'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

నటీనటులు: పి విజయ్ కుమార్, యజ్ఞా శెట్టి, శ్రీతేజ్ తదితరులు
దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు
నిర్మాత: రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి
సంగీతం: కళ్యాణి మాలిక్
సినిమాటోగ్రఫర్: రమ్మీ
ఎడిటర్: కమల్. ఆర్
విడుదల తేదీ: మార్చి 29, 2019

రేటింగ్‌: 2.75/5

నలుగురిదీ ఒక దారైతే.. వ‌ర్మ‌ది మ‌రో దారి. సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్స్‌. వివాదాల‌తో సావాసం చేస్తుంటాడు. ఏ స్విచ్ నొక్కితే.. ఎక్క‌డ ఏ బ‌ల్బ్ వెలుగుతుందో బ‌హుశా వ‌ర్మ‌కే బాగా తెలుసు. ఎవ‌రి క‌థ‌లో వివాదం ఉందో, ఆ వివాదాన్ని ఎంత క్యాష్ చేసుకోవొచ్చో బాగా లెక్క‌గ‌ట్ట‌గ‌ల‌డు. అందుకే ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌లోనే చీక‌టి కోణాన్ని ధైర్యంగా ఎంచుకున్నాడు. `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` అనే పేరు పెట్టి - అందులో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్ర‌ని ప్ర‌తినాయ‌కుడిగా చూపించే ధైర్యం చేయ‌గ‌లిగాడు. ఆ ధైర్య‌మే.. ఈ చిత్రానికి ఉచిత ప్ర‌చారాన్ని తీసుకొచ్చింది. బాల‌కృష్ణ తీసిన `క‌థానాయ‌కుడు`,`మ‌హానాయ‌కుడు` గురించి జ‌నం మాట్లాడుకున్నారో లేదో తెలీదు గానీ.. ఈ సినిమా గురించి మాత్రం మాట్లాడుకునేలా చేసింది. విడుద‌ల‌కు ఒక్క రోజు ముందు కూడా హైడ్రామా న‌డిచింది. ఈ సినిమా విడుద‌ల‌ను నిలిపివేస్తూ కోర్టు స్టే ఆర్డ‌ర్‌ని ఇచ్చింది. మ‌రి ఇన్ని వివాదాలు దాటుకుని వ‌చ్చిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ఎలా ఉంది? ఇదంతా ప్ర‌చార ఆర్భాట‌మేనా, ఇంకేమైనా ఉందా?

* క‌థ‌

1989లో ఎన్టీఆర్ ప‌ద‌వీత్యుతుడు అయిన త‌ర‌వాత ఈ క‌థ మొద‌ల‌వుతుంది. ఇటు నా అనుకున్న‌వాళ్లు, అటు అధికారం రెండూ దూర‌మై, ఒంట‌రిగా గ‌డుపుతున్న ఎన్టీఆర్ జీవితంలోకి ల‌క్ష్మీ పార్వ‌తి ప్ర‌వేశిస్తుంది. ఆత్మ క‌థ రాస్తూ... ఎన్టీఆర్‌కి ద‌గ్గ‌ర‌వుతుంది. ఎన్టీఆర్ - ల‌క్ష్మీపార్వ‌తిల బంధం అటు పార్టీ పెద్ద‌ల‌కు గానీ, ఇటు కుటుంబ స‌భ్యుల‌కు గానీ న‌చ్చ‌దు. దాంతో మీడియాలోని ఓ వ‌ర్గం ల‌క్ష్మీ పార్వ‌తి కి వ్య‌తిరేకంగా వార్త‌లు రాస్తుంది. దుష్ఫ్ర‌చారం మొద‌లెడుతుంది. 1994 ఎన్నిక‌ల‌లో ఎన్టీఆర్ తిరిగి ముఖ్య‌మంత్రి అవుతారు. ఈ నేప‌థ్యంలో... ల‌క్ష్మీ పార్వ‌తి ఆధిప‌త్యం స‌హించ‌లేక‌పోయిన కుటుంబ స‌భ్యులు.. వెన్నుపోటుకు ప‌థ‌కం వేస్తారు. అదేమిటి? త‌ద‌నంత‌ర ప‌రిణామాలేంటి? అనేదే ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌.. క‌థ‌.

* న‌టీన‌టుల ప‌నితీరు..

