'మీకు మాత్ర‌మే చెప్తా' మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు: తరుణ్ భాస్కర్, అనసూయ భరద్వాజ్, అభినవ్ గోమ‌టం పావని గంగిరెడ్డి, వాణి భోజన్ త‌దిత‌రులు
దర్శకత్వం: షమ్మీర్ సుల్తాన్
నిర్మాతలు: విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ
సంగీతం: శివకుమార్
సినిమాటోగ్రఫర్: మదన్ గుణదేవా 
విడుదల తేదీ: నవంబర్ 1,  2019

 

రేటింగ్‌: 2.75/5

 
కొత్త‌త‌రం అన‌గానే ప్రేక్ష‌కులు కొత్త‌ద‌నాన్ని ఊహిస్తారు. ఇక ఆ టీమ్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌లాంటి వ్య‌క్తి కూడా భాగ‌మ‌య్యాడంటే అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగిపోతుంటాయి.  వ‌రుస సినిమాల‌తో జోరు మీదున్న విజ‌య్ దేవ‌ర‌కొండ నిర్మాత‌గా  మార‌డం...  త‌న‌ని క‌థానాయ‌కుడిగా నిల‌బెట్టిన ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్‌ని ఈ సినిమాతో హీరోగా మార్చేయ‌డం... ఇలా క‌ల‌యిక విష‌యంలో చాలా ఆస‌క్తిని రేకెత్తించిందీ సినిమా.  ప్ర‌చార చిత్రాలు కూడా అల‌రించేలా ఉండ‌టంతో ఈ సినిమా గురించి ఆస‌క్తిగా ఎదురు చూశారు ప్రేక్ష‌కులు. మ‌రి అందుకు త‌గ్గ‌ట్టుగా సినిమా ఉందా? క‌థానాయ‌కుడిగా ఇప్ప‌టికే నిరూపించుకొన్న విజయ్ నిర్మాణ ద‌క్ష‌త మాటేమిటి?  త‌రుణ్ భాస్క‌ర్ ఎలా న‌టించాడు? త‌దిత‌ర విష‌యాలు తెలుసుకొనే ముందు క‌థ‌లోకి వెళ‌దాం.

 

* క‌థ‌

 

రాకేష్ (త‌రుణ్ భాస్క‌ర్) ఒక టీవీలో యాంక‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. అత‌నికి కామేష్ (అభిన‌వ్ గోమటం) మంచి స్నేహితుడు. ఇద్ద‌రూ ఛాన‌ల్‌కి టీఆర్పీ రేట్లు రావడం కోసం నానా తంటాలు ప‌డుతుంటారు. ఈ క్ర‌మంలోనే స్టెఫీ (వాణి)తో  రాకేష్ ప్రేమ‌లో ప‌డ‌తాడు. పెళ్లికి సిద్ధ‌మైపోతాడు. మ‌రికొన్ని గంట‌ల్లో పెళ్లి అన‌గానే రాకేష్‌కి సంబంధించిన ఒక వీడియో బ‌య‌టికొస్తుంది. బెడ్ రూమ్ నేప‌థ్యంలో సాగే  `మ‌త్తు వ‌ద‌ల‌రా, నిద్దుర మ‌త్తు వ‌ద‌లరా` అనే వీడియో అది. వైర‌ల్‌గా మారిపోతుంది. త‌న‌కి ఎలాంటి అల‌వాట్లు లేవ‌ని, అమ్మాయిలకి ఆమ‌డ దూరంలో ఉంటాన‌ని స్టెఫీకి చెప్పి పెళ్లికి ఒప్పించిన రాకేష్ స‌మ‌స్య‌ల్లో ఇరుక్కుంటాడు. ఆ వీడియోని తొల‌గించేందుకు కామేష్‌తో క‌లిసి  రాకేష్ ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేశాడు?  మ‌రి దాన్ని స్టెఫీ చూసిందా లేదా? వీళ్ల క‌థ‌తో సంయుక్త (అన‌సూయ‌)కి సంబంధ‌మేమిటి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 

* న‌టీన‌టులు


త‌రుణ్‌భాస్క‌ర్ ఎంత మంచి ద‌ర్శ‌కుడో, అంత మంచి న‌టుడు కూడా. ఆయ‌న పాత్ర‌ల్లో చాలా స‌హ‌జంగా ఒదిగిపోయాడు.  స్నేహితుడు కామేష్ పాత్ర‌లో అభిన‌వ్ న‌టన కూడా మెచ్చుకోద‌గ్గ స్థాయిలో ఉంది. వారియ‌ర్‌, హాక‌ర్‌ని క‌నుక్కునే యువ‌కుడు,  స్టెఫీ పాత్ర‌లో వాణీ, కామేష్ ల‌వ‌ర్‌గా పావ‌ని గంగిరెడ్డి పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. మిగ‌తా న‌టులంతా కొత్త‌వాళ్లే.  వాళ్లంతా పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. అన‌సూయ సంయుక్తగా త‌ళుక్కున మెరిసింది. ఆమె స్థాయికి త‌గ్గ పాత్ర కాదు కానీ సినిమాలో ఒక మ‌లుపుల‌కి కార‌ణ‌మ‌య్యే పాత్ర‌.


