుడు సినిమా నేపధ్యం ఇదే. ఐతే దర్శకుడు శివ నిర్వాణ ఈ కాన్సప్ట్ ని ప్రేమ జంటకి అప్లయ్ చేశాడు. ఆలోచన బాగానే వుంది కానీ తను చెప్పదలచుకున్న పాయింట్ ఏమిటనే క్లారిటీ లేకుండా పోయింది. లెనిన్ సత్య పాత్రతో ఈ సినిమా కథ పరిచయం చేసిన దర్శకుడు ఇంటర్వెల్ వరకూ గానీ మళ్ళీ కథలోకి రాలేదు. కాశ్మీర్ లో నడిపిన ప్రేమకథ బోరింగ్ గా వుంటుంది. మనస్పూర్తిగా నవ్వుకునే ఒక్క సన్నివేశం కూడా వుండదు. పైగా తమ్ముడు తప్పిపోయాడని బేగం అదే డ్రామా చిరాకు తిప్పేస్తుంది. ఒకరి గురించి ఒకరికి తెలిసాక వాళ్ళ పెళ్లి వరకూ సన్నివేశాలు చకచక నడుస్తున్నాయి.
ఐతే ఇంటర్వెల్ తర్వాత ఖుషి కాస్త ఒక డైలీ సీరియల్ గా తయారౌతుంది. ఇందులో సంఘర్షణకి ప్రేక్షకుడికి కనెక్షన్ వుండదు. పిల్లల గురించి ప్రయత్నించడం, హోమాలు, ఆ కేరళ ఎపిసోడ్.. ఇవన్నీ తెరపై చూస్తున్నపుడు అసలు దర్శకుడి ఉద్దేశం ఏమిటో అర్ధం కాదు. భార్యల గురించి పడుకునే పాట ఇరికించేనట్లుగా వుంటుంది. అసలు సెకండ్ హాఫ్ అంతా మరీ సాగదీత వ్యవహారంగా మారిపోయింది. ఎమోషన్స్ తేలిపోయాయి. ఒక దశలో సహనానికి పరీక్షా పెడతాయి. క్లైమాక్స్ లో దర్శకుడు ప్రపంచానికి ఎదో చెప్పాలనుకున్నాడు. కానీ అది వినే ఓపిక ప్రేక్షకుడికి వుండదు. అంతలా విసిగించేశారు.
నటీనటులు: విజయ్ సమంతలే ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఇంత లేజీ కథ కూడా వాళ్ళ స్క్రీన్ ప్రజన్స్ తోనే ముందుకు వెళ్ళింది. ద్వితీయార్ధంలో భార్యాభర్తలుగా సహజంగా కనిపించారు. క్లైమాక్స్ లో వాళ్ళ నటన మెప్పిస్తుంది. సచిన్ ఖేడేకర్, మురళీశర్మ పాత్రలు సినిమాకి కీలకం. ఒకరు నాస్తికుడిగా, మరొకరు ప్రవచనకర్తగా పాత్రల్లో హుందాగా నటించారు. జయరాం, రోహిణి, శరణ్య, లక్ష్మీ పరిధిమేరకు కనిపించారు. ఫస్టాఫ్‌లో వెన్నెల కిశోర్ కొన్ని నవ్వులు పంచితే, సెకండ్ హాఫ్ లో రాహుల్ రామకృష్ణ ఓకే అనిపిస్తారు.
టెక్నికల్: మ్యూజిక్ చిత్రానికి ప్రధాన బలం. వినడానికి చూడటానికి పాటలు బావున్నాయి. మురళీ కెమెరా కశ్మీర్ అందాల్ని అందంగా బాధించాడు. ద్వితీయార్ధంలో ఎడిటింగ్ ఇంకా పదునుగా ఉండాల్సింది. దర్శకుడు శివ నిర్వాణ తాను చెప్పాల్సిన పాయింట్ ఏమిటో సూటిగా చెప్పలేకపోయాడు.
ప్లస్ పాయింట్స్
విజయ్, సమంత
పాటలు
కాశ్మీర్ నేపధ్యం
మైనస్ పాయింట్స్
కథ, కథనం
సాగదీత, ఎమోషన్స్ తేలిపోవడం
వినోదం లేకపోవడం
సీరియల్ తరహ సన్నివేశాలు
ఫైనల్ వర్దిక్ట్ : ఖుషి లేదుహే...