న‌టీన‌టుల ఎంపిక‌లో వ‌ర్మ మార్క్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కొత్త వాళ్లతోనూ అద్భుతాలు చేస్తాడు. అయితే స్టార్ కాస్టింగ్ విష‌యంలో వ‌ర్మ ఈసారి కాస్త అజాగ్ర‌త్త‌గా ఉన్నాడ‌నిపిస్తుంది. ఎన్టీఆర్‌గా విజ‌య్ కుమార్ న‌ట‌న‌కు వంక పెట్ట‌లేం. కానీ కొన్నిసార్లు `ఈయ‌న ఎన్టీఆర్ ఏంటి?` అనిపిస్తే అది ఎన్టీఆర్ అభిమానుల త‌ప్పుకాదు. ల‌క్ష్మీ పార్వ‌తిగా య‌జ్ఞ శెట్టి న‌ట‌న బాగుంది. బాబు పాత్ర‌లో శ్రీ‌తేజ్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. మిగిలిన‌వాళ్లంతా అంత గుర్తుపెట్టుకునే న‌ట‌న ప్ర‌ద‌ర్శించ‌లేదు.

* విశ్లేష‌ణ‌

ఎన్టీఆర్ జీవితాన్ని బ‌యోపిక్‌గా తెర‌కెక్కించే క్ర‌మంలో మొద‌టి రెండు భాగాలు క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు అయితే చివ‌రి భాగం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అని వ‌ర్మ ఇది వ‌ర‌కే చెప్పాడు. ఓర‌కంగా చూస్తే... వ‌ర్మ మాటే నిజం అనిపిస్తుంది. ఎన్టీఆర్ జీవిత క‌థ‌లో తెర వెనుక విష‌యాల్నీ, కుట్ర‌ల్నీ ధైర్యంగా బ‌హిర్గ‌తం చేశాడు వ‌ర్మ‌. నిజానికి ఎన్టీఆర్ వెన్నుపోటు వ్య‌వ‌హారం జ‌నాల‌కు తెలియంది కాదు. మామ‌ని అల్లుడు ఎలా వెన్నుపోటు పొడిచాడో.. ప్ర‌తిప‌క్షాలు క‌థ‌లు క‌థ‌లుగా చెబుతాయి. వాటినే వ‌ర్మ ఇప్పుడు తెర‌పైకి తీసుకొచ్చాడు.

తాను ఎలాంటి క‌థ‌ని ఎంచుకున్నా, అత్యంత స‌హ‌జ‌త్వంతో, రియాలిటీకి ద‌గ్గ‌ర‌గా తీసుకెళ్లి తెర‌కెక్కించ‌డం వ‌ర్మ స్పెషాలిటీ. ఈ సినిమాలో అదే క‌నిపించింది. ఎన్టీఆర్ - పార్వ‌తిల బంధానికి తానే సాక్షిభూత‌మైన‌ట్టు.. వారి అంత‌రంగిక విష‌యాల్నీ తెర బ‌ద్దం చేయ‌గ‌లిగాడు. అన్నింటికంటే ఈ క‌థ‌లో కీల‌క‌మైన ఘ‌ట్టం... వెన్నుపోటు వ్య‌వ‌హారం. అస‌లు ఎన్టీఆర్‌కీ, అత‌ని కుటుంబానికీ మ‌ధ్య గ్యాప్ ఎందుకు వ‌చ్చింది?  అది రాజ‌కీయ కుట్ర‌ల‌కు ఎలా కార‌ణ‌భూత‌మైంది?  అనే విష‌యాన్ని వ‌ర్మ చ‌క్క‌గానే పట్టుకోగ‌లిగాడు.