* సాంకేతిక వ‌ర్గం


సాంకేతికంగా సినిమా ప‌ర్వాలేదనిపిస్తుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ, ఆయ‌న తండ్రి వ‌ర్ధ‌న్ దేవ‌ర‌కొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప‌రిమిత బ‌డ్జెట్‌ని కేటాయించి ఈ సినిమాన నిర్మించారు. మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకొనే వాళ్లు ఈ ప్ర‌య‌త్నం చేశారు. దాంతో సినిమాలో ఆశించిన స్థాయి హంగులు క‌నిపించ‌వు.  శివ‌కుమార్ సంగీతం, మ‌ద‌న్ గుణ‌దేవా ఛాయాగ్ర‌హ‌ణం సినిమా స్థాయిలో ఉన్నాయి. ద‌ర్శ‌కుడు షమ్మీర్ సుల్తాన్ చిన్న క‌థ‌నే ఆస‌క్తికరంగా తీర్చిదిద్ద‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యారు. కామెడీపై ప‌ట్టున్న ద‌ర్శ‌కుడిగా  పేరు తెచ్చుకున్నాడు. త‌రుణ్ భాస్క‌ర్ కూడా  మాట‌ల కోసం ఓ చేయి వేశాడు. ఆయ‌న శైలి సంభాష‌ణ‌లు సినిమాలో చాలా వినిపిస్తాయి. 

 

* విశ్లేష‌ణ‌

 

ప్ర‌తి ఒక్క‌రి సెల్‌ఫోన్‌లో ఒక ర‌హ‌స్యం ఉంటుంది. అది బ‌య‌టికొస్తే ఎలా ఉంటుంది? అది కూడా పెళ్లికి ముందైతే? ఇది క‌చ్చితంగా ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మే. అయితే ఆ చిన్నపాటి అంశం సినిమా స్థాయికి స‌రిపోతుందా అనేదే ప్ర‌శ్న‌. ఆ విషయాన్నే స‌వాల్‌గా స్వీక‌రించిన ద‌ర్శ‌కుడు సంద‌ర్భాల నుంచే వినోదం పుట్టించాడు.  క‌థ‌ని స‌ర‌దా స‌ర‌దాగా ముందుకు న‌డిపాడు. ఆరంభంలో స‌న్నివేశాలు కాస్త నిదానంగా అనిపించినా... వీడియో బ‌య‌టికి రావ‌డం నుంచి సినిమా ప‌రుగులు పెడుతుంది.  వీడియోని ఎలాగైనా తొల‌గించాల‌ని క‌థానాయ‌కుడు చేసే ప్ర‌య‌త్నాలు...  పెళ్లి కూతురుని ప్రేమించిన కుర్రాడు వారియ‌ర్‌గా మారి రాకేష్ గుట్టు విప్పేందుకు చేసే ప్ర‌య‌త్నాలు... కామేష్  చేసే అల్ల‌రి... ఇలా స‌న్నివేశాల‌న్నీ కూడా మంచి వినోదాన్ని పంచి పెడ‌తాయి. మ‌రోప‌క్క వీడియో ఎప్ప‌టిక‌ప్పుడు వ్యూస్ పెంచుకుంటూ అది పెళ్లి కూతురు ద‌గ్గ‌రికి వెళుతుందా,  చూస్తుందా అనే ఆస‌క్తిని పెంచుతూ ప్రేక్ష‌కుల్ని థ్రిల్‌ని పంచి పెడుతుంది. 

 

అయితే ద్వితీయార్థంలోనే అస‌లు స‌మ‌స్య ఎదుర‌వుతుంది. చెప్ప‌డానికి ద‌ర్శ‌కడికి క‌థేమీ మిగ‌ల్లేదు. దాంతో  మ‌ళ్లీ సంద‌ర్భోచిత స‌న్నివేశాల్నే న‌మ్ముకొన్నాడు.  అవి ప్ర‌థ‌మార్థం స్థాయిలో ఆక‌ట్టుకోక‌పోవ‌డం సినిమాకి మైనస్‌గా మారింది.  క‌థ‌లో ఏదైనా మలుపు ఉంటుందేమో అని ప్రేక్ష‌కుడు ఊహిస్తాడు. కానీ ద‌ర్శ‌కుడు అక్క‌ర్లేని చోట, అది కూడా ప‌తాక స‌న్నివేశాల్లో క‌థ‌ని మ‌లుపుతిప్పి పాత స‌న్నివేశాల్నే మ‌రో ర‌కంగా  చూపిస్తాడు. దానివ‌ల్ల సినిమాకి పెద్ద‌గా ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌లేదు. అయితే ఇంత చిన్న క‌థ‌ని కూడా ఆస‌క్తిక‌రంగా చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు స‌ఫ‌ల‌మ‌య్యాడు. ఆయ‌న అల్లుకున్న స‌న్నివేశాలు, వాటి నుంచి వినోదం పుట్టించిన తీరు మెచ్చుకోద‌గ్గది.  క‌చ్చితంగా కొత్త‌త‌రం క‌థ ఇది. అయితే దాన్ని మ‌రికాస్త బ‌లంగా రాసుకొని, నిర్మాణం ప‌రంగా మ‌రికొన్ని జాత్ర‌త్త‌లు తీసుకొనుంటే ఈ సినిమా స్థాయి పెరిగేది.

 

* ప్ల‌స్ పాయింట్స్‌ 

కామెడీ 
డైలాగులు 
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్


* మైన‌స్ పాయింట్స్

బోరింగ్ సీన్లు.
 

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌: బాగా న‌వ్వించినా... క‌థ ప‌రంగా ఇంకాస్త వెలితిగా అనిపించే సినిమా ఇది.

 

- రివ్యూ రాసింది శ్రీ


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS