తారాగణం: రాశి, ఇనా సాహా, సాయి రోనాక్
బ్యానర్: రోలింగ్ రాక్స్ ఎంటర్టైన్మెంట్స్
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్
చాయాగ్రహణం: వీ రవి కుమార్
సంగీతం: శ్రిచారణ్ పాకాల
నిర్మాతలు: దినేష్, విష్ణు
దర్శకుడు: శ్రీ ముని
హారర్, థ్రిల్లర్ చిత్రాల పరంపర కొనసాగుతోంది. అయితే సరికొత్త నేపథ్యంతో వచ్చిన చిత్రాలకే ఆదరణ దక్కుతోంది. ఈ విషయం `లంక` రూపకర్తలకు అర్థమయ్యే ఉంటుంది. అందుకే టెలీపతీ అనే ఓ కాన్సెప్ట్‌ని తీసుకొని, ఓ థ్రిల్లర్ కథని అల్లుకొన్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో ఇంత వరకూ సినిమాలేం రాలేదు. అందుకే `లంక` పాయింట్ పరంగా ఆసక్తిని రేకెత్తించింది. మరి దాన్ని తెరపై చూపించిన విధానం ఎలా ఉంది? ఈ లంక ఎవరికి ప్లస్స్..?? ఎవరికి మైనస్??? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
* కథ ఎలా సాగిందంటే...
రెబాక (రాశి) ఓ ఒంటరి మహిళ. నా అన్న వాళ్లందరినీ కోల్పోయి ఒంటరిగా ఉంటుంది. ఆ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి టెలీపతి అనే విద్య నేర్చుకొంటుంది. చుట్టూ ఎవ్వరూ లేకపోయినా, ఉన్నారన్న భావనలో బతుకుతుంటుంది. టెలీపతీ విద్య ద్వారా ఎదుటివాళ్ల మనసుని చదివే కళ అబ్బుతుంది. రెబాక ఉన్న గెస్ట్ హౌస్‌లోకి షార్ట్ ఫిల్మ్ తీయడానికి ఓ బృందం వస్తుంది. అందులో స్వాతి అనే అమ్మాయి ఓ ఆపదలో చిక్కుకొంటుంది. ఆ ఆపదేంటో కనుక్కొని, సమస్యని పరిష్కరించడానికి రెబాక తన వంతు ప్రయత్నాలు చేస్తుంటుంది. అంతలోనే స్వాతి చనిపోతుంది. స్వాతిని ఎవరు చంపారు? ఎందుకు?? ఈ హత్య వెనుక రెబాక హస్తం ఉందా, లేదా? అనేది తెలియాలంటే `లంక` చూడాల్సిందే.
* ఎవరెలా నటించారంటే..
చాలా కాలం తరవాత రాశిని పూర్తి స్థాయి పాత్రలో చూసే అవకాశం దక్కింది. తన వరకూ వందకి వంద మార్కులు తెచ్చుకొంటుంది. సహజంగా నటించింది. స్వాతి పాత్రలో కనిపించిన అమ్మాయి నటన కూడా బాగుంది. మిగిలినవాళ్లవి ప్రాచుర్యం ఉన్న పాత్రలు కావు. కనీసం గుర్తించే స్థాయిలో ఉన్న నటీనటుల్ని ఎంచుకొంటే బాగుండేది. ఇదో థ్రిల్లర్. దాన్ని హారర్ ఎలిమెంట్‌లోకి మార్చకుండా... తాను రాసుకొన్న పాయింట్‌కి కట్టుబడి తెరకెక్కించాడు దర్శకుడు. తనలో ప్రతిభ ఉంది. ఇంత కన్‌ఫ్యూజన్ ఉన్న కథని ఈమాత్రం తెరకెక్కించడం, అదీ... తొలి ప్రయత్నం కావడం మెచ్చుకోదగ్గ విషయమే. అయితే నిడివి మరీ ఎక్కువ ఉండడం ఇబ్బంది పెట్టింది. ఎడిటింగ్ కూడా సరిగా కుదరలేదు. దాంతో కన్‌ఫ్యూజన్ పెరిగిపోయింది. నిర్మాణ పరంగా ఎలాంటి వంకలూ లేవు. క్వాలిటీ మేకింగ్ కనిపించింది.
* తెరపై ఎలా సాగిందంటే..
దర్శకుడు రాసుకొన్న పాయింట్ కొత్తగా ఉంది. టెలీపతీ ని బ్యాక్ డ్రాప్ గా చేసుకొన్నారు కాబట్టి... దాని చుట్టూ కొత్త సన్నివేశాలు రాసుకొనే వీలు దక్కింది. దాంతో `లంక` ని ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. అయితే.. ఈ కథలో మలుపులెక్కువ. ఏ సన్నివేశం ఎందుకు తీశారో, ఏ పాత్ర ఎందుకు ఎలా ప్రవర్తిస్తుందో అర్థం చేసుకోవడం కష్టం.
సినిమాని ముగించేటప్పుడు మలుపులకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. `లంక` నిడివి కూడా చాలా ఎక్కువ. దాంతో భరించడం కష్టం అవుతుంది. తెరపై ఓ సన్నివేశం చూపించిన తరవాత.. `ఇదంతా అబద్దం` అని చూపిస్తారు. దాంతో ఏది నిజమో, ఏది అబద్ధమో అన్న కన్‌ఫ్యూజన్ పెరిగిపోతుంటుంది. ద్వితీయార్థం నత్తనడక నడిచింది. ఓ దశలో క్లైమాక్స్ వచ్చేస్తే బాగుణ్ణు అని కూడా అనిపిస్తుంది. తొలి భాగంలో ప్రశ్నలకు సమాధానం చెప్పే క్రమంలో మళ్లీ సినిమాపై ఆసక్తి మొదలవుతుంది. మొత్తంగా... మలుపులు ఎక్కువై, గమ్యస్థానం చేరేలోపే మధ్యలోనే ఆపేసిన ప్రయాణంలా అనిపిస్తుంది.. `లంక`.
* ప్లస్ పాయింట్స్
- బ్యాక్ డ్రాప్
- రాశి
- మేకింగ్
* మైనస్ పాయింట్స్
- కన్‌ఫ్యూజ్ స్క్రిప్ట్
- నిడివి ఎక్కువ
* ఫైనల్ వర్డిక్ట్
లంక... వంకలు చాలానే ఉన్నాయ్!
యావరేజ్ యూజర్ రేటింగ్: 2.25/5
రివ్యూ బై: శ్రీ