ఎన్టీఆర్ - బాబుల వెన్నుపోటు వ్య‌వ‌హారం అన‌గానే సామాన్య జ‌నాల‌కు, అప్ప‌టి `అన్న‌` అభిమానుల‌కు, ఇప్ప‌టి ప్ర‌తి ప‌క్ష పార్టీల‌కు ఏం గుర్తొస్తుందో.. ఆ స‌న్నివేశాల‌న్నీ పూస గుచ్చిన‌ట్టు చూపించాడు. ఇది వ‌ర్మ‌కి మాత్ర‌మే సాధ్య‌మా అన్న‌ట్టు ధైర్యంగా గుడ్డ‌లిప్పి నిజాన్ని నిర్భ‌యంగా చెప్ప‌గ‌లిగాడు. అయితే.. ఎంత పొలిటిక‌ల్ క‌థే అయినా...ఇదో వ్య‌క్తి జీవితం. కుట్ర‌లు, కుతంత్రాల‌కు బ‌లైన ఓ ముఖ్య‌మంత్రి క‌థ‌. ఇలాంటి క‌థ‌ల‌కు డ్రామా అత్యంత అవ‌స‌రం. అయితే అది ఎక్కువ కాకూడ‌దు, త‌క్కువా చేయ‌కూడ‌దు. బాలెన్స్ అనేది చాలా ముఖ్యం. ఆ బ్యాలెన్స్ ఈ సినిమా విష‌యంలో ప‌ట్టు త‌ప్పింద‌నిపించింది.

కొన్ని చోట్ల డ్రామా మ‌రీ ఎక్కువ‌గా అనిపిస్తే.. ఇంకొన్ని చోట్ల అస‌లు దానికి ఛాన్సే ఇవ్వ‌లేదు. ఇక్క‌డ వ‌ర్మ చెప్ప‌ద‌ల‌చుకున్న‌ది వెన్నుపోటు వ్య‌వ‌హారం. ఆయ‌న ఫోక‌స్ అంతా దానిపైనే ఉంది. దానికి ముందూ, వెనుకా క‌థ అల్లుకోవాలి. ఆ క‌థ‌లో ఆస‌క్తిక‌ర‌మైన ఎలిమెంట్స్ లేవు. దాదాపు ఇది అంద‌రికీ తెలిసిన క‌థే. వ‌ర్మ ఇప్పుడే కొత్త‌గా బ‌య‌ట‌పెట్టిన అద్భుతాలేం క‌నిపించ‌వు. ఈ మాత్రం దానికి ఏపీ ప్ర‌భుత్వం, చంద్ర‌బాబు అభిమానులు ఇంత హైరానా ప‌డిపోయారా?  అనిపిస్తుంది.

* సాంకేతిక వర్గం

కుట్ర‌.. కుట్ర‌.. పాట విడుద‌ల‌కు ముందే సంచ‌ల‌నాలు రేపింది. తెలుగుదేశం అభిమానుల్లో ఒణుకు పుట్టించిన ఈ పాట‌.. థియేట‌ర్లోనూ రక్తి క‌ట్టింది. సిరాశ్రీ సాహిత్యం, క‌ల్యాణి కోడూరి సంగీతం వ‌న్నె తీసుకొచ్చాయి. ఆర్‌.ఆర్‌, బీజియ‌మ్స్ విష‌యంలో క‌ల్యాణి కోడూరికి మంచి మార్కులు ప‌డ‌తాయి. కొన్ని సంభాష‌ణ‌లు చ‌ప్ప‌ట్లు కొట్టించేలా ఉన్నాయి. కీల‌క‌మైన సంద‌ర్భాల్లో వ‌చ్చే స‌న్నివేశాలు బాగా పండ‌డానికి కార‌ణం.. పొలిటిక‌ల్ పంచ్‌లే. ద‌ర్శ‌కుడిగా వ‌ర్మ తాను చెప్ప‌దల‌చుకున్న‌ది స్ప‌ష్టంగా చెప్పాడు. కానీ.. సాగ‌దీత ఇబ్బంది పెడుతుంది. ఓవ‌ర్ డ్రామా... విసిగిస్తుంది. ఈ విష‌యాల్లో వ‌ర్మ జాగ్ర‌త్త ప‌డితే త‌ప్ప‌కుండా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ఓ స‌రికొత్త సంచ‌న‌లం సృష్టించేది. వ‌ర్మ ఈమ‌ధ్య తీసిన సినిమాల్లోకంటే.. ఇది బెట‌ర్ అవుట్ పుట్ అన‌డంలో ఎలాంటి సందేహం అవ‌స‌రం లేదు.

* ప్ల‌స్ పాయింట్స్‌

+ వెన్నుపోటు ఎపిసోడ్‌
+ పాట‌లు
+ నేప‌థ్య సంగీతం

* మైన‌స్ పాయింట్స్‌

- సాగ‌దీత‌

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌: వెన్నుపోటు కోసం చూడాల్సిందే

- రివ్యూ రాసింది శ్రీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS