మన్మథుడు 2 మూవీ రివ్యూ & రేటింగ్‌

మరిన్ని వార్తలు

నటీనటులు: నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెల కిశోరె తదితరులు
దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్
నిర్మాణం : అన్నపూర్ణ స్టూడియోస్, వయకామ్ 18 పిక్చర్స్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ మరియు మనం ఎంటర్ ప్రెస్సెస్.  
సంగీతం: చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫర్: యం.సుకుమార్
విడుదల తేదీ: ఆగస్టు 9,  2019

 

రేటింగ్‌: 2.5/5

 
పదిహేడేళ్ల క్రితం వచ్చిన సినిమా మన్మథుడు. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీసు రికార్డులనేం బద్దలు కొట్టేయలేదు. కాకపోతే... హాయిగా, ఆద్యంతం చూసే సినిమాల జాబితాలో ఒకటిగా చేరిపోయింది. అప్పట్లో ఈ సినిమా విడుదలైనప్పుడు ఎన్ని థియేటర్లు నిండాయో తెలీదు గానీ, ఇప్పుడు ఎప్పుడు టీవీల్లో వచ్చినా - ఛానల్ మార్చకుండా, యాడ్లు సైతం వదలకుండా చూసేస్తుంటారు జనాలు.


అంతగా నచ్చేసింది. మన్మథుడు 2 అనే టైటిల్ పెట్టి సినిమా తీయాలనుకోవడం... ఒకింత సాహసమే అయినా, చేస్తోంది నాగార్జున కాబట్టి, ఆ టైటిల్ ఆయనకు తప్ప మరెవ్వరికీ సరిపోదు కాబట్టి - ఈ సినిమా కూడా మన్మథుడు లా మురిపిస్తుందని ఆశ పడ్డారు సినీ జనాలు, నాగ్ అభిమానులు. మరి ఇప్పటి మన్మథుడు ఎలా ఉన్నాడు?  అభిమానుల అంచ‌నాల‌కు అందాడా?
 

* క‌థ‌

 

సాంబ‌శివ‌రావు అనే శామ్ (నాగార్జున‌) కుటుంబం మొత్తం పోర్చుగ‌ల్‌లో ఎప్పుడో మూడు త‌రాల క్రిత‌మే సెటిలైపోయింది. శామ్ ఓ ప్లే బాయ్ టైపు. రిలేష‌న్స్‌పై న‌మ్మ‌కం ఉండ‌దు. పెళ్లంటే ప‌డ‌దు. పెళ్లీడు కూడా ఎప్పుడో దాటిపోయింది. కానీ ఇంట్లోవాళ్లు మాత్రం పెళ్లి చేసుకో.. అంటూ పోరుపెడుతుంటారు.


వాళ్ల గోల భ‌రించ‌లేక అవంతిక (ర‌కుల్‌)ని రెండు వారాల అద్దె ప్రియురాలిగా ఇంటికి తీసుకొస్తాడు. మ‌రి... ఈ అద్దె ప్రియురాలు డ్రామా వ‌ర్క‌వుట్ అయ్యిందా, లేదా?  ఇంట్లోవాళ్లు అవంతిక‌ని ఎలా రిసీవ్ చేసుకున్నారు?  పెళ్లిపై శామ్ అభిప్రాయాలు మారాయా?  లేదా? అనేదే మిగిలిన క‌థ‌.
 

* న‌టీన‌టులు


నాగ్ గ్లామ‌ర్ గురించి కొత్త‌గా మాట్లాడుకునేది ఏముంది?  అప్ప‌టి మ‌న్మ‌థుడి కంటే అందంగా ఉన్నాడు. అందంగా క‌నిపించాడు. చలాకీగా న‌టించేశాడు. నాగ్ న‌ట‌న‌లో లుక్‌లో వంక పెట్టేది ఏం లేదు. త‌న డ్ర‌స్సింగ్ స్టైల్‌కి నూటికి 200 మార్కులు ప‌డ‌తాయి.


రకుల్ దీ ప్రాధాన్యం ఉన్న పాత్రే. త‌ను కూడా చాలా బాగా చేసింది. లక్ష్మి లాంటి సీనియ‌ర్ న‌టి ఉండ‌డం బాగా క‌లిసొచ్చింది. రావు ర‌మేష్‌ని స‌రిగా వాడుకోలేదు. అంద‌రికంటే ఎక్కువ మార్కులు వెన్నెల కిషోర్‌కి ప‌డ‌తాయి. త‌న కామెడీనే ఈ సినిమాని కొత్త ఉత్సాహాన్ని, శ‌క్తిని అందించాయి.


* సాంకేతిక వ‌ర్గం


ఆర్‌.ఎక్స్ 100తో రెచ్చిపోయిన చైత‌న్య భ‌ర‌ద్వాజ్ ఈ సినిమాలో అదే మార్క్‌ని చూపించ‌లేక‌పోయాడు. గుర్తు పెట్టుకోద‌గిన పాట‌లు లేవు. నేప‌థ్య సంగీతం విష‌యంలో మాత్రం త‌న ప‌నిత‌నం ఆక‌ట్టుకుంది.


పోర్చుగ‌ల్ అందాల్ని సుకుమార్ కెమెరా మ‌రింత ముగ్థ‌మ‌నోహ‌రంగా చూపించాయి. టెక్నిక‌ల్‌గా సినిమా బాగుంది. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ క‌నిపించాయి. అయితే స్క్రిప్టుపై మ‌రింత ప‌నిచేయాల్సింది. మ‌న్మ‌థుడు అనే టైటిల్ కూడా ఈసినిమాపై అంచ‌నాలు పెంచింది. మ‌రో కొత్త టైటిల్‌తో వ‌చ్చి ఉంటే, ఆ ప్ర‌భావం త‌గ్గేది.


* విశ్లేష‌ణ‌

 

ఓ ఫ్రెంచ్ చిత్రానికి ఇది రీమేక్‌. డ‌బ్బులు ఇచ్చి మ‌రీ రైట్స్ కొన్నారు.  అలాంట‌ప్పుడు క‌థ‌లో ఏదో గ‌మ్మ‌త్తు ఉంటుంద‌ని క‌చ్చితంగా అనుకుంటారు. కానీ.. ఇదో సాదా సీదా క‌థ‌. చీనీకమ్ లాంటి సినిమాలు చూసిన‌వాళ్ల‌కైతే.. మ‌రీ రొటీన్‌గా అనిపిస్తుంది. అంతెందుకు... ఈమ‌ధ్యే ర‌కుల్ దే దే ప్యార్ దే చేసొచ్చింది. అదీ ఇలాంటి క‌థే.  క‌థ‌లో చెప్ప‌డానికి పెద్ద స్కోప్ లేన‌ప్పుడు స‌ర‌దా స‌న్నివేశాలు, ఎమోష‌న్ సీన్స్, పాట‌లు, గ‌మ్మ‌త్తైన క్యారెక్ట‌రైజేష‌న్స్‌తో బండి న‌డ‌పాలి.


కానీ... అవేం ఇందులో క‌నిపించ‌వు. క‌థ స‌ర‌దాగానే మొద‌లైనా, మ‌ధ్య మ‌ధ్య‌లో ఎన్నెన్నో స్పీడ్ బ్రేక‌ర్లు ప‌డుతుంటాయి. వెన్నెల కిషోర్ పాత్ర‌, అత‌ని కామెడీ లేకపోతే.. సినిమా చాలా మ‌ట్టుకు బోర్ కొట్టేసేదే. చాలా వ‌ర‌కూ.. వెన్నెల కిషోర్ ఈ సినిమాని మ‌రీ బ‌ల‌హీన ప‌డ‌కుండా కాపాడ‌గ‌లిగాడు. నాగ్ గ్లామ‌ర్, ర‌కుల్‌తో కెమిస్ట్రీ, రావు ర‌మేష్ చెప్పే డైలాగులు ఇవ‌న్నీ తొలి భాగం పాసైపోయేలా చేస్తాయి. 


ద్వితీయార్థంలో మ‌రిన్ని కుదుపులు. అన‌వ‌స‌రంగా వ‌చ్చిప‌డిపోయే సన్నివేశాలు చాలా ఉన్నాయి. సినిమా మొత్తాన్ని ఒకే పాయింట్‌పై తిప్ప‌డం ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. రాసుకున్న స‌న్నివేశాల్లో ప‌దును, ద‌ర్శ‌కుడిలో ప్ర‌తిభ ఉన్న‌ప్పుడే అవి సాధ్యం అవుతాయి. రాహుల్ కొంత వ‌ర‌కూ త‌న ప‌నిలో న్యాయం చేశాడు. కానీ చాలా చోట్ల తేలిపోయాడు. మ‌న్మ‌థుడు కూడా పెద్ద క‌థేం కాదు. త్రివిక్ర‌మ్ మ్యాజిక్‌, దేవి పాట‌లు, క‌థ‌లోని ఎమోష‌న్ చాలా ప్ల‌స్ అయ్యింది.


అవేం లేక‌పోవ‌డం.. మ‌న్మ‌థుడి 2కి ప్ర‌తీకూల అంశాలుగా మారాయి. క్లైమాక్స్ కి ముందు కూడా ద‌ర్శ‌కుడు అన‌వ‌స‌రంగా కాల‌యాప‌న చేశాడు. దాంతో చాలా పెద్ద సినిమా (లెంగ్తీ ప‌రంగా) చూస్తున్న ఫీలింగ్ క‌లుగుతుంది. డ‌బుల్ మీనింగ్ డైలాగులు కొన్ని పంటికింద రాయిలా త‌గులుతాయి. అప్ప‌టి మ‌న్మ‌థుడికీ, ఇప్ప‌టి మ‌న్మ‌థుడికీ పోలిక‌లు తీసుకుంటే.. మ‌న్మ‌థుడు 2 అస్స‌లు న‌చ్చ‌డు. ఇదో ఫ్రెష్ సినిమా అనుకుని, నాగ్‌పై న‌మ్మ‌కం పెట్టుకుని, పోర్చుగ‌ల్ అందాల్ని స‌రికొత్త‌గా చూడాలనే ఉద్దేశంతో థియేట‌ర్ల‌లో అడ‌గు పెడితే.. కొంత‌మేర సంతృప్తి ప‌డొచ్చు.


* ప్ల‌స్ పాయింట్స్‌ 

+నాగ్ 
+ర‌కుల్‌
+పోర్చుగ‌ల్ నేప‌థ్యం
+ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్‌

 

* మైన‌స్ పాయింట్స్

-డ‌బుల్ మీనింగ్ డైలాగులు
-క‌థ‌నం

 

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌: శోభ త‌గ్గిన మ‌న్మ‌థుడు.

 

- రివ్యూ రాసింది శ్రీ.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS